బంగారం కొద్దీ సింగారం - 2
"బంగారం" అంటే పెట్టుబడి లేదా వనరులు, "సింగారం" అంటే వచ్చే ఫలితం లేదా అలంకారం. అంటే, మనం ఎంత బంగారం (పెట్టుబడి) పెడితే అంత సింగారం (ప్రయోజనం) కనిపిస్తుంది అని అర్థం. భారత్-అమెరికా ట్రేడ్ డీల్‌కు దీనిని ఇలా అన్వయించవచ్చు. గత నెల రచ్చబండ చర్చలో ప్రధానాంశం అమెరికా–భారత్ సుంకాల అనిశ్చితి గురించి. ఆ చర్చ కొనసాగింపుగా ఈ సంచికలో — సుంకాల అనిశ్చితి తర్వాత ఇంకా ఎలాంటి సవాళ్లు మిగిలి ఉన్నాయి, అమెరికా–భారత్ టారిఫ్ ఒప్పందం భారత్‌కు నేర్పిన కొత్త పాఠాలు ఏమిటి, రష్యా నుండి చమురు కొనుగోళ్లు తగ్గిన నేపథ్యంలో కొత్త రక్షణ కొనుగోళ్ల దిశ ఎలా ఉండాలి, భవిష్యత్‌లో ఎదురయ్యే సవాళ్లను ఎలా అంచనా వేయాలి — అన్న అంశాలను వివరంగా చర్చిద్దాం, ఆపై చర్చకు ముగింపు. ముగింపు మంచిదైతే మన ప్రయాణం సార్థకం కదా!
సవాళ్లు ఇంకా ఉన్నాయా? సుంకాల అనిశ్చితి తొలగించడం రెండు దేశాల మధ్య నమ్మకాన్ని బలపరచే అడుగు. కానీ సవాళ్లు ఇంకా ఉన్నాయా అంటే — అవును. కొన్ని రంగాల్లో సుంకాలు కొనసాగుతాయి — ఇది అమెరికా యాంటీ–డంపింగ్ పాలసీకి అనుగుణంగా ఉంటుంది. ఏ దేశం కూడా రాత్రికి రాత్రి చీప్ ఉత్పత్తులు తమ దేశంలోకి వచ్చి పడి దేశీయ పరిశ్రమను నాశనం చేయాలని కోరుకోదు కదా? అమెరికా లోపలి రాజకీయాలు దీర్ఘకాలంలో సుంకాలపై ప్రభావం చూపవచ్చు, “అమెరికా ఫస్ట్” విధానం మళ్లీ రావచ్చు — ఏతావాతా మళ్లీ సుంకాల యుద్ధానికి తెర తీసే పరిస్థితులను కొట్టిపారేయలేము. అందుకే సుంకాల తగ్గింపు "చివరి అడుగు కాదు — పెద్ద అడుగుల్లో ఒకటి మాత్రమే".
