Menu Close
Ghali-Lalitha-Pravallika
కథ మొదలు మాది - ముగింపు మీది
ఘాలి లలిత ప్రవల్లిక

గత సంచిక తరువాయి... చివరి భాగం »

30. అమర జ్యోతి

అంశం :: కథ మొదలు మాది - ముగింపు మీది శీర్షిక: మళ్ళీ చిగురించనీ..

"నీ నిర్ణయం మాకు నచ్చింది శ్యామలా నీవు పడ్డ కష్టాలన్నీ మాకు తెలుసు. చిన్న నాటి స్నేహితులుగా, నీ కన్నీళ్ళను తుడిచి ఓదార్చామే కానీ నీకు జీవితంలో అవసరమైన తోడు కాలేకపోయాము. ఇప్పటికైనా మంచి నిర్ణయమే తీసుకున్నావు. సమాజం నుంచి విమర్శా బాణాలు విని వెనుతిరగవు కదా!" అన్నారు మహేశ్వరి, ఇందిర, రామలక్ష్మి.

"ఎప్పటికీ కాను" ధృఢ నిశ్చయంగా శ్యామల స్వరం వినబడింది.

"ఇప్పుడు సంతోషంగా ఉంది. పిల్లలతో మళ్ళీ మాట్లాడతావా?” అడిగారు.

"లేదు. అన్నీ అయ్యాకే చెప్తున్నాను. వాళ్ళకు చేయాల్సిందీ, చెప్పాల్సిందీ ఏమీలేదు. ఆ అవకాశం ఇస్తే వాళ్ళకు సాయం చేసుకుంటూ. ..ప్రేమగా చూసుకుంటూ.. మిగిలిన జీవితం గడిపేదాన్ని. దూరంగా నెట్టి ఆ అదృష్టాన్ని కోల్పోయారు."

"మాకు తెలుసు శ్యామ్. నువ్వొద్దులే మేమొకసారి మాట్లాడుతాం." అంది లక్ష్మి చేయి పట్టుకుని.

"ఇంతకీ వరుడిని ఎక్కడ వెతకమంటావు? ఏ వివాహవేదికలో?”

"రచయిత్రికి మన అవసరం ఉంటుందా?” అంది ఇందిర.

"ఆ అవసరం లేదు. నిజానికి నాకు ప్రాణప్రదమైన సాహిత్యం చదువుకుంటూ..గడిపేయగలను. ఆ పని తోడుతో, హాయిగా, ప్రశాంతతతో చేయాలనుంది. ఇన్నాళ్ళూ దక్కని సమయం దక్కింది. కానీ నా అభిమాన రచయిత భార్యను కోల్పోయినా కూడా పిల్లల దగ్గర విదేశాలలో ఉండి వస్తున్నారు. వాళ్ళు అక్కడే సెటిలైపోయారు.

పిల్లల చదువుల రీత్యా ఇక రెండేళ్ళకోసారి కూడా రాలేమని తెగేసి చెప్పేసారు. శాశ్వతంగా వాళ్ళ దగ్గర ఉండేలా అన్నీ సెటిల్ చేసుకు రమ్మంటున్నారట. అతనికి ఈ డెబ్భై ఏళ్ళ వయసు లో ప్రశాంతంగా ఇక్కడనే ఉండాలని ఉందట.

ఆఖరి శ్వాస వరకూ పూర్తి స్థాయిలో సాహిత్యంలో ఆశించిన, ఆలోచనల్లో మిగిలిపోయిన రచనలు చేయాలని ఆశ పడుతున్నారు. దానికి అలాంటి ఆసక్తి ఉన్న వారు చేయూతగా నిలిస్తే, తోడుగా వెన్నంటే ఉంటే, అనుకున్నది సాధించగలననే నమ్మకంతో ఉన్నారు.

ఆ ఆశయం, ఆదర్శాలకు నేనయితే వందశాతం న్యాయం చేయగలననే నమ్మకం వారికుంది. కొన్ని సంవత్సరాలుగా లేఖల ద్వారా ఓ అభిమానిగా నా అంతరంగం వారికి తెలుసు. మా పరిస్థితుల నేపథ్యంలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. నా సమ్మతం తెలియచేసాను. ఆశయాలు, ఆదర్శాలు ఏమన్నా, ఆడ మగ కలిసుండాలంటే ఈ సమాజంలో పెళ్ళి కావాలి. అందుకే మన స్నేహితుల సమక్షంలో దండలు మార్చుకుంటాము. వారి ఇంట్లో కలిసి ఉంటాము. వారి పిల్లలకు ఏ అభ్యంతరమూ లేదుట. ఇది జరిగింది" వారి వైపు చూస్తూ చెప్పింది శ్యామల.

"చాలా సంతోషం. తరవాత జరగాల్సినవి మన చిన్ననాటి స్నేహితులందరి సమక్షంలో" అంటూ ఆనందంగా శ్యామలను చుట్టేశారు ప్రేమగా...

*****

31. బుద్ధవరపు కామేశ్వరరావు

అంశం :: కథ మొదలు మాది - ముగింపు మీది శీర్షిక: గయ్యాళి అత్త

ఆరుపదుల వసంతాలు చూసిన శ్యామలమ్మకు, ఒంటరితనం కొత్తేమీకాదు. కానీ ఈ మధ్య కాలంలో... 'తాను ఒంటరి' అనే ఫీలింగ్ పవర్ఆఫ్ పట్టా పుచ్చుకొని గుండె సింహాసనం మీద, తిష్ట వేసుకుని కూర్చుంది. 'ఇన్నాళ్లు లేని ఫీలింగ్ ఇప్పుడు ఎందుకు వచ్చింది?' అని పదే పదే తన మనసునుప్రశ్నించుకుంది. అది...

'అప్పుడు బాధ్యతలు తోడుగా ఉండేవి. ఇప్పుడు అవి తీరిపోయాయి. వీటితో పాటుగా అనారోగ్యం శరీరంలోకి ఎంట్రీ ఇచ్చేసింది. మరి ఇప్పుడేగా! ఇంట్లో నాకు ఉన్న విలువ నాకు తెలిసేది. మరి ఇంత సింపుల్ లాజిక్ ఎలా మిస్ అయ్యాను!?!' అని తనకు తాను జవాబు చెప్పుకొంది.

కంటికొలకుల్లో దాగిన రెండు కన్నీటిబొట్లు ఆమె బుగ్గలపై కి ప్రాకాయి. గతం ఆమె కళ్ళ ముందు మెదిలింది.

***

పెళ్లయిన నాలుగేళ్లకే ఇద్దరు పిల్లల్ని ఒళ్ళోపెట్టి పరారు అయిపోయాడు శ్యామలమ్మ మొగుడు పరాంకుశం.

"నా కొడుకును వీధులపాలు చేసిన నీవు మాఇంటికి ఏమొహం పొట్టుకొని వస్తావు? నువ్వూ, నీ పిల్లలూ కట్ట కట్టుకొని ఏచావన్నా చావండి. మాకు మీకు ఎటువంటి సంబంధం లేదు," అని తెగేసి చెప్పేసి, ఆమెను... ఆమె పిల్లల్ని ఇంట్లోకి రానీయకుండా తలుపు మొహం మీదే వేసేసారు ఆమె అత్తింటి వారు.

పుట్టింటికి వెళ్ళటం ఇష్టం లేని శ్యామలమ్మ. ఒక కాన్వెంటు లో టీచర్గా జాయిన్ అయ్యి, తిని తినక ఎన్నో కష్టాలు పడి పిల్లల్ని ప్రయోజకుల్ని చేసింద. ఇప్పుడు పిల్లలు ఇద్దరికీ పెళ్లిళ్లు అయిపోయాయి. ఎవరి సంసారాలు వాళ్ళవి.

***

కళ్ళ నీళ్లు తుడుచుకుంది. మనసులో ఒక గట్టి నిర్ణయం తీసుకుంది. ఆ ప్రయత్నంలో సఫలీకృతురాలు అయ్యింది. తన నిర్ణయం కొడుకూ, కోడలికి చెప్పింది. నీ ఇష్టం అన్నాడు కొడుకు. మీ ఆనందమే మా ఆనందం అని చెప్పి తప్పుకుంది కోడలు. కూతురుతో ఈ మాటే చెబితే... జవాబు చెప్పకుండా, ఫోన్ కట్ చేసేసింది. చుట్టుపక్కల వాళ్ళు, "ఈ వయసులో ఈవిడకు ఇదేం పోయేకాలం," అని అన్నారు.

******

"నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఈ చుట్టుపక్కల వాళ్ళు ఎవరూ నాకు కనీసం మాట సహాయం కూడా చేయలేదు. వీళ్ల మాటలు నేను పట్టించుకోనవసరం లేదు. ఇక నా పిల్లలు అంటావా? ఈరోజు కాకపోతే రేపైనా నేను తీసుకున్న నిర్ణయం సరైనదే అని నన్ను వెతుక్కుంటూ వస్తారు. ఇక 'ఐడిల్ బ్రెయిన్ ఈజ్ ది డెవిల్స్ వర్క్ షాప్' అన్నాడు ఓ ఆంగ్ల కవి. అందుకే ఈ వంటరి తనం పోవాలంటే నేను ఏదో వ్యాపకం కల్పించుకోవాలి..." ఇలా పరి పరి విధాల మరోసారి ఆలోచించి, ఓ కృత నిశ్చయానికి వచ్చి, శశాంక్ కు ఫోన్ చేసింది శ్యామలమ్మ.

******

కాలచక్ర వేగానికి ఓ మూడు మాసాలు హడావుడిగా గడిచిపోయాయి. ఆ రోజు రాత్రి హాలులో కూర్చుని టిఫిన్ తింటున్న శ్యామలమ్మ అల్లుడు,

"ఏమేవ్! అర్జంటుగా రా. మీ అమ్మ వచ్చింది" గట్టిగా అరుస్తూ వంటింట్లో ఉన్న తన భార్యకు చెప్పాడు. వెంటనే చీర కొంగుతో చేతులు తుడుచుకుంటూ హడావుడిగా వచ్చి,

"అమ్మా! నువ్వేనా? ఏమిటి ఈ వేషం?" అంటూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది.

******

కాసేపటి తరువాత తన గదిలో కూర్చుని పేపర్ చదువుతున్నాడు శ్యామలమ్మ కొడుకు.

"ఏవండీ! త్వరగా రండి. మీ అమ్మగారు వచ్చారు చూడండి" భర్తకు వినపడేలా గట్టిగా అరిచింది శ్యామలమ్మ కోడలు. వెంటనే పేపర్ పక్కున పడేసి కంగారుగా బయటకు వచ్చి,

"అమ్మా! నువ్వేనా? ఏమిటి ఈ అవతారం?" అంటూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు.

******

సరిగ్గా అదే సమయానికి తను ఇంట్లో వాలు కుర్చీలో ప్రశాంతంగా కూర్చుని ఉప్మా తింటూ, టీవీ లో వస్తున్న తను ప్రధాన పాత్రలో నటించిన తెలుగు ధారావాహిక గయ్యాళి అత్త మొదటి భాగం చూస్తోంది శ్యామలమ్మ.

"ఈ పాత్ర వేసింది అసలు నేనేనా? ఎప్పుడూ నవ్వుతూ ప్రశాంతంగా ఉండే నేను ఇంత గయ్యాళిగా నటించాను అంటే అది తప్పకుండా శశాంక్ గొప్ప తనమే" అనుకుంటా టీవీ చూస్తున్న ఆమెకు మూడు నెలల క్రితం జరిగిన ఓ సంఘటన జ్ఞాపకం వచ్చింది.

******

"ఈ ఒంటరితనం భరించడం ఎలా? ముఖ్యంగా నాకు ఏదైనా ఓ వ్యాపకం కావాలి. అప్పుడే తన మనసుకు ప్రశాంతత. కానీ ఈ వయసులో నేను ఎలాంటి పనులు చేయగలను.." ఇలా ఆలోచిస్తూ ఉండి పోయిన శ్యామలమ్మ కు ఎవరో తలుపు కొడుతున్న చప్పుడు వినిపించింది. వెంటనే లేచి తలుపు తీయగానే ఓ ముప్పై ఐదేళ్ళ వ్యక్తి లోపలికి వచ్చి, ఆమె కాళ్లకు నమస్కరించి "టీచర్! నేను జ్ఞాపకం ఉన్నానా? చిన్నప్పుడు మీరు పని చేసిన కాన్వెంట్ లో చదువుకున్నాను. నేను సరిగ్గా చదవకపోతే 'నీకు చదువెందుకురా? ఎక్కడైనా నాటకాలు వేసుకొని బతకరా?' అని కోపంగా కేకలేసేవారు....." చెబుతున్న అతడిని గుర్తు పట్టి,

"ఓ... జ్ఞాపకం వచ్చింది ఆ రోజుల్లో కాన్వెంట్ వార్షికోత్సవం సందర్భంగా తారాశశాంకం నాటకంలో శశాంకుడు పాత్ర వేసిన శశాంక్ కదూ? ఇప్పుడు ఏం చేస్తున్నావు బాబూ?"

"ఆనాటి మీ దీవెనలు ఫలించి టీవీ సీరియల్స్ డైరెక్ట్ చేస్తున్నానమ్మా. మొన్న ఆ కాన్వెంట్ వార్షికోత్సవానికి నన్ను చీఫ్ గెస్ట్ గా పిలిచారమ్మా. ఆ సందర్భంలో తెలిసింది మీరు ఇక్కడ ఉన్నారని. ప్రస్తుతం నేను గయ్యాళి అత్త అనే ఓ మూడు వందల భాగాలతో ఓ టీవీ ధారావాహిక తీస్తున్నాను. అందులో అత్త పాత్రకు మిమ్మల్ని అడుగుదామని వచ్చాను"

"నేనా? నాకు అసలు నాటకాల అనుభవం లేదు. దానికి తోడు గయ్యాళి అంటున్నావు. అసలు నాలో ఏం చూసి ఇలా అడుగుతున్నావు?"

"టీచర్! ఆ రోజుల్లో నన్ను మీరు కోపంగా తిడుతున్నప్పుడు మీ మొహంలో కనిపించిన ఆ హావభావాలు నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉన్నాయి. నటన గురించి మీరు ఆలోచించకండి. ఆ పాత్రలో మిమ్మల్ని తప్ప వేరే వారిని ఊహించుకోలేక పోతున్నాను. నేను అన్నీ చూసుకుంటాను. కాదనకండి. రేపు ఉదయం కారు పంపుతాను. స్టూడియో కి వచ్చేయండి..." అంటూ కాళ్లకు దణ్ణం పెట్టి, పదివేలు ఉన్న ఓ కవర్ బల్ల మీద పెట్టి, హడావుడిగా వెళ్లి పోయాడు శశాంక్.

******

శశాంక్ ఆలోచనలతో మునిగి పోయిన శ్యామలమ్మకు ఎవరో తలుపు కొడుతున్న శబ్దం విని తలుపు తీయగానే

"అభినందనలు గయ్యాళి అత్త అమ్మ గారు. ఆ పాత్రలో మీరు జీవించారు" అంటూ పూలమాలలతో వచ్చిన కుటుంబ సభ్యులను, ఇరుగు పొరుగు వారిని చూసి గర్వంతో పొంగి పోయింది శ్యామలమ్మ.

****శుభం****

Posted in May 2026, కథలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *