Menu Close
సెల్యూట్
-- తేజస్వి పారుపూడి --

'నేనెక్కడున్నాను? ఇది స్వర్గమా నరకమా? అనుమానం లేదు నరకమే. కడుపారా కన్నబిడ్డలను చేతులారా చంపిన నాకు నరకమే.., అయ్యో ... నేనెంత పాపాత్మురాలిని ? విషం కలిపిన పరమాన్నం భోజనం తింటూ వెర్రి ఆనందంతో నా బిడ్డలు 'ఇంకా కావాలమ్మా' అంటుంటే కన్న కడుపు శోకంతో రగిలిపోతున్నా వాళ్లకి గోరు ముద్దలు చేసి మరీ తినిపించాను. నేను తిన్నాను. కడుపులో ఏదో బాధ. మైకం కమ్మి నా కళ్ల ముందు .... సొమ్మసిల్లి పోతున్న నా కన్నబిడ్డల దీనమైన ముఖాలు కనిపిస్తున్నాయి. ఇంకెంత ? పదినిమిషాల్లో అందరం చచ్చిపోతాం ... ఆ... అయితే చచ్చిపోయామన్నమాట. బ్రతుకుకంటే చావు ఇంత తేలిగ్గా సుఖంగా ఉంటుందా? ఇలా అని తెలిస్తే ఎపుడో పోయేవాళ్లం'

కుమిలికుమిలి ఏడుస్తూ కలవరిస్తున్న నిర్మలను రాజేశ్వరమ్మ చల్లనిచెయ్యి తాకింది. 'నువ్వు బ్రతికే వున్నావు నిర్మలా!' ‘ఆ ... నేను బ్రతికే వున్నానా? అయితే... అయ్యో నా బిడ్డలు... నిర్మల కంఠంలో ఆవేదన. ఎందుకు ఏడుస్తావు...వాళ్లు చచ్చిపోవాలనేగా ఆఖరి ముద్ద తినిపించావు.”

నిర్మల దోసిట్లో ముఖం దాచుకుంది. 'అవును పరవాన్నంలో విషం కలిపి మరీ తినిపించాను. ఏం చెయ్యను? ఒకవైపు ఆకలితో అలమటించిపోయే పిల్లలకు పట్టెడన్నం పెట్టలేని నా నిస్సహాయత. మరోవైపు దుర్భాషలతో రోజూ నాపై చెయ్యి చేసుకుంటూ నా భర్త పెట్టే నరకయాతనలు ... నేను తట్టుకోలేకపోయాను.”

‘చాలా తప్పు చేసావు నిర్మలా! సమస్యకి పరిష్కారం చావేనా? సమస్య గులకరాయి. దూరంనుంచి చూస్తే చిన్నదిగా, తేలికగా కనిపిస్తుంది. కంటి దగ్గర పెట్టుకుంటే లోకాన్నే కప్పేస్తుంది.”

అవి ఒడ్డున కూర్చుని చెప్పే మాటలు. నేనెందుకు చచ్చిపోవాలనుకున్నానో, తెలిస్తే మీరిలా నీతులు చెప్పరు. నిరాశ పెంచుకుంటూ బ్రతకడం ఎంత తెలివి హీనం? ఆవేశం ధ్వనించింది నిర్మల కంఠంలో,

రాజేశ్వరమ్మ శాంతంగా అంది. నిజమే. కొన్ని జ్ఞాపకాలు ఎంతో భయపెట్టి బలహీనుల్ని చేసి ఆలోచనలనుండి ఒడ్డున పడనివ్వవు. కాని ఒక్కక్షణం నిగ్రహం తెచ్చుకుని ఆలోచిస్తే జీవితం భ్రమ కావచ్చు. కాని అందమైన భ్రమ చేసుకోవచ్చుగా. అది సరేగానీ అందుకేనా నన్ను అంత దీనంగా పాతిక రూపాయలు అప్పు ఇమ్మని బ్రతిమలాడావు?'

'అవును బతిమాలాను. పేగుల్లో ఆకలి చిచ్చు పెడుతుంటే.... నాలుగు రోజులుగా నా బిడ్డలకు పట్టెడన్నం పెట్టలేకపోయిన పాపిష్టి తల్లిని. చివరిసారిగా వారికిష్టమైన పరవాన్నం వండి పెట్టాలనే మీ దగ్గర అప్పుచేసాను. దానితోనే మెడికల్ షాపులో టాబ్లెట్లు కూడా కొన్నాను. కాని అది నా బిడ్డలకు తినిపిస్తున్నప్పుడు నేననుభవించిన నరకం ఎవరికి అర్థమవుతుంది? బిడ్డలకి తిండి పెట్టలేని నాలాంటి తల్లి బ్రతికి వున్నా నరకమే. అందుకే వాళ్లతోబాటే నేనూ తిన్నాను. “అమ్మా... పరమాన్నం చేదుగా ఉందేం?” అన్న పిల్లల మాటలే నన్ను కోసేస్తున్నాయి. ఆ... అన్నట్టు నా బిడ్డల శవాలేవీ?

'నిర్మలా....... పిల్లలు ఆస్పత్రిలో.....???' రాజేశ్వరమ్మ మాట పూర్తి కాకుండానే కళ్లు మూసుకునే భోరుమంది నిర్మల. 'అయ్యో... నా బిడ్డలు ముగ్గురూ చచ్చిపోయారా? నన్ను మాత్రం ఎందుకు బ్రతికించారమ్మా?'

రాజేశ్వరమ్మలో కరుణ పెల్లుబికింది. నిర్మలా! నీ బిడ్డలు చచ్చిపోలేదమ్మా ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. నువ్వు కళ్లు తెరు నిర్మలా నాకేసి చూడు.” నిర్మల నెమ్మదిగా కళ్లు విప్పి ఈలోకంలోకి వచ్చింది. 'ఆ... రాజేశ్వరమ్మ గారు! మేం సమాజానికే కాదు ఊరికి, దేశానికి భారం. నేను బ్రతికి ఈ లోకంలో ఎవరినీ ఉద్ధరించాల్సింది లేదు. మమ్మల్నెందుకు బ్రతికించారమ్మా?”

'బ్రతికి ఉండడం మానవ ధర్మం కనుక మనం నిర్వర్తించాల్సిన కర్తవ్యాలు ఇంకా వున్నాయి కనుక... మనం పుట్టింది చావడం కోసం కాదు కనుక ...”

'నేను ఈ జీవితంతో విసిగిపోయాను. ఒంటరిగా భర్త సాయం లేకుండా నేనీ బిడ్డల్ని ఎలా పెంచగలను? ఆ కసాయివాడు మారడమ్మా మీకు తెలీదు - ఆర్భాటాలు ఆడంబరాలతో అతగాడికి విపరీతమైన ఖర్చు అలవాటయింది. స్నేహితులు అని చెప్పుకున్న వాళ్లు అతని దగ్గర డబ్బున్నంతవరకూ వాడుకున్నారు - అప్పులపాలవగానే తరిమేసారు. ఇంటిమీదకొచ్చి ఆ అప్పులవాళ్లు రోజూ దుర్భాషలాడుతుంటే త్రాగుడు అలవాటు చేసుకున్నాడు - ఇంక అతను మారే అవకాశమే లేదమ్మా!”

రాజేశ్వరమ్మ సానుభూతిగా నిర్మల తల నిమిరింది. “లేదు నిర్మలా. సుధాకర్ మారాడు. స్పృహ తప్పిపోయి పడివున్న మిమ్మల్ని చూసి బెంబేలెత్తిపోయాడు. అతనిప్పుడు ఆస్పత్రిలో పిల్లల దగ్గర ఉన్నాడు. ప్రకృతిలో ఋతువులెంత సహజమో కష్టసుఖాలూ అంతే. జీవితంలో సౌఖ్యాన్ని వెతుక్కుంటూ పోవడమే మన కర్తవ్యం. నిజం చెప్పాలంటే నిర్మలా! ప్రపంచంలో అత్యంత సాహసం ఏంటో తెలుసా? నూరేళ్లు జీవించడం. అడుగడుగునా తిమింగిలాల్లా నోరు తెరిచే సమస్యల నుండి తప్పించుకుంటూ ఆత్మస్థైర్యమనే తెడ్డుతో నవ్వుతూ ఒడ్డుకు చేరడాన్ని మించిన సాహసం వేరేం లేదు. సుధాకర్కి ఉపాధి చూపించే బాధ్యత నాది. సరేనా? చూడమ్మా పశ్చాత్తాపంతో క్రుంగిపోతున్న సుధాకర్ను మళ్లీ ఆదరించు.”

నిర్మల అయోమయంగా అంది. “ఇంతకీ విషం తిన్న మేము ఎలా బ్రతికాం?”

రాజేశ్వరమ్మ నవ్వింది. “మీరు తిన్నది విషం కాదు కనుక...”

“అదెలా సాధ్యం...నా అంతట నేనే కొన్నానే...”

“నిర్మలా! ఒకోసారి అనుకోని సంఘటనలు మనిషిని అయోమయం చేసి అగ్ని పరీక్షకు నిలబెడతాయి... నెల్లాళ్లుగా నువ్వు పడుతున్న యాతనంతా నేను గమనిస్తూనే వున్నాను. నిన్న పాతిక రూపాయలు అప్పు అడిగినప్పుడు నీ మాటల్లోని నిరాశ, వేదన చూసి నాకు అనుమానం వచ్చింది. నిస్పృహతోవున్న నువ్వు మెడికల్ షాపుకి వెళ్తావని ఊహించాను. అందుకే నా సలహాతో షాపువాడు నీకిచ్చింది నువ్వడిగిన టాబ్లెట్లు కాదు. అలసిన మనసుకు మత్తుగా హాయిగా నిద్రపట్టించేవి. అందుకే పరమాన్నం తినగానే మీ అందరికీ గాఢంగా నిద్ర పట్టి తిన్నచోటే సొమ్మసిల్లిపోయారు. ఎప్పట్లాగే తూలుతూ వచ్చిన సుధాకర్ కళ్లకి మీరు సగం తింటూ వదిలేసిన పరమాన్నం... అక్కడే వెనక్కి విరుచుకు పడి నిద్రపోతున్న భంగిమల్లో మీరు... కనిపించేసరికి అతని మత్తు వదిలిపోయింది. అతనిని ఈ పరిస్థితి కంగారులో ముంచెత్తింది. వాస్తవం తెలిసీ నేను నోరు విప్పలేదు. సుధాకర్ మారాడు నిర్మలా! ఇది నిజం.

'నన్ను క్షమించండమ్మా!' ఇంట్లోకి అడుగుపెట్టాడు సుధాకర్.

‘వచ్చావా నాయనా? పిల్లలేరీ?'

'పిల్లల్ని మేజర్గారు మీ ఇంటికి తీసుకెళ్లారమ్మా! నిర్మలా నన్ను క్షమించలేవా?' అతని గొంతులో పశ్చాత్తాపం. “సుధాకర్! ఖలీల్ జిబ్రాన్ అనే రచయిత ఏమన్నాడో తెలుసా? ఒక మనిషిని అర్ధం చేసుకోవాలంటే అతను చెప్పిన మాటలు కాదు కొలమానం. చెప్పని మాటలు... భార్యా భర్తల మధ్య క్షమాపణలకంటే అర్ధంచేసుకునే మనసు చాలా ముఖ్యం.”

సుధాకర్ తలవంచుకున్నాడు. “నిజమేనమ్మా పాపిష్టి వాణ్ణి. ప్రేమించి పెళ్లాడిన నిర్మలను ఇన్నాళ్లూ నా మూర్ఖత్వంతో ఎంతో నొప్పించాను. స్నేహితుల మెచ్చుకోలు మాటలు నిజమేనని నమ్మి ...వచ్చిన జీతమంతా వాళ్లకే ఖర్చు చేసి అప్పులు చేసి - ఆఫీసు ఎగ్గొట్టి ఉద్యోగం కూడా పోగొట్టుకున్నాను. చివరికి నావాళ్లనుకున్న స్నేహితులే నన్నెగతాళి చేస్తూ నా ఎదుటే నన్ను చీదరించుకుంటుంటే వాళ్లనేమీ చేయలేని అశక్తతతో తాగడం మొదలెట్టాను. కుటుంబం కోసం నిర్మల పడుతున్న బాధ గమనించలేకపోయాను. కాని నిర్మల ఇంతకు సాహసిస్తుందని ఊహించలేకపోయాను. మీరే కనుక సమయానికి వాళ్లని ఆదుకోకపోతే ఈ జీవితంలో ఒంటరిగా మిగిలిపోయేవాడిని. నా పాపానికి నిష్కృతి ఉండేది కాదు.”

రాజేశ్వరమ్మ దీర్ఘంగా నిట్టూర్చింది. “సుధాకర్ నిర్మలా! జీవితం అనేది మనకు పోరాటాన్ని నేర్పుతుంది. సమస్యలతో పోరాడి జీవితాన్ని సార్ధకం చేసుకోవాలి తప్ప జీవితాన్ని ముగించుకోవడం ధీరోదాత్తుల లక్షణం కాదు. నిర్మలా! మన వీరసైనికుల్ని చూడు... కుటుంబాలకి దూరంగా మంచుకొండల్లో యుద్ధంలో వారి జీవితం ఎక్కడ ఎప్పుడు ఎలా ముగుస్తుందో తెలీకపోయినా సరిహద్దుల్లో వారి పోరాటం ఎవరికోసం? మనందరి ప్రాణరక్షణకోసం. మరణం అంటే అదీ ... వీరమరణంలా ఉండాలి.”

నిర్మల సిగ్గుతో 'మేమెంత పొరబాటు చేసామో ఇప్పుడు తెలుస్తోంది.' అంది ఆవిడ చేతులు పట్టుకుని.

‘నిర్మలా... తృప్తికీ, అసంతృప్తికీ మధ్య తేడాయే అగాధంలా నిలిచి జీవితాన్ని దు:ఖమయం చేస్తుందనే వాస్తవాన్ని గుర్తుంచుకుంటే చాలు. మనసుకి కష్టమనిపించినప్పుడు విరక్తి పెంచుకుని చావడం ఘనకార్యం కాదు. నవ్వుతూ బ్రతకడంలో సాహసం ఉందని నేర్చుకోవాలి.' ‘రాజేశ్వరమ్మగారూ! ముగ్గురు బిడ్డల్ని వీరసైనికులుగా యుద్ధభూమికి పంపిన వీరమాత మీరు. మీముందు నిలబడాలంటేనే సిగ్గుగా ఉంది నాకు.’ సుధాకర్ మనస్ఫూర్తిగా అన్నాడు.

రాజేశ్వరమ్మ శరీరం గర్వంతో పొంగింది. “నాకు అటువంటి బిడ్డలున్నందుకు వాళ్లను తలచుకుని నేనెంతో గర్వపడుతూంటాను సుధాకర్! నా భర్త భారత సైన్యంలో మేజర్గా దేశానికి సేవ చేసారు. నా భర్త అడుగుజాడల్లో నడిచారు నా కొడుకులు. నాపిల్లలకి ఉగ్గుపాలతో ధైర్యాన్ని, దేశభక్తినీ నూరిపోసాను. తెలుసా?”

సుధాకర్ జేబులు తడుముకుని కవరు బయటికి తీసాడు. 'అమ్మా... మరిచేపోయాను...మేజర్గారు మీకీ ఉత్తరం ఇమ్మన్నారమ్మా. మీ పెద్దబ్బాయి సంజయ్ రాసాడట. ఇదిగో...

రాజేశ్వరమ్మ పొంగిపోయింది. నా కన్నా దగ్గర్నుంచి ఉత్తరం వచ్చిందా? ఈ ఉత్తరం చూస్తుంటే వాడే నా దగ్గరకు వచ్చినంత సంబరంగా ఉందయ్యా... ఉత్తరం విప్పి చదువుతూంటే చూడు కన్నీళ్లు ఎలా అడ్డొస్తున్నాయో... కవరులోని ఉత్తరాన్ని ఆత్రంగా పైకే చదివింది.

'అమ్మా! నువ్విచ్చిన కొండంత ధైర్యంతో ఈ మంచుకొండల్లో నాన్నగారి తెగువను ధైర్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ముందుకుసాగిపోతున్నాను. శత్రువు తూటా అనేది దిగబడితే నా గుండెల్లో తప్ప నా వెన్నులో దిగబడే అవకాశం శత్రువుకి నేనెప్పటికీ ఇవ్వబోను. తమ్ముళ్లు - విజయ్, అజయ్, నేను... మీ కన్నబిడ్డలమైనందుకు గర్వంగా వుంది. నీ శుభాశీస్సులతో నేను శత్రువులను తరిమి కొడుతున్నాను. అవి ఉన్నంత వరకూ నేను విజయుడనే.

అమ్మా ఇది చెప్తే నువ్వు నవ్వుకుంటావేమో! ఇక్కడ దొరుకుతున్న మామిడిపండ్ల మీద ఐస్క్రీమ్ పాలు కలుపుకుని తింటుంటే నువ్విచ్చిన ఆఖరి విందులో అమృతతుల్యమైన ఆ మాంగో మిల్క్ షేక్ గుర్తొస్తోంది. ఆ తమ్ముళ్లతో కూడా ఇప్పుడే ఫోన్లో మాట్లాడాను - నాన్నగారు నాకు ఇటీవలే వీరమరణం పొందిన మేజర్ సిన్హా గారి ఫోటో పేపర్ కటింగ్లు పంపించారు. అవి నాలో మరింత నైతిక స్థైర్యాన్ని కలిగిస్తున్నాయి. మన జాతి అంతా మా సైనికుల వెంటే అండగా వున్నారనే వార్తలు మాలో సంతోషాన్ని ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి.

మీలో మేము మన భారత జాతిని చూస్తున్నాం. నాన్నగారు నువ్వు గుర్తొస్తే కళ్లల్లో నీళ్లు ఉబుకుతుంటాయి. అయినా అవి మా కార్య దీక్షకు అడ్డుకావు. ఇప్పుడే బెటాలియన్ నుంచి ఆదేశం వచ్చింది. వార్ సైటికి బయలుదేరుతున్నాం. దేశరక్షణ కోసం పోరాడే సువర్ణావకాశం మాకు లభించిందమ్మా - సమధికోత్సాహంతో కదులుతున్న మా వీర సైనికులంతా నీ బిడ్డలే. మా కోసం మా విజయం కోసం నువ్వు, నాన్నా ప్రార్ధించండమ్మా! విజయమో వీర స్వర్గమో! అమ్మా నమోనమామి. జైహింద్!  మీ కన్నా”

సుధాకర్ కళ్లలో నీరు నిండింది. రాజేశ్వరమ్మగారూ! సరిహద్దుల్లో ఉన్నాడు కదా బాబు? అయ్యో... చాలా ప్రమాదకరమైన ప్రాంతానికి భీకర పోరాటానికి వెళ్తున్నారన్నమాట. '

నిర్మల ఆర్తిగా రాజేశ్వరమ్మగారినల్లుకుపోయింది. 'అమ్మా నాకే ఇంత దుఃఖం వస్తోంది. మీరు ధైర్యంగా ఉండండి. మన సంజయ్ బాబు తప్పక విజయులై వస్తారు.'

రాజేశ్వరమ్మ నిబ్బరంగా గర్వంగా అంది. 'నా బిడ్డల గురించి నాకెప్పుడూ దిగులు లేదర్రా! నా కంట నీటబొట్టు రాలితే అది జాతికే అవమానం. నా బిడ్డలకే అవరోధం అవుతుంది. అందుకే నేనే కాదు మీ కంటా అలా కన్నీరు ఒలికించొద్దు. ఎందరో తల్లులకు గర్భశోకాన్ని తప్పించే ప్రయత్నంలో నా బిడ్డలు వీర మరణం పొందితే నాకు గర్భశోకం కలగదు. ఎందుకంటే వాళ్లు మన ప్రజల గుండెల్లో చిరస్మరణీయులై ఉంటారు కనుక.'

సుధాకర్ కంఠంలో దృఢ నిశ్చయం తొణికిసలాడింది. 'అమ్మా! మీరు నా కంటికి కేవలం ఒక తల్లిలా కన్పించడం లేదు. ఈ దేశమాతలా కన్పిస్తున్నారు. ఇంక నాకు భవిష్యత్తే తప్ప గతం అవసరం లేదమ్మా!'

రాజేశ్వరమ్మ అతని భుజం తట్టింది. 'మళ్లీ నీతులు చెబుతున్నాననుకోకు... ఎలాంటి గతమైనా అది నేర్పిన పాఠాలతో బ్రతకడమే మనం అలవాటు చేసుకోవాలయ్యా.... అంతేకాదు అందులోంచి భవిష్యత్తుకు బాట వేసే అనుభూతుల్ని ముత్యాల్లా ఏరుకోవాలి. జీవిత మాధుర్యాన్ని మింగేసేలా ఏ గతమూ మన వెంట రాకూడదు.'

నిర్మల విచలితమయిపోయింది. ఎంతటి గుండె నిబ్బరమమ్మా మీకు? మీ బిడ్డల పట్ల ఎంతటి నమ్మకం? మీకు మాట ఇస్తున్నాను...ఈ జీవితంలో నా బిడ్డలకింక పిరికి చావు కల్పించే ప్రయత్నం ఇంకెప్పుడూ చెయ్యను. మీలా నేనూ నా బిడ్డల్ని వీర సైనికులుగా తయారు చేస్తాను.”

'శభాష్ నిర్మలా ... ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు.'

సుధాకర్ ఆమె ముందు మోకరిల్లాడు. 'అమ్మా! మీరన్నట్టు ప్రతి జీవితానికీ, మరణానికీ తప్పకుండా ఒక పరమార్ధం ఉండాలమ్మా! సంజయ్ బాబు ఉత్తరం చూసాక నాకూ సైన్యంలో చేరాలనిపిస్తోంది. దేశమాత ఋణం తీర్చుకోవాలనిపిస్తోంది. దేశ మాత స్వేచ్ఛ కాపాడే వీర సోదరుల మధ్య నేనూ ఒక రేణువును కావాలనుకుంటున్నాను. నన్ను ఆశీర్వదించండి."

రాజేశ్వరమ్మ కనుకొలకుల్లోంచి నీటిబొట్టు. 'శుభమస్తు...”

భార్యాభర్తలిద్దరి నుండి వీడ్కోలు తీసుకుని ఇంటికి వచ్చి కూలబడిపోయింది రాజేశ్వరమ్మ. 'నిర్మలా... సుధాకర్ ఊహించని మలుపును ఏ నాటకంలోనో చూస్తే అది రచయిత సృష్టి అనుకుంటాం. కాని నిజజీవితంలో సంఘటనలూ చిత్రాతిచిత్రంగా ఏ తర్కానికీ అందవు. చేజారిన క్షణాలు లెక్కించే కంటే రాబోయే కాలానికి మీలాంటి వారికి పునాదులు వెయ్యాలని నా తాపత్రయం. మొండిగా బ్రతకడానికి ఆలంబన, గడిచిన మధుర క్షణాలేకాదు, మీలాంటి వాళ్ల అభిమానం కూడా నా సంజయ్ ఇంకా బ్రతికి ఉన్నాడనుకున్నారు కదూ... లేదు... వీరమరణం పొందిన నా బిడ్డను మీ అందరిలో చూసుకోవాలనే మేజర్రు ఇందాక నీతో ఎప్పుడో మా సంజయ్ వ్రాసిన ఉత్తరాన్ని పంపారు.

బాబూ సంజయ్! ఈ రోజు నీ పుట్టినరోజు కాకపోయినా నీచిత్రపటానికి ఈ పూలదండ ఎందుకో తెలుసా నాయనా... దేశానికి నీలాంటి వీరసైనికుడిని ఒకడిని తయారుచేసానన్న గర్వంతో....

ఆమె గొంతులో దు:ఖపు పొంగు. సంజయ్ -నా చిట్టి తండ్రీ! ఈ జీవితమే శాశ్వతం కానప్పుడు మనుషులకి ఒకరి పట్ల ఒకరికి ఎందుకీ ఆత్మీయతా బంధాలు నాయనా?'

కొడుకు సంజయ్ మాటలు ఆమె గుండెల్లో ప్రతిధ్వనించాయి.

'అమ్మా... నువ్వు ఏడవకూడదు ఈ జీవితం ఒక నాటకమని నాటకంలో కాల పరిమితి అయిపోయిన పాత్రలు వెళ్లిపోతాయని షేక్స్పియర్ అన్నాడని ఆంగ్ల సాహితీ విదుషీమణివి నీకు నేను మళ్లీ చెప్పాలా అమ్మా...? నిరాశలో కొట్టుమిట్టాడేవారికి జీవిత మాధుర్యాన్ని చవి చూపి, జీవితమంటే ఎంత విలువైనదో తెలియజెప్పి, నా ఆయుష్షును పెంచడమే ...నా అఖరి కోరిక అని నీకు తెలుసుగా….. ఒక నిండు కుటుంబం ప్రాణాలు కాపాడి నా ఆయుష్షును పెంచావుకదమ్మా... మళ్లీ జన్మలోకూడా నేను నీ కడుపునే పుట్టాలని కోరుకుంటున్నానమ్మా... అమ్మా.... నమోనమామి...'

రాజేశ్వరమ్మ గాఢంగా నిట్టూర్చింది. నేనూ జన్మజన్మలకి నీలాంటి బిడ్డనే కోరుకుంటానురా సంజయ్.. తుది క్షణం వరకు శత్రువుకు వెన్ను చూపకుండా దేశమాత సేవచేసిన నీలాంటి బిడ్డలే ఈదేశానికి ఈక్షణంలో కావలసింది. జీవితంలాగే జీవి కోరికలూ స్థిరమూ, శాశ్వతమూ కావు నాయనా! అందుకే కాబోలు ఓ తాత్వికుడన్నాడు... నీ కోరికేంటో నువ్వు స్పష్టంగా తెలుసుకోగలిగితే జీవితం నీకు అర్ధమయినట్టే' అని. అయినా నువ్వీ లోకంలో లేవని నేనెప్పుడూ అనుకోవడం లేదురా... అదిగో దూరాన ఎక్కడో మెరిసిన ఆ నక్షత్రంలో నువ్వు కనిపిస్తున్నావు. ఆ క్షణకాలం మెరుపుచాలు బాబూ నాకు నూరేళ్ల జీవితానికి కావలసిన ధైర్యాన్ని పోగు చేసుకుని అడుగు ముందుకు వేయడానికి....???’

ఇప్పుడు మనం సెల్యూట్ చెయ్యవలసింది ఎవరికంటారు? దేశంకోసం ప్రాణాలొడ్డిన ఆ బిడ్డకా? ముగ్గురు బిడ్డల్ని దేశమాత సేవకు అంకితం చేసిన ఈ తల్లికా?

**సమాప్తం**

Posted in March 2022, కథలు

1 Comment

  1. కరణం శ్రీపాద రావు నాచారం 9440419743

    కర్తవ్యాలను గుర్తు చేసిన మీకు శత కోటి వందనాలు!

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!