Menu Close
VSRao
మహాత్మా గాంధి
డా. వల్లూరుపల్లి శివాజీరావు
Mahatma-Gandhi
Image by WikiImages from Pixabay

దక్షిణ ఆఫ్రికా- మానవుడు ఒకటి తలిస్తే, దేవుడు మరొకటి తలిచి నిర్ణయిస్తాడు

సేథ్ అబ్దుల్లా కేసు ముగిసిన తరువాత గాంధీజీకి ఇక ప్రిటోరియాలో ఇంకా ఉండవలసిన అవసరం కనపడలేదు. వెంటనే ఆయన ‘డర్బన్’ (Durban) వెళ్లి భారత్ కు తిరుగు ప్రయాణానికి సన్నాహం ప్రారంభించారు. కాని సేథ్ అబ్దుల్లా ఘనమైన వీడ్కోలు ఇవ్వకుండా గాంధీజీని పంపించటానికి సిద్ధంగా లేరు. ఆయన గాంధీజీ గౌరవార్ధం ‘Sydenham’ (డర్బన్ లో ఒక ఊరు) లో ఒక పెద్ద విందు ఏర్పాటు చేశారు.

దీనికి ముందు రోజు గాంధీజీ అచ్చటి దినపత్రికలు చదువుతున్నప్పుడు ఒక పత్రికలో వ్రాయబడిన ‘Indian Franchise Bill’ అనే శీర్షికతో ఉన్న చిన్న వ్యాసం ఆయనను ఆకర్షించింది. ఇందులో నాటాల్ House of Legislature లో భారతీయులకు ఉన్న ఓటు హక్కును హరించేందుకు ప్రతిపాదించబడిన బిల్లు గురించి విపులంగా వ్రాయబడి ఉంది. ఫలితంగా వీరికి అసెంబ్లీ (Legislature) సభ్యులను ఎన్నుకునే ఓటు హక్కు ఉండదు. దీనిని గురించి తీవ్రంగా కలవరపడిన గాంధీజీ ఇలా వివరించారు.

“నేను వెంటనే ఈ ఓటు హక్కును హరించే అసెంబ్లీ ప్రతిపాదనను సేథ్ అబ్దుల్లా విందుకు వచ్చిన కొంతమంది అతిధులను ప్రశ్నించాను. అబ్దుల్లా ఇలా చెప్పారు: ‘ఈ విషయాల గురించి మాకేమి తెలుసు? మీకు తెలుసు కదా ఈ ‘Orange Free State’ రాష్ట్రంలో మా వ్యాపారం ఏదో విధంగా నడుస్తూ ఉంటుంది. మేము ఆందోళన చేసినా అది వృధా ప్రయాసే అవుతుంది. మేమందరం నిజానికి నిరక్షరాస్యులైన కుంటివాళ్ళం. మేము వార్తా పత్రికల ద్వారా కేవలం మా వాణిజ్య వస్తువుల ఖరీదులు, తదితర విషయాలు గురించి మాత్రమే తెలుసుకుంటాం. ఇక ప్రభుత్వ చట్టాల గురించి మాకేమి తెలుస్తుంది? ఇక ఇచ్చట మా కళ్ళు, చెవులు యూరోపియన్ న్యాయవాదులే.

దీనికి నేను ‘కాని ఇచ్చటే పుట్టి, చదువుకున్న యువత ఉంది కదా’ అని అన్నాను.

అబ్దుల్లా ‘వాళ్ళా! వాళ్ళెవరూ మాదగ్గరకు రారు. నిజం చెప్పాలంటే మమ్ములను వారు గుర్తించరు. మేము ఎదురుపడినా, వాళ్ళు క్రైస్తవాచార్యుల బొటన వ్రేళ్ళ క్రింద ఉంటారు. ఈ మతాచార్యులు ప్రభుత్వానికి లోబడి ఉంటారు' అని సమాధానమిచ్చారు.

సేథ్ అబ్దుల్లా సమాధానం నా కళ్ళు తెరిపించింది. ఇటువంటి స్వార్ధపరులైన క్రైస్తవ మతాచార్యులను మనవారేనని ఎలా అనుకోగలం. క్రైస్తవ మతం అంటే క్రైస్తవులుగా మారిన మరుక్షణం భారతీయత పరిత్యజించమని బోధించే మతమా? కాని నేను కొద్ది రోజులలో భారత్ కు తిరిగివెళ్తున్నాను. ఆ సమయంలో నా మస్తిష్కంలో ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి.

చివరకు అబ్దుల్లాతో ‘ఈ బిల్లు చట్టంగా మారితే భారతీయుల పరిస్థితి మరింత దిగజారుతుంది. ఇది మన ఆత్మగౌరవాన్ని సమూలంగా నరికి వేస్తుంది’ అని సూచించాను.

అలా జరగవచ్చు అని అంటూ అబ్దుల్లా ‘ఈ ఓటు హక్కు రాద్ధాంతానికి మూల కారణం ఒకటి ఉంది. మాకు ఒక మంచి లాయరు ఉన్నారు. ఆయన పేరు Mr. Escombe. ఈయన తన ఆలోచనలను మా బుర్రలలో ప్రవేశపెడతాడు. ఈయన అన్యాయాన్ని నిర్భయంగా ఎదుర్కొనగలిగిన వ్యక్తి. ఈయనకు డర్బన్ వార్ఫ్ (Wharf: రేవు) ఇంజినీరుతో శత్రుత్వం ఉంది. ఈ న్యాయవాది తనకు అసెంబ్లీ ఎన్నికలలో రావలసిన ఓట్లు రాకుండా చేస్తాడేమోనని భయం ఉంది. ఈ విషయం మాకు వివరంగా చెప్పిన తరువాత ఈయన ప్రోద్బలంతో ఇచ్చటి భారతీయులందరు ఓటర్లుగా నమోదుచేసుకుని ఈయనకు అనుకూలంగా ఓట్లు వేశాం. దీనిని బట్టి మా ఓటు హక్కుకు నీవు చెప్పినంత ప్రాముఖ్యత, విలువ లేదని మేము భావించాం. కాని జరిగే అన్యాయం, వివక్షత గురించి నీవు చెప్పింది నాకు పూర్తిగా అవగతమయింది. ఇప్పుడు నీ సలహా ఏమిటి’ అని ప్రశ్నించాడు నన్ను.

ఈ మా సంభాషణ అంతా మిగతా అందరు శ్రద్ధగా విన్నారు. వారిలో ఒకరు లేచి నాతో ‘ఏమి చేయాలో నేను చెప్పదలచుకున్నాను. నీ ఓడ ప్రయాణం రద్దుచేసుకో. మరొక్క నెల రోజులు ఇక్కడే ఉండు. నీవు నిర్ధేశించిన మార్గంలో నడిచి పోరాడుదాం’ అని సూచించాడు.

ఇతరులందరు ఏక కంఠంతో ‘నిజమే, నిజమే. సేథ్ అబ్దుల్లా: మీరు ఈ గాంధీ భాయిని భారత్ తిరిగి వెళ్లకుండా ఆపండి’ అని ఆయనకు సలహా ఇచ్చారు.

సూక్ష్మబుద్ధి గల అబ్దుల్లా ‘నేను ఈయనను వెళ్లకుండా ఆపలేను ఈ విషయంలో నాకు ఎంత బాధ్యత ఉందో మీకు అంతే బాధ్యత ఉంది. మీరు చెప్పినది సమంజసమే. మనం అందరం ఏకమై గాంధీ భాయిని ఇచ్చటే ఉండాలని ఒప్పించుదాం. కాని ఆయన ఒక బారిష్టర్ అని గుర్తుంచుకోవాలి. ఆయన వేతనం మాట ఏమిటి?’ అని తన అనుమానాన్ని బయట పెట్టాడు.

నా వేతనం గురించిన చర్చ నాకు బాధ కలిగించి అబ్దుల్లాతో ఇలా అన్నాను: ‘ఇందులో వేతనం సమస్య కాదు. ప్రజాసంబంధిత పనికి జీతం ఉండదు. (ప్రస్తుత ప్రజా సేవకులారా! గాంధీజీ నోటినుంచి జాలువారిన ఈ అక్షర సత్యాన్ని జ్ఞాపకం ఉంచుకోండి). అవసరమయితే ఒక నౌకరులాగా ఇక్కడ ఉంటాను. ఈ మిత్రులందరితో నాకు పరిచయం లేదు. వారు నాతో సహకరిస్తారని మీరు నమ్మితే నేను ఇచ్చట ఒక నెల ఎక్కువ ఉండగలను. కాని ఒక్క విషయం. మీరు నాకు వేతనం ఇవ్వనవసరం లేదు. కాని, ఇది అందరికి సంబంధించిన విషయం కాబట్టి ఆర్ధిక సహాయం లేకుండా దీనిని నిర్వర్తించలేము. అధికారులకు టెలిగ్రాములు పంపటానికి, కరపత్రాలు ప్రచురించటానికి, న్యాయవాదుల సహాయం తీసుకోటానికి పైకం కావాలి. అలాగే ఇచ్చటి చట్టాలు, న్యాయసూత్రాలు తెలియవు కాబట్టి అవసరమైన న్యాయ పుస్తకాలను కొని చదవాలి. వీటినన్నిటిని డబ్బు లేకుండా నిర్వర్తించలేము. అదీగాక, ఒక వ్యక్తి వీటినన్నిటిని నిర్వర్తించలేడు. అందువల్ల కొంతమంది ముందుకు వచ్చి నాకు సహాయపడాలి.

వెంటనే అందరు ముక్త కంఠంతో ‘డబ్బు వస్తుంది. మీకు తోడ్పడగలిగే వ్యక్తులు కావలసిన మంది ఉన్నారు. దయచేసి మీరు ఇక్కడే ఉండండి. మీరు ఉంటే మాకు అంతా మంచి జరుగుతుంది’ అని గట్టిగా అరిచారు.

ఈ పరిణామంతో నా వీడ్కోలు విందు సమావేశం దక్షిణ ఆఫ్రికాలో భారతీయుల హక్కుల గురించి పోరాడే కార్యనిర్వాహక సంఘం ఏర్పడటానికి దారితీసింది. వెంటనే నామస్తిష్కంలో ఒక కార్య నిర్వాహక ప్రణాళిక రూపు దిద్దుకొంది. దీనిని గురించి వీరితో చర్చించి, ఓటు హక్కు గల వ్యక్తుల పేర్ల జాబితాను తయారు చేసి, ఒక నెల పాటు ఇచ్చటే ఉండదలచాను.

అలా దేవుడు దక్షిణ ఆఫ్రికాలో నా జీవితానికి పునాది వేసి, భారతజాతి ఆత్మగౌరవాన్ని పరీక్షించే యఙ్నానికి విత్తనం నాటాడు. మానవుడు ఒకటి తలిస్తే, దేవుడు మరొకటి తలుస్తాడు. ఇదే దైవ లీల!”

నాటాల్ లో స్థిరపడటం

నాటాల్ లో ‘Seth Haji Muhammad Haji Dada’ ఒక పేరొందిన, అతి ముఖ్యమైన భారతీయుడు. సేథ్ అబ్దుల్లా ఆర్ధికంగా బలమయిన వ్యక్తి అయినా, ఈయనతోపాటు ఇతరులు Seth Haji Muhammad ను ప్రజాసంబంధిత వ్యక్తిగా పరిగణించి అభిమానిస్తారు. అందువల్ల మరుసటి రోజు ఆయన ఆధ్వర్యంలో ఆయన గృహంలో ఒక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ‘Franchise Bill’ కు వ్యతిరేకంగా తీర్మానం జరిగింది.

వెంటనే స్వచ్చంద సేవకులు (volunteers) నియమించబడ్డారు. డర్బన్ కోర్టు అనువాదకుడు ‘Mr. Paul’, మిషన్ పాఠశాల ప్రధానోపాధాయుడు ‘Mr. Subhan Godfrey’ కూడా స్వచ్ఛంద సేవకులయ్యారు. వీరు తమతో పాటు అనేకమంది క్రైస్తవ యువకులను కూడా చేర్చారు. వీరే కాదు. స్థానిక వర్తకులు కూడా స్వచ్ఛంద సేవకులుగా తమ పేర్లను నమోదు చేశారు. వీరిలో ప్రముఖులు: Dawud Muhammad, Muha-mmad Kasam, Kamruddin, Adamji Miyakhan, A. Koladaivellu Pillai, C. Lachhiram, Rangasami, Padachi, Amod Jiva, Parsi Rustomji. వీరితో పాటు కొందరు గుమాస్తాలు (clerks) కూడా ఉన్నారు. వీరిలో ముఖ్యులు Manekji, Joshi, Narasimharam, తదితరులు.

వీరందరికి ఒక సరి క్రొత్త అనుభవం, తమ కళ్ళముందున్న ఆపద, విపత్తు కదలాడుతున్నాయి. ఇవి వీరిని కలిపి ఒక సంఘటిత శక్తిగా మార్చాయి. వీరందరు తమ తమ హోదాలు, స్థితిగతులు, తారతమ్యాలు, హెచ్చుతగ్గులు ప్రక్కనపెట్టి ఏకమై నిలిచారు. ఈ కార్యంలో గొప్పవాడు, యజమాని, సేవకుడు, గుమాస్తా అనే బేధాలు లేవు. హిందువులు, మహ్మదీయులు, క్రైస్తవులు, పార్సీలు, గుజరాతీలు, మదరాసీలు, సింధీలు ఉన్నారు. ఈ పోరాటంలో అందరు సమానులే, భారతావని సేవకులే. గాంధీజీ నాయకత్వంలో సంభవమైన ఇదే సంఘటిత శక్తి భవిష్యత్తులో భారతావని దాస్యశృంఖలాలను త్రెంచుకోవడానికి ఉపయోగపడింది.

అసెంబ్లీలో Franchise బిల్ చట్టంగా మారటానికి సిద్ధంగా ఉంది. అంతవరకు జరిగిన ప్రసంగాలలో కొంతమంది శాసన కర్తలు (legislators) ఈ బిల్లు భారతీయులకు వ్యతిరేకంగా ఉందని వాదిస్తే, చాలామంది అసలు ఓటు హక్కుకు అనర్హులని పేర్కొన్నారు. ఈ సమయంలో, ఆ తరువాత ఏం జరిగిందో గాంధీజీ మాటల్లోనే తెలుసుకుందాం.

“నేను వెంటనే అందరినీ సమావేశపరచి పరిస్థితిని వివరించాను. మేము తీసుకున్న నిర్ణయం ప్రకారం అసెంబ్లీ స్పీకర్ కు ఈ బిల్లుకు సంబంధించిన చర్చ వాయిదా వేయమని కోరుతూ ఒక టెలిగ్రామ్ పంపించాను. అదే టెలిగ్రామ్ నాటాల్ రాష్ట్ర ప్రధానమంత్రికి, న్యాయవాది Mr. Escombe (సేథ్ అబ్దుల్లా మిత్రుడు) కు పంపించాను.

వెంటనే ఈ బిల్లుపై చర్చ రెండు రోజులపాటు వాయిదా వేసినట్లుగా స్పీకర్ ఒక టెలిగ్రామ్ పంపించాడు. ఈ తొలి చిన్న విజయం మా హృదయాలను ఆనందంతో నింపింది.

మేము వెంటనే Legislative Assembly కి సమర్పించటానికి ఒక విజ్ఞాపన పత్రం (petition) తయారుచేసి, దీనికి 5 ప్రతులు (copies) తయారుచేసి, ఒక ప్రతిని వార్తాపత్రికలకు పంపించాలని నిర్ణయించాం. ఈ ప్రతులలో భారతీయుల సంతకాల జాబితాను జత చేయాలని కూడా నిర్ణయం జరిగింది. చేతి వ్రాత నిపుణుడు (calligrapher) Mr. Arthur స్వహస్తంతో అసలు ప్రతిని తయారుచేశాడు. దీనిని చూసి ఇంగ్లీష్ భాష మీద పట్టు ఉన్న కొందరు రాత్రంతా మేల్కొని మిగతా ప్రతులను తయారుచేశారు.

వర్తక వాలంటీర్లు తమ స్వంత బళ్ల (carriages)ల్లో, ఇతరులు అద్దె బళ్లల్లో ఊరూరా వెళ్లి అనేక మంది భారతీయుల సంతకాలను సేకరించారు. ఈ సంతకాల జాబితాను విజ్ఞాపన ప్రతులతో జతపరచి అసెంబ్లీ స్పీకర్, రాష్ట్ర ప్రధానమంత్రి, తదితరులకు పంపించాం. వార్తాపత్రికలు మా విజ్ఞాపక పత్రాన్ని అచ్చువేసి మాకు అనుకూలంగా వ్రాశాయి. మా కృషి అసెంబ్లీలో వాగ్వివాదాల మీద ప్రభావం చూపింది.

వాడి వేడిగా చర్చలు జరిగాయి. మాకు వ్యతిరేక, పక్షపాతి సభ్యులు తమ వాదనలకు పదును పెట్టి, విజ్ఞాపన పత్రంలోని వినతులను నిర్ధ్వందంగా తోసిపుచ్చారు. అధిక సంఖ్యలో ఉన్న వీరు చివరకు చట్టంగా మారేటట్లు చేశారు. ఫలితంగా, భారతీయులు తమ ఓటు హక్కును కోల్పోయారు.”

తరువాత జరిగింది విజయమో, అపజయమో వచ్చే సంచికలో తెలుస్తుంది.

Mahatma-Gandhi-24Years
23 సంవత్సరాల, 5 నెలల, 24 రోజుల వయస్సులో దక్షిణ ఆఫ్రికా డర్బన్ లో తలపాగా ధరించిన యువ న్యాయవాది (‘కూలీ బారిష్టర్’), మోహన్ దాస్ గాంధి

****సశేషం****

Posted in April 2026, వ్యాసాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *