Menu Close
Mutthevi Ravindranath Photo
'మనుస్మృతి'
ముత్తేవి రవీంద్రనాథ్
మూడవ అధ్యాయము (ఓ)

మహాలయ శ్రాద్ధములు

వర్ష ఋతువులో మఖా నక్షత్రంతో కూడిన భాద్రపద కృష్ణ త్రయోదశినాడు తేనెతో కూడిన ఏ పదార్థంతోనైనా శ్రాద్ధం చేస్తే అది పితృదేవతలకు అంతులేని తృప్తినిస్తుంది. వర్ష ఋతువులో భాద్రపద బహుళ త్రయోదశినాడు కుంజరము (ఏనుగు) యొక్క ఛాయ (నీడ) తూర్పు దిశలో పడే సమయంలో అంటే అపరాహ్ణ కాలంలో  పితృదేవతలు తమలో తాము మాట్లాడుకుంటూ “మన వంశంలో పాయసము, మధు(తేనె), సర్పిస్ (నెయ్యి) తో శ్రాద్ధ కర్మ చేసి మనన్ని తృప్తిపరచే వాడు ఎవడైనా పుట్టి ఉండకపోతాడా?” అని ఆశతో అనుకుంటారట.

శ్రద్ధాభక్తులతో మానవుడు ఏ వస్తువునైనా శాస్త్రప్రకారం ఇస్తాడో, అది అతడి పితరులకు ఇహ పరములలో అంతులేని మేలు కలిగిస్తుంది.

కృష్ణ పక్షంలో దశమి మొదలుకొని అమావాస్య వరకు (ఒక్క చతుర్దశి మినహా) గల తిథులన్నీ శ్రాద్ధ కర్మలకు ప్రశస్తములు.

సరి తిథులలో సరి నక్షత్రములైన భరణి, రోహిణి మొదలైన వాటిలో శ్రాద్ధము చేసినవాడు కోరుకున్నవన్నీ నెరవేరతాయి. పాడ్యమి మొదలైన బేసి తిథులలో, అశ్విని, కృత్తిక మొదలైన బేసి నక్షత్రములలో శ్రాద్ధ కర్మలు చేసినవాడు సంపద, విద్య అధికంగా కలిగిన సంతానాన్ని పొందుతాడు.

అశ్విని మొదలుగాగల మొత్తం ఇరవై ఏడు నక్షత్రాలలో భరణి, రోహిణి మొదలైన 13 నక్షత్రాలు సరి నక్షత్రములు కాగా మిగిలిన 14 బేసి నక్షత్రాలు. పాడ్యమి మొదలైన తిథులలోనూ సరి, బేసి వర్గీకరణ ఉంది.

శ్రాద్ధ కర్మలకు శ్రేష్ఠమైన సమయం

యథా చైవాపరః పక్షః పూర్వపక్షాద్విశిష్యతే  |
తథా శ్రాద్ధస్య పూర్వాహ్ణాదపరాహ్ణో విశిష్యతే || (3- 278)

పితృ క్రియలకు పూర్వపక్షం కంటే నెలలో రెండవ సగమైన అపర పక్షం ఎలా విశిష్టమైనదో, అలాగే పూర్వాహ్ణము కంటే అపరాహ్ణము శ్రేష్ఠమైనది.

సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు గల దినము (పగటి కాలం) లో సూర్యోదయం నుంచి మిట్టమధ్యాహ్నం వరకు గల మొదటి  సగభాగాన్ని పూర్వాహ్ణము అంటారు. మధ్యాహ్నం నుంచి సూర్యాస్తమయం వరకుగల రెండవ సగభాగాన్ని అపరాహ్ణము అంటారు.

ప్రాచీనావీతినా సమ్యగపసవ్యమతంద్రిణా |
పిత్య్రమానిధనాత్కార్యం విధివద్దర్భపాణినా || ( 3- 279 )

శ్రాద్ధ కర్మలో కర్త ప్రాచీనావీతియై (కుడి భుజం మీద యజ్ఞోపవీతం ధరించినవాడై), ఏ మాత్రం అలసత్వం, ఏమరుపాటు లేకుండా, మృతి చెందిన రోజునుంచి శ్రాద్ధ క్రియలు ముగిసేవరకు చేతిలో దర్భలను ఉంచుకుని, సక్రమంగా  విధి ప్రకారం అన్నిపనులూ అపసవ్యదిశలో చేయాలి.

రాత్రిని రాక్షసి అంటారు. అందుకే రాత్రి వేళలలో శ్రాద్ధ క్రియలు చేయరాదు. ప్రాతస్సాయం సంధ్యా  కాలములలోనూ శ్రాద్ధము చేయకూడదు. సూర్యోదయమైన వెంటనే కూడా చేయరాదు. శ్రాద్ధ కర్మలకు అపరాహ్ణ వేళయే శ్రేష్ఠం.

ఈ విధంగా సంవత్సరంలో మూడు సార్లైనా హేమంత, గ్రీష్మ, వర్షర్తువులలో శ్రాద్ధ కర్మలు చేయాలి. అయితే ఒక గృహస్థు రోజువారీ చేయాల్సిన పంచ మహా యజ్ఞములలో భాగంగా రోజూ కనీసం ఒక్క విప్రునికైనా భోజనం పెట్టి అతడిని తృప్తి పరచాలి.

పితృయజ్ఞ సంబంధమైన హోమాన్ని శ్రౌత, స్మార్త వ్యతిరిక్తమైన లౌకికాగ్నిలో చేయరాదు. అగ్నిహోత్రమును ఎప్పుడూ ఉంచుకునే వాడిని ఆహితాగ్ని అంటారు.

ఆహితాగ్ని కానివాడు విప్రహస్తంలో హవిస్సులు సమర్పించవచ్చు. ఆహితాగ్ని అయినట్టి బ్రాహ్మణుడు ఒక్క అమావాస్య రోజు తప్ప మాసశ్రాద్ధము చేయరాదు. ఎక్కడ ద్విజోత్తముడు స్నానం అయ్యాక నీటితో ప్రతిరోజూ తర్పణలు విడుస్తాడో,

దానితోనే అతడి పితృదేవతలందరూ తృప్తి పొందుతారు. ఆ కర్త కూడా పితృ యజ్ఞం చేసిన ఫలాన్ని కూడా పూర్తిగా పొందుతాడు.

తండ్రులు వసురూపులనీ, పితామహులు (తాతలు) రుద్రరూపులనీ, ప్రపితామహులు (ముత్తాతలు) ఆదిత్యరూపులనీ ఒక విశ్వాసం అనాదిగా ఉంది.

అందుకే ప్రతి ఒక్కరూ తండ్రిని వసు రూపునిగానూ, తాతను రుద్రరూపునిగానూ, ముత్తాతను  ఆదిత్యరూపునిగానూ భావించి ధ్యానించాలి. ఎవరు ఈ విధంగా తన పితృ పితామహ ప్రపితామహులను వసురుద్రాదిత్య రూపులుగా ధ్యానిస్తారో వారి ఎడల వసురుద్రాదిత్యులు ప్రీతి చెందుతారు.

ఇక్కడ వసువు, రుద్ర, ఆదిత్య శబ్దాలకు అర్థాలేమిటో తెలుసుకుందాం. వసు అంటే బంగారము, సంపద, రత్నాలు - ఇలా అన్నీ సంపదను సూచించే అర్థాలే ఉన్నాయి. వసువుల పేరుతో ఒక దేవతా గణం  ఉంది. ప్రజాపతి పుత్రులైన ఆపుడు, ధ్రువుడు, సోముడు, ధరుడు, అనిలుడు, అనలుడు, ప్రత్యూషుడు,ప్రభాసుడు అనే ఎనిమిది మందిని అష్ట వసువులు అంటారు. వసిష్ఠుని ఆశ్రమం నుంచి కామధేనువును దొంగిలించే ప్రయత్నం చేసినందుకు ఆయన వీరిని మనుషులుగా పుట్టమని శపిస్తాడు. గంగకు శంతనుడి వల్ల   వీరంతా ఒకరి తరువాత మరొకరుగా పుడతారు. ఎనిమిదవవాడైన ప్రభాసుడే గాంగేయుడు అని పిలువబడిన భీష్ముడు.

ఇక బ్రహ్మమానస పుత్రులైన  పదకొండు మందిని రుద్రులు అంటారు. వారు - అజుడు, ఏకపాదుడు, అహిర్బుధ్న్యుడు, హరుడు, శంభుడు, త్రయంబకుడు, అపరాజితుడు, ఈశానుడు, త్రిభువనుడు, త్వష్ట, రుద్రుడు - ఈ పదకొండు మందిని ఏకాదశ రుద్రులు అంటారు.

అదితికి పుట్టినవారు కనుక ఆదిత్యులు. అదితికి కశ్యప ప్రజాపతి వలన పుట్టిన 12 మందిని ద్వాదశాదిత్యులు అంటారు. వారు - ధాత, మిత్ర, అర్యమా, త్వష్ట, వరుణ, పూష, శుక్ర, అంశుమాన్( రవి- సూర్య), భగ , వివస్వత, సవితృ, విష్ణు.

ఈ అధ్యాయం అంతా మనం పితృదేవతలకు పిండాలు పెట్టడంలోనూ, వారికి తర్పణలు విడవడంలోనూ  పాటించాల్సిన పలు నియమాలను గురించి తెలుసుకున్నాం. ముందుగా మనం అసలు ఈ శ్రాద్ధ క్రియల ప్రయోజనం ఏ మేరకు ఉంటుందో కూడా కొంచెం హేతుదృష్టితో ఆలోచించడం అవసరం. ‘బృహదారణ్యకోపనిషత్’ లో హేతుదృష్టితో ప్రశ్నించే  గార్గి అనే విద్యార్థిని యొక్క  జిజ్ఞాసను అడ్డుకున్న యాజ్ఞవల్క్యుడు,  ‘ ఇక మీదట ప్రశ్నించి విసిగిస్తే  నీ తలతెగి పడుతుంది’, అని హెచ్చరిస్తాడు. జిజ్ఞాసువులు అడిగే ప్రశ్నలకు శాస్త్రీయంగా సమాధానాలు చెప్పలేని సంప్రదాయవాదులు హేతుదృష్టిని కేవలం అప్పుడు మాత్రమే కాదు ; ఎప్పుడూ ప్రోత్సహించరు. బహుశా ‘సంశయాత్మా వినశ్యతి’ అనే ఆర్యోక్తి ఏర్పడింది జిజ్ఞాసను తొక్కేయడానికీ, ఆధ్యాత్మిక విద్యారంగంలో దేనినీ ప్రశ్నించకుండా కేవలం అనుసరించే పద్ధతిని ప్రోత్సహించడానికేనేమో! సంశయించే ఆత్మ వినాశనమవుతుందట! ఒకపక్క ఆత్మ నాశములేనిదనీ, జీవుడు మరణించిన పిదప ఆత్మ ఈ శరీరాన్ని విడిచి మరో శరీరంలోకి వెళుతుందనీ, ఆత్మకు చావు పుట్టుకలు లేవనీ ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత ఘోషిస్తున్నాయి. మరి సంశయించే ఆత్మ కూడా అసలు ఆత్మేనా? కాదా? ఆత్మే అయితే అది ఎలా వినాశనమౌతుంది? ఇదొక వైరుద్ధ్యం !!

ఒకపక్క ఆత్మకు ఆకలిదప్పులు ఉండవని చెపుతూనే మరణించిన తమ పెద్దల ఆత్మలకు ఆహారంగా పిండాలు పెడతారు. అవి భోక్తలు లేక కాకులుతింటే తమ పితరుల ఆకలి తీరిందని భావిస్తారు. నీటిలో తర్పణలు వదిలి, ఆ నీరు ఎక్కడో ఊర్థ్వ లోకాల్లో సత్యలోకం దిశగా అలుపెరగని ప్రయాణం చేస్తున్న తమ పితరుల ఆత్మల దప్పిక తీరుస్తుందని భావిస్తారు. శ్రాద్ధ క్రియలలో భోక్తలు, కాకులు తిన్న ఆహారాలు, ఇక్కడ వదలిన తర్పణలు పితరులకు ఎలా చేరతాయోనన్న విషయాన్ని పక్కనబెడితే,  ఆత్మలకు అసలు ఆకలిదప్పులు ఉండవని చెపుతూనే ఇలా ఆ ఆత్మల ఆకలిదప్పులు తీర్చే ప్రయత్నం చేయడం మరో వైరుద్ధ్యం !!! ఇలా పరస్పరవిరుద్ధమైన భావనలకు ఆలవాలమైన ఆత్మ సిద్ధాంతాన్ని అందుకే హేతువాదులు అశాస్త్రీయమైనదిగా కొట్టిపారేస్తారు. గౌతమ బుద్ధుడు కూడా అనాత్మవాదే ! మన శరీరంలో ఆలోచించే మెదడు ఉండడం మాత్రమే సత్యమనీ, వ్యక్తి మరణంతో మెదడుకూడా నశిస్తుందనీ హేతువాదుల విశ్వాసం.  చావు పుట్టుకలు లేనిదని చెప్పబడే ఆత్మ ఒకటి మన శరీరంలో ఉన్నదనడం, మన మరణానంతరం అది మన శరీరాన్ని వదలి మరో శరీరంలో ప్రవేశిస్తుందనడం కేవలం ఎట్టి ఆధారాలూ లేని అశాస్త్రీయ విశ్వాసాలని హేతువాదుల నమ్మకం.

ద్విజుడు ఎప్పుడూ విఘసాశీ (అంటే విఘసమును భోజనం చేసేవాడుగా) ఉండాలి. లేక అమృత భోజనుడుగానైనా ఉండాలి. విఘసము అంటే శ్రాద్ధకర్మలలో పితృ దేవతలకు నివేదించగా, అతిథులకు పెట్టగా మిగిలిన శేషాన్నము. అమృతము అంటే యజ్ఞాలలో హవిస్సులుగా దేవతలకు సమర్పించగా మిగిలిన పురోడాశము వంటి హుతశేషము.

అలా ఒక గృహస్థు నిత్యం చేయాల్సిన పంచ మహాయజ్ఞాలలో పాటించవలసిన విధులు వివరించడంతో భృగు మహర్షి ప్రోక్తమైన మానవ ధర్మశాస్త్రం లోని మూడవ అధ్యాయం ముగుస్తుంది.

***సశేషం***

Posted in March 2022, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!