Menu Close
అయ్యరు హోటల్ కమ్ సమాచార కేంద్రం
-- గరిమెళ్ళ వెంకట లక్ష్మి నరసింహం --

కొసరు బేరం.., అప్పడం కోసం.

అయ్యరు హోటల్ సందడిగా ఉంది. అంత సందడిలోనూ, ఎదురుగా రోడ్డు మీద కూరలమ్ముతున్న ఎల్లాజీ కేకలు, ఖణీగా వినిపిస్తున్నాయి. ఇవాళ బెండకాయలు, వంకాయలతో బాటు గోంగూర కూడా ఉన్నట్టుంది. ఓ ముసలాయన కూరలు బేరాలు చేస్తున్నట్లుంది.

“బెండకాయలు ఎలా ఇస్తున్నావ్.” ముసలాయన విచారణ.

“కేజీ ముఫై అండి.” ఎల్లాజీ సమాధానం.

“మరీ బంగారం ధర చెప్పకు. ఇచ్చే ధర చెప్పు.”

“ఇరవై తొమ్మిది సేసుకోండి.”

“ఇరవై తొమ్మిది కూడా చాలా ఎక్కువ. సరిగ్గా చెప్పు.”

“మరో రూపాయి తగ్గింసి తీసుకొండి.”

“పాతిక చేసుకో.”

“మీ మాట గాదు. నాదీ గాదు. ఇరవై ఆరు, ఎన్ని కేజీలిమ్మన్నారు.”

“కేజీలకొద్దీ బెండకాయలు, నేనేమిటి చేసుకొంటాను. ఉన్నవాళ్ళం ఇద్దరం. ఓ వంద గ్రాములియ్యి. ఇవాళ మా బావమరిది భోజనానికి వస్తున్నాడు. అందుకే వంద గ్రాములు. లేక పొతే యాభై గ్రాములు మాకు ఎక్కీ, తొక్కీ.”

మనసులో తిట్టుకొంటూ, ఎల్లాజీ వంద గ్రాముల బెండకాయలు తూచుతూంటే,

“తూకం, బెండకాయల వైపు, కొద్దిగా తేలిపోతోంది. మరో బెండకాయ పడుతుంది.” అంటూ, తనే, ఓ బెండకాయ ఏరేరి తీసి, తూకంలో వేసేడు, ముసలాయన.

తూకంలోని బెండకాయలు పట్టుకొని,

“జాగా ఏది సార్.” అని అడిగేడు ఎల్లాజీ.

“జాగా నేనెక్కడినుండి తెచ్చేది. ఓ ప్లాస్టిక్ సంచీలో వేసి ఇయ్యి.”

“నా కాడ ప్లాస్టిక్ సంచీలు లేవు సార్. మునిసిపాల్టోళ్ళు బేన్ సేసినారు గదా.”

కట్టుకొన్న పంచను, కాలి ముణుకులు వరకు, మీదకు ఎత్తి, మడిచి, అందులో బెండకాయలు వేయించుకొంటూ,

“కూరలతో కొంత కొత్తిమీర పడేస్తావుగా.” ఎల్లాజీ ముఖంలోకి చూస్తూ, ముసలాయన, తన బోనసు అడిగేడు.

“రెండు కేజీలు కూరలు కొంటే, అరకట్ట కొత్తిమీర ఇత్తానండి.” బోనసు రూల్సు చెప్పేడు, ఎల్లాజీ.

“పోనీ, ఆ లెఖన, వంద గ్రాములికి, నాలుగు రెబ్బలయినా వస్తాయిగా, అవే పడీ.” ముసలాయన ధైర్యంగా అడిగేడు. మనసులో తిట్టుకొంటూ, నాలుగు రెబ్బల కొత్తిమీర, ఎల్లాజీ తీయబోతూంటే,

“చూడూ, ఆ రెబ్బ పండిపోయింది. మరోటి మార్చు.” అన్న ముసలాయన మాట విని, మనసులో “ఏం బేరం దొరికిందిరా.” అని తిట్టుకొంటూ, నాలుగు ఆకుపచ్చని రెబ్బలు ముసలాయన పంచలో పడేసాడు. ఎల్లాజీ బండి ప్రక్క వీధిలోకి మళ్లింది.

అయ్యరు హోటల్ లో రిటైర్డ్ పోలీస్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు, లాయరు జోగారావు, శాస్త్రిగారు, ఏదో లోకాభిరామాయణం మాట్లాడుకొంటున్నారు. క్రొద్ది దూరంలో పెళ్లి సందడి. అరగంట క్రిందటివరకు, ప్రక్కనున్న వారి మాటలు కూడా వినిపించకుండా హోరెత్తించి, ఒక్కమారుగా ఆగిపోయిన మైకు, మళ్ళీ కంఠం విప్పింది. కట్న కానుకలు కాబోసు, పురోహితుడు గొంతుక చించుకొని వినిపిస్తున్నాడు. “పెండ్లి కుమారుని మేనమామ, అమెరికా వాసి, శ్రీ మాణిక్యేశ్వర శర్మగారు, వధూవరులను ఆశీర్వదించి, అయిదు వందల అమెరికా డాలర్లు.” మరో రెండు నిమిషాల తరువాత, “పెండ్లి కుమార్తె తాతగారు, రిటైరుడు కలక్టరు గారు, శ్రీ వెంకట విశ్వేశ్వర సీతారామాంజనేయ శాస్త్రి గారు, వధూవరులనా” అకస్మాత్తుగా మైకు ఆగిపోయింది.  మళ్ళీ చెడ్డట్టుంది. అయ్యరు హోటల్ లో, శాస్త్రిగారు, సుబ్బారావు, జోగారావు, ‘హమ్మయ్య’ అనుకొన్నారు. లోకాభిరామాయణం మళ్ళీ అందుకొంది. సుబ్బారావు గారు, కూరగాయల ధరలు, రోజురోజుకు మండిపోతున్నాయని, ఆవేదన వ్యక్తం చేసేరు. ఇంకా ఏదో మాట్లాడబోతూండగా, మైకు మళ్ళీ కంఠం విప్పింది. ప్రకటన జారీ అవుతున్నాది.

“అతిథులందరకు, విన్నపం. పైన, మూడవ అంతస్తులోని డైనింగ్ హాలులో, మీ అందరకు భోజన ఏర్పాట్లు సిద్ధమయ్యేయి. తమరందరు అచ్చటకు విచ్చేసి, మా ఆతిథ్యం స్వీకరించ ప్రార్థన. ప్రస్తుతం, అనివార్య కారణాల మూలంగా, లిఫ్ట్ పనిచెయ్యడం లేదు. తత్కారణంగా మీకు కలిగే అసౌకర్యానికి చింతిస్తూ, క్షమించ ప్రార్థన.” అదే ప్రకటన మరో రెండు మార్లు చేయడమయింది.

అయ్యరుహోటెల్ లో లోకాభిరామాయణం చర్చించుకొంటున్న ముగ్గురూ, అది విని, నవ్వుకొన్నారు. మూడవ అంతస్తులో విందారగించి, కొద్ది సేపట్లో, కూర్మారావు సమాచార కేంద్రం చేరుకొన్నాడు. “పెళ్లినుండేనా రావడం.” జోగారావుగారు అతనితో మాట కలిపేరు.

“విందుభోజనం, బాగా ఆరగించినట్లున్నారు.” శాస్త్రిగారు, వ్యంగ్యంగా ఓ అస్త్రాన్ని, సున్నితంగా విసిరేరు.

కూర్మారావు, వ్యంగ్యంగా, చిరునవ్వుతో, “ఏం విందు భోజనమండి. తమకు తెలియనిదేముంది. ఈ రోజుల్లో, ప్రతీ చోట, బఫెలే కదండి. జైల్లో దొంగల్లా, క్యూలో వెళ్ళాలి. తాపీగా, మనకి నచ్చిన ఐటమ్స్, ఒకదాని తరువాత మరోటి తిందామనుకొంటే, కుదరదు. మరో మారు క్యూలో చేరే అవకాశం ఉండదని, ఒక్కొక్క సెర్వరు ముందు నిలబడి, అన్నం, పప్పు, కూరలు, అన్నీ ఒకదాని మీద ఒకటి వేయించుకొని, చివరగా, వాటి మీదనుండి సాంబారు పోయించుకొని, క్యూలో నుండి బయట పడాలి. ఎక్కడయినా, జాగా చూసుకొని, పళ్ళెంలోని నాలుగు, ఏకంగా కలుపుకొని, కడుపు నింపుకోవాలి.” అని తన అసంతృప్తిని తెలియజేసేడు.

అది విన్న లాయరు జోగారావుగారు, “ఈ మధ్య ఓ పెళ్లిలో చూసేను. ఆడవాళ్లు, బంపర్ టు బంపర్ క్యూలో ఉండేవారు. సెర్వర్లు వడ్డిస్తున్నారు. అంతలో, ఓ చిన్న కుర్రాడు వాళ్ళ మధ్య దూరి, అప్పడం అందుకోబోయేడు. ఆ ఊపుకి, ఒకావిడ పట్టు చీర పయటంచు మీదకి, ఆవిడ ప్రక్కనున్న ఆవిడ ప్లేటులోని, అన్నం, పప్పు, కూరలు, సాంబారు, అన్నీ కలిపి, ఒక్కమారుగా క్రేష్ లేండింగ్ అయ్యేయి. అప్పుడు చూడవలసింది, ఆవిడ భామావిలాపం. – “వెధవ అప్పడం కోసం, గుంటవెధవ, నా 18 వేల ఖరీదయిన పట్టు చీర తగలబెట్టేడు. బ్రతికిపోయేను.లాండ్రీ వాడు, రెండో పట్టు చీర, ఇంకా రడీగా లేదని చెప్పడంతో, ఈ చీర కట్టుకొచ్చేను. లేకపోతే, ఆ ముఫైఎనిమిదివేల ఖరీదయిన పట్టు చీర కట్టుకొని వచ్చేదాన్ని. దానికి ఈ గతి పట్టేది. అని విసుగుకొంటూ చిందులు తొక్కింది.” అని, కళ్ళకు కట్టినట్లు వివరించేరు.

ఇన్స్పెక్టర్ సుబ్బారావు కుతూహలంగా ఆ సంఘటన వివరాలు విని, “ఆవిడ చాలా తెలివైన లేడి. టు బర్డ్స్ ఎట్ వన్ షాట్. తను కట్టుకొన్న చీర ఖరీదు 18 వేలని, రెండో చీర ఖరీదు 38 వేలని, చెప్పకనే చెప్పిందావిడ.’ అని ఓ చిరునవ్వు పారేశాడు.

సిరికిం జెప్పడు, మాధవుని క్రీడా నియమాలు.

ఆ దినం ఆదివారం. అయ్యరు హోటల్ ప్రవేశ ద్వారానికి సమీపంలో ఒక బోర్డు మీద, Today’s special - సేమియా ఉప్మా, అని పెద్ద అక్షరాలలో సుద్దముక్కతో రాసి ఉంది. మరేం. జనమంతా, దానిమీదే పడ్డారు. ఒక మూల, జోగారావు ప్లీడరు గారు, శాస్త్రిగారితో తను వాదిస్తున్న కేసు వివరాలు, ఏవో చెపుతూంటే, ఆయన శ్రద్ధగా వింటున్నారు.

ఇంతలో, కొత్తగా చేరిన పెద్ద లెఖ్ఖల మేష్టరు లక్ష్మణస్వామి గారు, మొదటి సారిగా, అయ్యరు హోటల్ లో అడుగు పెట్టేరు. ఆయన రాకను దూరం నుండే గమనించిన, జోగారావు ప్లీడరు గారు, “రండి,రండి, మాస్టారూ” అని ఆయనకు స్వాగతం పలకడంతో, అటు దారి తీసేరు మాస్టారు. జోగారావు గారు మాస్టారుని శాస్త్రిగారికి పరిచయం చేసేరు.

“చాలా సంతోషం. మీ రాకకై వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూండే వారిమి. తమకు అన్ని సౌకర్యాలు కుదిరాయా?” శాస్త్రిగారి కుశల ప్రశ్న.

“మేము చేరిన నాటికే ఈయన (జోగారావు గారిని చూపిస్తూ) కావలిసినవన్నీ సమకూర్చేరు.”

ఆ సమయంలో రిటైర్డ్ తెలుగు పండిట్ రామ్మూర్తి పంతులు గారు, హోటల్ లో ప్రవేశిస్తూ, నేరుగా శాస్త్రిగారిని సమీపించి, ఆయనకి ఓ నమస్కారం సమర్పించి, దగ్గరలోనే ఓ కుర్చీ మీద ఆసీనులయ్యేరు. సర్వరు ఎదురుగా నిలబడగానే, “ఓ ప్లేటు ఇడ్లీ.” అని ఆర్డర్ ఇచ్చేరు. “సార్, ఈవేళ స్పెషల్, సేమియా ఉప్మా. వేడిగా ఉంది సార్.” అని సేల్స్ టెక్నిక్కు  ఉపయోగించేడు, సర్వరు.

“గట్టి వాడివే. సరే, అదీ ఓ ప్లేటు తీసుకు రా.” అని, పంతులు గారు, చొక్కా పక్క జేబులోనుండి పొడుం డబ్బా తీస్తూంటే, ఆయనకు జోగారావు గారు, కొత్త పెద్ద లెఖ్ఖల మేస్టారుని పరిచయం చేసేరు.

“తమరి దర్శనం చేసుకొందామని, రెండు రోజుల క్రితం మీ ఇంటికి వెళ్ళేను. తమరు ఎదో శుభకార్యం వీక్షించడానికి పై ఊరు వెళ్ళేరని తెలిసింది.” పంతులుగారి వివరణ.

“అవునండి. మా మేనమామ గారి, మనవరాలి పెళ్ళికి, కోటబొమ్మాళి వెళ్లేమండి. నిన్న సాయంత్రమే వచ్చేము.”

“మాస్టారూ, కోటబొమ్మాళి, అంటే జ్ఞాపకం వచ్చింది, నిన్న పేపరులో పడ్డాది. ఆ ఊరి రైల్వే స్టేషనులో ఏదో దొంగతనం జరిగిందని.” జోగారావు గారి వార్త.

“అది చాలా హై టెక్ దొంగతనం.” లక్ష్మణరావు గారు చిరు నవ్వుతో వ్యంగ్యంగా అన్నారు.

“ఏమిటా దొంగతనంలో విశేషం.” లాయరు జోగారావు గారి ప్రశ్న.

“అర్ధరాత్రి, ఏదో ట్రైను రావలసి ఉండేదట. అందులో వెళదామనుకొన్న ప్రయాణీకుడొకడు, దుప్పటి, తలగడా పరచుకొని ప్లాట్ఫారం మీద పడుకొన్నాడట. పక్కనే దగ్గరగా తన చిన్న ట్రంకు పెట్టె పెట్టుకొన్నాడట. చాలా అలసిపోయి ఉన్నాడు కాబోలు, సుఖంగా నిద్రపోతూండేవాడట. ప్లాట్ఫారం నిర్మానుష్యంగా ఉండేదట. అది గమనించిన వాడొకడు, పడుకొన్న ప్రయాణీకుని పెట్టె పట్టుకొని పారిపోతూంటే, ఎవరో ఓ ఆసామీ, “నీ పెట్టె పట్టుకొని వాడెవడో పారిపోతున్నాడు.” అని, ఆ కుంభకర్ణుణ్ణి నిద్ర లేపి, పారిపోతున్న వాడిని చూపించేడట. పాపం, ఆ ప్రయాణీకుడు, సగం నిద్దట్లో, గాభరా పడుతూ లేచి, ఏమిటి చెయ్యాలో తోచక, లుంగీతో పరిగెత్తడం కష్టమనుకొన్నాడో ఏమో, కట్టుకొన్న లుంగీని, గప్పున విప్పి పారేసి, లాగు బనియనుతో, పెట్టె దొంగని, పట్టుకోడానికి పరుగు తీసేడట.” అని లెఖ్ఖల మేష్టారు వివరిస్తూంటే,

“అట్టి పరిస్థితులలో, సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే, గజేంద్రుని రక్షించడానికి, వీలయినంత త్వరగా, ఘటనా స్థలం చేరుకోవాలనే, తడబాటులో వెళ్లిన వైనం, భాగవతంలో పోతన గారు, ‘సిరికిం జెప్పడు’, అని ఎంత చక్కగా వర్ణించేరండీ. అట్టిది, ఆ సామాన్య మానవుడు మతి తోచని స్థితిలో, దొంగని అలా వెంటాడడం సహజమే గదా.”  అని, రిటైర్డ్ తెలుగు పండితులు, రామ్మూర్తి పంతులు గారు, కోటబొమ్మాళి రైల్వే ప్లాట్ఫారం మీద, గజేంద్రమోక్షాన్ని సృష్టించేరు.

“ఇంతకూ, ఆ ప్రయాణీకుడు, పెట్టె దొంగని పట్టుకొన్నాడా.” కుతూహలంతో, శాస్త్రిగారు అడిగేరు.

“పెట్టె మాట, దేముడెరుగు.” అని మేష్టారు ఇంకా ఏదో చెప్పబోతూంటే,

“పెద్ద కథ లాగే ఉంది.” లాయరు గారు వ్యంగంగా అన్నారు.

“పెద్ద కథే. పాపం, ఆ మనిషి, పెట్టె దొంగని పట్టుకోడానికి, ఓ దిక్కు పరిగెడుతూంటే, వాడిని నిద్ర లేపిన ఆపద్బాంధవుడు, ప్లాట్ఫారం మీద పరచి ఉన్న, దుప్పటి తలగడాలకు, లుంగీ జతపరచి, రెండో దిక్కు పరుగు తీసేడట. ఆ సమయంలోనే పెట్టె మీద ఆశ వదలుకొని వెనక్కి తిరిగిన ఆ ప్రయాణీకుడు, అది చూస్తూ, కలా, నిజమా అని అనుమానిస్తున్న తరుణంలో, ట్రైన్ కూతకు నిజాన్ని గ్రహించి, లాగు, బనియనుతో తొందరగా ట్రైన్ ఎక్కేడట. తెల్లారి, ఊళ్ళో అనుకొంటూండేవారు. ఆ ఆసామీ అత్తవారింటికి వెళ్తూండేవాడని.”  మాస్టారి కథ ముగిసింది. నలుగురూ నవ్వుకొన్నారు.

రామ్మూర్తి పంతులు గారి ఇడ్లీ, సేమియా ఉప్మా ప్లేట్లు ఖాళీ అయ్యేయి.

ఇంతలో, పొట్టి ప్లీడరు ధర్మారావు, ఇన్సూరెన్స్ ఏజెంట్ కూర్మారావు, సీరియస్ గా రాజకీయాలు చర్చించుకొంటూ రంగ ప్రవేశం చేసేరు. ఎప్పటి లాగే, శాస్త్రిగారి దగ్గర హాజరు నమోదు చేసుకొని, ఆయనకు దగ్గరలోనే ఆసీనులయ్యేరు. లక్ష్మణస్వామి మేష్టారు, వారి చెంతకు వెళ్లి, తన పరిచయం చేసుకొన్నారు.

“మిమ్మల్ని మీ తీరిక సమయంలో కలుసుకొంటాను, మేష్టారూ.” కూర్మారావు, మనసులో ఇన్సూరెన్స్ కేసు తగలొచ్చు, అనే ఆశతో  వినయంగా అన్నాడు.

“ఆదివారాలు తీరికే.” మేష్టారి స్పందన.

“మేస్టారూ, ఆయన ఇన్సూరెన్స్ ఏజెంటు.” పొట్టి ప్లీడరు హెచ్చరిక.

“ఎవరయితేనేం, మేమిచ్చేది కప్పుడు వేన్నీళ్లే కదా.” ముఫై శాతం హాస్యం జోడించి, ఫరవా లేదన్నట్టు స్పందించేరు, మేష్టారు.

ఇంతలో ఆర్డర్ తీసుకోడానికి, సెర్వరు, వాళ్ళ ఎదుట నిలబడ్డాడు.

పొట్టి ప్లీడరు, మసాలా దోస అనిచెప్పబోతూంటే,

“వకీలు గారూ, ఈ దినం సేమియా ఉప్మా స్పెషలుగా చేసేరు. చాలా రుచికరంగా ఉంది. తమరు తప్పక సేవించండి.” అని రామ్మూర్తి పంతులు గారు, ఓ రికమెండేషను పారీసేరు.

“పంతులు గారు చెప్తున్నారంటే, హండ్రెడ్ టెన్ పెర్సెన్ట్ కరెక్టు. మొదట సేమియా ఉప్మాతే, తరువాత మసాలా దోస.” పొట్టి ప్లీడరు ఆర్డర్.

“నాక్కూడా సేమియా ఉప్మా తీసుకురా.” కూర్మారావు అదే బాటలో వెళ్ళేడు.

“అయ్యా, కూర్మారావు గారూ, నిన్న సంధ్యాసమయంలో, గాంధీ మైదానంలో ఎవరో కుర్రాళ్లతో, తమరు ఏదో చర్చిస్తూండేవారు. నేను శివాలయానికి వెళుతూ గమనించేను. ఏమిటి విశేషం.” రామ్మూర్తి పంతులు గారి విచారణ.

“విశేషమేమీ లేదండీ. ఆ పిల్లలు క్రికెట్ ఆడుకొంటూండేవారు. ఏవో చిన్న తగాదాలు పడ్డారు. రెండు రోజుల క్రిందటే, మా చెల్లెమ్మ కొడుకు మాధవుడు, జబల్పూర్ నుండి వచ్చేడు.  మైదానంలో గడ్డి మీద చతికిళ్ల పడి, మా కుటుంబ విషయాలు ఏవో మాట్లాడుకొంటూంటే, ఆ కుర్రాళ్ళు, వాళ్ళ తగవు పట్టుకొని మా దగ్గరకొచ్చేరు.” కూర్మారావు వివరించె.

“ఏమిటి, వాళ్ళ తగవు.” జోగారావు ప్లీడరు గారు, కోర్టులో జడ్జీ లాగ అడిగేరు.

“ఆ కుర్రాళ్ళు, టెన్నిస్ బాలుతో క్రికెట్ ఆడుకొంటున్నారు. వాళ్ళ దగ్గర ఒక్క బ్యాటే ఉంది. అది, మన అరటిపళ్ళ వ్యాపారి చలపతి, ఉన్నాడు కదూ, వాడి కొడుకు, సూరిబాబుది. వాడిని కెప్టెన్ చేస్తేనే, అందరిని దానితో ఆడనిస్తానన్నాడట. అందరూ ఒప్పుకొన్నారట.”

“ఎగ్రిమెంట్ కుదిరేక సమస్య ఏమిటి.” పొట్టి ప్లీడరు గారి ధర్మ సందేహం.

“ఓ కుర్రాడు వేసిన బంతిని, సూరిబాబు, బేటుతో గాలిలోకి ఎగరేశాడట. ఆ బంతి నేల మీద పడకుండా మరో కుర్రాడు పట్టుకొన్నాడట. రూలు ప్రకారం సూరిబాబు అవుట్ అయ్యేడని మిగిలిన కుర్రాళ్ళ వాదన.” కూర్మారావు ఇంకా చెప్పబోతూంటే,

“అందులో, సందేహమేమీ లేదు. ఆ కుర్రాడు అవుటే.” లక్ష్మణస్వామి మేష్టారు ధృవీకరించేరు.

“సమస్య ఏమిటంటే, సూరిబాబు, తను ఔట్ ఎప్పుడయ్యేడో, తనే నిర్ణయిస్తాడట. అప్పటికే ఆరు మార్లు ఔట్ అయ్యేడు గాని, ఔట్ కాలేదని బుకాయిస్తున్నాడట. దానితో, మిగిలిన కుర్రాళ్లందరూ, వాళ్లకి బ్యాటు తో ఆడే అవకాశం రావడం లేదని, ఆందోళన పడి, తగవు తీర్చమని మా దగ్గరకు వచ్చేరు.” అసలు సమస్య బయట పెట్టేడు, కూర్మారావు.

“కుర్రాడు, ఘటికుడిలాగున్నాడు. ఫరవా లేదు, రాజకీయాలలో రాణిస్తాడు.” రామ్మూర్తి పంతులు గారు, భవిష్యవాణి పలికేరు.

“నాకు క్రికెట్ గూర్చి, అట్టే తెలీదు. మా మాధవుడుకి బాగా తెలుసు. కుర్రాళ్లను సమాధాన పరచడానికి, వాడు పూనుకొన్నాడు. మిగిలిన కుర్రాళ్లను దూరంగా ఉండమని, సూరిబాబుతో మెల్లగా చెప్పేడు. – “నీ బేటింగ్ చూసేను. చాలా బాగుంది. బౌలింగ్ కూడా బాగా ప్రేక్టీస్ చెయ్యి. ఆల్ రౌండరువి అవుతావు. అప్పుడు నీకు మన ఇండియా టీములో ఆడే అవకాశాలు, వస్తాయి. దానికి నేను చెప్పినట్టూ చెయ్యి. ఒక ఓవరు బేటింగ్, వెంటనే మరో ఓవరు బౌలింగ్ చెయ్యి. ఇలా, వరసగా బేటింగ్, బౌలింగ్ చేస్తూంటే, ఆల్ రౌండరువి అయిపోతావు. నువ్వు బౌలింగ్ చేస్తున్నప్పుడు, వాళ్లలో ఎవరో ఒకరు, బేటింగ్ చేస్తారు. అది నువ్వే నిర్ణయించు. నీ బేటింగులో నువ్వు ఎప్పుడూ అవుట్ కావు. అది రూలు. ఏం, నీకు నచ్చిందా. అని సూరిబాబుని బుజ్జగించేడు. అది విని, - “నచ్చింది, అంకుల్. థేంక్ యు అంకుల్.” అని. చేటంత మొహం చేసుకొన్నాడు, సూరిబాబు. తరువాత, మిగిలిన కుర్రాళ్లను దగ్గరగా రమ్మనమని చెప్పి, వాళ్లకి తన ప్లాన్ బోధపరచేడు. వాళ్ళు కూడా సరదా పడి, గెంతులేసుకొంటూ వెళ్లి ఆట ప్రారంభించేరు.” కూర్మారావు కథ ముగించేడు.

“సమస్యను తెలివిగా పరిష్కరించేడు, మీ మేనల్లుడు.  సూరిబాబు ఎప్పుడూ ఔటవ్వడు... మిగిలిన ఆటగాళ్లకూ…  బేటుతో ఆడే అవకాశమూ వచ్చింది. చక్కటి పరిష్కారం.” లెఖ్ఖల మేష్టారి ప్రశంస.

“మీ మాధవుని క్రీడా నియమాలు భేషుగ్గా ఉన్నాయి. ఇరు పక్షాలకు సంతృప్తినిచ్చేయి.” రామ్మూర్తి పంతులు గారి తీర్పు.

రసం, వడ, మార్కెటింగ్; కొసరు బేరాల ముసలాయన.

అయ్యరు హోటల్ లో ఆ రోజు స్పెషల్ - రసం, వడ. ముందుగానే జాగ్రత్త పడ్డాడు, అయ్యరు. ప్రతీ అదనపు కటోరీ రసం వెల, యాభై పైసలు అని నోటీసు బోర్డు ద్వారా తెలియబరిచేడు. జనం రసం మీద పడ్డారు.

ఆ రోజు, రిటైర్డ్ చిన్న లెఖ్ఖల మేష్టారు,నారాయణరావు గారు మధ్యాహ్న భోజనానికి ఇద్దరు అతిథులను ఆహ్వానించేరు. శ్రీమతికి, వంట పనిలో వెసులుబాటు కల్పించే ఉద్దేశ్యంతో, సాంబారు కొనడానికి, మాస్టారు నాలుగు గిన్నెల కేరియరుతో, అయ్యరు హోటల్లో అడుగు పెట్టేరు. రసం, వడ లాగిస్తున్న, పొట్టి ప్లీడరు ధర్మారావు, మాస్టారుని చూసి, “మాస్టారూ, ఏమిటి విశేషం. అంత పెద్ద కేరియరుతో వచ్చేరు.” అని అడిగేడు.

కారణం వివరించేరు, మాస్టారు.

“మాస్టారూ, రసం బ్రహ్మాండంగా ఉంది. మీ గెస్టులకి తప్పక రుచి చూపించండి.” ఒక ఉచిత సలహా పారేశాడు, పొట్టి ప్లీడరు.

“మంచి సలహా ఇచ్చేరు. సాంబారు, రసం, రెండూ తీసుకెళతా. వెరైటీ ఉంటుంది.” అని వేచి ఉన్న సెర్వరుతో, “మూడు గిన్నెల నిండా సాంబారు, ఒక గిన్నె నిండా రసం తీసుకురా. ఎన్ని కటోరీలో, చెప్తే, ఆ లెక్కన డబ్బిస్తా,” అని, వాడికి కేరియర్ అందించేరు.

“అప్పటి దాకా,మీకు, రసం వడ, ఒక ప్లేటు తెమ్మన్నారా సార్.” అని వినయంగా అడిగేడు సెర్వర్.

“ప్లీడరు గారు రికమెండ్ చేసేరు, తిరుగుండదు, తీసుకురా.” చిరునవ్వుతో చెప్పేరు, మాస్టారు.

కొద్దిసేపట్లో, రిటైర్డ్ తెలుగు పండితులు రామ్మూర్తి పంతులు గారు, తొమ్మిదేళ్ల తన మనవరాలుతో వచ్చి, రసం వడ ఆరగిస్తున్న, నారాయణరావు మేష్టారి పక్కన జాగా చేసుకొని,

“రావు గారూ, ఏమిటి ఆరగిస్తున్నారు, కమ్మని వాసన విరజిమ్ముతోంది.” చిరునవ్వుతో అడిగేరు.

“రసం వడ, ఇవాళ స్పెషల్.”

“పంతులు గారూ, రుచి చూడండి. మీరు తప్పక ఇష్టపడతారు.” వరసగా రెండో ప్లేటు లాగిస్తున్న పొట్టి ప్లీడరు రికమెండేషన్.

“తమరి సలహా తప్పక మన్నిస్తాను.” అని స్పందిస్తూ, ఎదురుగా వేచి ఉన్న సెర్వరుకు ఒక ప్లేటు రసం వడ తెమ్మని చెప్తూ,

“గిరిజా, నీకేమిటి కావాలమ్మా.” అని మనవరాలి అభిప్రాయాన్ని సేకరించ తలచేరు.

“తాతగారూ, నాకు మసాలా దోస.” ఠక్కున చెప్పింది, మనవరాలు, వాలు జడ సవరించుకొంటూ.

“ఎప్పుడూ మసాలా దోసేనా. కొంత వైవిధ్యం ఉండాలి.” తాతగారి సలహా.

“తాతగారూ, ఇంట్లో ఎప్పుడూ, మసాలా దోస చెయ్యరు. రోజూ ఉండలు కట్టిన ఉప్మా తిని బోరు కొడుతోంది.”

“తల్లీ, నీకు అంగీకారమయినదే ఆరగించు.  కానీ, నా సంసారం గుట్టు, రట్టు చెయ్యకు.” అని, చిన్న చిరునవ్వుతో, మనవరాలుకు మసాలా దోస ఆర్డర్ ఇచ్చేరు, పంతులుగారు. పంతులుగారు, రసం వడ ఆరగిస్తున్న సమయంలో శాస్త్రిగారు రంగ ప్రవేశం చేసి, తన నియమిత ఆసనాన్ని అధిష్టించేరు.

“ఈ దినం కుళాయి రావడం ఆలస్యమయింది. దాని మూలాన్న అన్ని పనులూ వెనక బడ్డాయి. నా స్నానం కూడా. అందుచేత నా రాకలో ఆలస్యమయింది.” శాస్త్రిగారి సంజాయిషీ.

“ఆలస్యమయినా, వచ్చింది. దానికే సంతోషించాలి.” మునిసిపల్ కుళాయిపై పంతులుగారి అభిమతం.

“శాస్త్రిగారూ, ఇవాళ, రసం వడ స్పెషల్. A one. మీరు, టేస్ట్ చేసి చూడండి.” పొట్టి ప్లీడరు ఉచిత సలహా.

“ప్లీడరు గారు, రసం వడ కు మార్కటింగ్ కాంట్రేక్ట్ తీసుకొన్నట్టున్నారు. నాకూ, పంతులుగారికీ రాగానే రికమెండ్ చేసేరు.” నారాయణరావు మేష్టారి జోకు.

‘ఆయన, అయ్యరు హోటల్ లో, అబద్దాలు ఆడరు.’ కొద్ది క్షణాల ముందు వచ్చి, సంభాషణను వింటున్న ఇన్సూరెన్స్ ఏజెంట్, కూర్మారావు, పొట్టి ప్లీడరు మీద ఓ జోకు విసిరేడు.

“తమరిలా కాదు. నేను కనీసం ఇక్కడైనా నిజం చెప్తాను.” పొట్టి ప్లీడరు అట్టు తిరగేసేడు. అందరు ఘొల్లున నవ్వుకొన్నారు. శాస్త్రిగారు కూడా రసం వడ పార్టీలో కలిసేరు. రసం వడ పార్టీ సభ్యత్వం, పెరిగింది.

ఆ రోజు హనుమజ్జయంతి. మన అయ్యరు ఆంజనేయ భక్తుడు. ఉదయాన్నే, ఆంజనేయ ఆలయంలో, శేషాచారిగారిచేత విశేష పూజలు జరిపించి, మారుతి మెడలో నూటఎనిమిది వడల హారం వేసేడు. ఆ ప్రసాదాన్ని, గ్రాహకులకు, స్వయంగా తనే వినయంగా, అందజేస్తున్నాడు. గ్రాహకులతో, హోటల్ క్రిక్కిరిసి ఉంది. సివిల్ నాయుడు, దర్జీ కొండలరావు, మసాలాదోసలు తింటూ, రాజకీయాలు చర్చించుకొంటున్నారు. మునిసిపల్ హెల్త్ ఆఫీసరు గారి ప్యూను రామకోటి, అతిథి మర్యాదలతో, ఇడ్లీ వడ కాంబో సేవిస్తున్నాడు. ఆ సమయంలో, శంకరశాస్త్రిగారు హోటల్ లో ప్రవేశించి, తన ఆసనాన్ని అధిష్టించేరు. సివిల్ నాయడు, కొండలరావు, రామకోటితో బాటు గ్రాహకులు చాలా మంది, శాస్త్రిగారికి నమస్కరించి, ఆయన ఆశీర్వచనాలు అందుకొన్నారు. హోటల్ కు ఎదురుగా, ఎల్లాజీ కూరలబండీ ఆగి ఉంది. ఆనపకాయలు ఆ రోజు ప్రత్యేకత.

“నేత ఆనపకాయలండి, పొయ్యి మీదెడితే ఎన్నలా కరిగిపోతాయండి.” అని నలుగురు చెవుల్లో పడేటట్లు ఏకరవు పెడుతున్నాడు, ఎల్లాజీ.

కాఫీ కోసం ఎదురుచూస్తున్న కొండలరావు, ఆ కేక విని, ఆనపకాయ కొనే ఉద్దేశ్యంతో, కూరలబండీ చేరుకొన్నాడు.

కొండలరావు తొందరగా తనకు నచ్చిన ఆనపకాయను వేరుగా ఉంచి, వంకాయలు ఎంచుకోవడంలో దృష్టి సారించేడు. ఇంతలో, కొసరుబేరాల ముసలాయన వచ్చి, ఓ యాభై గ్రాముల ఆనపకాయ ముక్క కావాలని, ఎల్లాజీని వినయంగా విసిగించసాగేడు. ఆనపకాయలను, ముక్కలుగా కోసి అమ్మడం వీలవ్వదని, వినయంగానే విన్నవించుకొంటున్నాడు ఎల్లాజీ. ఆ సంభాషణ ఏదో కొంత విన్న కొండలరావు, ఎల్లాజీని ఉద్దేశించి,

“ఎల్లాజీ, ప్రాబ్లమేటి. పెద్దాయన, ఆయన మాట కొంత ఇనుకో.” సలహా ఇచ్చేడు, కొండలరావు.

“ఆనపకాయలో, సిన్న ముక్క అడుగుతుండరు. ముక్క కోసిన కాయ సెల్లడం కట్టం. ఆ మాట ఇనుకోరాయన.”

ఎల్లాజీని తప్పక ఒప్పిస్తాడన్న గంపెడాశతో, తన కేసు వివరాలు చెప్పుకోడానికి, ముసలాయన కొండలరావు దరి చేరి,

“ఈ దినం నా జన్మదినం కావడం మూలాన్న, నాకు ప్రీతికరమయిన ముద్దపప్పు, ముక్కల పులుసు, ప్రత్యేకంగా వండి, నాకు తినిపించాలని, మా ఆవిడ సంకల్పించింది. మరి ఆ పులుసులోకి, ముక్కలు కావాలిగా. మా పొరుగువారి పెరడులోని, మునగచెట్టు కొమ్మ ఒకటి, మా పెరడులోనికి వ్యాపించి ఉంది. దానికి వ్రేలాడుతున్న, ఒక చిన్న మునగకాయను, నిన్న సంధ్యా సమయంలోనే, త్రెంచి భద్రపరిచేను. గత వారం మా ఎదురింటివారు, వారి పశువుల సాల పైన కాసిన, తియ్య గుమ్మడి కాయలోని, ఓ ముక్క మాకు పంపేరు. రెండు కూరలు చేసుకోగా, దానిలో రెండు ముక్కలు, ఈ దినం పులుసులోనికి భద్రంగా ఉంచేము. ఇహ మిగిలినది, ఆనపకాయ ముక్కలు. మూడు గరిటెల పులుసులోకి అవి ఎన్ని ముక్కలు పడతాయండి. మహా అయితే నాలుగు ముక్కలు. దానికోసం, కొండంత ఆనపకాయ తీసుకెళ్లి కుళ్ళబెట్టాలి తప్ప, ఏమిటి చేసుకొంటానండి. అందుకే, ఓ యాభై గ్రాముల ముక్క ఇయ్యి నాయనా, అంటే, వీలుపడదంటాడు. ఏదో పుట్టిన రోజులు, పర్వదినాలలోనే పులుసు రుచి చూస్తాము గాని, మిగిలిన రోజులలో, చారుతోనే సరిపెట్టుకొంటాం.” అని, ఆ రోజు, పులుసు ప్రత్యేకత గూర్చి, వివరంగా చెప్పేడు, ముసలాయన. కొండలరావు మనసులో  నవ్వుకున్నాడు.

ముసలాయన మీద జాలిపడి, “ఎల్లాజీ, నా ఆనపకాయలో ముక్క ఓటి అయ్యగారికి కోసియ్యి.” అని చెప్పి,

“అయ్యగారండి, తమకి ఎంత ముక్క పడతదో, తీసుకొండి.” అని ముసలాయన సమస్య తీర్చేడు, కొండలరావు.

కొండలరావుకు ధన్యవాదాలు పలుకుతూ, ముసలాయన సుమారు నాలుగంగుళాలు పొడవు, ఒక అంగుళం వెడల్పైన ముక్క నొకదానిని, కోయించుకొని సంచిలో వేసుకొన్నాడు. కథ అక్కడితో ఆగిపోలేదు. ముసలాయన ఎల్లాజీతో వినయంగా,

“ముక్కల పులుసుకు, కొత్తిమీర కొద్దిపాటైనా, చాలా అవసరం. అవో రెండు రెమ్మలు పడేస్తే, అన్నీ సమకూరినట్లే.”

“అయ్యగారండి, నా దగ్గర కూరలు కొన్నోళ్ళకే, కొత్తిమీర ఇత్తానండి.” కొత్తిమీర రూలు చెప్పేడు, ఎల్లాజీ.

అది విన్న కొండలరావు, “ఎల్లాజీ, నేను కూరలు కొంటున్నానుకదా, నాకు కొత్తిమీర ఇత్తావు కదా, అందులొందే, అయ్యగారికి కొంత ఇయ్యి.” సమస్యా పూరణం చేసేడు, కొండలరావు.

మనసులో తిట్టుకొంటూ,ఎల్లాజీ ముసలాయనకు రెండు రెబ్బలు కొత్తిమీర అందజేసేడు.

ముసలాయన ముఖం వికసించింది. ముసలాయన, కొండలరావుని సమీపించి, “ఈ రోజు పులుసులో ఆనపకాయముక్కలు, కొత్తిమీర తినే భాగ్యం కల్పించినందులకు చాలా ధన్యవాదాలు. మరి, దయచేసి, వాటి వెల...” అని  వినయంగా అడిగేడు.

“ఆ సిన్న ముక్కకి డబ్బులేటి అయ్యగారూ. పెద్దోరు, మీరు హేపీ అయితే, నేనూ హేపీ.” అని, కథ ముగించబోయేడు, కొండలరావు.

“మీరు చాలా ఉన్నత స్వభావం గల వారు. కాని, నేను ఋణగ్రస్తుణ్ణి కాకూడదు గదా. ఏదో కొంత స్వీకరించాలి. అప్పుడే నాకు తృప్తి.” ఆ చిన్న ఆనపకాయ ముక్కకు, తను ఎంతోకొంత సొమ్ము, ఎందుకు ఇవ్వదలచుకొన్నాడో, వినయంగా చెప్పె, ముసలాయన.

“ఎంతో కొంత ఇయ్యండి సార్. సరిపోద్ది.”

ముసలాయన చిల్లర డబ్బుల కోసం జేబులు తడుముకొంటున్నాడు. ఆనపకాయ, వంకాయలు, బెండకాయలకు, ఎల్లాజీకు సొమ్ము చెల్లించి, తన కాఫీ సంగతి జ్ఞప్తికొచ్చి, అయ్యరు హోటల్ చేరుకొనే తొందరలో, “అయ్యగారూ, మరో రోజు సూసుకోచ్చు.” అని కొండలరావు వెళ్ళబోతూంటే,

“మరి, మిమ్మలిని నేను కలియడమెలా.” అని, ముసలాయన బుర్ర గోక్కుంటూ ఉంటె,

“అయ్యగారూ, మీకీలయినప్పుడు, ఆ శివాలయంలో హుండీలో, నా పేర్న ఎసేయండి”

“సమస్యకు సమాధానం చక్కగా చెప్పేరు. అలా చేస్తే, నేనూ ఋణగ్రస్తుణ్ణి కాను. మీకూ, శివుని ఆశీర్వచనాలతో పుణ్యం లభిస్తుంది.”

చిన్న చిరునవ్వుతో, “హాపీ బత్తు డే అయ్యగారూ.” అని, ముసలాయనకు, ఓ నమస్కారబాణం పడేసి, కొండలరావు కాఫీ సేవించడానికి, అయ్యరు హోటల్ వైపు దారి తీసేడు.

ముక్కలపులుసుకు కావలిసిన, ఆనపకాయముక్క, రెండు రెబ్బలు కొత్తిమీర సమకూర్చుకొని, ముసలాయన పుట్టినరోజు పండుగ జరుపుకోడానికి, గృహోన్ముఖుడయ్యేడు.

అయ్యరు గారు, ఈ ఊరులో అడుగు పెట్టిన వేళా విశేషం. చూసేరు కదూ, రుచికరమయిన టిఫిన్లు కావాలన్నా, ఏదయినా విషయం తెలుసుకోవాలన్నా, జనం అయ్యరు హొటేలుకే వెళతారు. ఇలా, తనదంటూ, ఓ ప్రత్యేక స్తానం ఏర్పరుచుకొంది, అయ్యరు హోటలు. మరచిపోకండి. మీరు ఈ ఊరు ఎప్పుడు వచ్చినా, అయ్యరు హొటేలుకు తప్పక వెళ్ళండి.

*** సమాప్తం ***

Posted in March 2022, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!