అన్నమయ్య తన పాటలలో శృంగార, వైరాగ్యాది భావాలనే గాక మనుష్యుల మధ్యనున్న శిశు, మాతృ, స్నేహ, బంధుత్యాది సంబంధాలను భగవంతుని పరంగా చెబుతూ రచనలు సాగించాడు.
సంపుటి 111, సంకీర్తన 107. ఇందులో దేవుణ్ణి తన ప్రాణ స్నేహితునిగా భావించి ఆయనకు హితోపదేశం చెయ్యడం అన్నమయ్య యొక్క భక్తికి పరాకాష్ఠ.
“ఇంత యేలుకొంటె ఇంక విడువంగరాదు
నా విన్నపమిద్ది చేకొనుమయ్యా!
చెలిమి చేయంగరాదు చేసి విడువంగ రాదు …”
ఈ సందేశం లో స్నేహం అనేది ఎంత గట్టి బంధమో తెలుసుకొమ్మని హెచ్చరిస్తున్నాడు అన్నమయ్య. స్నేహం పుట్టుకతో రానిది. కట్టెలతో ముగిసిపోనిది. భగవంతునితో గూడా స్నేహ బంధం అలా ఉండాలి. అన్నమయ్య విష్ణుభక్తి సర్వోత్కృష్టమైనది. అందుకే భగవంతునికే హెచ్చరికలు చేస్తూ తన రచనలు సాగించాడు.
మధురభక్తి – ఆరుద్ర వివరణ క్లుప్తంగా:
భగవంతుని ప్రాణనాథునిగా ఎంచుకొనే మహా భావనయే మధురభక్తి అంటారు. ఇదే ఆధునిక భారతీయ సాహిత్యంలో వైష్ణవికత అనే పేరుతో చలామణి అవుతున్నది.
ఈ మధురభక్తి మార్గంలో అన్నమయ్య వేలాదివేల కీర్తనలు రచించాడు. అన్నమయ్య 33 వేల కీర్తనలు రచించాడని తెలుస్తున్నది. అందులో సగానికి పైగా శృంగార కీర్తనలేనని చెప్పవచ్చు. తాను నాయికగా, అలివేలు మంగగా చెప్పిన కీర్తనలు ఎన్నో ఉన్నాయి.
అన్నమయ్య తన రచనలలో వివిధ విషయాలను తీసుకొన్నారు. పురాణాలు. జ్యోతిష్యం, దశావతారములు, ద్వాదశ రాసులు ఇలా అన్ని విషయాలు మధురభక్తి తో రచించడం అన్నమయ్య గొప్పతనం.
అన్నమయ్య రచన గూర్చి ఆరుద్ర మాటలను కొద్దిగా తెల్పుతాను.
“అన్నమయ్య రచనంతా దేశీయమే. అడుగడుగునా సామెతలే. ప్రతి చరణంలో నానుడులే. అన్నమయ్య మూర్తీభవించిన తెనుగుతనము. ..” అంటూ ఆరుద్ర చెప్పిన మాటలు అక్షర సత్యాలు. (స.ఆం.సా. పుట 1000).
తాళ్ళపాక వారి సాహిత్యం ఇంకా వెలుగు చూడాల్సి ఉందని ఆరుద్ర మాట. తాళ్ళపాక చిన్నన్న, అన్నమయ్య రచించిన కీర్తనలు మొత్తం ముప్పైరెండు వేల కీర్తనలని చెప్పాడు. ప్రస్తుతం అన్నమయ్య కీర్తనలు దొరికిన సంఖ్యల గురించి ఆరుద్ర ఇలా చెప్పారు.
“అన్నమయ్య కీర్తనలు అన్నీ రాగి రేకులపైన చెక్కబడ్డాయి అనుకుంటే ఒక రేకులో సుమారు ఆరు కీర్తనలు వంతున ఎక్కితే అన్నమయ్య రేకులే 5400 తక్కువ తేలుతాయి. అయితే ఇప్పటికి లభించిన అన్నమయ్య రేకులు కేవలం 2284 మాత్రమె. మొత్తం తాళ్ళపాక కుటుంబ సభ్యుల రేకుల సంఖ్య వెరశి 2531 అని పరిశోధకులు చెబుతున్నారు.” (స.ఆం.సా. పుట 1001).
అన్నమయ్య పదసంపద- ఆరుద్ర అభిప్రాయం
‘ఇంత పదసంపద మనకు లభ్యమౌతున్నప్పటికీ ప్రచురణ అయినంతవరకూ సమర్ధవంతమైన విశ్లేషణ నోచుకోలేదు.’ అంటూ ఆరుద్ర గారు ‘30 ఏళ్ళు గడిచాయి. అయినా ఈ సారస్వత శాఖ తెలుగులో ఉన్నా తెలుగువారి చూపు దీనిమీద తగినంత పారలేదు. దానికి కారణాలెన్నో …శబ్దం. అర్థం, తాత్పర్యం, వాక్యం, వ్యాకరణం, జాతీయం, దేశీయం, సంగీతం, శృంగారం, పదరచనా పరిణామం, సంకీర్తన, భక్తితత్వం, సమకాలపు సంఘ చరిత్ర నీడలు, ఇత్యాదిగా పలు మొగములు పర్యవేక్షణ ఇందు సాగవలసియున్నది’ అన్న రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారి మాటలు మనకు శిరోధార్యములు అని అన్నారు ఆరుద్ర.
శబ్దం-అర్థం-వగైరాలు
ఆరుద్ర అన్నమయ్య పాటలలో ఉన్న కొన్ని పదాలు మొదలైన విషయాలను చర్చిస్తూ రాళ్ళపల్లి వారు చెప్పిన కొన్ని విషయాలు కొద్దిగా వివరించారు.
ఆరుద్ర అన్నమయ్య వాడిన పదం తీసుకొన్నారు. దీనిని అన్నమయ్య చాలాసార్లు వాడారని ఆరుద్ర తెల్పారు. ఆ పదం “దోమటి”.
ఈ “దోమటి” పదం గూర్చి చెప్తూ ఆరుద్ర సూర్యరాయ ఆంధ్ర నిఘంటువు లో ఇచ్చిన వివరణ తెల్పారు.
‘దోమటి వి అన్నము … ఈ క్రింది ప్రయోగములను బట్టి ఔపవిభక్తికముగా దోచుచున్నది..’ అంటూ రామలక్ష్మీ ఆరుద్ర అన్నమయ్య పాటలలో24 చోట్ల దోమటి అనే పదం ఉన్నట్లు గుర్తించి “అన్నమయ్య పలుకుబళ్ళు” అనే తమ రచనలో చర్చించారు. వాటిని ఆరుద్ర స.ఆం.సా లో తెలిపారు.
ఈ పదం గూర్చి చర్చించిన ఆరుద్ర ఇది వివాహ భోజనానికి సంబంధించిన పదమని ‘దోమటి విందు’ అని ఇలా అనేక కోణాల నుండి చర్చించారు. దోమటి అన్న దానితో పాటు ‘దొడకు’ అనే క్రియావాచకం విరివిగా వాడడం జరిగింది. దీనిని గూర్చి కూడా ఆరుద్ర చర్చించారు.
దోమటి బహుశా ఇది గొల్లవారి పెళ్లి విందును గూర్చిన పదమని అన్నారు ఆరుద్ర. అందుకు కారణం ఇది ఉండవచ్చు. సాధారణంగా బ్రాహ్మణుల పెండ్లిళ్ళలో పెళ్లి జరిగిన రోజు రాత్రి జరిగే విందును బువ్వంబంతి అని చెప్తారు. అప్పుడు పెళ్లి పాటలు పాడుతారు. బువ్వ అంటే అన్నం. పాలబువ్వ తేవే అనే పాట ఉంది కదా. అందువల్ల దోమటి అనేది బువ్వ అన్నట్లు అన్నం అన్న అర్థంలో వాడి ఉంటారు.
అన్నమయ్య పద కవితా పితామహుడు. మన సాహిత్యంలో పద రచనా పరిణామాన్ని అన్నమయ్య రచనల వల్ల తెలుసుకోవచ్చు.
పాల్కురికి సోమనాథుడు తన కాలంలో ఉన్న కొన్ని పదాలను తెల్పాడు. అవి తుమ్మెద, ప్రభాత పర్వత, ఆనంద, వెన్నెల, శంకర, సంజయ వర్ణన, గొబ్బి, గణవర్ణన పదాలు మొదలైనవి కొన్ని చెప్పాడు అయితే వీటి పేర్లు తెలుస్తున్నాయే గానే వాటి తీర్లు తెలీవు అని అన్నారు ఆరుద్ర.
అయితే, అన్నమయ్య సంకీర్తనలో ఈ పదాలే కాక ఇంకా ఎన్నో అసంఖ్యాకమైన పదాలు కనబడతాయని, వాటిలో ఒక్కొక్క వర్గానికి ఎన్నెన్నో ఉదాహరణలు అన్నమయ్య సాహిత్యంలో దొరుకుతాయి అన్నారు ఆరుద్ర. అంతేగాక వాటిని ఆరుద్ర కొన్ని పదాల పట్టిక ఇచ్చి ఆయా పదాలు ఏఏ సంకీర్తనా లక్షణానికి చెందినవో తెల్పుతూ వాటి నెంబరు ఇచ్చారు. మచ్చుకు కొన్ని-
అర్థ చంద్రికాపరం – సంకీర్తన లక్షణం – 5, అల్లో నేరెళ్లో – సంకీర్తన లక్షణం – 47, ఏల పాట – సంకీర్తన లక్షణం – 51
ఇంకా శ్రద్ధగా చూస్తే ఎన్నో రకాల పదాలు దొరుకుతాయన్నారు ఆరుద్ర. పదం అంటే word కాదు, రచనా విధానం.
అన్నమయ్య ‘పదములు’ అనే రచన విరివిగా బహు విధాలుగా చేయడం వల్ల ఆయనను పద కవితా పితామహుడు అన్నారు. ఆయన శుద్ధమైన విష్ణు భక్తుడు. అందుకే శృంగార కీర్తనలు పాడే వారికి, వినే వారికి భక్తి రసాన్నే ప్రసాదించాయి. వెంకటేశ్వరుని నమ్ముకొని కమ్మని పదరచన చేసిన అన్నమయ్య ధన్యుడు. ఆయన పదాలను, కీర్తననలను పాడుకొంటున్న తెలుగువారు, తెలుగు తెలిసిన వారూ కూడా ధన్యులే.