Menu Close
భారతి
-- యలమర్తి చంద్రకళ --

భారతి అమెరికాలో పుట్టి అమెరికాలో పెరిగినా, ఆమె తల్లి తండ్రులు అనంతపురం జిల్లాకు చెందినవారు.

ఆమెకు "భారతి" అని తన అమ్మమ్మ గారి పేరే పెట్టారు. అందుకేనేమో అమ్మమ్మ అంటే భారతికి ప్రాణము.

భారతి మేనమామ వ్యవసాయ దారుడు. పల్లెలోనే కాపురం వుంటున్నాడు.

భారతి ఇండియా వచ్చిన ప్రతిసారీ మేనమామ, అత్త, వారి పిల్లలు, అమ్మమ్మలతో వున్నన్నాళ్ళూ  సందడిగా కాలం, కలలా గడిచిపోయేది. తిరిగి అమెరికా వెళ్ళే రోజు భారతి అమ్మమ్మ వెనక చేరి ఆమె చెంగులో దాగి తల్లి తండ్రులతో రావడానికి ఇష్టపడేది కాదు.

దసరాల్లో పెట్టే  బొమ్మల కొలువుల్లో, రాముడు, సీత, కృష్ణుడు, రాధ, దశావతారాలు అన్నిటి గురించి ఆసక్తిగా అడుగుతూ పురాణాల గురించి దేవతల గురించి తెలుసుకునేది. బొమ్మలు సర్దడములో సాయపడేది. పట్టు పరికిణి, జడ కొప్పులు వేసుకుని బుట్టబొమ్మలా వుత్సాహంగా తిరుగుతుంటే అందరికీ కన్నుల పండుగలా వుండేది.

దీపావళికి ఇళ్ళ ముందు దీపాలతో వూరంతా దేదీప్యమానంగా వెలిగిపోతూ వుంటే భారతి కళ్ళూ మిలమిలా మెరిసేవి. సాయంత్రాలు చిచ్చుబుడ్లు, విష్ణు చక్రాలు, భూచక్రాలు వంటివి అందరితో కలిసి పటాసులు  కాలుస్తూ, అరిసెలు, లడ్డూలు చక్కిలాలు వంటి అమ్మ చేతి పిండివంటలు తింటూ వుంటే ఆమె ఆనందం వర్ణనాతీతం.

సంక్రాంతికి ముగ్గులు వేస్తూ, వాటిని రంగులతో నింపుతూ, గొబ్బెమ్మలు తడుతూ పరవశించి పోయేది.

అమెరికాలో ఎన్నో సౌకర్యాలున్నా, పల్లెలోని అమ్మమ్మ ఇంట పొందిన ఆనందం ఆమెకు దొరికేది కాదు.

ఇంటి పెరట్లొనే వున్న జామ, మామిడి వంటి చెట్ల నుండి కాయలు కోసుకు తినడం బాగా నచ్చేది. తల్లిదండ్రులను విడిచి ఉండలేక, అమెరికాకి వెళ్ళడం ఇష్టం లేకపోయినా వారితో తిరిగి వెళ్ళేది. అమెరికాలో నాలుగు నెలలు మంచుతో, చలిలో వుండడం భారతికి నచ్చని విషయాల్లో మొదటిది. తనకన్నా బరువయిన స్వెటర్లు వేసుకోవాల్సి రావడం చికాకు పుట్టించేది. పోనీ అమ్మమ్మని తీసుకుపోదామని ఎన్నో సార్లు ప్రయత్నించి విఫలమయ్యింది.

భారతి “అమ్మమ్మా మాతో నువ్వూ అమెరికా రావాలి అని, లేకుంటే తనూ వెళ్ళనని మారాము చేసేది. మనవరాలి అభిమానానికి పొంగిపోతూనే “అయ్యో తల్లి రాలేనమ్మా నాకు అక్కడ ఎలా వుండాలో చేతకాదమ్మా, సొంత వూరు విడచి రాలేనని" చిరునవ్వుతో చెప్పేవారు.

“నీకు చూడాలనిపించినప్పుడు వచ్చేయమని, రోజూ ఫోన్లో మాటలాడుకోవచ్చు, వీడియో కాల్ లో చూసుకోవచ్చు కదా” అని నచ్చచెబితే భారతి బుద్దిగా వినేది.

భారతి తల్లిదండ్రులతో ఇండియా కు వచ్చిన ప్రతిసారి నీటి ఎద్దడి సమస్యలను చూసి చలించిపోయేది. తన ప్రియమైన అమ్మమ్మ "భారతమ్మ" గారు బిందెలతోటి నీరు మోసుకురావడం, లైన్లో నిలబడి ఎండల్లో చమటలు కక్కుతూ ఇబ్బందిపడటం, ఆమెను మరింత ఆవేదనకు గురిచేసేది.

”అమ్మమ్మా ఎందుకు అంత కష్టపడతావు” అన్న మనవరాలితో “అంతేనే ఈ నీటి సమస్యలు మాకు తీరవు” అన్నారు ఆవిడ.

“మాతోటి వచ్చేయొచ్చు కదా, రానంటావేం? అక్కడ నీళ్ళు పట్టుకోవాల్సిన అవసరమే లేదు”.

అమ్మమ్మ భుజాల మీదుగా చేతులు వేసి “ప్లీజ్ రాకూడదూ” అంటూ బ్రతిమాలింది. “లేదు తల్లీ మేము పుట్టి , పెరిగిన స్వర్గం లాంటి దేశాన్నివిడిచి రాలేనన్న” ఆవిడను ఆశ్చర్యంగా చూసింది. “మిస్ యు అమ్మమ్మా” అంటూ బుగ్గ మీద ముద్దు ఇచ్చి, కళ్ళ నుండి ఆగకుండా జారుతున్న కన్నీటిని తుడుచుకుంటూ, అమ్మమ్మని వదలలేక వదిలి తప్పని సరిగా ఎప్పటిలాగే తల్లి తండ్రులతో అమెరికా వెళ్ళింది.

***********

భారతి తో మాట్లాడితే అమెరికాలో పెరిగిందని అనిపించదు. అమెరికాలో వున్నా తెలుగు క్షుణ్ణంగా నేర్చుకుంది. ముచ్చటగా తెలుగులో మాట్లాడుతుంది. సంగీతం నేర్చుకుంటూ చక్కగా కీర్తనలు ఆలపిస్తుంది. ఫోన్ లో అమ్మమ్మ గారికి వినిపిస్తుండేది. ఆవిడా మనవరాలి మాటలు, పాటలు వింటూ మురిసిపోయేవారు.

అమ్మమ్మతో మాట్లాడినప్పుడల్లా “నేను నీటి సమస్య తీరుస్తాను” అంటూ ఆరిందానిలా కబుర్లు చెప్పేది.

చిన్నారి భారతి ఆ చిన్న వయస్సులోనే నీటి సమస్యను తీర్చే మార్గాలు కనుగొనాలని, తన ఊరు, తన దేశం యొక్క పరిస్ధితి చక్కబెట్టాలని కలలు కనేది. కాలం ఎప్పుడూ ఒకేలా సాగదు.

అనుకోని సంఘటనలు మనిషికి పూడ్చుకోలేని కష్టాలను, తట్టుకోలేని బాధలను మిగులుస్తాయి. దైవం లీలలు అర్ధం కావు. ఎందుకో మంచి వారిని త్వరగా తన వద్దకు పిలిపించుకుంటాడు.

ఒకరోజు మంచి నీళ్ళు తెస్తూ జారి పడిన అమ్మమ్మ గారు మంచం పట్టారు. భారతి, ఆమె తల్లి, తండ్రులు వెంటనే ఇండియా వచ్చి ఆమె వద్ద వుండి వైద్యం చేయించారు. అయినా ఫలితం దక్కలేదు. అమ్మమ్మగారి మరణానికి అందరూ బాధపడ్డారు. భారతిని అమ్మమ్మ మరణం కృంగ తీసింది. ఆమె లో పట్టుదలనూ పెంచింది.

అమ్మమ్మలా మరెవరూ మరణించకూడదన్నదే ఆమె జీవిత లక్ష్యంగా మారింది. ఆమెతో పాటే ఆమె ఆశయము పై గురి పెరుగుతూ వచ్చింది.

మాష్టర్స్ చదువు అయ్యాక నీటి సమస్య పైన రీసెర్చ్ చేయాలనుకున్నది. “ఎన్నో మంచి చదువులు వున్నాయి. మెడిసిన్ , ఇంజనీరింగ్ వంటివి చదవమని” తల్లి తండ్రులు ఎంత చెప్పినా భారతి నిర్ణయం లో మార్పు రాలేదు.

“నీటి సమస్య తీర్చగలను అనుకుంటున్నావా?“ అన్న తల్లి, తండ్రులకు తాను తెలుసుకున్న వివరాలు చెప్పింది.

“అమ్మా! మూఁడు వంతులు నీరు, ఒక వంతు నేలా ఉన్న భూమి లో నీటి కొరత ఏర్పడకూడదు.

ఆ కారణాలను పరిశోధన చేయాలి”. కూతురి మంచి ఆలోచన, పట్టుదల, దీక్షచూసి ఆమె మౌనం వహించింది.

మంచి నీరు సముద్రంలో కలిసి ఉప్పు నీరుగా మారి నిరుపయోగమవుతున్న విషయం పరిశీలించి ఆ నీటిని సముద్రములో కలవకుండా ఆపే విధానాల పై పరిశోదనలు చెయ్యడము ప్రారంభించింది.

ప్రపంచలోని పలు దేశాల విధానాలు పరిశీలించి, ఎన్నో ఆసక్తికర విషయాలు తెలుసుకుంది.

దుబాయ్ వంటి దేశాల్లో ఉప్పు నీటిని మంచి నీటిగా మార్చకునే  ప్రక్రియ ను అనుసరిస్తున్నారని తెలుసుకుంది.

సింగపూరు వంటి దేశాలలో వారు ఒకసారి వాడిన నీటిని శుద్ది చేసి మళ్ళీ అదే నీరు వాడే విధానాన్ని అనుసరిస్తున్నారు. భారతదేశంలో జీవనదులు పన్నెండు అనుసంధానం చేయడం ద్వారా వరదలను అరికట్టవచ్చు కరవు ప్రాంతానికి నీటిని అందించవచ్చు.

అది అమలు చెయ్యాలని జవహర్ లాల్ నెహ్రు గారి హయాంలోనే నిర్ణయించినా ఆచరణ సాధ్యం కాలేదు .

ఇంకా వాన నీటిని ఒడిసి పట్టే ఇంకుడు గుంతల ద్వార భూమిలోని జలరాశిని పెంచవచ్చు.

పర్యావరణాన్ని సమతులం చెయ్యడానికి చెట్లను ,అడవులను పెంచడం కూడా కొంత సమస్యను తీరుస్తుంది.

*************

భారతి తన పరిశోధన అంశాలను భారత ప్రభుత్వానికి పరిశీలనకు పంపి, దేశ ప్రదాని నుండి అమలుచేయుటకు కావలసిన అనుమతి పొందగలిగింది.

ఆమె మొదటగా తన అమ్మమ్మ గారి ఊరినుండి మొక్కలు పెంచడం, ఇంకుడు గుంతలు తవ్వించడం మొదలు పెట్టింది.

మిగిలిన పధకాలు ప్రభుత్వము ద్వారా చేయాలి. వారి సహాయ, సహకారాల కోసము వేచివున్నది.

ఆమె ఈ విషయాలపై ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించడం మొదలు పెట్టింది. ఆక్రమంలో తనవంటి ఆలోచనలు కలవారిని కలుస్తున్నది. వారంతా ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వారిలో విజయ్ చాలా చురుకుగా వుంటూ, భారతికి చేదోడు వాదోడుగా వుంటున్నాడు.

“మన ఇద్దరి భావాలు కలిసినట్లే మనం కూడా ఇంక కలిసి ప్రయాణం చేద్దామన్న విజయ్ కి భారతి తన అంగీకారం తెలిపింది”. అలా వారి పరిచయం పెళ్ళికి దారి తీసింది.

విజయ్ కూడా అయిదు సంవత్సరాలు అమెరికాలో వుద్యోగం చేసి, అక్కడ వుండలేక స్వదేశానికి తిరిగి వచ్చేశాడు. అమెరికాలోని సౌకర్యాలన్నీ వుండేలా తమ ఇంటిని తీర్చిదిద్దుకున్నాడు. తల్లి, తండ్రులతో కలిసి వుంటున్నాడు. తాను సంపాదించిన డబ్బుతో పది ఎకరాల పొలం కొన్నాడు. ఆధునిక పరికారాలతో, వ్యవసాయంలో కొత్త వొరవడులకు శ్రీకారం  చూట్టాడు.

దుబాయి వంటి దేశాల వాతావరణమే తమ వూరిలో వున్నదని ఖర్జురమ్ చెట్లు మూడు ఎకరాల్లో పెంచాడు. మొదటి రెండు సంవత్సరాలు పంట మీద రాబడి రాలేదు. మూడవ సంవత్సరం ఖర్జురాలు విరగ కాశాయి. మంచి లాభాలు వచ్చాయి. అతన్ని చూసి వూరిలోని మరికొందరు ఆ తోటలు పెంచడానికి ముందుకు వచ్చారు. మిగిలిన ఏడు ఎకరాల్లో వేరు, వేరు పంటలను ఎరువులు వేయకుండా ఆర్గానిక్ పద్ధతుల్లో పండిస్తున్నాడు. విండ్ మిల్స్ , సోలార్ ప్లాంట్ కూడా నిర్మించాడు.

నవ యువత తలుచుకుంటే చేయలేనిది ఏముంటుంది. పాత భావాలు వదిలించుకుని , కొత్త ఆలోచనలు, ఆదర్శాలతో వారే దేశాన్ని ముందుకు ప్రగతి పధం లోకి నడపగలరు.

భారతి, విజయ్ ని చేసుకోవాలని నిర్ణయించుకుందని, ఇక ఆమె ఆమెరికాకు తిరిగి రాదని తెలుసుకుని ఆమె తల్లితండ్రులు నివ్వెరపోయారు. ఒంటరిగా కూతురికి దూరంగా వుండలేక , కూతురి లక్ష్యసాధన లో తామూ పాలు పంచుకోవాలని, మాతృభూమి, కన్నతల్లి ఋణం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆమె తల్లి తండ్రులు కూడా మాతృ భూమికి చేరుకున్నారు.

విజయ్, భారతి ల మిత్ర బృందం కలిసి వూరి రూపు రేఖలను మార్చి వేసారు.

"కృషితో నాస్తి దుర్భిక్షం”.

*** సమాప్తం ***

Posted in April 2022, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!