కదంబం - సాహిత్యకుసుమం
నటనే వరం
- చందలూరి నారాయణరావు -
1.
ఎవరిలో చూసినా
ఎవరో ఒకరు "ఓ భయం"
ఓ చీదరలా....ఓ చీకటిలా...
తొక్కేసే మాటలతో
తుడేపేలా చేష్టలతో
ఒరుసుకుపోతుంటారు..
అచ్చం నల్లని మబ్బులా
భయం కమ్మి
రాతి చినుకులతో
ముంచెందుకు సిద్ధంగా ఉంటారు.
చూపుల మెరుపులను
శబ్దంగా గుచ్చుతూ
లోపాలను పిడుగులా
రాల్చేందుకు కాచుకుని
లోపల ప్రతి క్షణం భీతి
వరదలా పారుతుంది.
దిన దిన గండమే
ఆ బంధపు పలకరింపు....
2.
ఎప్పుడు చూసినా
ఎవరెదురైనా
ముఖాలు అప్పటికప్పుడే
చెక్కునే నేర్పరితనం.
మాటలు పిచ్చి మొక్కల్లా
మర్యాద ఏపుగా కాస్తుంది.
భుజాలపై చేతులు
మెలికలుగా చుట్టుకుని
గుండెలపై పడగ లాడిస్తూ
తీయని విషాన్ని దాస్తుంది.
చర చరమని పాకే చురుకుదనంతో
ఓడించి ఊడ్చేయాలనే
ప్రవర్తనే మనుగడ.
దూరంగా భారంతో ఉన్నా
నటన వరంగా
ఎదలో రొదతో
మనసుకు మంట పెట్టే
ఓ మనిషిని సృష్టించి
మరో మనిషిలో
కన్నీటిని వండి వార్ఛటం
ఏ మనసుదైనా నేరం కాదా?