Menu Close

కదంబం - సాహిత్యకుసుమం

నా నాయుడు బావా
– కొడుపుగంటి సుజాత –

ఏడా ఉంటివో నా నాయుడు బావ
నీ ఎంకిని మరిసేవో నా నాయుడు బావ
సంతలోన తాళి కొనుకొస్తానని
ఎనకెనుక సూస్తు కొంటె సైగలు సేస్తు
బేగి వస్తానని మరిలిపోతివి..
పగలు రేతిరీలు గడిసిపోయే
నీ సడే లేకపాయే నా మావ
నా నాయుడు బావ

ఏటిలోన నేను తానమాడుతుంటే
నక్కినక్కి వచ్చి నడుము మీద చెయ్యేసి
పిడికడైన లేదే ఎంకి నీనడుమంటు నొక్కినొక్కి
నువ్వు ముద్దాడిన ఊసు నేనెట్టా మరిసేది
నా నాయుడు బావా

ఏదేవుడిచ్చాడే నీకీ అందమంటు
పెదాలపై ముద్దుల ముద్దరలేసి
నీ చేతుల్లో నను బందీ సేసిన
ఆ కమ్మని ముచ్చట్లు చెవిలోన
గుసగుసలు సెపుతుంటే కళ్లముందు
నువ్వు మెదిలి గుండెల్లోన యేడి సెగలు
పొంగుతున్న వైనం నీకెట్ట సెప్పేది
నా నాయుడు బావా

నీమీద బుగులుతో నామనసు నామాట యినదయే
అద్దంలో సూస్తు పోడరద్దుకుంటే
నా మొగం మాయమై నీరూపు కనిపించి
యేడి కోర్కెలతో గుండె బరువెక్కే..
కలలోన నిన్ను సూద్దామని
యెన్నెల్లో పక్కేసి సుక్కలెంక సూస్తుంటే
ఎన్నలంతా యేడిక్కి ఎద యేగిపోయే
పకపకా నవ్వుతు నిదురమ్మ ఏరు దాటి పోయే
కమ్ముకొచ్చిన నా ఈడు
నవ్వుల పాలుజేతువా నా నాయుడు బావ
ఎదురు సూసిన కన్నుల్లో నీళ్లు
సంద్రమై పొంగి సెంపలపై పారి గుండెల్లో ఇంకిపోయే
నా నాయుడు బావ

పగలురేయి మరిసి నీ ఎంకి
పంటసేల్లల్లోనే పడిగాపులు కాస్తుంది
ఇకనైనా బేగి రారా నామావా
ఎయి జన్మలదాక ఎంకినాయుడి బావల
వైనం ఇలపైన మనదేనురా
నా నాయుడు బావా

********

Posted in May 2026, కవితలు

1 Comment

  1. వేణుగోపాల గుమ్మడిదల

    చాలా బాగుంది, నాయుడు బావ పై పాట. నండూరి సుబ్బా రావు గారు ఉద్రేక భరితంగా ఎంకి పాటలు పాడుతుంటే విన్నాను. ఈ పాట ఆఉద్రేకపు జల్లు చూపించింది. ధన్యవాదాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *