ప్రణవి ఫోన్‌ని జంబేష్ చేతిలో పెట్టింది. గొంతులో భయం లేదు, కేవలం నిజాయితీ మాత్రమే ఉంది.
“ఏంటిది? ఎవరిచ్చారు?” అంటూ దాని వంక అనుమానంగా చూసాడు జంబేష్.
“ఇది సెల్ ఫోన్ తమ్ముడు ఇచ్చాడు. రీఛార్జ్ చేయాలి. స్కాచ్ కార్డ్ ఎలా కొట్టాలో నాకు తెలియట్లేదు.”
జంబేష్ ఫోన్ అందుకున్నాడు. దానిని పరీక్షగా చూశాడు. అతని చూపు ఒక్కసారిగా మారిపోయింది.
“ఈ ఫోన్ నీ దగ్గర ఎలా ఉంది?”
“మూర్తి ఇచ్చాడు అని చెప్పాను కదా…!”
“మూర్తి ఎందుకు నీకు ఫోన్ ఇచ్చాడు? మమ్మల్ని ఏం చేయటానికి? అంటే మా మీద మీకు నమ్మకం లేకనా! లేక మళ్ళీ మమ్మల్ని పోలీస్ స్టేషన్లో పెట్టిద్దామనా? సక్రమంగా సంసారం చేసుకో అని చెప్పి పంపాలి గాని, ఇలా ఓ గూఢచారి ని పంపినట్టు పంపిస్తారా?” అన్నాడు కోపంగా.
“అలాంటిదేమీ లేదు. నేను ఎలా ఉన్నానో తెలుసుకోవడం కోసం ఇచ్చారు. కేవలం క్షేమ సమాచారానికే” అంది.
“నేను ఇలా ఉన్నానని తెలిసి, నువ్వు నాకు సేవలు చేయకుండా… పనులు చేసుకుంటూ ఉండక. నువ్వు నీ తమ్ముడితో మాట్లాడుతున్నావా?”
“లేదండి… నేను ఇప్పటిదాకా ఏమీ మాట్లాడలేదు,”
“అబద్ధం! చెబుతున్నావు. నేను నమ్మను,” జంబేష్ గొంతు పెరిగింది.
“నేను నిజమే చెప్తున్నాను, నమ్మండి”
“ఫోన్ ఇచ్చాడు అంటే మాట్లాడావు అని అర్థం. నేను ఇక్కడ చెయ్యి విరిగి బాధపడుతుంటే… నువ్వు నీ తమ్ముడితో సంతోషంగా కబుర్లు చెప్పుకుంటున్నావా? మా మీద ఏం కుట్రలు చేస్తున్నారు?”
ప్రణవి కళ్లలో నీళ్లు తిరిగాయి.
“అయ్యో…! అవేమి మాటలండి. నేను ఇప్పటిదాకా మాట్లాడలేదు. మూర్తి నా తమ్ముడు. మీ బావమరిది. మన బాగోగులు తెలుసుకోవడానికి ఫోన్ ఇచ్చాడు. ఇందులో తప్పేముంది? నేను మీకు ఎవరికి తెలియకుండా దొంగ చాటున మాట్లాడుకోలేదు కదా! ఫోను మీకే తీసుకొచ్చి చూపించాను. మిమ్మల్ని మోసం చేసేదాన్నే అయితే… ఆ ఫోను కనపడనిచ్చే దాన్ని కాదు కదా! కేవలం యోగక్షేమాల కొరకే ఫోన్ తెచ్చుకున్నా. ఇంకా ఇప్పటి వరకూ దానితో మాట్లాడనే లేదు.” అంది ఎక్సప్లనేషన్ ఇస్తూ…
‘అసలు విషయం మాట్లాడకుండానే అపార్థాలకు దారి తీసింది, ఈ ఫోన్ వ్యవహారం, చెప్పకుండా ఉన్నా బాగుండేది. లేనిపోని అపార్ధాలు…అనుమానాలు చుట్టుకున్నాయి,’ అని మనసులో అనుకుంది.
జంబేష్ ప్రణవి మాటల్ని వినిపించుకోలేదు.
“నిన్ను నేను ఎలా నమ్ముతాను? నన్ను మోసం చేసి ఇంతకాలం ఫోన్ నీ దగ్గర దాచావు. నువ్వు నీతిమంతురాలివి అయితే అప్పుడే ఫోను తెచ్చి ఇచ్చేదానివి. ఇప్పుడేదో నీ అవసరం వచ్చింది కాబట్టి తీసుకొచ్చావు. నువ్వు నమ్మదగ్గ మనిషివి కాదు. అక్కడికీ అన్నయ్య చెప్తూనే ఉన్నాడు దాన్ని నమ్మబోకు రా! అది ఒక నాగుపాము. మన మీద పగతో మనల్ని అంతం చేయడానికి వచ్చింది అని. నేనే నమ్మలేదు. నీ అసలు స్వరూపం ఈరోజు బయటపడింది. అయినా నా దగ్గర… ఇక్కడ ఉండేటప్పుడు నీ తమ్ముడు వాళ్ళతో నీకు పని ఏంటి? నన్ను చూసుకుంటూ ఉండాలిగానీ. నీకు వాళ్లే ఎక్కువ అనుకుంటే ఆ రిలేషన్ నే కొనసాగించకపోయావా? పోనీలే కదా అని నీ మీద జాలిపడి మంచిగా చూసుకుందాం అనుకున్నాను. నీ రంగు ముందే బయటపడింది,” అంటూ కోపంతో ఊగిపోయాడు.
ప్రణవి గుండె పగిలింది. ‘తమ్ముడు అనే బంధానికి కూడా ఇక్కడ విలువ లేదు. నా పిచ్చి గాని నా కన్నతల్లికే విలువ ఇవ్వలేదు. నా చేతే నా తల్లిని గెంటించిన వాళ్ళు. నా వాళ్ళు ఇచ్చే డబ్బులు కావాలి కానీ… వాళ్లతో ప్రేమగా ఎప్పుడూ లేరు.
నన్ను కూడా అలాగే ఉండమంటారు. వాళ్ళు చేసిన తప్పేముంది. ఫోన్ ఇవ్వడం తప్పా! అయినా ఇప్పుడు నేనేం తప్పు చేశాను. అంటే నిజాయితీగా ఫోన్ చూపించడం తప్పయిందా!
ఎందుకు వీళ్ళు అసహజంగా ఉన్నారు? నేనేం పాపం చేసుకున్నాను. నన్ను అర్థం చేసుకోకుండా… ఇలా లేనిపోనివి నాకంట కట్టి మాట్లాడుతున్నారు,’ అని మనసులో మదన పడుతూ ఉంది.
“పో! నా ముందు నుంచి పో! నీ మొహం చూడాలనిపించడం లేదు.” కసురుకున్నాడు.
ప్రణవి అక్కడ నిలబడలేకపోయింది. ఫోన్ అక్కడే పెట్టేసి బయటకు వచ్చేసింది.
బయట హాల్లో రాజన్ కూర్చుని ఉన్నాడు. ప్రణవి కళ్లలో నీళ్లు చూసి మనసులో పండగ చేసుకున్నాడు.
“ఏమైంది ప్రణవి?”
“ఏమీ లేదు బావగారు.”
“ఎందుకు వాడిని అలా అరిపిస్తున్నవు. అసలే వాడు ప్రెస్టేషన్లో ఉంటే. నువ్వు పోయి వాడిని కెలకడం ఎందుకు? నువ్వు ప్రశాంతంగా మమ్మల్ని ఉండనివ్వవా? అంటే అన్నానంటావు గాని, ఈ ఫోను లేంటి ? ఈవ్యవహారం ఏంటి? మా కరెంట్ వాడుకుంటూ… మా మీదే కంప్లైంట్ చేస్తావా? నీకేమన్నా ఇది ధర్మంగా ఉందా?” అంటూ అడిగాడు.
ప్రణవి తిరిగి జవాబు చెప్పలేదు. మౌనంగా ఉంది.
ఇంతలో జంబేష్ కూడా బయటకు వచ్చాడు. అతని ముఖం ఎర్రగా ఉంది.
రాజన్ వెంటనే అతని దగ్గరికి వెళ్లాడు.
“ఏమైంది జంబేష్?”
“అన్నయ్యా… ప్రణవి దగ్గర ఫోన్ ఉంది. మూర్తి ఇచ్చాడుట.”
రాజన్ కళ్లలో మెరుపు.
“మూర్తి ఇచ్చాడా? అంటే ఇన్ని రోజులు వీళ్లిద్దరూ టచ్‌లో నే ఉన్నారన్నమాట. నేను చెప్పాను కదా! వీళ్ళ బుద్ధి ఎలాంటిదో. వాడు మీ మధ్యలో చిచ్చు పెట్టడానికే ఈ ఫోన్ ఇచ్చాడు.”
జంబేష్ మౌనంగా ఉండిపోయాడు.
జంబేష్ మీద తన మాటల ప్రభావం పనిచేస్తోందని గ్రహించాడు. ‘కొలిమిలో కాలిన ఇనుముకి దెబ్బ మీద దెబ్బ పడితేనే దానిని అనుకూలంగా మలుచుకోవచ్చు…’ అనుకుంటూ…
“జంబేష్! ఇక ఈ అమ్మాయిని మన ఇంట్లో ఉంచుకోవటం ప్రమాదం. మనం బయటికి వెళ్లిపోతే ఆడవాళ్ళిద్దరూ ఉంటారు… వాళ్లని ఏమైనా చేయగలదు. మేం మాత్రం ఉంచుకోలేం. వెంటనే ఈ అమ్మాయిని, పిల్లల్ని తీసుకుని వెళ్ళిపో,” అన్నాడు.
జంబేష్ పిడికిలి బిగించాడు.
“మీ మధ్య ఉంచను అన్నయ్యా.”
“అయితే ఈ విషయంలో నువ్వు కఠినంగా ఉండాలి. లేకపోతే నీ బలహీనతను ఆసరాగా తీసుకుని వాళ్ళు నీకు ద్రోహం చేస్తారు.”
అవును అన్నట్లు తల ఊపి, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
రాత్రి అయింది.
జంబేష్ ప్రణవితో ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
ప్రణవి పిల్లలను పడుకోబెట్టి మంచం మీద కూర్చుంది. జంబేష్ వెల్లకిలా పడుకుని సీలింగ్ చూస్తున్నాడు.
ప్రణవి మెల్లగా అడిగింది,
“నిద్రపోలేదా?”
జంబేష్ సమాధానం ఇవ్వలేదు.
ప్రణవి మళ్లీ అడిగింది,
“మీరు నా మాట వినరు కదా!” జంబేష్ తిరిగి పడుకుని ఆమె వైపు చూసాడు.
“నమ్మడం అంత ఈజీ కాదు ప్రణవి. నువ్వు నీ తమ్ముడు ఇచ్చిన ఫోన్ వాడుతున్నావు. ఇది నిజం. ఇంక నేనేం నమ్మాలి?”
ప్రణవి నిశ్శబ్దంగా ఉండిపోయింది.
జంబేష్ అన్నాడు,
“సరే, అయితే ఆఫోన్ ఇప్పుడు నాకు ఇచ్చేయ్.”
“నేను అక్కడ టేబుల్ మీద పెట్టేసాను. తెచ్చుకోలేదు,”
“అక్కడ పారేస్తే ఎవరు తీసుకుంటారు? తెచ్చి ఇవ్వు,” అన్నాడు.
ప్రణవి ఫోన్ తీసుకొచ్చి అతని చేతిలో పెట్టింది.
జంబేష్ ఆ ఫోన్‌ను తీసుకుని కిటికీలోంచి బయటికి విసిరేసాడు.
ఫోన్ చీకట్లో ఎక్కడో పడి శబ్దం చేసింది.
ప్రణవి షాక్‌గా చూసింది.
జంబేష్ అన్నాడు, “ఇలాంటి ఫోన్లు నా ఇంట్లో ఉండకూడదు.”
ప్రణవి ఏమీ అనలేదు. జంబేష్ నిద్రపోయాక మెల్లిగా లేచి బయటకు వెళ్లి చీకట్లో ఆ ఫోన్ కోసం వెతికింది.
ఫోన్ దొరికింది. స్క్రీన్ పగిలిపోయింది.
ప్రణవి ఆ పగిలిన ఫోన్‌ను చీర కొంగులో చుట్టి తెచ్చుకొని, పెట్టెలో దాచుకుంది. రూమ్‌లోకి వచ్చి మంచం మీద కూర్చుంది.
జంబేష్ నిద్రపోతున్నాడు. ప్రణవి అతని మొహం వైపు చూసింది.
‘మీరు నన్ను నమ్మలేదు. పర్వాలేదు. ఏదో ఒకరోజు నిజం మీకు తప్పక తెలుస్తుంది. నా మనసు ఏంటో మీకు తప్పక అర్థం అవుతుంది.
మబ్బు పొర కమ్మి మసక బారిన సూర్యుడిలాంటి వారు. నిజాయితీ గాలులకి చెప్పుడు మాటల మబ్బులు చెదిరిపోవాల్సిందే… అప్పుడు తప్పక మీ స్వయంప్రకాశిక శక్తి వెలుగులు చిమ్ముతుంది. నీలో మార్పు వచ్చే వరకు నేను ఎదురు చూస్తూనే ఉంటా!’ అనుకుంది.
ఆ రాత్రి ప్రణవికి నిద్ర పట్టలేదు.
ఆ రాత్రి రాజన్‌కు మాత్రం హాయిగా నిద్ర పట్టింది. తన ప్లాన్ సక్సెస్ అయింది కాబట్టి.
****సశేషం****
రచయిత్రి పరిచయం ..
పేరు: ఘాలి లలిత B.A:Bed; కలం పేరు: ప్రవల్లిక
రచనలు: మట్టి పాదాలు కవితాసంపుటి, ఆహా కథాకుసుమాల సంపుటి, మర్మదేశం సైంటిఫిక్ ఫిక్షన్ బాలల నవల (“సిరిమల్లె” పత్రికలో ధారావాహికగా వెలువడింది.), కొలిమి (మినీ నవల) (ప్రస్తుతం “సిరిమల్లె” పత్రికలో ధారావాహికగా వస్తున్నది.)
పురస్కారాలు: 1. జిల్లా కలక్టర్ గారిచే ఉగాది పురస్కారాలు నాలుగు సార్లు; 2. గురజాడ అప్పారావు ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి గురజాడ రాష్టీయ పురస్కారము; 3. సావిత్రిబాయి పూలేజాతీయస్థాయి ఆదర్శ ఉపాధ్యాయిని పురస్కారం; 4. ఆదర్శ మహిళా పురస్కారం; 5. పాతూరి మాణిక్యమ్మ కీర్తి పురస్కారం; 6. గుర్రాల రమణమ్మ సాహితీ పురస్కారం; 7. గుఱ్ఱం జాషువా పురస్కారం; 8. సత్యశ్రీ పురస్కారం; 9. గాడ్ఫాదర్ ఫౌండేషన్ నుంచి సాహితీ పురస్కారం; 10. సరోజినీ నాయుడు సాహితీ పురస్కారం; 11. విద్వాన్ విశ్వం ఉత్తమ కథా పురస్కారం; 12. అక్షరయాన్ నుంచి తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా 2022 లో సాహిత్య స్రష్ట పురస్కారం; 13. తానా వారి నుంచి 10,000 నగదు, సత్కారం; 14. సరోజినీ నాయుడు ఎక్స్ లెన్స్ అవార్డు.
బిరుదులు: ప్రతిలిపి బెంగుళూరు వారి నుంచి ‘సాహితీ విశారద’ బిరుదు మరియు తెలుగు కవితా వైభవం హైదరాబాదు వారినుంచి ‘సహస్రకవిమిత్ర’.
సాహిత్య పరంగా చేపట్టిన బాధ్యతలు: తెలుగు భాషోద్యమ సమితి ప్రధాన కార్యదర్శి; గురజాడ అప్పారావు ఫౌండేషన్ ఆఫ్ అమెరికా నెల్లూరు విభాగానికి అధ్యక్షురాలు; నెరసం సహ కార్యదర్శి; సింహపురి సాహితీ సమైఖ్యలో కార్యదర్శిగా కొంత కాలం పనిచేశారు.
ప్రస్తుతం, అక్షరయాన్ రచయిత్రుల సంఘంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ అక్షర యాన్ బాలికా, బాలుర విభాగములను నెలకొల్పారు. 108 మంది రచయితలచే మాయలోకం అనే గొలుసు నవలను రాయిస్తునారు. అలాగే శ్వేత ధామం అనే గొలుసు కట్టునవలను సాహితీ సిరికోన అనే సామాజిక మాధ్యమం లో మహిళలచే రాయిస్తున్నారు. బాల బాలికలచే నల్ల హంస అనే మరో గొలుసు నవలను కూడా వ్రాయిస్తున్నారు.