డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని దీక్షగా సెల్‌ఫోన్‌లో మేట్రిమోనిలో పెళ్లిసంబ౦ధాలు వెతుకుతో౦ది సరోజ. “హాయ్ మమ్మీ గుడ్‌మార్నింగ్, ఏమిటి ఇ౦త పొద్దున్నే ఫోన్‍లోకి చూస్తున్నావ్? ఏమైనా పాత సినిమాలా?” అడిగాడు సుధీర్.
“సినిమాలు చూసే తీరుబడి వు౦దా నాకు? పూర్వం ఆడపిల్లకు పెళ్లిసంబంధం చూడడానికి ఆరుజతల చెప్పులు అరిగిపోయాయి అనేవారు ఇప్పుడు ఈ మాట్రిమోనిలు చూసి, చూసి ఆరు కళ్ళజోడులు కొనుక్కోవాలేమో.”
“నీకు కళ్ళజోడు కావాలని సూటిగా చెప్పవచ్చుగా.” అన్నాడు అక్కడే ఉన్న శ్రీకాంత్.
“అబ్బా, కామెంట్ చేసారా? చూడమంటే ఒక్క సంబంధ౦ కూడా చూడరు గానీ…”
“అమ్మో నా వల్ల కాదు, ఆడపిల్లల తల్లితండ్రులు వేసే యక్షప్రశ్నలకు నేను జవాబు చెప్పలేను. నేను ఆఫీస్‌కు రెడీ కావాలి.” చూస్తున్న పేపర్ టీపాయ్ పడేసి వెళ్ళిపోయాడు, శ్రీకాంత్.
“అబ్బా ఈ రోజుల్లో కూడా ఏమిటమ్మా, సంబంధాలు, కట్నాలు అంటూ.”
“అదేమిటి నీకు పెళ్లిచేయాలంటే సంబంధాలు వెతుక్కోవద్దా? పోనీ నీకు ఎవరైనా నచ్చిన అమ్మాయి ఉంటే చెప్పు, ఆ అమ్మాయినే చేస్తాము.”
“చూద్దాములే! అయినా ఈ పెళ్లి… అందరినీ పిలవడం, ఆ తర్వాత పెళ్లయిన ఇద్దరికీ సరిపడకపోవడం, విడాకులు తీసుకోవడం, అబ్బా! భలే బోర్.”
“అంటే ఏమిటిరా నీ అభిప్రాయం?” సరోజకు కోడుకు ఆలోచన అర్థం కావడం లేదు.
“అబ్బా అదేనమ్మా అతిగా ఆలోచి౦చవద్దు అనేది. ఇష్టమైనప్పుడు కలిసి ఉండి అక్కర్లేనప్పుడు విడిపోయేట్టు ఉ౦డాలి. అయినా నాకు ఆఫీస్‌కు టైమ్ అయ్యింది. బై.” అంటూ సుధీర్, తల్లి సర్దిపెట్టిన లంచ్ బాక్స్ తీసుకుని బయలుదేరి వెళ్ళిపోయాడు. సరోజకు మతిపోయినట్టు అయింది.
ఏమిటి వీడు ఇలా మాట్లాడతాడు? ఎవరినైనా ప్రేమించలేదు కదా?
సరోజకు ముగ్గురు పిల్లలు. సుధీర్ పెద్దవాడు. సాఫ్ట్ వేర్ ఉద్యోగి. తర్వాత ఇద్దరూ ఆడపిల్లలు కవలలు. ఇ౦జనీరి౦గ్ థర్డ్ ఇయర్‌లో ఉన్నారు. దాదాపు ఆరునెలలుగా సుధీర్ కు పెళ్లిసంబ౦ధాలు చూస్తున్నారు.
కొన్ని వీళ్ళకు నచ్చక, కొన్ని వీళ్ళు వాళ్ళకు నచ్చక ఇప్పటివరకు ఏ సంబ౦ధం కుదరలేదు. ఇంతలో సుధీర్ వెలిబుచ్చిన అభిప్రాయం… అదే శ్రీకాంత్ దగ్గర చెప్పింది సరోజ.
“ఏ౦ వాడు ప్రేమించిన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయడానికి నీకేమిటి అభ్య౦తరం?”
“వాళ్ళు మన వాళ్ళయితే పర్వాలేదు, లేకపోతే ఎన్నిసమస్యలు?”
“ఆ… వాడు ప్రేమించినవాడు కదా ఆ సమస్య వాడిది.”
“అబ్బా! ఏం చెప్పినా తేలిగ్గా తీసుకు౦టారు. మనకి అభ్య౦తరం లేకపోతే సరా, వాడి వెనక ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళకి పెళ్లికావద్దా?”
“నిజమే, అయినా రాత్రి వాడు ఇంటికి వచ్చాకా మాట్లడదాములే…” శ్రీకాంత్ ఆఫీస్‌కు వెళ్ళిపోయాడు.
***
ఆ రాత్రి శ్రీకాంత్, సరోజ ఇద్దరూ ఆడపిల్లలు నిద్రపోయాక సుధీర్‌ను వివరాలు అడిగారు. అతడు చెప్పిన విషయం విని ఇద్దరికీ మతిపోయిన౦త పని అయ్యింది. “నాకు పెళ్లి మీద నమ్మకం లేదమ్మా. అమ్మాయికి, అబ్బాయికి పడకపోతే ఈ పెళ్లి మంత్రాలు కలుపుతాయా? అందుకే నేను సహజీవనం చేస్తున్నాను.”
“ఏమిటి సుధీర్ ఇది? మన ఇంటా, వంటా లేని పనులు. ఇంతవరకు మన కుటు౦బాన్ని ఎవరూ వేలెత్తి చూపడానికి లేకుండా ఉ౦టూ వచ్చాము. అటువ౦టిది ఇలాటి పని చేస్తే నలుగురిలో ఎంత అవమానం? నీ చెల్లెళ్లకు పెళ్లిళ్ళు అవుతాయా?”
“ఈ రోజుల్లో ఇలాంటివి కామన్‌గా జరుగుతున్నాయమ్మా. ఇంకా చెల్లెళ్ల పెళ్లి ఎప్పుడో కదా…”
“అంటే ఈలోగా ప్రప౦చం మారిపోతు౦ద౦టావా? ఎప్పుడైనా సరే కుటు౦బ౦ మంచి చెడ్డలు చూడకుండా ఎవరూ పెళ్లి చేసుకోరు.”
“నాకు అవన్నీ నచ్చవమ్మా, మా ఆఫీస్‌లోనే ముగ్గురు సా౦ప్రదాయ౦గా పెళ్లి చేసుకుని విడిపోయిన వారున్నారు. విడాకులు, కేసు, కోర్టులు అంటూ చాలా బాధ పడ్డారు, అవన్నీ తెలుసుకుని నేను మళ్ళీ అదే పొరపాటు చెయ్యను.” అన్నాడు సుధీర్.
“శుభమాని పెళ్లి మాట చెబితే విడాకుల గురించి మాట్లాడతావేరా?” కాస్త కోప౦గా అన్నాడు శ్రీకాంత్.
“పోనీ, ఆ అమ్మాయి ఎవరో చెప్పు. నేను, డాడీ వెళ్లి మాట్లాడతాము.”
“అఖ్ఖర్లేదు… ఇంతవరకూ వచ్చాకా ఇక దాచడం దేనికి? మేమిద్దరం రెండునెలలుగా కలిసి ఉ౦టున్నాము…”
శ్రీకాంత్, సరోజ మొహాలు చూసుకున్నారు. ‘వీడు సుధీర్ కాదు, శ్రీరామచంద్రుడు’ అనుకున్నారు ఇన్నాళ్ళూ… కానీ ఇలా సహజీవనం చేస్తూ తమకి తెలియకుండా… సరోజ తనలో తనే ఉలిక్కి పడింది. అంటే తమతో చెప్పి చేస్తే తప్పులేదా? ఆదివారాలు ఫ్రెండ్స్ అంటూ ఎందుకు బయట తిరిగాడో ఇప్పుడు అర్థం అవుతో౦ది, రాత్రి ఆఫీస్‌లో లేట్ అయ్యింది అంటూ భోజనం అక్కడే చేసాన౦టే, అది ఎక్కడో ఇప్పుడు తెలుస్తో౦ది.
సుధీర్ మళ్ళీ మొదలు పెట్టాడు. “ఈ కట్నాలు, పెళ్లి ఖర్చులు… మర్యాదలు బాగా చెయ్యలేదని బంధువులు అలగడం… ఇదంతా పెద్ద వేస్టనిపించింది. పెళ్లి పేరు చెప్పి బోలెడు ఖర్చు, శ్రమ ఏమీ లేదు. పైగా మాలో ఎవరు ఎవరికీ నచ్చకపోయినా బై చెప్పుకుని విడిపోతాము…”
“మీకు పిల్లలు కలిగితే?” మధ్యలోనే అంది సరోజ.
సుధీర్ ఒకసారి తండ్రివైపు చూసి, “జాగ్రత్తగా ఉ౦టా౦ ఆ విషయంలో…”
“మరి నేను, మీ నాన్న, నీ చెల్లెళ్ళు నీకు అన్ని విషయాల్లో నచ్చామా?”
“మీరు నా కుటు౦బం మమ్మీ…”
“చేసుకుంటే ఆ ఆమ్మాయి మన కుటు౦బమేగా…”
“ఉహూ వద్దు మమ్మీ! పెళ్లి చేసుకున్న దగ్గరను౦ఛి ఒకరి మీద ఒకరికి అధికారాలు, అలకలు, పంతాలు, పట్టుదలలు… అబ్బా! పెద్ద తలనొప్పి…”
“అదే లేకపోతే జీవితంలో మజాయే లేదురా… ఆ మాటకొస్తే నాకు, డాడీకి గొడవలు కాలేదూ? మేము సంతృప్తిగా లేమా? నా మాట నీకు అర్థం అయి౦దా? మేము స౦తోష౦గా లేమా, సుఖ౦గా లేమా అనడం లేదు… సంతృప్తిగా లేమా? అంటున్నాను. సుఖ౦, కన్నా సంతోషం కన్నా స౦తృప్తి గొప్పది.”
“కానీ దానికోసం మీరు ఎన్ని త్యాగాలు చేసారు? ఎంతగా మిమ్మల్ని మీరు కోల్పోయారు?”
“ఒరేయ్! నీకు పోగొట్టుకోవడానికి, ఇవ్వడానికి తేడా తెలిసినట్టు లేదు. నీ ఆఫీసే ఉంది నీ స్వేచ్ఛను, టైమును ఇస్తేనే వాళ్ళు నీకు హోదాను, జీతాన్ని ఇస్తారు…”
సరోజ మాటలకు శ్రీకాంత్ ఆశ్చర్యపోయాడు. అతనికి చాలా మంది మగవాళ్ల లాగా భార్య తెలివి మీద నమ్మకం తక్కువ. సరోజే మళ్ళీ అంది.
“ఇంతకీ ఎవరు ఆ అమ్మాయి? మన కుల౦ కాకపోయినా పర్వాలేదు కానీ ఒక ఆడపిల్లను ఇష్టం అయినప్పుడు భార్య అని, లేనప్పుడు నువ్వు పో అనడం మంచిది కాదురా… ఆ పిల్లకు తెలియకపోతే నేను మాట్లాడతాను…”
“లేదమ్మా! తనకు ఈ పెళ్ళిళ్ళు, వాటితో వచ్చే న్యూసెన్స్ తో విసిగిపోయే ఈ నిర్ణయం తీసుకుంది. వాళ్ళ బావ వాళ్ళక్కను పెళ్లి జరిగిన ఏడాదికే నచ్చలేదని వదిలేసాడు. ఆమె ఇప్పుడు బ్యూటీపార్లర్ నడుపుతో౦ది.”
“వాడెవడో మంచివాడు అయి వు౦డడు. అయినా బ౦ధాన్ని నిలబెట్టుకోవాలని ఇద్దరికీ ఉ౦డాలి. సరే ఆమె వాళ్ళక్క అనుభవం ఉంది కాబట్టి పెళ్లి అంటే భయపడుతోంది, అనుకు౦దాము నీకేమైంది? ఎవరో మీ కొలీగ్స్ కు అలా జరిగిందని నువ్వు అందరూ నవ్వే ఆ పనులు చేయకు. అంత దూరం ఎందుకు? మన ఇంట్లో మనం ఒకరితో ఒకర౦ ఎంతో అభిమాన౦గా ఉంటాము. అటువంటిది… ఒక ఆడపిల్లతో కలిసి ఉన్న విషయమే మాకు చెప్పలేదే! నిన్నేమి చేయాలి?” సుధీర్ దగ్గర జవాబు లేదు.
“నీ ఇష్టం అయినట్టు బ్రతికే హక్కు నీకు౦ది. కానీ ఈ ఇంటికి, దానికున్న పరువు మర్యాదలను పాడుచేసే హక్కు నీకు లేదు…” అన్నాడు శ్రీకాంత్.
“రేపు ఆ అమ్మాయి దగ్గరకు నన్ను తీసుకువెళ్ళు నేను మాట్లాడతాను.”
“వద్దు మమ్మీ! ఇది చిన్నప్పుడు నాకు మార్కులు తక్కువ వస్తే టీచర్‌తో మాట్లాడినట్టు కాదు.”
“లేదు… నేను మాట్లాడతాను. ఒక అమ్మాయికి విడాకులు అయి, ఇంకో అమ్మాయి పెళ్లి కాకుండా సహజీవనం చేస్తు౦ది అంటే ఆ కుటు౦బం ఎ౦త బాధ పడుతుందో అలోచి౦చావా? వాళ్ళకి ఇష్ట౦ అయితే వాళ్ళక్కను మా ఫ్రెండ్ కొడుక్కి ఇవ్వొచ్చు, వాడుకూడా డైవోర్సి కదా…”
శ్రీకాంత్‌కు భార్య తెలివి మీద కాస్త నమ్మకం కలిగింది. సరోజ, చేతిలో ఉన్న ఫోన్‌లో టైమ్ చూసి, “అబ్బా! రాత్రి పన్నె౦డు అయింది. ఇంక నిద్ర పోదాం…” అన్నది.
***
నెలరోజుల తర్వాత రెండు పెళ్ళిళ్ళు ఒకేసారి జరిగాయి. సాంప్రదాయ౦గా జరిగిన ఆ పెళ్ళిళ్ళు అందరికీ నచ్చాయి. సరోజ మాత్రం వధూవరులు నలుగురుకి నాలుగు కవర్లు ఇచ్చింది, “ఇందులో ఉన్నది ఆచరి౦చ౦డి…” అంటూ.
నలుగురూ కాస్త హడావిడి తగ్గాక కవర్లు తీసి చూసారు. అందులో అందరికీ ఒకే వాక్యం “జీవితం ‘మయసభ’ కాదు, ఒకరి అనుభవం చూసి మన౦ భ్రమ పడిపోవడానికి. నీళ్ళు అయినా నేల అయినా మనమే నడిచి చూసుకోవాలి. రాళ్ళను, ముళ్లను తొలగించుకోవాలి. అన్నిటినీ మించి, గెలుపు మనది కావాలి!”