Menu Close
సిరికోన కవితలు
సౌజన్యం: సాహితీ సిరికోన
(వాక్స్థలి సాహిత్య దిన సంచిక)

నిద్ర అంచుల మీద
నింపాదిగా నడుస్తున్నప్పుడు
అకాలంగా ఆమని ఎగిరివచ్చి వాలినట్టు
పిడికిట్లో ఒదిగిన పూల గుఛ్చం లో
తుళ్ళిపడుతున్న మెత్తని హరివిల్లు తునకలు
ఎదురుగా నిలువెత్తు చిరునవ్వై నువ్వు
పాలిపోయి పారిపోతున్న రాత్రి
దొరికిపోయి తలవంచుకున్న ఉనికి

పక్కనే ఉన్నాక
ఆహ్వాన పత్రికలెందుకు?
స్వాగత వచనాలెందుకు?
దగ్గరో దూరమో గతమో వర్తమానమో
మల్లెతీగనై అల్లుకు పోవాలనీ
గతమో వర్తమానమో
నీకూ నాకూ మధ్యన ఉన్నది
ఈ క్షణం మాత్రమే.
ఎందుకనీ, ఎప్పుడనీ
ఎక్కడికనీ - ప్రశ్నలకే తావు లేదు.

ఆకుల మాటున ఒదిగి పరిమళం వెదజల్లే
సంపెంగ సౌరభంలో
మునిగితేలుతూ నువ్వూ నేనూ తప్ప
సడి లేని అడుగులు కదలక నువ్వు
రెప్పవాల్చని మొలకెత్తే చిరునవ్వై నేను

నీ వెచ్చని ఊపిరి పలకరింత
హత్తుకున్న చేతుల మధ్య ఆదమరచిన జీవనం
నిన్న రాత్రి నిద్రలో ఓ పలవరింత
ఈ ఉదయం తొలిపలకరింత.

కవిలో ఇద్దరుంటారు
ఒకరు... లోకాతీతంగా రాసేవారు
మరొకరు... లౌక్యంగా జీవించేవారు

మాలోనూ ఇద్దరున్నారు...
ఒకరు... నచ్చితే లీనమై చదివేవారు
కాదంటే పొట్లాలకు కాగితాల బొత్తం దొరికింది లెమ్మనుకునే వారు..

మరొకరున్నారు....
నచ్చిందేమిటా అని తరచితరచి చూసేవారు
ఎందుకు నచ్చిందాని తమ్ము తాము ప్రశ్నించుకునేవారు
నచ్చిన వాటిల్లో తమ ముఖం తాము చూసుకునేవారు
తలల్లో ప్రపంచ రసాయనశాలను నిర్మించుకొని మాటల్ని పరీక్షించేవారు
మాటలన్న మాట మరచి మరో ప్రపంచం వెదుక్కొనేవారు..
వెదుకులాటే రసానందమని మురిసి పోయేవారు
ఒట్ఠి అర్భకభావుకులు!!

కవుల్లారా! కాస్త దయ తలచండి!
మా లోనూ ఇద్దరున్నారని గుర్తించండి
అదేమిటీ ప్రశ్నలని ఆగ్రహించకుండా
అర్భక రూపాలం, ఆదరించండి!
మేముంటే మీరుంటారు!!
'మీరుంటే మేముంటాం' అనను కానీ
మీరే మిగిలి ఉండకండి!!

మేలుచేసే కాలం ఎప్పుడూ ఉంటుంది
మనసు తొందరపడి సాగుతుంది
పుట్టబోయే శిశువు కాలాన్ని లాక్కుంటూ
మొక్కలా ఎదిగేందుకు నేలపైకి వస్తుంది..!!

ఊహలు వాస్తవాన్ని కొలచలేవు
కావ్యాలు ఎప్పుడు యదార్థాన్ని చూపలేదు
మధుర కోయిల కూత సవ్యంగా సాగితే
ప్రకృతి అంతా సుందరంగానే కనిపిస్తుంది...

రాగ తాళాలు మంగళకరంగా వినిపిస్తూంటే
శ్వాసలో సరిగమలు గలగలా నవ్వుతాయి
విద్యలెన్నో నేర్చిన వినయ సంపన్న త ఉంటేనే
నేలపైన శిలాఫలకంలా నిలుస్తాయి..

జన్మ రహస్యాలను తెలుసుకున్న నాడే
మౌనానికి అర్థం బోధపడుతుంది
మొక్క వికసించిన నాడే అందమై నిలుస్తూ
కళ్ళకు ఆనందాన్ని కలిగిస్తుంది..

నీ నీడే నిన్ను భయపెడుతుందంటే
పిరికితనపు మాటలెన్నో వింటారు
కన్నీళ్ళను నిత్యం జారవిడుస్తున్నావంటే
ఉదరములో అగ్నిగోళాన్ని ఏర్పరిచారు..

కాలం నిత్యము పరీక్ష పెడుతుంది
అందులోని ఉత్తీర్ణతే నీ ప్రయాణపు మార్గం
మనసు చిందే శ్వేత నీకు గుర్తులైతే
ఆకాశము తలవంచి ఆలింగనం చేస్తుంది...

సంఘములో రాజు బంటు నీవే
నువ్వు ఎంచుకున్న మార్గమే నిలబెడుతుంది
రాసుకున్న అక్షరాలే నిక్షిప్తమై నిలిస్తే
మరో జన్మ సాధన కు దారులు చూపిస్తాయి..

Posted in April 2026, సాహిత్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *