ఓడలు బళ్ళు అవుతాయి.. బళ్ళు ఓడలవుతాయి!
అది ఒక ప్రశాంతమైన సాయంత్రం వేళ. రావిచెట్టు కింద కూర్చుని దినపత్రికలో ఉన్న ప్రధాన శీర్షికలు బయటకు చదువుతున్నారు తాతయ్య.
పక్కనే మనవడు జున్నుబాబు కూర్చుని వింటున్నాడు. "ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలవుతాయి" అని చదవగానే, "తాతయ్యా! ఓడలు బళ్ళుగా మారిపోతాయా? రోడ్డు మీద నడుస్తాయా?" అని అమాయకంగా అడిగాడు.
తాతయ్య నవ్వుతూ జున్నుని తన దగ్గరకు తీసుకుని, “అది నిజంగా మారిపోవడం కాదు జున్నూ! 'ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలవుతాయి' అనేది మన జీవిత సత్యాన్ని తెలిపే ఒక గొప్ప సామెత.
ఓడల మీద వ్యాపారం చేసేవారు అత్యంత ధనవంతులని, బళ్ళ మీద వ్యాపారం చేసేవారు సామాన్యులని అర్థం. అంటే మనిషి స్థితిగతులు కాలక్రమేణా ఎలా మారతాయో చెప్పే సందర్భంలో ఈ సామెతను వాడతారు,” అని పత్రికలో ఉన్న స్ఫూర్తిదాయక కథను చదవడం ప్రారంభించారు.
"ఒకప్పుడు జనార్ధన్ అనే ఒక పెద్ద వ్యాపారి ఉండేవాడు. అతనికి సొంతంగా అనేక ఓడలు ఉండేవి. వాటి ద్వారా విదేశాలకు సరుకులను పంపిస్తూ అపారమైన సంపదను సంపాదించాడు.
ఒకసారి సముద్రంలో వచ్చిన భయంకరమైన తుఫాను వల్ల అతని ఓడలన్నీ మునిగిపోయాయి. అప్పటివరకు కోట్లకు పడగలెత్తిన ఆ ధనవంతుడు, ఒక్క రోజులోనే ఏమీ లేని పేదవాడిగా మారిపోయాడు.
చూశావా జున్నూ.. ఓడల స్థాయి నుంచి సామాన్య స్థితికి పడిపోవడమే 'ఓడలు బళ్ళు అవ్వడం' అంటే! అయినప్పటికీ జనార్ధన్ ధైర్యం కోల్పోలేదు. 'ఓడలు పోయాయి కదా' అని కూర్చోకుండా, ఒక చిన్న ఎడ్ల బండిని ఏర్పాటు చేసుకుని, దాని మీద సరుకులు వేసుకుని ఊరూరూ తిరుగుతూ కష్టపడి అమ్మాడు.
తన పట్టుదలతో, తెలివితేటలతో మెల్లమెల్లగా ఎదిగి, పాత వైభవాన్ని తిరిగి సంపాదించుకున్నాడు. కొన్నేళ్ల తర్వాత మళ్ళీ ఓడల యజమాని అయ్యాడు. అంటే.. బండి మీద తిరిగే సామాన్యుడు కూడా తన కృషి ద్వారా ఓడలు నడిపే స్థాయికి ఎదగడమే 'బళ్ళు ఓడలు అవ్వడం' అన్నమాట!
ఈ లోకంలో ఏదీ శాశ్వతం కాదు జున్నూ! సంపద అనేది ఎప్పుడూ ఒకే దగ్గర ఉండదు. ఈరోజు పేదవాడు రేపు ధనికుడు కావచ్చు, ధనవంతుడు పేదవాడు కావచ్చు. అందుకే మనం సంపద ఉన్నప్పుడు గర్వపడకూడదు, కష్టాల్లో ఉన్నప్పుడు కుంగిపోకూడదు," అని జున్ను తల నిమురుతూ తాతయ్య చెప్పడం ముగించారు.
“ఓడలు బళ్ళు అవుతాయి.. బళ్ళు ఓడలవుతాయి! అంటే ఏంటో, దీనిని ఏ సందర్భంలో వాడతారో ఇప్పుడు స్పష్టంగా తెలిసింది తాతయ్యా!” అన్నాడు జున్నుబాబు.
********
రచయిత పరిచయం
నా పేరు కాశీ విశ్వనాథం పట్రాయుడు. నేను వృత్తి రీత్యా ఉపాధ్యాయుడను. ప్రవృత్తి రీత్యా రచయితను. 300 కవితలు, 200 బాలగేయాలు, 50 సాంఘిక కథలు, 250 బాలల కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. పిల్లలతో గడపడం, వారికి కథలు చెప్పడం, వారికి నచ్చిన కథలు రాయడం నాకు ఎంతో ఇష్టం. తెలుగు భాష పట్ల ఆసక్తి కలిగించడానికి, తెలుగు భాష గొప్పతనం, జాతీయాలు, నుడికారాలు, సామెతలు గురించి నేటి తరం పిల్లలకు తెలియచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇదే ఉద్దేశ్యంతో కొంతమంది రచయితలు ఇంతకు ముందు జాతీయాలు, సామెతలు వాటి పుట్టు పూర్వోత్తరాల గురించి రాశారు. అయితే నేను భాషోపాధ్యాయుల కోరిక మేరకు ఆ సామెతలను, జాతీయాలను ఏ సందర్భంలో ఉపయోగించారు అనే విషయాన్ని కథల రూపంలో అందిస్తున్నాను. వీటిని తరగతి గదుల్లో బోధించడానికి, ఉదాహరణలుగా చెప్పడానికి, జాతీయాలు, సామెతలు పిల్లల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోవడానికి ఎంతగానో ఉపయోగ పడతాయి. నన్ను ప్రోత్సహించి, నా రచనలు విద్యార్థులకు, తెలుగు భాషాభిమానులకు చేరువయ్యేలా కృషి చేయాలని సంకల్పించిన సిరిమల్లె పత్రిక సంపాదకులు మధు బుడమగుంట గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు. మీ అభిప్రాయాలను క్రింది బాక్స్ లో కామెంట్స్ రూపంలో తెలుప మనవి. – కాశీ విశ్వనాథం.