Menu Close
C-Vasundhara Photo
తెలుగు సాహిత్య చంద్ర చంద్రికలు
డా.సి.వసుంధర

పాల్కురికి సోమనాథుడు

“తొలికోడి కనువిచ్చి మై పెంచి
జల జల రెక్కలు సడలించి నీల్గి
గ్రక్కున గాలార్చి కందంబువిచ్చి
ముక్కున నీకలు నక్కొల్పి కడుపు
నిక్కించి మెడసాచి నిక్కి ముస్సూచి
కొక్కొరో కుర్రని కూయకమున్నె”

“తెలుగు తోటలో మొదటి కోకిల కందమెత్తి తెలుగు వాళ్ళ కోసం తెలుగు ఛందస్సులో పాటలు పాడింది. ఆ కోకిల పేరు పాల్కురికి సోమనాథుడు. తెలుగు మాటన్నా, పాటన్నా, మేను పులకరించి మైమరిచిపోయే తెలుగు మహాకవి” – ఆరుద్ర మాటలివి. ఇంకా ఇలా అంటున్నారు ఆరుద్ర.

“తెలుగు జాతి అతనికిచ్చిన దివ్యాయుధం ద్విపద. తెలుగు జాతికి అతడిచ్చిన గొప్ప కానుక కూడా ద్విపద...ప్రజల కోసం అతను పుట్టాడు. ప్రజలే అతణ్ణి అమరకవిని చేశారు.”

ఓరుగల్లు కాకతీయులకు రాజధాని. దానికి పన్నెండు క్రోసుల దూరంలో పాల్కురికి అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో క్రీ.శ. 1240 ప్రాతంలో పాల్కురికి సోమనాథుడు జన్మించాడు. అప్పుడు కాకతీయ సామ్రాజ్యాన్ని గణపతిదేవ చక్రవర్తి పాలిస్తున్నాడు. సోమనాథుని తండ్రి పేరు విష్ణురామి దేవుడు. తల్లిపేరు శ్రియా దేవమ్మ. వీరిది సంప్రదాయ యుక్తమైన బ్రాహ్మణ కుటుంబం. సోమనాథుడు వేదవేదాంగాలను చదివాడు. సోమనాతునికి కవిత్వాభిరుచి కల్గించిన గురువు కరస్థలం విశ్వనాథయ్య. సోమనాథుని కాలంలో సంస్కృత భాషా ప్రభావం తీవ్రంగా ఉండి, పురాణేతిహాసాల అనువాదాలే తెలుగు కావ్యాలుగా రాణిస్తుండేవి. ఇలాంటి పరిస్థితులలో సోమనాథుడు, నన్నెచోడుడు, పండితారాధ్యుడు, యధావాక్కుల అన్నమయ్య రచించిన గ్రంథాలు చదివి వీరశైవం చేత ఆకర్షితుడై వీరశైవం స్వీకరించాడు. వీరశైవ సిద్ధాంతాలు-

వీరశైవం, కుల, మత, స్త్రీ పురుష, పేద ధనిక బేధం ఉండకూడదంటుంది. చదువు, వర్గం, వర్ణం అవసరంలేదంటుంది. శివభక్తుడై ఉంటే చాలు అతడు ఆరాధింప దగినవాడు. స్వాతంత్ర్యం కాంక్షించే కవి సోమనాథుడు అందుకే ఆరుద్ర అంటారు “ఈ నాడు యువ కవులు అభ్యుదయ రచయితలైనట్లు ఆనాది అభ్యుదయవాదమైన వీరశైవాన్ని చేపట్టాడు సోమనాథుడు”

పాల్కురికి సోమనాథునికి శివదీక్ష నొసగిన గురువు గురులింగాచార్యుడు. ఈ దీక్ష యొక్క పద్ధతి – దీక్షనిచ్చే గురువు శివ స్వరూపుడు. దీక్షా కాలంలో గురువు తన హస్తం శిష్యుని తలపై పెడతాడు. అప్పుడా శిష్యుడు రెండవ జన్మ ఎత్తినట్లే. ఆనాటి నుండి గురు హస్తసంజాతకుడు. ఆనాటి నుండి అతనికి గురువే తల్లి తండ్రి. గురువు గోత్రమే శిష్యుని గోత్రమవుతుంది. తను గురువు వద్ద ఉన్న రోజులలో సోమనాథునికి ఒక భక్తునితో పరిచయంగల్గింది. అతని పేరు గోడగి త్రిపురారి. సోమనాథుడు తాను రచించిన ‘అనుభవసారం’ త్రిపురారికి అంకితమిచ్చాడు. ‘అనుభవసారం’ లో 243 పద్యాలున్నాయి. ఇందులో ఆఖరి పద్యం తరువోజ. సోమనాథుడు తన తర్వాత రచనను ద్విపదలోనే రచించడానికి ఆ తరువోజ మూలం కావచ్చు. ‘అనుభవ సారం’ లో మాత్రం కంద, సీస, మద్యాక్కర, క్రాంచపదం, మత్తేభ, శార్దూలం, త్రిభంగి మొదలైన ఛందస్సులన్నీ ఉపయోగించాడు.

“త్రిభంగి” ఛందస్సు అపురూపమైనది. ఇతని తర్వాత దీనిని ఎవ్వరూ వాడలేదు. అందుచేత లాక్షణికులు దీనినే లక్ష్యం క్రింద స్వీకరించారు. “ఆంధ్ర సాహిత్యంలో త్రిభంగిని చూద్దాం.” అని ఆరుద్ర త్రిభంగిని పరిచయం చేశారు. అది-

“గురుమత సహితులు దురిత విరహితులు
సురుచిర సజ్జన వర్తుల్, ధ్రువ కీర్తుల్ శాంత సుమూర్తుల్ ...”

అని దీని లక్షణాన్ని ఆరుద్ర వివరించారు. (స.ఆం.సా. 413)

గురువు చెప్పిన శిల్ప రహస్యాలను సోమనాథుడు అనుభవసారంలో అమలుపరిచాడు. సంస్కృత సామెతలు, తెలుగు సామెతలు సోమనాథుని చెప్పు చేతలలో ఉంటాయని “ఒడల్లెలం జవ్వలై (84) చేతివాని విడిచి కాలబడినవాని కాసపడినట్లు (216) శవమునకు శృంగారం (223)” మొదలైన ప్రయోగాలను ఆరుద్ర ఉదహరించారు. సోమనాథుడు ‘అనుభవసారాన్ని’ మల్లికార్జున పండితారాధ్యుని ప్రభావంతో వ్రాశాడు. మూడు పద్యాలలో పండితయ్యను కీర్తించాడు. ‘అనుభవసారంలో పరనింద మతావేశము లేదు’ అని వావిళ్ళ వెంకటేశ్వర్లు గారి మాట. కానీ ఇందులో ఆ లక్షణాలు ఉన్నాయని చెప్తూ ఆరుద్ర “చెనయు శివద్రోహుల యెడ...” మొదలైన కొన్ని పద్యాలను ‘అనుభవసారం’ నుండి చూపించారు (స.ఆం.సా. పేజీలు 414-415).

‘అనుభవసారం’ తరువాత సోమనాథుడు రచించింది బసవ పురాణం. బసవయ్యను, పండితయ్యను గూర్చి ముందు చాళుక్య యుగంలో చెప్పడం జరిగింది. వీరిద్దరూ వీర శైవ మత ప్రచారకులు. ఒక రకంగా స్థాపకులు.

కన్నడదేశంలో క్రీ.శ. 1162 ప్రాంతంలో ఉన్న బిజ్జలుడు అనే రాజు వద్ద ఉన్న బసవన్న నందీశ్వరుని అవతారంగా భావింపబడ్డాడు. ఇతడు కోశాధికారి.

ఇతడు బ్రాహ్మణ మతాన్ని ఖండించి, వీరశైవాన్ని ప్రచారంలోకి తెచ్చాడు. ఇతను అనేక మహిమలు చూపించాడు. ఆంధ్రలో ఉన్న పండితారాధ్యుడు బసవన్న మహిమలు, వీరశైవమత ప్రచార విశేషాలు విని అతనిని కలవాలని అనుకొన్నా, కలవలేక పోవడం జరిగింది. మొత్తంమీద కర్ణాటకలో బసవన్న, ఆంధ్రలో పండితారాధ్యుడు వీరశైవ మత ప్రచారం చేసి ప్రజలను విపరీతంగా ఆకర్షించారు. ఇట్టి పరిస్థితులలో పాల్కురికి సోమనాథుడు పూర్వ ఛందస్సులన్నీ వదిలిపెట్టి ద్విపద ఛందస్సులో తాను బసవపురాణం వ్రాయాలని సంకల్పించాడు. ప్రజలకు అతి దగ్గరగా ఉన్న రోటి వంటలు, మొదలైనవి తరువోజ ఛందస్సులో ఉండటం గమనించాడు. తరువోజ లోని రెండు పాదాలు ఖండం ఒక ఛందస్సు గా పూర్వం ప్రచారంలో ఉన్నదన్న విషయం సోమనాథుడు గ్రహించాడు. మల్లియరేచన ద్విపదకు లక్షణం చెప్పాడు తన కవి జనాశ్రయం లో (జాత్యాధికారం 30) స.ఆం.సా పుట 416.

ఈ విధంగా సోమనాథుడు బసవపురాణం చెప్పబోతూ కొంతమంది తమిళాంధ్ర కర్ణాటక ఔత్తరాహికులైన శివభక్తుల కథలను జోడించి-జైనుల వలె, ద్విపద, త్రిపద, చౌపద మొదలైన చంధస్సులు ప్రజల సాహిత్యంతో – ఆనాడు ఉన్నవాటి నుండి సోమనాథుడు ద్విపదను గ్రహించాడు. జైనులలాగే పురాణ భక్తుల కథలు కూడా జోడించి బసవపురాణం రచించాడు. (స.ఆం.సా. పుట 416).

ఈ సందర్భంగా 28 మంది శివభక్తుల పేర్లను ఆరుద్ర ఇచ్చాడు. ఈ కథలన్నీ గురువు-సోమనాధయ్య, రెంటాల మల్లినాథుడు మొ||వారు సోమనాథునికి వివరించారు.

“ఉరుతర గద్య పద్యోక్తుల కంటె
సరసమై పరగిన జానుదెనుంగు మేలని”

ప్రజల భాషలో ప్రజల ఛందస్సులో సోమనాథుడు తన బసవ పురాణం రచించాడు. ఆశ్వానీల కార్యం, కైలాస వర్ణనతో కథ ప్రారంభమవుతుంది. శివుని ఆజ్ఞ ప్రకారం నందీశ్వరుడు బసవన్నగా భూలోకంలో జన్మిస్తాడు. ఉపనయనం నిరాకరిస్తాడు. రెండవ ఆశ్వాసంలో బసవన్న వంగ కాయలను లింగ కాయలుగా చెయ్యడం మొ|| మహిమలు చూపుతాడు. నాలుగవ అధ్యాయంలో మడివాలు మాచయ్య వధ ప్రసిద్ధం. ఈ భక్తులంతా జైనులను ఓడించి సంహరించిన వారే. చివరి ఆశ్వాసం లో బసవన్న మహిమలు చూపడం, నిర్యాణం ఉన్నాయి.

బసవపురాణం, కన్నడ దేశ బసవన్న యొక్క కథలో, తమిళ దేశంలోని అరుపత్తు మూవరు (63) నాయనారుల కథలను జోడించి తెలుగులో కావ్యం వ్రాయడం వల్ల సోమనాథుడు ఆనాటి దక్షిణ దేశ చరిత్రలో ఒక జాతీయ సమైక్యతను సాధించాడని ఆరుద్ర మాట.

రచనా విధానం

సామాన్య ప్రజల మనోభావాలను వారి భాషలో చెప్పగలగడం సోమనాథుని ప్రతిభ. బెజ్జమహాదేవి అనే భక్తురాలు శివునికి తల్లి లేదని చింతించి తానే శివునికి తల్లిగా మారిన వైనాన్ని సోమనాథుడు ఎంత అద్భుతంగా చిత్రించాడో గమనించాలి –

“తల్లి గల్గిన నేల తపసిగానిచ్చు  - దల్లి గల్గిన నేల తల జడల్గట్టు
దల్లి యున్న విషంబు ద్రావనేవిచ్చు – దల్లి యుండిన దోళ్ళు దాల్పనేలిచ్చు
----
తా నింతవాడయ్యె దల్లి లేకయును – దానెంత నెదుగునో తల్లి గల్గినను?”

సకలేశ్వర మాడి రాజయ్య కథలో శివుడు గొల్ల వేషంలో వస్తాడు. ఈ సందర్భంగా సోమనాథుడు ఆనాటి గొల్లలను బొమ్మ కట్టించాడు. విషాన్ని శివునికి నైవేద్యంగా పెట్టి దానిని భక్తులందరికీ పంచడం బసవన్న త్రాగిన ఆ విషం పొగలు గ్రక్కుతుండడం మొదలైన విషయాలు సోమనాథుడు హాలాహలం తాగినట్టే ఆవేశంగా ఉత్తేజంగా వర్ణించాడు.

పెద్దల అభిప్రాయాలు – కొన్ని ప్రత్యేక విషయాలు:

సోమనాథుడు తన రెండు కావ్యాలను శ్రీశైలం లోనే ప్రారంభించాడు. సోమనాథుడు కర్ణాటక మైసూరు రాష్ట్రంలో తుముకూరు తాలూకాలోని హోల్కురి లో జన్మించాడని చిలకూరు నారాయణరావు గారు, చాగంటి శేషయ్య గారు అభిప్రాయపడ్డారు. కొందరు తెలంగాణాలో పాల్కురికి జన్మస్థలం అన్నారు. అలాగే కాల నిర్ణయం లో కూడా అభిప్రాయ భేదాలున్నాయి.

సోమనాథుని గూర్చి తెలుగులో పేరుమోసిన సాహిత్య వేత్తలంతా పరిశోధనలు చేశారు. దానిని గూర్చి కొంత సమాచారం వీరశైవ ప్రచారానికి సోమనాథుడు పండితయ్య చరిత్ర ఒక ముఖ్య ఆయుధంగా వాడుకొన్నాడు. ప్రతాపరుద్రుని కాలంలో ఓరుగల్లు చేరి పరమత ఖండన చెయ్యడానికి సంకల్పించారు. శ్రీశైలంలో జరిగిన శివతత్వ గోష్టిలో సోమనాథుని, పండితయ్య జీవితం గూర్చి వ్రాయమని పండితులు కోరారు. 11810 ద్విపదలతో అయిదు ప్రకరణాలుగా పండితయ్య చరిత్రను వ్రాశాడు. ఇది ఒక చిన్న సైజు విజ్ఞాన సర్వస్వం.

వేటూరి ప్రభాకర శాస్త్రి గారు: “ఆ కాలపుటాంధ్రదేశ ప్రజా చరిత్రమున యది యనేక విషయముల తెలుపుచున్నది.” (స.ఆం.సా. పుట్ 419).

“వేదములనుండి, పురాణముల నుండి శివపారమ్య ప్రతి పాదకములయిన వాక్యములనీతడు హెచ్చుగా జూపినాడు...ఆంధ్ర వాఙ్మయమునను గడించిన గౌరవమున కంటే సోమనాథుడు కర్ణాటక దేశమునను, కర్ణాట వాఙ్మయమునను హెచ్చు గౌరవమును గడించెను...”

బండారు తమ్మయ్య గారు: “ఆంధ్ర కవులలో సర్వజ్ఞతా శక్తి గల నన్నయ, తిక్కన, ఎఱ్ఱాప్రగడ, నన్నెచోడ, నాచన సోమనాథులను, శ్రీనాథుని మించిన విద్యత్కవిగా నీతని గణింపదగును.”

రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారు: “అతనిది అణపరాని యుద్రేకము. భావబలమే లేని వట్టి శుష్క కల్పనలతో నిండిన మన ప్రభంధముల వంటివి చదివి చప్పిడి పడిన కొందరిని ఇతని గ్రంథములు మొదలు మొదలు  ఆవకాయ వలె ఆకర్షించును. ఇక శైవ భక్తిగల వారి మాట చెప్పబనిలేదు.”

కాశీనాథుని నాగేశ్వర రావు: వీరశైవము తలపెట్టిన కులాచరణ నిర్మూలనము దుస్తరమైనది...సాంఘిక ప్రయోజనములకును, మానవ కళ్యాణమునకును, నిరుపయోగమైనది.”

ఇలా పెద్దల అభిప్రాయాలను సమీకరించి, పాల్కురికి సోమనాథుని రచనలను, వ్యక్తిత్వాన్ని, భాషాభావాదులను ఆరుద్ర రసవత్తరంగా చర్చించారు.

సంస్కృత సమాసభూయిష్టమైన రచనను నిరసించి ద్విపదను చేపట్టిన సోమనాథుడు పండితారాధ్య చరిత్రలో సుదీర్ఘసమాసాలు చేశాడు. ఏకపాద, సప్తపాద సమాసాలు ఇతని రచనలో ఉన్నాయి. ఏడు పాదాలలో ఒకే సమాసం ఉన్న రచన – కుందేంద్రు చంద్రికా గోక్షీరఫేన – సుందరామల పరిస్ఫురిత సద్వర్ణ...పండితారాధ్య..వాద ప్రకరణం (స.ఆం.సా పేజి 421)

“పండితుల కోసం సమాసాలు ప్రజలకోసం కథ” అన్నారు ఆరుద్ర. అలాగే అతని రచనలను గూర్చి “తవ్వేకొద్దీ రత్నాలిచ్చే గని అతడు” అంటూ ఆరుద్ర సోమనాథుని ప్రశంసించాడు.

**** సశేషం ****

Posted in April 2022, సమీక్షలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!