[చిత్రము 7]

ఇందులో దమయంతి నలమహారాజుకి ప్రేమసందేశాన్ని హంసద్వారా పంపడం కనిపిస్తుంది. రాచరికపు స్త్రీలు ధరించే ఆభరణాలు, కట్టు బొట్టు, ప్రేమపూరితముఖకవళికలు, హంసమెడ లోని వంపు, కళ్ళలోని ధ్యాస చాలా ముఖ్యం. అతిథి మర్యాదను నిలబెట్టే చల్లని నీడగల అరుగుమీద తామరాకు ఆసనం ఔచిత్యానికి ప్రతీక.
వరండాలోని విల్లులా వంపు ఉన్న కట్టడము, స్తంభము, లాగి కట్టబడి ఉన్న తెర, రాచభవనపు రాజసాన్ని ప్రదర్శిస్తాయి. ఆకాశంలో మేఘాలు భవనము బయట వైపు ఉన్న ప్రదేశంలో దూత అయిన హంస రాకకు అనువైన సొంత స్థావరాన్ని సుందరంగా సూచిస్తాయి.
ఇంకొక విశేషం – ఈ కళాఖండమును డెకొలాంలో కాక ప్లైవుడ్ లో కష్టమైన సూక్ష్మవివరాలతో రూపొందించడం.
రచయిత పరిచయం:
అపురూపకళాస్రష్ట – అయ్యగారి సూర్యనారాయణమూర్తి
శ్రీ అయ్యగారి సూర్యనారాయణమూర్తి బహుముఖప్రజ్ఞాశాలి. వీరు కీ.శే. శ్రీ సీతారామమూర్తి, శ్రీమతి రాజ్యలక్ష్మిగార్ల కనిష్ఠపుత్రులు.
మూర్తిగారు విద్యాభ్యాసం మొదలుపెట్టి నప్పటినుండి సరస్వతీమాత కటాక్షానికి పాత్రులై, చదువులలో అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించి ఎన్నో పతకాలను కైవసం చేసికొన్నారు. మెకానికల్ ఇంజనీరింగ్ లో ఆంధ్రవిశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల, విశాఖపట్టణము నుండి పట్టభద్రులయ్యారు. ఆ రోజుల్లో ఐదేళ్లపాటు సాగిన ఇంజనీరింగ్ విద్యాభ్యాసంలో, విశాఖపట్టణము మరియు కాకినాడ ఇంజనీరింగ్ కళాశాలల అన్ని విభాగాలలోని విద్యార్ధులందరిలో, ఐదేళ్లలో వ్రాసిన టెక్నికెల్ మరియు నాన్ టెక్నికల్ పాఠ్యాంశాల పరీక్షలన్నింటి మొత్తములో అత్యధికమైన మార్కులు సాధించి శ్రీవేపాకృష్ణమూర్తి గోల్డ్ మెడల్ ను పొందిన ఆదర్శవిద్యార్థిగా వీరు నిలిచేరు. ఆ తర్వాత, మూర్తిగారు ఇంజనీరింగ్ పరిశ్రమలలో కొన్ని సంవత్సరాలు విశేషానుభవం గడించి ఐఐఎమ్, అహ్మదాబాద్ లో మేనేజ్మెంట్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేరు.
వృత్తిరీత్యా, మూర్తిగారు ఇంజనీరింగ్ మరియు మేనేజ్మెంట్ రంగాలలో పలుసంస్థలలో సృజనాత్మకతకు పెట్టింది పేరయి ఉన్నతపదవులలో అరుదైన మన్ననలు పొందేరు.
ప్రవృత్తిరీత్యా, వీరు చేయి తిరిగిన ఛందోబద్ధసుకవి, కళాకారులు. ‘సిరిమల్లె’ పాఠకులకు మూర్తిగారి ఉత్తమకవిత్వపటుత్వము గతపదివసంతాలుగా సుపరిచితమే. ఈ సంచికలో ముర్తిగారిలో ఉన్న విశేషకళాకారుణ్ణి పరిచయం చేయడానికి చాలా సంతోషిస్తున్నాము.
మూర్తిగారు ‘ఫ్రెట్ వర్క్’ అనే హస్తకళలో బాల్యం నుండే ఎంతో నైపుణ్యం ప్రదర్శించిన దిట్ట. వీరి కళ గురించి, అందులో వీరు సృష్టించిన కళాఖండాల గురించి గతంలో మాటీవీ, ఈటీవీ మరియు భారత్ టుడే ఛానెళ్ళలో ప్రసార మయ్యింది. మన ‘సిరిమల్లె’ పాఠకులందరికీ ఈ కళావిశేషాలు తెలియజేయడంకోసం ప్రత్యేకంగా ఒక ధారావాహికను ఈ అంగ్ల నూతన సంవత్సర సంచికతో ప్రారంభిస్తున్నాము.