అమెరికా–భారత్ టారిఫ్ ఒప్పందం — భారత్ నేర్చుకున్న కొత్త పాఠాలు: పెట్టుబడి పెరిగేకొద్దీ లభించే ప్రయోజనాలు - ఈ ఒప్పందం ప్రకారం, అమెరికా మన వస్తువులపై టారిఫ్‌లను 50% నుండి 18%కి తగ్గించింది. బంగారం: భారత్ రష్యా నుండి చమురు కొనుగోలు తగ్గించడం మరియు అమెరికా నుండి $500 బిలియన్ల విలువైన వస్తువులను (ఎనర్జీ, టెక్నాలజీ, విమానాలు) కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడం. సింగారం: దీనివల్ల మన టెక్స్‌టైల్స్, లెదర్, ఫార్మా రంగాలకు అమెరికా మార్కెట్ లో భారీ అవకాశాలు దక్కాయి. అంటే భారత్ ఎంతగా అమెరికాతో వాణిజ్య సంబంధాలు పెంచుకుంటే, మన ఎగుమతులు అంతగా పెరుగుతాయి. అమెరికా–భారత్ వాణిజ్య చర్చలు ఎప్పుడూ సంఖ్యలతో మాత్రమే నడవవు; వాటి వెనుక భౌగోళిక రాజకీయాల నాడి కూడా కొట్టుకుంటూనే ఉంటుంది. తాజా టారిఫ్ ఒప్పందం ఈ నిజాన్ని మరింత స్పష్టంగా చూపించింది. ఈ ఒప్పందం ద్వారా భారత్ గ్రహించిన మొదటి పాఠం — వాణిజ్యం ఇప్పుడు వ్యూహాత్మక అనుసంధానంతో ముడిపడి ఉంది. అమెరికా టారిఫ్‌లను తగ్గించడం కేవలం మార్కెట్ యాక్సెస్ కారణం కాదు; రష్యా నుండి భారత్ చమురు కొనుగోలు పై తీసుకున్న విదేశాంగ నిర్ణయాలు కూడా కీలక పాత్ర పోషించాయి. రెండవ పాఠం — పరస్పర ప్రయోజనం తప్పనిసరి. అమెరికా కు “మేము సుంకాలు తగ్గిస్తే, మీరు కూడా తగ్గించాలి” అనే స్పష్టమైన సందేశం ఇచ్చింది. భారత్ కొన్ని రంగాల్లో సర్దుబాటు చేస్తూ, దేశీయ పరిశ్రమను ప్రభావితం చేసే సున్నిత రంగాలను మాత్రం రక్షించుకుంది. మూడవ పాఠం — చమురు దిగుమతులపై ఆధారపడటం కూడా బేరసారాల శక్తిని ప్రభావితం చేస్తుంది. రష్యా ఆయిల్ కొనుగోళ్లపై భారత్ తీసుకున్న నిర్ణయాలు భారత్–అమెరికా వాణిజ్య చర్చల దిశను మార్చాయి. ఈ మొత్తం ప్రక్రియ ద్వారా భారత్ నేర్చుకున్న అసలు విషయం: “వాణిజ్యం ఇక ఆర్థికం మాత్రమే కాదు; అది వ్యూహం కూడా.”
రష్యా నుండి చమురు కొనుగోళ్లు తగ్గిన నేపథ్యంలోని కొత్త రక్షణ కొనుగోళ్ల దిశ: ఆపరేషన్ సింధూర్ యుద్ధంలో పాక్‌ను కుదేలు చేసిన S‑400 క్షిపణి వ్యవస్థ ఇప్పటికే ఒక బలమైన రక్షణ పొరను అందిస్తున్నప్పటికీ, బెదిరింపులను ఎదుర్కోవడానికి సుదూర లక్ష్యాలను ఛేదించే S‑500 దీర్ఘశ్రేణి క్షిపణి తరగతి వ్యవస్థ భారత్‌కు అవసరం. చైనా ఇప్పటికే J‑20 యుద్ధవిమానాలను పెద్ద సంఖ్యలో ప్రవేశపెడుతోంది. J‑35 మరియు అమెరికా నుండి కాపీ కొట్టి తయారు చేసినట్లు విమర్శలు ఎదుర్కొంటున్న J‑20 వంటి యుద్ధవిమానాలను పాక్‌కు చైనా ఉచితంగా ఇచ్చినా ఇస్తుంది. ఉచితంగా కాకపోతే — అప్పుల భారంతో ఉన్న పాక్ డబ్బులిచ్చి ఈ చైనా విమానాలను కొనుగోలు చేసే పరిస్థితి ఉందా? ఈ చైనా జెట్లు భారత వైమానిక దళానికి ఒక కొత్త తరహా సవాలు — ఎందుకంటే ఇది స్టెల్త్–స్టెల్త్ యుద్ధ విమానాల పోటీ. రఫేల్ వంటి 4.5 తరం జెట్లు భారత్ వద్ద ఉన్నప్పటికీ, 5వ తరం స్టెల్త్ సామర్థ్యం లోటు స్పష్టంగా కనిపిస్తోంది. రష్యా తయారీ సుఖోయ్‑57 ఈ లోటును పూరించగలిగే శక్తివంతమైన ఫైటర్ జెట్. అమెరికా ఆయుధాలకున్న "కిల్ స్విచ్" సమస్య రష్యా తయారీ సుఖోయ్‑57 లకు ఉండదు. రష్యా నుండి చమురు కొనుగోళ్లు భారత్ తగ్గించుకున్న సమయంలో — రష్యా నుండి ఈ రక్షణ కొనుగోళ్లు భారత్‌కు చాలా కీలకం. అయితే విమర్శకుల అభ్యంతరం ఏమిటంటే, ఫ్రెంచ్ రఫేల్‌తో పోలిస్తే రష్యా తయారీ సుఖోయ్‑57 పెద్ద యుద్ధ ట్యాంకు సైజులో ఉంటుంది — కావున శత్రు రాడార్లకు సులభంగా దొరికిపోతుంది అని. కానీ మిత్రులారా, ఇదే సైజులో ఉండే సుఖోయ్‑30 MKI యుద్ధవిమానాల నుంచే ఆపరేషన్ సింధూ యుద్ధ సమయంలో ఏకంగా 15కి పైగా క్షిపణులను భారత్ ప్రయోగించింది. తొలి రోజు (మే 7న) సుఖోయ్‑30 MKI విమానాలు ప్రధానంగా ఇతర దాడి విమానాలకు (రఫేల్ వంటివి) ఎయిర్ డిఫెన్స్ కవర్‌ను అందించాయి. అయితే, మే 10న జరిగిన తీవ్రమైన దాడుల్లో ఇవి నేరుగా బ్రహ్మోస్ క్షిపణులను ప్రయోగించి పాక్‌లో ఉన్న 11 వైమానిక స్థావరాల సామర్థ్యాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. యుద్ధ నిపుణుల అంచనా ప్రకారం, మే 10న ఒక్క రోజులోనే పాక్ వైమానిక సామర్థ్యం 20 శాతం తుడిచిపెట్టుకుపోయింది. ఆ రోజు జరిగిన భీకర దాడి తర్వాతే పాకిస్థాన్ చేతులెత్తేసి యుద్ధ విరమణ ప్రకటనకు సిద్ధమైంది. కావున ముందుగా భారత్ ఆత్మాహుతి డ్రోన్ల సాయంతో పాక్ రాడార్లను లేపేసింది — ఆ తర్వాత సుఖోయ్‑30 MKI, రఫేల్ తమ పని పూర్తి చేసాయని తెలుస్తుంది.
భవిష్యత్ దిశ: ఈ లెక్కన, రాబోయే దశాబ్దంలో భారత్ మరికొన్ని S‑500, రఫేల్, సుఖోయ్‑57 వంటి ప్లాట్‌ఫారమ్‌లను సమకూర్చుకోవాల్సి ఉంటుందని రక్షణ నిపుణులు సూచిస్తున్నారు. కారణం సులభం — ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ పూర్తిగా బలహీనపడిపోయిందని అనుకోవడం పొరపాటు. ఇప్పటికే బంగ్లాదేశ్‌లో డ్రోన్ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసి, వివిధ మార్గాల్లో భారత్‌పై దాడికి బంగ్లాదేశ్‌ను సిద్ధం చేయించే ప్రయత్నానికి పాక్ పన్నాగం పన్నుతోంది. లేకపోతే పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న బంగ్లాదేశ్‌కు ఇప్పటికిప్పుడు డ్రోన్ ఫ్యాక్టరీ అవసరమా? గత రెండు ఏళ్లుగా రాడికల్ శక్తుల చేతిలో బందీ అయి, దిశాహీనంగా మారిన బంగ్లాదేశ్‌ను రెచ్చగొట్టి భారత్‌పై ఒత్తిడి తీసుకురావడానికి పాక్ శక్తి వంచన లేకుండా ప్రయత్నించడంలో ఆశ్చర్యం లేదు. పాకిస్తాన్ గత ప్రవర్తనను చూస్తే, ఇలాంటి వ్యూహాలు కొత్తవి కావు. అందుకే భారత్‌కు ఒకే సందేశం — తస్మాత్ జాగ్రత్త.
ముగింపు – అనిశ్చితి నుంచి అవకాశాల దిశగా: సుంకాల అనిశ్చితి తగ్గడం మూలంగా భారత ఎగుమతిదారులకు ఊరట కలిగింది అనే చెప్పాలి. పెట్టుబడిదారులకు నమ్మకం పెరిగింది. రెండు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యానికి బలం చేకూరింది. భారత్ గ్లోబల్ వేదికపై “వాణిజ్య భాగస్వామి” నుంచి “వ్యూహాత్మక భాగస్వామి”గా మారుతున్న ప్రయాణంలో ఇది మరో కీలక మైలురాయి. "బంగారం కొద్దీ సింగారం" అన్నట్లుగా, భారత్ తన ఆర్థిక మరియు దౌత్యపరమైన వనరులను అమెరికాతో ఎంత సమతుల్యంగా పంచుకుంటుందో, అంతగా మన దేశానికి ఆర్థిక లబ్ధి మరియు అంతర్జాతీయ మద్దతు లభిస్తుంది. రచ్చబండ చర్చ ముగింపు ముందు ఇంకా చెప్పుకుంటే ఎన్నో విషయాలు. కానీ ఒక ముగింపు ఉండాలి కదా! వీలైతే నాలుగు మాటలు, కుదిరితే కప్పు కాఫీ (లేదా టీ) - ఈ లెక్కన రచ్చ బండ చెట్టు వద్ద కాఫీ - టీ కొట్టు పెట్టుకున్నవాడు అదృష్టవంతుడు అని చెప్పుకోవాలి! చర్చ ముగిసే సరికి రచ్చబండ వద్ద ఎన్ని కాఫీ - టీ ఆర్డర్లు వచ్చి ఉంటాయో ఊహించుకోండి. ఈ చర్చ ముగియకూడదు అనుకునే వాడెవడైన ఉంటే - వాడు వీడేనని చెప్పాలి. మొదలు పెట్టిన విషయానికి వస్తే - సుంకాల పెంపు వార్తతో బెంబేలుపడిపోకుండా, ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు అని గుర్తెరిగి, మన ముందు ఉన్న అవకాశాలను అన్వేషించి, వాటిని సామరస్యపూర్వకంగా ఒడిసి పట్టుకొని - చివరికి సుంకాల తగ్గింపు వంటి శుభవార్తతో చర్చ కంచికి - మనం ఇంటికి చేరడం ఒక ఊరటనిచ్చే — హాయి గొలిపే సందర్భం. కదా మిత్రులారా! క్రింద ఉన్న కామెంట్ బాక్స్‌లో మీ అభిప్రాయాలను తప్పక పంచుకోండి. ఈ సంచికలో చెప్పుకున్నది కొద్దిగా అయినా — మాటలు ఎక్కువ కావాల్సిన అవసరం లేదు; బంగారం కొద్దీ సింగారం అన్నట్టే — ఈ చర్చ సారాంశమే ముఖ్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు — అందరూ బాగుండాలి, అందులో మనమూ ఉండాలి. సిరిమల్లె పాఠకులందరికీ — ఆయురారోగ్యాలు, ఆనందం, అభివృద్ధి, విజయాలు కలగాలని కోరుకుంటూ వారందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. వచ్చే నెల మరో కొత్త విషయం - లోతైన విశ్లేషణతో మళ్లీ కలుద్దాం.
నమస్కారములతో, మీ వెంకట్ నాగం.