తెలుగు గడ్డపై స్త్రీల రచనలు, కవయిత్రులు అన్న విషయం గూర్చి ముందుగా ఆరుద్ర గారి మాటలు మనం గ్రహించాలి.
“ఎప్పుడో ఇక్ష్వాకుల కాలానికి ముందు హాల శాతవాహనుడు పాలించే రోజులలో మన తెనుగు గడ్డమీద మగవాడితో సమానంగా మహిళ కూడా కవిత్వం చెప్పిన సాక్ష్యాలు దొరుకుతాయి గాని, ఆనాటి నుండి రెడ్డిరాజుల యుగం దాకా కమ్మని రచనలు చేసిన ఆడవాళ్ళ పేర్లైనా మనకు లభించవు. గాధాసప్తశతి ని సుసంపన్నం చేసిన సౌభాగ్యవతుల పేర్లు చెప్పుకొని ఆ తర్వాత మొట్టమొదటి తెనుగు రచయిత్రి కావ్యాన్ని గూర్చి చదువుకొందాం.” ఆరుద్ర మాటలు అక్షర సత్యాలు. తెలుగు సాహిత్యంలో పురుషాధిక్యత కొనసాగి ఆడవారి స్థానం మోహనాంగి చెప్పినట్లు వంట ఇంటికే పరిమితం.
ఆరుద్ర వివరణ ఇచ్చిన ఆ రచయిత్రుల – కవయిత్రుల పేర్లు; అణులచ్చి, సహాయ, మాధవి, రేవా మొదలైన వారు వ్రాసిన 14 గాథలు లభించాయి. పదిమంది పేర్లు వారు వ్రాసిన గాథలు (14) మనకు అన్నీ దొరికాయి అన్న ఆరుద్ర ఇది చాలా సంతోషకరమైన విషయమని చెబుతూ ఇలా వివరించారు.
“ఈ గాథలను చదివినప్పుడు మనకు స్త్రీ హృదయం సాక్షాత్కరిస్తుంది. అంతరాంతరాలలో ఆడది ఎలా భాసిస్తుందో ఆడదే వ్రాయగలదు గాని మగవాడు ఎంత ఊహించినా అది ఊహాగానమే అవుతుంది” అని వివరిస్తూ ఆనాటి స్త్రీ రచనలను గూర్చి, అందులోని రచనోశ్యము, స్త్రీ పురుషుల మధ్య భేదము మొదలైన వాటిని గూర్చి క్లుప్తంగా చర్చించారు ఆరుద్ర.
ఆనాటి మహిళల కవిత్వ మహిమ అనుభవించాలంటే ఒకటి రెండు కవితలను మనం రుచి చూస్తే తెలుస్తుంది ఆ కవితా మాధుర్యం. భార్యాభర్తల బంధం గూర్చి, స్త్రీల ప్రేమతత్వం గురించి చెప్పి ఆనాటి రచయిత్రుల భావనా పటిమ గూర్చి ఆరుద్ర వివరించారు.
‘మగువ ఒక చేత్తో నొప్పించినా మరో చేత్తో కౌగలించుకుంటుంది, ఆమె చూపులకు హృదయాలు, వీపులకు కళ్ళు ఉంటాయి. రవి కాంచనిది కవి కాంచునని అన్నా కవి కాంచలేనిది కాంత కాంచగలదు, కాంత మాత్రమె చూడగలదు’ అంటూ గాధాసప్తశతి లో రేవాదేవి అనే కవయిత్రి చెప్పిన గాథ గూర్చి ఆరుద్ర వివరించారు.
అలిగి పెడమోము పెట్టి నీ వరుగుచున్న -గాని మానిని వెనువెంట గదలివచ్చు
మగని ప్రక్క నె యున్నదిమనసటంచు – పులకరించిన నీవీపె తెలుపు మాకు. [గ.స. సారము, 1-87 (66)]
అవును మగవాడు ఎటువంటి వాడైనా సరే మగువ మనసు ప్రేమించినవాడిని పెనవేసుకుని వదిలిపెట్టదు. అతడు మొరడైనా, నరుడే చూడండి ‘నసిప్పహా’ దేవి ఏమంటుందో
నిలువగా రాని వలపు బందెమున దగిలి
అతడు వాయించి నట్లెల్ల నాడుచుందు;
మ్రాను సాజంపు మ్రోడైన గాని, చెలియ
చొక్కి పెనగదె యద్దాని చుట్టు దీగ [గ.స. సారము, 4-4 (237)]
‘మగవాడు ఎలా చెబితే అలా బ్రతకడమే స్త్రీ కి తెలుసు. అతనిలో ప్రేమ అనే పచ్చదనం లేకపోయినా స్త్రీ మోడువారిన వృక్షాన్ని పట్టుకొని తానూ అల్లుకొనిపోయినట్లు జీవిస్తుంది’ అంటూ స్త్రీ యొక్క మనస్తత్వాన్ని, పరిస్థితిని, ఆమె యొక్క ధ్యేయాన్ని పై కవితలో కవయిత్రి చక్కగా చిత్రించింది. అలాగే దంపతుల ప్రేమ యొక్క పెంపును గూర్చి నాగమల్లె తీగె, నవమల్లి తీగె మ్రానుకు పెనవేసుకొన్నట్లు అని చెప్పడం గొప్ప భావుకత.
ఆ విధంగా స్త్రీ, పురుషుని ఎన్నటికీ విడిచిపోదు. అంటూ గాధాసప్తశతి లోని స్త్రీలు రచించిన గాథలలోని సారాంశం చూస్తే స్త్రీ పురుషుల మనస్తత్వాలు అప్పటినుండి ఇప్పటి వరకు ఒక్కటిగానే ఉన్నాయనిపిస్తుంది.
ఆరుద్ర గారికి ఉన్న గుణం, ఒక విషయానికి సంపూర్ణత్వం కలిగించడం, దానికని సాహిత్య చరిత్ర తో పాటు దేశ రాజుల చరిత్ర కూడా వివరించడం. ఆరుద్ర పెట్టుకొన్న ఈ నియమం ప్రకారమే గాధాసప్తశతి లోని స్త్రీల రచనలు కూడా కొంత పరిశీలించి వివరించడం జరిగింది.
తాళ్ళపాక తిమ్మక్క
తాళ్ళపాక తిమ్మక్క కు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఈమె పదకవితా పితామహుడని పేరుగాంచిన తాళ్ళపాక అన్నమయ్యకు మొదటి భార్య. ఈమె తెలుగు భాషలో కావ్యం వ్రాసిన తొలి కవయిత్రి. ఈ తిమ్మక్క వ్రాసిన కావ్యం సుభద్రా పరిణయము. ఈ ప్రాధాన్యతను, ఈమె కాలాన్ని గూర్చిన వివరాల విషయంలో వేటూరి ప్రభాకర శాస్త్రి గారు చెప్పిన దానిని గూర్చి కొందరు సాహితీ వేత్తలు అభ్యంతరం చెబుతున్నారు అని ఆరుద్ర తెల్పారు. సాహితీ వేత్తలు చెబుతున్నది ఏమిటంటే ‘తిమ్మక్క ఆర్వాచీనురాలు’. ఆ చర్చను తరువాత చూద్దాం. ముందు తిమ్మక్క కావ్యాన్ని పరిశీలిద్దాం అంటూ ఆరుద్ర దానిని ప్రారంభిచారు.
తిమ్మక్క సుభద్ర కల్యాణానికి ఆధారం నన్నయ భారతమే. ఆదిపర్వం అష్టమాశ్వాసం లో నన్నయ 136 గద్యపద్యాలతో (ఆది – 8-89 నుండి 223 వరకు) విజయ విలాసం రచించాడు. అదేమాదిరి తిమ్మక్క 1163 పాదాలతో ద్విపద కావ్యం వ్రాసింది.
తిమ్మక్క తన రచనను కావ్యం అని చెప్పలేదని అది పాట అని మాత్రమె చెప్పుకొన్నారని ఆరుద్ర తెలిపారు. అయితే కడు మంచి తేట పలుకులతో చెప్పినట్లు తెల్సింది. కొన్నిచోట్ల నన్నయను గాక స్వతంత్రంగా వ్రాసి పాటలకు ప్రాణం పోసింది అన్నారు ఆరుద్ర. నన్నయ గారి వలె తిమ్మక్క కూడా ప్రాంతీయాభిమానం చూపింది.
నన్నయ కూడా మూలంలోని అర్జునుని తీర్థయాత్రా ప్రయాణ స్థలాలను మార్చాడు. మహేంద్ర పర్వతం చూచి, సముద్ర తీరం వెంబడే మణులూరు పురానికి చేరినట్లు ఉన్న దానిని నన్నయ గారు మార్చి తన వేంగీదేశానికి వచ్చినట్లు అర్జునునికి తన స్వస్థలాన్ని చూపించాడని ఆరుద్ర తెల్పారు. తిమ్మక్క కూడా మార్పు చేసింది.
ఈ విషయాన్ని గూర్చి ఆరుద్ర గారి వ్యవహారిక భాష, సంభాషణా చతురత చూడాల్సిందే.
“ఈ విషయంలో నన్నయ గారు టూరిస్ట్ గైడ్ గా మారి అర్జునునికి సగర్వంగా వేంగీ దేశాన్ని చూపించాడు. ఆయన ఈ మాత్రం లైసెన్స్ తీసుకొన్నాడు కనుక అర్జునుని పాస్పోర్ట్ లో మరికొన్ని తీర్థాలు లిఖించినా తప్పులేదని తాళ్ళపాక తిమ్మక్క అర్జునుని రెక్కపట్టుకొని ఆపి తిరుపతి వేంకటేశ్వరునికి మ్రొక్కించింది చూడండి” అంటూ చలోక్తులతో ఆరుద్ర అర్జునుని తిరుపతి యాత్ర గురించి వివరించారు.
తిమ్మక్క దృష్టిలో అర్జునుడు వరుసగా చూచినా క్షేత్రాలు (దక్షిణాన) ‘అమర నహోబిళం – బా వెంకటాద్రి నాపై కంచి – వరదుల గొలిచె’
తిమ్మక్క చేసిన ఈ మార్పులను గూర్చి చెబుతూ ఆరుద్ర ఇలా అన్నారు. “ఈ అతిక్రమణకు ఒరవడి పెట్టినది నన్నయ గారే కదా. ఆయన వేలు చూపిన చోట ఈమె మండ అందుకున్నది.”
ఈ విధంగా తిమ్మక్క అర్జునునికి తిరుపతి మొదలైన ప్రదేశాలు చూపించిన తరువాత అర్జునుడు ఏం చేసాడో ఆరుద్ర మాటలలోనే విందాం.
“…తీర్థయాత్రలు చేస్తూ వీలైన చోట్లలో వివాహాలాడుతూ అర్జునుడు ద్వారక ప్రాంతాలకొచ్చాడు. వచ్చీరాగానే వావికుదిరిన పెళ్లీడు పిల్ల ఈ ఊళ్ళో ఉందని జ్ఞాపకమొచ్చింది. యాదవులు యతులను పూజిస్తారని కపటయతి వేషం వేసుకొని ఊరవతల నిలబడి కృష్ణుని తలచుకొన్నాడు…” అని అన్నారు ఆరుద్ర.
ఇక అక్కడ కృష్ణుని తలచుకొన్న అర్జునునికి కృష్ణ సాక్షాత్కారమయింది. ప్రభాస తీర్ధం దగ్గర కృష్ణుడు అర్జునుని కలుసుకోవడం, నమస్కరించడం అయిన తరువాత ‘నేను ద్వాదశ మాసక వ్రతం చేస్తున్నాను నీ దర్శనం వల్ల నాకు పాపాలు పోయాయి’ అని అర్జునుడు అన్నప్పుడు నన్నయ కృష్ణుని నోట పలికించిన దానికి, తిమ్మక్క ఆ ఘట్టంలో రాసిన దానికి గల వ్యత్యాసాన్ని ఆరుద్ర చూపెట్టారు.
నన్నయ –
“అనిన విని నగచు నబ్జనాభుండర్జును నతిస్నేహంబునం గౌగలించుకొని యెల్లవారల కుశలంబును నడిగి యాతని తీర్ధాభిగమన నిమిత్తంబును సుభద్రయందు బద్ధానురాగుండగుటయు నుపలక్షించి ద్వారకాపురంబునకు దోడ్కొని యరిగె”
ఈ సందర్భంగా నన్నయ ‘నగచు’ అనే పదం మాత్రమె వాడారని ఆరుద్ర తెల్పుతూ, తిమ్మక్క ఈ సందర్భంగా రచించిన దానిని తెల్పారు. అది-
“అత్తరి శౌరిసర్వాత్మకుడగుట – అంత నా నరుని తలం పంతయు దెలిసి
యొక్కరుం డేతెంచె నొనర నచ్చటికి – నరుడు నచ్చెరువొంది నారాయణునకు
సరుగున ప్రణమిల్లి సద్భక్తి మొక్కి – వనమాలి కెదురుగా వచ్చి యర్జునుడు
దండప్రణామమ్ము తగ నాచరించె – నారాయణా యనుచు నవ్వుచు నరుడు
కరముబట్టుక వాని కడు లేవనెత్తె – హరియునవ్వుచు బల్కె నర్జును జూచి
నిన్ననేసుతులగని నెరతనమ్మునను – యింతలో సన్యాసి వెట్లయితి వయ్య
యెరుగుదుము మీవిద్యలెల్లను మేము – గరిమ వేసాలల్ల గ్రాసాలకొరకె
అని గెలిసేయుచు నతని దోకొనుచు – చనుదెంచె రైవతశైలమ్ముకడకు
అచట నర్జునునుంచి హరియు నంతటను – నడనడచి ద్వారకానగరి కేతెంచె (సుభద్ర పుట 13)
తిమ్మక్క నన్నయ్య వ్రాయని పరిహాస వాక్యాలను కూడా ఇక్కడ వ్రాసింది. కానీ ఎక్కడా నన్నయ్య వాక్యాలను అనుకరించలేదు. ఇలాగే మరికొన్ని ఘట్టాలను తీసుకొని నన్నయ గారికి, తిమ్మక్క కు మధ్య గల భేదాలు, మార్పులను ఆరుద్ర పరిశీలనాత్మకంగా చర్చించి మనకందించారు. వాటిని వచ్చే సంచికలో చూద్దాము.