Menu Close
Lalitha-Sahasranamam-PR page title

ద్వితీయ అధ్యాయం (అమ్మవారి స్థాన నిరూపణ)

శ్లోకాలు: 22-23, సహస్రనామాలు: 55-63

055. ఓం సుమేరు శృంగమధ్యస్థాయై నమః

సుమేరుగిరిశృంగ మధ్యభాగంలో భాసిల్లునట్టి పరమేశ్వరికి ప్రణామాలు.


056. ఓం శ్రీ మన్నగరనాయికాయై నమః

శ్రీ చక్రమునకు లేక శ్రీ విద్యానగరమునకు నాయికయై ప్రకాశించు పరమేశ్వరికి ప్రణామాలు.


057. ఓం చింతామణి గృహాంతస్థాయై నమః

చింతామణి మంత్రాధి దేవత భక్తుల వాంచితార్ధాలను నెరవేరుస్తుంది. . అట్టి చింతామణి మందిరంలో నివసించు శ్రీమాతకు వందనాలు.


058. ఓం పంచబ్రహ్మాసన స్థితాయై నమః

బ్రహ్మ-విష్ణు-ఈశ-రుద్రులు మంచంకోళ్ళుగాను, సదాశివుడు ఫలకస్థానంలోను తేజరిల్లునట్టి ఆసనం పై విరాజిల్లు తల్లికి వందనాలు.


059. ఓం మహాపద్మాటవీ సంస్థాయై నమః

‌షట్చక్రాలు, లేదా అసంఖ్యాక సహస్రనాడులే మహాపద్మాలనబడుతాయి. అగణితనాడీ నిలయరూపమైన దేహరూప పద్మారణ్యంలో వసించు మాతకు ప్రణామాలు.


060. ఓం కదంబవనవాసిన్యై నమః

కదంబవనం వాసస్థానంగా గల శ్రీ మాతకు వందనాలు.


061. ఓం సుధాసాగర మధ్యస్థాయై నమః

అమృతసాగరమధ్య భాగంలో తేజరిల్లు లలితామతల్లికి వందనాలు.


062. ఓం కామాక్ష్యై నమః

పరమేశ్వరి నేత్రాలు శివస్వరూపాలై భక్తులవాంఛితాలను నెరవేర్చునట్టివియై ప్రకాశిస్తున్నాయి.


063. ఓం కామదాయిన్యై నమః

కోరిన కోరికలను ప్రసాదించునట్టి తల్లికి ప్రణామాలు.


* * * ద్వితీయ అధ్యాయం సమాప్తం * * *

తృతీయ అధ్యాయం (అమ్మవారి అవతార కార్యక్రమంలో భండాసురవధ)

శ్లోకాలు: 24-34/1, సహస్రనామాలు: 64-84

064. ఓం దేవర్షి గణసంఘాతస్తూయమానాత్మ వైభవాయై నమః

పరతత్త్వ మహిమకలిగి దేవర్షి గణంచే స్తోత్రం చేసింది మాతకు వందనాలు.


065. ఓం భండాసుర వధోద్యుక్త శక్తి సేనాసమన్వితాయై నమః

ముక్కంటి కంటి మంటకు భస్మావశేషుడైన మదనుని భస్మంనుండి ఆవిర్భవించిన క్రూరభయంకాసురుడు-భండాసురుడు. అట్టి దురాత్ముని సంహారార్థం సర్వశక్తి గణాలతో కూడిన శ్రీ లలితకు వందనాలు.


066. ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయై నమః

పరదేవతా యొక్క అంకుశంనుండి పుట్టిన సంపత్కరీనామకమైన దేవత గజాయుధాలకు అధికారిణియై-రణకోలాహలంచేసే గజాన్ని అధిరోహించి, గజసైన్యాలతో శ్రీలలితను సేవిస్తూన్నది. అట్టి లలితాంబకు వందనాలు.


067. ఓం అశ్వారూఢాధిష్టితాశ్వ కోటి కోటిభిరావృతాయై నమః

వాయువేగ, మనోవేగాదులనధిగమించిన కోట్లాది అశ్వాలను అధిష్టించిన శక్తి సేనలకు నాయకురాలై ‘అశ్వారూఢ’ నామకశక్తి పరాశక్తిని సేవించుచున్నది. అట్టి శ్రీలలితకు వందనాలు.


068. ఓం చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృతాయై నమః

‌సర్వాయుధాలతో నిండిన చక్రరాజమనే రథాన్ని అధిరోహించిన శ్రీ లలితాంబకు నమస్కారాలు.


069. ఓం గేయచక్ర రథారూఢ మంత్రిణీ పరిసేవితాయై నమః

గేయచక్రమనే రథాన్ని అధిరోహించి మంత్రిణియైన శ్యామలాదేవిచే సేవలనందుకుంటూన్న శ్రీమాత కు నమస్కారాలు.


070. ఓం కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృతాయై నమః

కిరి (వరాహం) రూపంలో ఉండునది__వరాహాలు వాహనాలుగా కట్టబడిన రధానికి కిరిచక్రరథమని నామము. అట్టి రథాన్ని అధిరోహించి దండనాయికైన వారాహీ శక్తిచే సేవించబడుతూన్ళ లలితాంబకు ప్రణామాలు.


071. ఓం జ్వాలా మాలినికాక్షిప్త వహ్ని ప్రాకారమధ్యగాయై నమః

గుప్తంగా ఉన్న జ్వాలామాలలతో కూడుకున్న అగ్ని ప్రాకార మధ్యభాగంలో భాసిల్లునట్టి పరమేశ్వరికి ప్రణామాలు.


072. ఓం భండసైన్య వధోద్యుక్త శక్తి విక్రమ హర్షితాయై నమః

అనంతమైన తన శక్తి సైన్యాలన్నీ భండాసురునణ్ణి వధించడానికి సంహరించ డానికై సంసిద్ధం కావడం చూసి ఆనందాన్ని పొందుతూన్న శ్రీలలితకు వందనాలు.


073. ఓం నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుకాయై నమః

నిత్యాతిధి దేవతలు పదునైదుమందీ కలిసి దుష్టులై అనిత్యాసురులను అంతం చేయ సంసిద్ధులు కావడం చూసి ఉత్సాహాన్ని పొందుతూన్న మాతకు నమస్కారాలు.


074. ఓం భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందితాయై నమః

నవవర్షప్రాయం కల బాలా త్రిపుర సుందరి--భండాసురుని కుమారులను హతమార్చినదన్న వార్తవిని ఆనందించిన శ్రీ లలితామాతకు నమోవాకాలు.


075. ఓం మంత్రిణ్యంబా విరచిత విషంగవధ తోషితాయై నమః

విషంగుడనే కౄరాపరుణ్ణి మంత్రిణ్యంబాదేవి హతమార్చగా చూచి సంతోషించిన శ్రీ లలితాంబకు వందనాలు.


076. ఓం విశుక్ర ప్రాణహరణా వారాహీ వీర్యనందితాయై నమః

విశుక్ర నామకాసురుణ్ణి అంతం చేసిన వారాహీ శక్తిని తిలకించి ఆనందించిన శ్రీ మాతకు వందనాలు.


077. ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరాయై నమః

విఘ్నపరంపరలు రూపుమాపుటకై శ్రీ లలిత-కామేశ్వరుని ముఖంకేసి చూడగా క్షణంలో మహాగణపతి ఆవిర్భవించాడు. అట్టి మహాశక్తిగల మహేశ్వరికి వందనాలు.


078. ఓం మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితాయై. నమః

కౄరరాక్షసులు ప్రయోగించిన విఘ్నయంత్రాలను అన్నింటినీ, నాశనం చేసిన మహాగణపతిని తిలకించి మహానందాన్ని చెందిన మహా మాతకు ప్రణామాలు.


079. ఓం భండా సురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణ్యై నమః

భండాసురుడు శ్రీ దేవి పై శస్త్రాలను ప్రయోగిస్తుండగా ఆమె వానిపై ప్రత్యాస్త్రాలను వర్షింపజేయసాగింది. అట్టి జననికి వందనాలు.


080. ఓం కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృత్యై నమః

తన నఖాగ్ర భాగాలనుండి పదిఅవతారాలనూ ప్రభావింపజేసిన మహేశ్వరికి నమోవాకాలు.


081. ఓం మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధా సురసైనికాయై నమః

మహాపాశుపతాస్త్రాన్ని ప్రయోగించి రాక్షస సైన్యాలను సర్వనాశనం చేసిన జగన్మాతకు ప్రణామాలు.


082. ఓం కామేశ్వరాస్త్ర నిర్దగ్ధభండాసుర శూన్యకాయై నమః

కామేశ్వరాస్త్రాన్ని ప్రయోగించి సైనపుర సమేతంగా భండాసురుణ్ణి దగ్ధం చేసిన శ్రీదేవికి ప్రణామాలు.


083. ఓం బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవసంస్తుత వైభవాయ నమః

బ్రహ్మ, విష్ణు, మహేంద్రాది బృందారక శ్రేష్ఠులచే సంస్తుతింపబడిన లలితా మాతకు వందనాలు.


084. ఓం హరనేత్రాగ్ని సందిగ్ధకామ సంజీవనౌషధ్యై నమః

రుద్రుని క్రోధాగ్ని జ్వాలల్లో భస్మావశేషుడైన మన్మధునికి సంజీవనౌషధివంటి లలితామాతకు ప్రణామాలు.


* * * తృతీయ అధ్యాయం సమాప్తం * * *

----సశేషం----

Posted in April 2022, ఆధ్యాత్మికము

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!