Menu Close
Samudraala Harikrishna
అక్షర చౌర్యం! (కథ)
సముద్రాల హరికృష్ణ

ఆ రోజు యముడి గారి కార్యాలయం మహా రద్దీగా ఉంది. ఎత్తు మీద పెద్ద రత్నసింహాసనాధిష్టితులై ప్రభువులవారు!

కాస్త కింద సుమారైన ఆసనంలో చిత్రగుప్తుడు, ఓ బల్ల మీద పెద్ద చిట్టా తెరిచి పెట్టుకుని. పక్కనే విశాలమైన ఆంగణంలో కిక్కిరిసిఉన్నారు నేరస్థులు, ఒకరినొకరు తోసుకుంటూ.

ఆ రోజు దొంగల వంతు. అంటే, దొంగలుగా ముద్రలు పడీ, నేరారోపణ చేయబడీ, భూమ్మీద శిక్షలు తప్పించుకున్న వారి దినం!

దినం అంటే, వారికి భూమ్మీద శిక్షలు పడకపోయినా, తప్పించుకోలేని సమవర్తి గారి న్యాయస్థానంలో శిక్షలు ఖరారయ్యే రోజన్నమాట!

చిత్రగుప్తుడు చదువుతున్నాడు- నేరస్థుడి పేరూ, చేసిన నేరమూ వాడికి శిక్షా స్మృతి ననుసరించి వేయతగ్గ నేరమూ, ---స్మ్రృతిలో ఉన్న అధ్యాయమూ, అధికరణమూ కూడా జోడిస్తూ!

ఎప్పుడూ ఉండేదేగా ఇది అన్నట్టు, మౌనంగా చెయ్యి ఊపుతూ,"ఊఁ ఊఁ కానీ కానీ", అంటున్నారు యముడు గారు, అసహనంగా!

"చిత్తం చిత్తం", అంటూ చిత్రగుప్తుడు అందరి నేరాలూ శిక్షలూ చదివి పూర్తిచేశాడు వేగంగా.

కోరలతో భయంకరంగా, మీసాలతో భీకరంగా, అరుపులతో దడ తెప్పిచ్చేట్టున్న యమ కింకరులు నేరగాళ్ళను, అనగా ఆ భూలోకదొంగలను తరుముకెళ్తున్నారు, 'దయ', అనేది ఏ కోశానా లేకుండా, రెండు యోజనాల అవతల ఉన్న శిక్షాస్థలికి!

కొందరికి సలసల నూనెలో వేయించటం, కొందరికి కొండ మీద నుంచి తోయించడం, ఇంకొందరికి ఇంకా ఘోరమైన శిక్షలు.

***

అందరూ అయిపోయారు, ఒక పది మంది మాత్రం మిగిలిపోయారు ఆ కొట్టంలో, తమకేం వడ్డిస్తారో అని బిక్కు బిక్కుమంటూ!

"వీళ్ళంతా ఎవరు, ఇంకా ఎందుకు ఇక్కడే ఉన్నారు?", అని హుంకరించారు ప్రభువులు!

"చిత్తం చిత్తం, మనవి చేసుకుంటున్నాను ప్రభో!

వీరు చేసిన నేరం మన శిక్షా స్మృతిలో దేని కింద పరిగణించాలో తెలియడం లేదు ప్రభో, తమరే పరిష్కారం చూపాలి", అన్నాడు చిత్రగుప్తుడు.

ఈ ఉద్యోగంలో, యుగాల అనుభవం ఉన్న తన నమ్మినబంటు మాటలకు ఆశ్చర్యపోయారు యముడు గారు.

"ఏవిఁటది త్వరగా చెప్పు చిత్రా", అన్నారు సూర్యసుతులు తొందర పెడ్తూ!

మరేవీఁ లేదు దేవా, వీరు కవిత్వమనీ, కథలనీ, వ్యాసాలనీ, సిద్ధాంత గ్రంథాలనీ ఉండే రకరకాల అక్షరసంచయ చౌర్యానికి పాల్పడ్డారు ప్రభో.

అంటే ఇదీ...-- బంగారం కాదు, వెండి కాదు, పొలం పుట్రా కాదు, ధనధాన్యాలు కాదు, వీరు దోచినది!

"అక్షర చౌర్యం", మహాప్రభో!

మునుపటి కాలాల్లో అడపాదడపా వచ్చినా అవన్నీ చిన్నపాటివీ, మరీ సకృత్తుగా వచ్చేవి ప్రభో ఇట్లాంటివి!

ఏ వందేళ్ళకో నూటయాభై ఏళ్ళకో, విశాల ధరామండలంలో ఎక్కడో కొన్ని చోట్ల‌ మాత్రమే! కనుక సామాన్య శిక్షలే వేస్తుండేవాళ్ళం అప్పుడప్పుడు వచ్చే ఆ ఒకటీ అరా నేరాలకు.

కానీ ఈ మధ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి ప్రభో ఈ నేరాలు!

ప్రతివాడూ రాసేవాడే! గజ రాతగాడే! ఏది నిజమో, ఏది కొట్టేసిన బాపతో తెలియటం మహకష్టం ప్రభో!

సారస్వతసృజన అందరూ చేసేవారే అయినారు, పక్కవాడిది కొట్టేసినా నామోషీ ఈషన్మాత్రం లేకుండా"! అన్నాడు చిత్రగుప్తుడు, కలికాల ప్రభావం, మరీ ఇంత దారుణమా అనుకుంటూ!

"ఇంతకీ, అంతగా ఏమి రాస్తారయ్యా, చిత్రగుప్తా"? అన్నారు యముడు గారు ఆ సృజన ఏపాటిదో తెలుసుకోవాలన్న ఉబలాటంతో!

వెంటనే గుప్తుల వారు తన స్వామిభక్తి తన్నుకు రాగా, "వద్దు మహాప్రభో వద్దు తమరు అవి చదివి అర్థం కాక బాధపడుతుంటే నేను చూడలేను. వదిలేయండి వాటి మానాన వాటిని", అన్నాడు కంఠస్వరం లో జాలి నూటికి నూరు శాతం పలికిస్తూ!

తన ప్రభువుకి ఏదో ప్రమాదమే వస్తుంది అవి చదివితే అన్నంత ఆర్తిగా ఉంది అతని హెచ్చరిక!

"సరే వదిలేద్దాం కానీ, ఈ విషయం చెప్పు!

అంతగా ఏది సహకరిస్తోంది వీరికిప్పుడు, మునుపు లేనిది? ఈ తామరతంపర రచనలకు కారణమేమిటీ అని!", యమరాజు గారి సందేహపు టనుమానం అది.

'సామా', ట ప్రభో అదేదో, దానిలో వేస్తారట, రాసినవి. దాన్ని నకలు చేసేసి అమాంతంగా, అనగా టోకు మొత్తంగా అదేనో, తల తోకా కత్తిరించి దానిలోని ఒకటో రెండో భాగాలో- తమ పేర్లతో చలామణీ చేయిస్తారట ప్రభో ఈ నేరస్థులూ", అంటూ "నీచులు", అన్నట్టు ఒక చూపు చూశాడు చిత్రగుప్తుడు.

జన్మలో సిగ్గూ ఎగ్గూ ఎరుగని ఆ చచ్చిపోయి యమలోకం వచ్చిన పదిమందీ వింతగా మొదటిసారి సిగ్గుపడుతూ మళ్ళీ చచ్చిపోయారు, ఆ గుప్త గారి చూపుకీ, ఆయనాడిన మాటలకూ!

"సరేలే, ఇదివాళ తెమిలేదు కాదు, బ్రహ్మ గారిని సలహా అడిగి నిర్ణయించాలి, తరువాత చూద్దాం", అన్నారు ప్రభువులు, ఆ నాటికి సభ చాలిస్తూ!

"అంతదాకా ఈ దొంగ పక్షులను చీకటి కొట్లో వేసి బంధించేయండి, తిండి తిప్ప పెట్టకుండా", అంటూనే వారి వైపు కొరకొరా చూస్తూ లేచ్చక్కా వెళ్ళిపోయారు నరకాధిపతి యముడు గారు.

"చిత్తం చిత్తం", అంటూ చిత్రగుప్తుడు కూడా వారికి వేయతగ్గ శిక్ష, యములవారు చెప్పింది చెప్పినట్టు భటులకు చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు.

***

బ్రహ్మలోకం.

బ్రహ్మగారూ, యముడూ ఏదో మంతనంలో ఉన్నారు.

కొంచెం అటుగా వీణ వాయించుకుంటూ తెల్లగా మెరిసిపోతూ సరస్వతీదేవి!

విషయం అంతా చెప్పాడు యముడు.

బ్రహ్మ గారు అంతా విని, "ఔరా ఎంతకు దిగజారుతున్నారు ఈ మానవులు", అని బోల్డు బాధపడి, ఇంకాస్త కోపబడీ,

"సరే ఏం చేద్దామని యమా నీ అభిప్రాయం" అన్నారు.

అంతా ఓర చెవిన వింటున్న వాణి కల్గచేసుకుంది.

కఠినాతికఠిన శిక్ష వేయించు యమా, అక్షర ద్రోహం చేస్తారా నీచులు", అని ఎప్పుడూ నవ్వులు చిమ్మే వాగ్దేవి నిప్పులు చెరిగింది.

"అమ్మా,అట్లాగే" అన్నాడు యముడు వినయంగా.

"వెధవలకు నువ్వేసే శిక్ష నువ్వు వేసెయ్ యమా, మనం ఇందాక అనుకున్నట్టు!

అది అయిన తరువాత భూమ్మీద ఏ మలమల ఎండలు కాసే ప్రాంతంలోనో బండలుగా సృష్టిస్తాను ఈ అక్కు పక్షులను, రోగం కుదిరి బుధ్ధి వస్తుంది", అన్నాడు బ్రహ్మగారు తనకు అలవాటు లేని కోపం తెచ్చుకుంటూ!

"సరే దేవా", అని యముడు కదలబోతుంటే, సరస్వతీదేవి "ఆగు యమా! ఇదీ విని తరలు", అన్నది ఆవేశంగా!

చిత్తం అని కూర్చున్నాడు యముడు అదేవిఁటో అనుకుంటూ!

బ్రహ్మను ఉద్దేశించి ఆయనను చూస్తూ వాణి చెప్పసాగింది.

నాథా! చదువులకు అధినేత్రిని నేను. ఇది చదువుతో అనగా దాని దురుపయోగం తో కూడిన విషయం.

ఎంత భావ దారిద్ర్యం ఈ మనుషుల్లో! ఒకరు వ్రాసినది ఇంకొకరు, తమదని చెప్ఫుకుని తిరుగుతున్నారా?

దానికి సన్మానాలు కూడానా?! అవి ముఖాన వేళ్ళాడ కట్టుకుని డాక్టరేట్ లా?!

ఛీ ఛీ, ఎంత నిస్సిగ్గురాయళ్ళనుకోవాలి!

కనుక వీళ్ళను ప్రాణం లేని బండలుగా కాదు, ప్రాణమున్న మనుషులు గానే పుట్టించాలి.

కానీ చదువు అబ్బని దద్దమ్మలు లాగా! మనుషులే అయినా బండలతో సమానమైన వారిగా!

విధిలేక చదువుకోలేని వారుగా కాదు సుమా! అన్నీ ఉండీ, చదువు తలకెక్కని వాజమ్మలుగా,

తమ వారిలో చిన్నబోయి తలవంచుకుని తిరిగే వారిగా సృష్టించాలి", అన్నది వాణి, నేరానికి తగ్గ శిక్ష ప్రతిపాదించానన్న ధీమాతో!

బ్రహ్మగారు తల పంకించి,"ఆలోచిద్దాం", అన్నారు తాపీగా.

వినమన్నది తన పై అధికారి సతీమణి కాబట్టి, అంతా కిమ్మనకుండా విని, నమస్కారాలు చెప్పి బయటపడ్డాడు యముడు.

***

బ్రహ్మగారు ఏమి నిర్ణయం తీసుకున్నారో, వాణీదేవి ప్రతిపాదన అమలయ్యిందో లేదో తెలియదు కానీ, కవిత్వ, కథా, వ్యాస సిద్ధాంత గ్రంథ/గ్రంథభాగాల చోరీ ఇలాతలంలో యథావిధిగా సాగిపోతోంది.

కొంతమంది ఎవరో అత్యున్నత న్యాయస్థానంలో కేసులు కూడా వేశారట ఈ విషయమై. కేసులు వేసిన వారికి నోటీసు లొచ్చాయట, నీ ఫలానా డిగ్రీ చెల్లదు, నిన్ను ఉద్యోగంలో నుంచి ఎందుకు తీసివేయకూడదో వారం రోజుల్లోగా జవాబిమ్మని.

దానితో వారి నోటిని కుట్టేసినట్టే!

అయినా కేసు వేసిన వారు పరలోక యాత్ర చేసే లోపల తేలే... కాదు కాదు... తేల్చే కేసులు ఏమున్నాయి ఈ దేశంలో?!

పై లోకాల్లోనే అంత తాత్సారమైతే, తామసానికీ తాత్సారానికి పెట్టింది పేరైన భూమ్మీద అంత తేలిగ్గా శిక్షల వరకు వస్తాయా కేసులు,వచ్చినా శిక్షలు అమలౌతాయా, శిక్షాస్మ్రృతులు మారుతాయా?!

***

లోకానికేమిటి, మహరాజులా సాగిపోతుంది, మూడన్యాయాలు, ఆరక్రమాలూ అన్నట్టు!

ఈ సామా లూ, ఈ కవిత్వకథారచనలూ, వాటి చౌర్యాలూ ఏం దిగొచ్చాయా?!

వీటికి మినహాయింపు కోరటంలోనూ, పరిస్థితులు అమాంతం మారి శిక్షలు పడిపోతాయి అనుకోవడంలో కాదూ, మన సత్తెకాలపుతనమూ, అమాయకచక్రవర్తి త్వమూ దాగి, తళతళా మెరిసేది?!

మరేఁ!

********

Posted in April 2026, కథలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *