Menu Close
GSS-Kalyani
కొత్త తెలివి (కథ)
గుండమరాజు శ్రీ శేషకళ్యాణి

ఆరో తరగతి క్లాసుకు తెలుగు పాఠాలను బోధించే పద్మావతి, "మీరంతా ఎల్లుండికల్లా ఒక మూడు పేజీల వ్యాసం రాసి నాకు ఇవ్వాలి. ఆ వ్యాసం మీకిష్టమైన ఆట గురించి రాయండి. తప్పులు లేకుండా చక్కటి పదాలతో అర్థవంతంగా రాయడానికి ప్రయత్నించండి. ఎవరెంత బాగా రాస్తారో చూద్దాం", అంది ఆ క్లాసులో ఉన్న పిల్లలతో.

పిల్లలంతా ముక్తకంఠంతో, "సరే టీచర్!", అన్నారు.

ఆ పిల్లల్లో ఒకడైన రఘు బడి పూర్తయ్యాక ఇంటికి వెళ్ళి వ్యాసం విషయం తన తల్లి అరుంధతికి చెప్పాడు.

అప్పుడు అరుంధతి రఘుని ప్రోత్సహిస్తూ, "నీకెప్పుడూ తెలుగుభాష పరీక్షల్లో అందరికన్నా ఎక్కువ మార్కులొస్తాయ్ కదా! నువ్వు తలచుకుంటే అందరికన్నా మంచి వ్యాసం రాయగలవని నాకు అనిపిస్తోందిరా రఘూ! నీ కృషిలో లోపం లేకుండా వ్యాసం బాగా రాయడానికి ప్రయత్నించు", అంది.

రఘు రెండు రోజులపాటూ కష్టపడి, పుస్తకాలు చదివి కొంత సమాచారాన్నీ, పెద్దలను అడిగి కొన్ని విషయాలనూ తెలుసుకుని, బాగా ఆలోచించి ఒక వ్యాసం రాశాడు. బడిలో మిగతా పిల్లలతోపాటూ తన వ్యాసాన్ని కూడా పద్మావతి టేబుల్ పైన పెట్టాడు రఘు.

పద్మావతి వ్యాసాలకు సంబంధించిన కాగితాలవంక చూస్తూ, "ఇవాళ బుధవారం. నేను శుక్రవారానికల్లా ఈ వ్యాసాలు చదివి, వీటిలో ఉత్తమమైన ఒక నాలుగు వ్యాసాలను ఎంపిక చేస్తాను. ఆ నలుగురూ మరొక విషయం మీద వ్యాసం రాసి నాకు వచ్చే మంగళవారానికల్లా ఇవ్వవలసి ఉంటుంది", అంది.

శుక్రవారం రానే వచ్చింది. ఎవరెవరి వ్యాసాలు ఎంపికయ్యాయో తెలుసుకోవాలని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు పిల్లలు.

పద్మావతి క్లాసులోకి వచ్చి, "పిల్లలూ! మీరందరూ రాసిన వ్యాసాలన్నీ చదివాను. అందరూ అంతో ఇంతో బాగానే రాశారు. అయితే వ్యాసంలో తెలిపిన విషయాలనూ, వాడిన పదాలనూ బట్టి మార్కులు ఇవ్వడం జరిగింది. అన్ని వ్యాసాలలోకీ చరిత్, రఘు, దివ్య, తేజస్విని వ్యాసాలు అద్భుతంగా ఉన్నాయి. వీళ్ళంతా వచ్చే మంగళవారం మరొక వ్యాసం రాసి నాకు ఇవ్వాలి", అని చెప్పింది.

పిల్లలంతా చప్పట్లు కొట్టారు.

