Menu Close
తెలుగు పద్య రత్నాలు
-- ఆర్. శర్మ దంతుర్తి --

రాజసూయం చేసినప్పుడు కృష్ణుడొచ్చి అడుగుతాడు, ‘ధర్మజా, ఈ పని చేయొచ్చు, ఇది చేయకూడదు అనే విషయాలు ఆలోచించకుండా ఈ యజ్ఞం సమయంలో నీ ఇష్టం వచ్చినట్టూ, నన్నేం పని చేయమంటావో చెప్పు,” అని. అప్పుడు ఆయన్ని అతిథులకి స్వాగతం పలకడానికి వినియోగించి, థర్మజుడు మనసులో అనుకుంటాడు, “భగవంతుడు నేను చేసేపనికి మెచ్చాడు, అంతకన్నా ఇంకేమిటి నాకు కావాల్సింది?” అని. యజ్ఞం పూర్తి చేసాక వచ్చిన వాళ్లలో ఒకరికి ముఖ్య అతిథిగా అర్ఘ్యం ఇవ్వాలి. ఈ అర్ఘ్యం తీసుకోవడానికి అర్హుడు తనని రాజసూయం చేయమని చెప్పి, తనకూడా పక్కనే ఉన్న సాక్షాత్తూ భగవంతుడైన శ్రీకృష్ణుడు. అయితే మొదటి అర్ఘ్యం కృష్ణుడికి ఇస్తే వచ్చిన అతిరథ మహారథులలో ఎవరికైనా కోపం రావచ్చు కనక – థర్మం ప్రకారం యుథిష్టురుడు భీష్ముణ్ణి ఆడుగుతాడు, “తాతా నువ్వు చెప్పు ఈ అర్ఘ్యం ఎవరికి ఇవ్వమంటావు?” అని.

అప్పుడు భీష్ముడు చెప్తాడు, “థర్మం ప్రకారం, స్నాతకుడు, సద్గురుడు, ఋత్విజుడు, ఇష్టుడు, భూపాలుడు, జ్ఞాన సంపన్నుడు, ఈ ఆరుగురు పూజింపదగినవారు. ఈ లక్షణాలన్నీ ఉన్నవారిని ఒకర్ని పూజించు,” అని. ఆ గుణాలున్నవారెవరో నువ్వే చెప్పు అంటే, కృష్ణుణ్ణే చూపిస్తాడు భీష్ముడు. అయితే కృష్ణుడికి అర్ఘ్యం ఇచ్చాక థర్మరాజు అనుకున్నట్టే శిశుపాలుడికి కోపం వస్తుంది. “ఈ గోపికల కూడా తిరిగే గొల్లవాణ్ణా నువ్వు గౌరవించినది? ఈ భీష్ముడికి వయసు వచ్చి బుర్రపనిచేయకపోతే నీకూ నీ తమ్ముళ్ళకీ ఏమైంది? ఇంతమంది వీరులం మేముండగా అందరికన్నా చిన్నవాడై, గోకులంలో వెన్న, పాలూ దొంగిలిస్తూ అల్లరి చిల్లరగా తిరిగే ఈ కృష్ణుడా నీకు కనిపించినది?” అని గేలి చేసినప్పుడు ధర్మరాజు శిశుపాలుణ్ణి పక్కకి తీసుకెళ్ళి మంచిగా మాట్లాడి సర్ది చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు, రాజుల్లో కలహాల వల్ల వచ్చే యుథ్థాలూ, చావులూ గుర్తు తెచ్చుకుని.

అయితే అక్కడే ఉన్న సహదేవుడికి ఛర్రున కోపం వస్తుంది శిశుపాలుడు అన్నది విని. రాజసూయం చేసేది థర్మరాజు, అర్ఘ్యం ఎవరికివ్వాలనేది ఆయనిష్టం. ఈ శిశుపాలెడెవరు మథ్యలో? ఆ కోపంలో సహదేవుడు అన్నదే ఈ నెల ఆంథ్ర మహాభారతం సభాపర్వంలో నన్నయ రాసిన పద్యం.

చ.
ఎడపక యర్ఘ్య మచ్యుతున కిచ్చితి; మిచ్చిన దీని కిం దొడం
బడ మని దుర్జనత్వమున బల్కెడు వీరుల మస్తకంబుపై
నిడియెద నంచు దా జరణమెత్తె సభన్ సహదేవు డట్టిచో
నుడిగి సభాసదుల్ పలకకుండిరి తద్దయు భీతచిత్తులై           (సభా పర్వం ద్వితీయాశ్వాశం 30)
 

మా అన్న భీష్మాచార్యులని అడిగాక ఎడపక – వెనుకాడక, మేము అర్ఘ్యం అచ్యుతుడికి ఇచ్చాం. అలా ఇచ్చిన దానికి ఒడంబడము (ఒప్పుకోమని), దుర్జనత్వంతో పలికే వీరుడు ఇక్కడెవరైనా ఉంటే, వాళ్ల తలమీద (మస్తకంబుపై) పెట్టడానికి (నిడియెదనంచు) ఇదిగో నా పాదం (దాజరణమెత్తె) – అంటూ కాలు (చరణం) ఎత్తాడు. సహదేవుడలా అనే సరికి సభాసదుల వెన్నులో వెణుకు పుట్టి ఎవరికీ మాట రాలేదు (పలకకుండిరి తద్దయు భీతచిత్తులై).

ఈ భయం థర్మరాజుకి కూడా కలుగుతుంది, కానీ మరో కారణానికి – యజ్ఞం పూర్తవదేమోనని. కానీ అక్కడే ఉన్న భీష్ముడు మాత్రం నిర్విచారంగా కూర్చుని నవ్వుతూ చెప్తాడు యుథిష్టిరుడితో, “ఏమీ కంగారు లేదు, అన్నీ భగవంతుడైన కృష్ణుడే చూసుకుంటాడు,” అని. ఇదే శ్రీరామకృష్ణులు చెప్పిన శరణాగతి అంటే. “ఒక చేత్తో భగవంతుణ్ణి పట్టుకుని రెండో చేత్తో ఈ ప్రపంచంలో పనులు చేస్తూ ఉండు. ఆ పని చేయడం అయిపోయాక, రెండు చేతులూ ఆయనకే జోడించు.” మనం చేయవల్సినది చేసాక ఆయన చేయవల్సిన మిగతాది ఆయనే చూసుకుంటాడు.

అర్ఘ్యం ఎవరికివ్వాలని అడిగినప్పుడు భీష్ముడేం చెప్పేడు? కృష్ణుడికన్నా జ్ఞానసంపన్నుడూ, ఋత్విజుడూ, ఇష్టుడూ, సద్గురుడూ ఎవరున్నారు?  ఇంత జరిగినా శిశుపాలుడు ఒప్పుకోడు. చివరకి వాడి తలపోయాక వాడిలోంచి ఒక వెలుగు బయల్దేరి కృష్ణుడిలో కలిసిపోతుంది. అది చూసిన థర్మరాజుకి ఆశ్చర్యం వేసి అక్కడే ఉన్న నారదుణ్ణి అడుగుతాడు – “వీడు పుట్టినప్పటినుండి, పొద్దున్న నుంచి సాయంత్రందాకా కృష్ణుణ్ణి అదేపనిగా తిట్టడం, అసహ్యించుకోవడమూను, అయినా వీడు పోయాక వీడు కృష్ణుడిలో కలిసిపోవడం ఏమిటి?” అని. అప్పుడు నారదుడు చెప్తాడు, “భగవంతుణ్ణి ఎలా గుర్తుంచుకున్నాం అనేది ముఖ్యం కాదు. కామంతో గోపికలూ, భయంతో కంసుడూ, వైరంతో రగిలిపోతూ జరాసంథుడివంటి రాజులూ, బంథుత్వంతో యాదవులూ (వృష్ణులూ) కృష్ణుణ్ణి అనుక్షణం గుర్తుపెట్టుకుని ఆయన అనుగ్రహం సంపాదించారు కదా. అలాగే ఏదో విధంగా ఆయన్ని మనసులో నిరంతరం గుర్తుపెట్టుకుంటే శ్రీహరిని చేరుకోవచ్చు,” అని.  దీనికి ఉదాహరణగా నారదుడు హిరణ్యకశిపుడి కథ కూడా చెప్తాడు. ఏ శత్రువు పేరైతే తాను వినకూడదనుకున్నాడో అదే పేరు – నారాయణ, హరి అంటూ ప్రహ్లాదుడు అనుక్షణం వేథించుకు తింటాడు తండ్రిని.

ఈ పద్యంలో ఉన్న మరో ముఖ్యమైన విషయం – భగవంతుణ్ణి సహదేవుడు ఎలా సంభోధించాడనేది. సహదేవుడేమంటున్నాడంటే, “ఎవరికి ఇచ్చాం అర్ఘ్యం? అచ్యుతునకి.” అచ్యుతుడంటే చ్యుతి, క్షయము, నాశనము లేనివాడు. పద్యం రాసేటపుడు నన్నయ ఎంత జాగ్రత్తగా కృష్ణుడికి అచ్యుతుడనే పేరు తీసి ఎందుకు వాడాడో గమనించారా? అంటే పద్యం రాసేటపుడు విష్ణుసహస్రనామాల్లో ఉన్న ఏదో ఒక పేరు తీసి పాదంలో ప్రాస సరిపోయినట్టూ రాసేయడం కాదు. అది రాసిన పరిస్థితులకి సరిగ్గా అతికే పదం అయ్యిండాలి. అందుకే అంటారు పంచమ వేదమైన మహాభారతం గురించి – ‘యది హస్తి తదన్యత్ర యన్నే హస్తి నతద్ క్వచిత్‘ అని. ఇందులో ఉన్నది ప్రపంచంలో ఎక్కడో ఒకచోట ఉన్నదే. ఇందులో లేనిది ప్రపంచంలో ఎక్కడా లేదు.

****సశేషం****

Posted in April 2022, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!