బడి నుంచీ ఇంటికి వెడుతున్నప్పుడు, "ఒరేయ్ రఘూ! నీకెప్పుడూ తెలుగు భాష పరీక్షల్లో మంచి మార్కులొస్తాయి కదా. అందుకే నీ వ్యాసం ఎంపిక అవుతుందని నేను ముందే అనుకున్నానురా. కానీ ఆ చరిత్ గాడు బడికి సరిగ్గా రాడు. ఎప్పుడూ పరీక్షల్లో తక్కువ మార్కులు తెచ్చుకుని టీచర్ల చేతిలో చివాట్లు తింటూ ఉంటాడు. వాడి వ్యాసం ఎంపిక కావడం ఆశ్చర్యంగా ఉంది!", అన్నాడు రఘూతో అతడి స్నేహితుడు రామచంద్ర.

"ఏమోరా! చరిత్ కూడా ఇప్పుడు కష్టపడి బాగా చదువుతున్నాడేమో. ఏదేమైనా మంచి వ్యాసం రాశాడు కాబట్టే పద్మావతీ టీచర్ చరిత్ వ్యాసాన్ని కూడా ఎంపిక చేశారు. నేను ఈసారి రాయబోయే వ్యాసంకోసం మరింత కష్టపడతా", అన్నాడు రఘు.

"ఆల్ ది బెస్ట్!", నవ్వుతూ అన్నాడు రామచంద్ర.

అనుకున్నట్లే రఘు ఈసారి మరింత కష్టపడి వ్యాసం రాశాడు. అందుకోసం గ్రంథాలయానికి వెళ్ళి తను ఎంచుకున్న అంశానికి సంబంధించిన పుస్తకాలు చదవడమేకాక ఇంటర్నెట్ లో అధికారిక వెబ్సైట్లనుంచీ కొంత సమాచారాన్ని సేకరించాడు. తన వ్యాసంలో ఆసక్తికర విషయాలనెన్నో విపులంగా తెలియజేశాడు రఘు.

మంగళవారంనాడు పిల్లలంతా క్లాస్ రూంలో పద్మావతి కోసం ఎదురు చూస్తున్నారు.

అంతలో చరిత్ తన బెంచీపైకి ఎక్కి నిలబడి, "అందరూ వినండి! ఈసారి పద్మావతీ టీచర్ ఎంపిక చేసే వ్యాసాల్లో నాది తప్పకుండా ఉంటుంది", అన్నాడు కాస్త గర్వంగా.

"అంత కచ్చితంగా ఎలా చెప్పగలవురా?", చరిత్ ను అడిగాడు రామచంద్ర.

"ఎందుకంటే మన క్లాసులో వ్యాసాన్ని నాకన్నా బాగా ఇంకెవరూ రాయలేరు కాబట్టి!", అన్నాడు చరిత్ లేని మీసం మెలేసినట్లు నటిస్తూ.

అంతలో పద్మావతి తరగతి గదిలోకి అడుగు పెట్టింది. అక్కడంతా నిశ్శబ్దం ఆవరించింది. చరిత్ , రఘు, దివ్య, తేజస్వినిలు తమ వ్యాసాలను పద్మావతికి ఇచ్చారు.

ఆ మరుసటి రోజు పద్మావతి క్లాసులోకి వచ్చి, "నిన్న నాకందిన నాలుగు వ్యాసాలూ అద్భుతంగా ఉన్నాయి. అయితే వాటిలో రఘు, చరిత్ రాసిన వ్యాసాలు మరింత బాగున్నాయ్", అంది.

పిల్లలంతా చరిత్ వంక ఆశ్చర్యంగా చూశారు. చరిత్ ముఖం సంతోషంతో వెలిగిపోతోంది.

అది గమనించిన పద్మావతి, "నీ వ్యాసం బాగుంది చరిత్! దీన్నిబట్టి చదువు విషయంలో నీ శ్రద్ధ పెరిగిందని తెలుస్తోంది. చాలా సంతోషం. ఇకముందు కూడా ఇలాగే చక్కగా కష్టపడి చదువు", అంది.

"టీచర్! మరి మాకేదైనా బహుమతి ఇస్తారా?", పద్మావతిని కుతూహలంగా అడిగాడు చరిత్.

"నేనివ్వబోయే బహుమతి చాలా ప్రత్యేకమైనది చరిత్! నేను నిన్నూ, రఘూనీ వచ్చేవారం మన రాష్ట్రంలో జరగబోయే ఇంటర్ స్కూల్ వ్యాసరచనల పోటీకి పంపుతున్నాను. మంచి వ్యాసాలు రాసి బహుమతులు గెలిచి మన స్కూల్ పేరు నిలబెట్టండి", నవ్వుతూ చెప్పింది పద్మావతి.

అది వినగానే చరిత్ ముఖంలో అప్పటిదాకా ఉన్న నవ్వు ఉన్నట్లుండి మటుమాయమైపోయింది. కానీ, పద్మావతి చెప్పిన అవే మాటలు రఘులో వ్యాసం బాగా రాసి పోటీలో బహుమతిని సాధించాలన్న పట్టుదలను కలిగించాయి!

బడినుంచి ఇంటికి వెడుతున్నప్పుడు, "ఏంట్రా చరిత్! అంత దిగులుగా కనపడుతున్నావ్?", అంటూ చరిత్ ను పలకరించాడు రామచంద్ర.

"అదేరా! పద్మావతీ టీచర్ చెప్పిన పోటీ సంగతి ఆలోచిస్తూ ఉంటే నాకెందుకో భయంగా ఉంది", చెప్పాడు చరిత్.

"భయమెందుకూ? నువ్వు బాగా రాయగలవు. నీమీద నీకున్న నమ్మకాన్ని పోగొట్టుకోకురా. గట్టిగా ప్రయత్నించు", అన్నాడు రామచంద్ర చరిత్ ను ప్రోత్సహిస్తూ.

వారం గడిచింది. పోటీ జరుగుతున్న ప్రదేశానికి రఘు, చరిత్ లు చేరుకున్నారు. పద్మావతి వాళ్ళను దగ్గరుండి పోటీ జరగే హాల్ లో కూర్చోబెట్టింది. పోటీ పూర్తయ్యాక రఘు నేరుగా పద్మావతి దగ్గరకు వచ్చి తను వ్యాసం బాగా రాసినట్లు చెప్పాడు. చరిత్ మాత్రం పద్మావతికి దూరంనుండే తను ఇంటికి వెళ్ళిపోతున్నట్లు సైగ చేసి అక్కడినుంచి మెల్లిగా జారుకున్నాడు.

ఓరోజు పద్మావతి క్లాసులోకి వచ్చి, "పిల్లలూ! కొన్నిరోజుల క్రితం జరిగిన ఇంటర్ స్కూల్ వ్యాసరచన పోటీ ఫలితాలు వచ్చాయి. మన రఘు మొదటి బహుమతిని గెలుచుకుని మన స్కూల్ పేరును నిలబెట్టాడు", అంది సంతోషంగా.

పిల్లలంతా చప్పట్లు కొడుతూ రఘుని అభినందనలతో ముంచెత్తారు. ఆ తర్వాత పద్మావతి చరిత్ ను నిలబడమని సైగ చేసింది. చరిత్ భయం భయంగా బిత్తర చూపులు చూస్తూ నిలబడ్డాడు.

"ఏంటి చరిత్? పోటీ రోజు నీకేమైందీ? ఏమీ రాయకుండా ఉత్త తెల్ల కాగితం ఇచ్చేసి వచ్చావట కదా? పొటీ నిర్వాహకులు నాకు ఫోన్ చేసి చెప్పారు. ఎందుకలా చేశావ్?", చరిత్ ను అడిగింది పద్మావతి.

"టీచర్! మరీ… నాకు ఏం రాయాలో తెలియలేదు టీచర్. అందుకే అలా ఇచ్చాను", నీళ్ళు నములుతూ సమాధానం చెప్పాడు చరిత్.

"ఏం రాయాలో తెలియకపోవడమేమిటి చరిత్? అంతకుముందు నువ్వు రాసి నాకిచ్చిన రెండు వ్యాసాల్లోంచీ ఏదైనా ఒకటి రాయచ్చని చెప్పాను కదా! ఆ రెండు వ్యాసాలూ చాలా బాగున్నాయ్. వాటిలో కనీసం కొన్ని విషయాలైనా పోటీలో గుర్తుకురాలేదా నీకూ?”, ఆశ్చర్యంగా అడిగింది పద్మావతి.

"లేదు టీచర్!", తలదించి సమాధానం ఇచ్చాడు చరిత్.

“నాకు ఇప్పుడు అనుమానం వస్తోంది చరిత్. ఇంతకీ ఆ వ్యాసాలు నువ్వే రాశావా?", కోపంగా అడిగింది పద్మావతి.

"అవీ... అవీ… నేనే రాశాను టీచర్. కానీ దానికోసం కొత్త తెలివిని ఉపయోగించాను”, అన్నాడు చరిత్ గొణుగుతున్నట్లు.

పిల్లలంతా ముసిముసి నవ్వులు నవ్వారు.

"ఏంటీ?? కొత్త తెలివా? సరిగ్గా చెప్పు చరిత్. నిజం చెప్పకపోతే ఊరుకునేది లేదు!", బెదిరించింది పద్మావతి.

“టీచర్! ప్లీజ్… కోప్పడకండి. నిజం చెప్పేస్తాను. వ్యాసాలు రాయడానికి మా నాన్న ల్యాప్ టాప్ లో కృత్రిమ మేధ (AI) ను వాడాను. మరి పోటీల్లో నాదగ్గర ల్యాప్ టాప్ కానీ ఇంటెర్నెట్ కనెక్షన్ కానీ లేవు కదా. అందుకే అక్కడ వ్యాసం రాయలేకపోయాను టీచర్", మెల్లిగా అసలు విషయం బయట పెట్టాడు చరిత్.

"ఓ! కృత్రిమ మేధను వాడటమా నీ కొత్త తెలివి!!", ఆశ్చర్యపోతూ అంది పద్మావతి.

పిల్లలంతా ఒక్కసారిగా పగలబడి నవ్వారు. అవమానంతో చరిత్ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయ్.

"సైలెన్స్!", గంభీరంగా అంది పద్మావతి. పిల్లలంతా నిశ్శబ్దంగా ఉండిపోయారు.

"ప్చ్! తెలిసో తెలియకో నువ్వు చేసిన పనివల్ల మరొకరికి పోటీలో పాల్గొనే అవకాశం పోయింది చరిత్. విజయానికి దగ్గరదార్లు ఉండవు. నిజంగా కష్టపడేవాళ్ళకే విజయం దక్కుతుందని ఇప్పటికైనా అర్థం చేసుకో. ఆధునిక సాంకేతికతను ఎంతవరకూ ఉపయోగించుకోవాలో అంతవరకే ఉపయోగించుకోవాలి. పూర్తిగా సాంకేతికతమీద ఆధారపడిపోయి మన మేధాశక్తిని వాడకుండా పక్కనపెట్టేస్తే మనం ఎందుకూ పనికిరానివాళ్ళమైపోయే ప్రమాదం ఉంది! నువ్వు కూడా రఘులాగా వ్యాసానికి కావలసిన సమాచారాన్ని అర్థంచేసుకుంటూ సేకరించి ఉంటే అది నీకెప్పటికీ గుర్తుండిపోయేది. ఇవాళ నువ్వూ విజేతల్లో ఒకడిగా నిలబడేవాడివి", అంది పద్మావతి.

"అవును టీచర్! ఇంకెప్పుడూ ఇలాంటి పనులు చెయ్యను", కన్నీళ్ళతో అన్నాడు చరిత్.

ఈ సంఘటన చరిత్ లో మంచి మార్పే తీసుకొచ్చింది. చరిత్ కి నిజంగానే చదువుపై శ్రద్ధ పెరిగింది. కష్టపడి మనసుపెట్టి చదివి ఆ ఏడు జరిగిన పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకుని పద్మావతి చేత 'భేష్' అని అనిపించుకున్నాడు చరిత్.

********

Posted in May 2026, కథలు

1 Comment

  1. Ch. నారాయణరావు

    కృత్రిమ మేధ నాశనం చేస్తుంది మనిషిని

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *