Menu Close
Radhika Nori
రాధికారుచిరం
రాధిక నోరి

గాసిప్

గాసిప్ ని తెలుగులో ఏమంటారో, దానికి సరైన పదం ఏమిటో ఎంత ఆలోచించినా నాకు తెలీలేదు. అందుకని గాసిప్ అని ఆంగ్లంలోనే వాడటానికి నిర్ణయించుకున్నాను. మీకేమి అభ్యంతరం వుండదు కదూ?

సరే, ఈ గాసిప్ గురించి ముందుకు సాగి, ఇంకొంచెం ఎక్కువ చర్చ చేసే ముందు అసలు దీని అర్థం ఏమిటో, అసలు దీని జననం, అంటే పుట్టుక ఎలా జరిగిందో తెలుసుకుందాం.

ఎవరి గురించి అయినా వారి అనుపస్థితిలో మాట్లాడటాన్ని గాసిప్ చేయటం అంటారు. అయితే సాధారణంగా గాసిప్ చెడు గురించే అయివుంటుంది. అంటే, ఎవరి గురించి అయినా వారి ముందు అయినా, లేక వెనుక అయినా మంచి మాట్లాడాము అనుకోండి, అది అందరికి నచ్చేదే కాబట్టి చిక్కేమి వుండదు. కానీ అదే ఏదన్నా చెడు కబురు అయితే, లేక ఏదన్నా అప్రియమైన విషయం అయితే, అది వారి అనుపస్థితిలో, వారికి తెలీకుండా చెప్తున్నాము కాబట్టి అది ఖచ్చితంగా చెవులు కొరుక్కోవడం అవుతుంది. మరి దీన్నే గాసిప్ అంటారు.

గాసిప్ అన్న పదం god-sibb అనే ఆంగ్ల పదం లోంచి వచ్చిందిట. God అంటే దేవుడు, sibb అంటే siblings, అంటే తోబుట్టువులు. మరి దేవుడు, తోబుట్టువులు కి గాసిప్ కి సంబంధం ఏమిటి అని మీరు ఆలోచిస్తూ వుండచ్చు. చెప్తాను, కొంచెం ఆగండి మరి. 11 వ శతాబ్దంలో ఆడవారి పురిటి సమయంలో వారికి సపోర్టును ఇవ్వటానికి, వారి బాధను కొంచెమైనా సరే, తమ మాటలతో మరిచిపోయేలా చేయడానికి, దేవుడిచ్చిన తల్లితండ్రులు, అంటే, God-parents లాంటివారు, తోబుట్టువుల లాంటివారు, స్నేహితులు అంతా కూడి ఏవేవో కబుర్లు చెప్పేవారట. ఆ కబుర్లలో పడి ఆడవారు వారి ప్రసవవేదనను కాస్తైనా, కాసేపైనా మర్చిపోయేవారట. మెల్లిగా రోజులు గడచి 16 వ శతాబ్దంనాటికి ఈ సాంప్రదాయం బాగా మార్పు చెందింది. కొంచెం నకారాత్మక మార్పు అని చెప్పచ్చు. ఎదుటివారి బాధను మరిపించటానికి మొదలుపెట్టిన ఒక చిన్న ప్రయత్నం వేరే వ్యక్తుల పరోక్షంలో వారి గురించి ఏవేవో లేనిపోని పుకార్లను పుట్టించటానికి మొదలయ్యే ఇంకో ప్రక్రియలాగా మార్పు చెందింది. అలా పుట్టుకతో వచ్చిన తన రూపురేఖలను పూర్తిగా మార్చేసుకుని కొంచెం అప్రియమైన మార్గం వైపు గాసిప్ తన పయనాన్ని మలుపు తిప్పేసుకుంది. బహుశా మొదట్లో దీన్ని గాసిప్ అని అనేవారు కాదేమో కూడా. మరి ఏమనేవారో మనకు తెలీదు. కేవలం కబుర్లు అని మాత్రం అనేవారేమో! ఏమో!

గ్రీకు సంప్రదాయంలో ఈ గాసిప్ దేవతని Pheme/Phemi అని అంటారట. ఈవిడ పుకార్లకు ప్రతీక. మొదట్లో చిన్న గుసగుసగా మొదలుపెట్టి మెల్లమెల్లగా తన ధ్వనిని పెంచుకుంటూ తన పుకార్ల బాకాలు నలుదిక్కులా వినిపించేలా గట్టిగా వూదుతూ తన రెక్కలను పూర్తిగా చాచి నలుదిక్కులా ఎగురుకుంటూ ప్రయాణం చేస్తూ వుంటుందిట. సరే, మన పురాణాల్లో కూడా మనకి నారదులవారు వున్నారుగా! ఎల్లప్పుడూ, అవిరామంగా సకలలోకాలను పర్యటిస్తూ కేవలం లోకకల్యాణం కోసం అనుక్షణం పాటుపడే మన నారదులవారు, పాపం, మంచికంటే చెడుకే ఎక్కువ పేరు తెచ్చుకున్నారు. ఆయన ఆంతర్యం మూలపడిపోయి, ఆయన చేసే గాసిప్ మాత్రం బయటపడి, ఆయనకి తంపులమారి అన్న పేరు వచ్చేసింది. అయితే ఇక్కడ ఒక్క విషయం చెప్పుకోవాలి. నారదులవారు చేసింది మంచి గాసిప్, చెడు గాసిప్ కాదు. అంటే ఆయన అక్కడా, ఇక్కడా మాటలు చేరవేసేవారు, కానీ వాటికి ఉప్పు, కారం, మసాలాలు జోడించి వాటి రూపురేఖలు మార్చేసేవారు కాదు. పైగా వాటి వెనకాల ఒక పరమార్ధం, ఒక లోకకళ్యాణం దాగి వుండేవి. అయినా ఆయనకు తంపులమారి అన్న అపవాదు మాత్రం తప్పలేదు. అంటే దానివలన తెలుస్తోంది, మంచి అయినా సరే, గాసిప్ చెడు అని. అవునా? అయినా ఈ కలికాలంలో అసలు మంచి గాసిప్ అంటూ ఏదీ లేదనుకోండి. అంతా చెడు గాసిపే! అసలు గాసిప్ అంటేనే చెడులాగా అయిపోయాయి రోజులు, పరిస్థితులు. అవునా? ఎందుకంటే మనకు ఈ కలికాలంలో నారదులవారు ఎవరూ లేరు కదా! ఇంక అర్ధాలు, పరమార్ధాలు ఎక్కడ నుండి వస్తాయి? వున్నదంతా గాసిప్ పేరున చవకబారు, చెడు వినోదమే!

ఈ గాసిప్ కి ఆంగ్లంలో అనేక పేర్లున్నాయి. ‘heard it through grapevine’, ‘spilling the beans’, ఇలా ఎన్నో! అలాగే గాసిప్ చేసేవారికి కూడా, ‘bigmouth’, ‘blabbermouth’, ఇలా ఇంకా ఎన్నో!

మరి గాసిప్ కి ఇంత చెడ్డపేరు వుంది అని తెలిసినా సరే, అందరూ గాసిప్ ఎందుకు చేస్తారు? ఏమిటి దానిలోని ఆ ఆకర్షణ? ఈ ప్రశ్నకు సమాధానం వెతికే ముందు నేను ఒక విషయం చెప్పదలచుకున్నాను. గాసిప్ అన్నది మనకు తెలీని కొత్త విషయమేమీ కాదు. యుగయుగాలుగా మన పురాణకాలం నుండీ జీవధారలాగా ప్రవహిస్తున్న ఒక అనంత ప్రవాహం. త్రేతాయుగం తీసుకుంటే మంధర చేసిన గాసిప్ అంతా ఇంతానా? చివరికి కైకేయి మనసుని తన వైపుకి తిప్పుకుని కానీ వదలలేదు కదా! ఇంక ద్వాపరయుగానికొస్తే మాత్రం ఈ గాసిప్ మహిమ ఏమన్నా తగ్గిందా? ఆ దుష్టచతుష్టయం అనుక్షణం చేసిన పనే అది కదా! ఈ గాసిప్ తన శక్తితో వాస్తవికతను కూడా మార్చేసింది కదా! అంటే, యుగాల తేడా లేదు, ఆడ, మగ తేడా లేదు. మనుషులు, దేవతలు అన్న తేడా కూడా లేదు. ఈ గాసిప్ మాత్రం అన్ని కాలాలలోనూ, అందరిలోనూ తిష్ఠ వేసుకుని కూర్చుందన్నమాట. అవునా?

సరే, నేను మళ్ళీ నా ప్రశ్న వైపు వెళ్తే, ఈ గాసిప్ చేయటం అందరికి ఎందుకు నచ్చుతుంది అని కదూ మనం చెప్పుకుంటున్నాం? ప్రతి చెడు అలవాటుకున్న మాయరోగమే అది కదా! అతి ఆకర్షణియకంగా కనిపిస్తుంది. అతి తియ్యగా అనిపిస్తుంది. అతి ఒడుపుతో మనల్ని తనలోకి లాగేసుకుంటుంది. గాసిప్ కూడా అంతే! వినటానికి, చెయ్యటానికి కూడా బహు బాగుంటుంది. ఎదుటివారి లోపాలు ఎప్పుడూ పెద్ద కొండలలాగా, మనలోని లోపాలు చిన్న నలుసులులాగా కనిపించటం, అనిపించటం సహజమే కదా! దానికి తోడు గాసిప్ చేయబడుతున్నవారు పక్కన వుండరు కూడాను. ఇంకేముంది? గాసిప్ చేసేవారికి, అబ్బో, బోలెడంత స్వేచ్ఛ. అవునా? ఒళ్ళు మరచిపోయి వారు మూడో నాలుక, మూడో నేత్రంలాగా అన్నమాట, వాడినా ఆశ్చర్యపోనక్కరలేదు. పనిలో పని వారి మీద ఏదన్నా కోపం వున్నా, అసూయ వున్నా కూడా, అది మంచి అదను కూడాను, వాటన్నిటినీ చిలవలు, పలవలుగా రకరకాల కథలల్లి బయటపెట్టడానికి. ఆమాట ఈనోటా, ఆనోటా నాని ఒక కార్చిచ్చులాగా అందరిమధ్యా అతి త్వరగా వ్యాపిస్తుంది. అందుకే నీకిష్టం లేనివారి గురించి నీకిష్టమైన మాటలు మాట్లాడటమే గాసిప్ అని అన్నారు Earl Wilson అనే అమెరికాకు చెందిన ఒక gossip columnist. ఇలాంటి పరిస్థితి రావటానికి ఇంకో కారణం కూడా కావచ్చు. ఏ కారణం చేతనైనా మనమీద మనకి నమ్మకం పోయి, ఆ ఆత్మన్యూనతలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు, ఏం చెయ్యాలన్నా ఏ దారి కనబడనప్పుడు, ఆ అభద్రతాభావాన్ని, అంటే insecurity ని దాచుకోవటానికి మనిషి గాసిప్ ముసుగుని కప్పుకుంటాడు. అందుకే ఆస్ట్రేలియాకు చెందిన Steve Toltz అనే ఒక నవలా రచయిత, అభద్రతని అనుభవిస్తున్నప్పుడు ఇతరులు తమ గురించి మాట్లాడకుండా వుండటానికి కొంతమంది మనుషులు ఆ ఇతరుల గురించి మాట్లాడతారు, అని అన్నారు. ఈ అభద్రత నలుగురిలో మనం విడిగా ఎక్కడ కనిపిస్తామేమో అన్న కారణం వలన కూడా రావచ్చు. అందరి మాటలలో మాట కలపడానికి కూడా మనుషులు గాసిప్ చేసే అవకాశం వుంది. ఎందుకంటే గుంపుతో కలిసిపోయి వుంటే బాగుంటుంది కానీ మనం ఒక్కరు విడిగా వుంటే మనిషికి బలం ఏం వుంటుంది? అలాగే అప్పుడప్పుడు 'నాకు కూడా మీకంటే ఎక్కువే తెలుసు' అని ఋజువు చేసుకోవటానికి కూడా కొంతమంది కల్పించి అర్ధం పర్ధం లేని గాసిప్ లు చేస్తూవుంటారు. ఇంకొంతమంది వుంటారు, వీరు పుకార్లని ప్రచారం చెయ్యరు, కానీ మనుషుల మనసులలో అనుమానం, ఆసక్తి విత్తనాలను నాటుతారు. దానితో ఇంక వారు మౌనంగా వుండి, జరిగేది తిలకిస్తూవున్నా తక్కినవారే ఆ మిగిలిన పని పూర్తి చేసేస్తారు. గాసిప్ చెయ్యటానికి ఇంకో కారణం, కొంతమందికి ఆసక్తికరమైన, రసవంతమైన విషయాలను, అవి ఎంత అబద్ధాలు, అతిశయోక్తులు అని తెలిసినా కూడా, వాటి గురించి గాసిప్ చేయటం, వాటిని ప్రచారం చేయటం చాలా ఇష్టం. అందులోను ఇతరుల గురించి అంటే ప్రతివారికి ఆసక్తి, వుత్సాహం ఇంకొంచెం ఎక్కువవుతాయి. అందుకే మనుషుల గురించి కాకుండా వారి ఆలోచనల గురించి ఆసక్తి పెంచుకో అని Marie Curie అనే ఒక Polish-French Physicist అందరినీ హెచ్చరించారు. ఇంకొంతమంది ఎవరికీ తెలియని రహస్యాలు నాకు మాత్రమే తెలుసు సుమా అని గొప్పలు చెప్పుకోవటం కోసం కూడా లేనిపోని గాసిప్, కల్పన చేసి మరీ చేస్తూవుంటారు. అలా చేస్తే అందరిలో సంచలనం సృష్టించవచ్చు అని వారి ఆశ. అదీకాకుండా దాని వలన అందరిలో వారికి ఆధిపత్యత ఏదో దొరుకుతుందని ఆశ కూడాను.

ఇలాంటి ఇంకా చాలా కారణాల వలన చాలామంది గాసిప్ చేస్తూవుంటారు. అందుకే మానవకోటి చరిత్రలో ఒక అతి పురాతనమైన సాంఘిక అలవాటుగా ఈ గాసిప్ అన్నది యుగయుగాల నుండి అలనాటి ప్రాచీన అంగడివీధుల నుండి ఈనాటి సాంఘికమాధ్యమాలదాకా చిరంజీవిగా ఇప్పటికీ తన అస్థిత్వాన్ని నిలబెట్టుకుంటోంది.

అయితే ఒక మనిషి అనుపస్థితిలో వారి గురించి ఏదన్నా చెడు మాట్లాడటం, లేక విమర్శించటం సరైన పనే అని అనిపిస్తోందా? లేదు కదూ? ఎవరికైనా ఏమన్నా ఆరోపణలు వుంటే వారితో నేరుగా మాట్లాడాలి కానీ ఇలా వారి వెనుక ఇతరులతో మాట్లాడితే ఏం లాభం? స్వరక్షణలో వారి వాదాన్ని ముందుకు వుంచే అవకాశం వారికి ఇవ్వకుండా వారి పరోక్షంలో వారి మీద ఆరోపణల వలన వుత్త గాసిప్ తప్ప ఇంకేదన్నా లాభం వుంటుందా? ఈ అనవసర గాసిప్ వలన అనవసర అల్లరే తప్ప ఆ ఆరోపణల నివారణ ఏమీ జరగదు కదా! అంతేకాదు, ఈ విషయాలు అనేక వింత రూపాలను సంతరించుకుని ఆ వ్యక్తులకు చేరితే అప్పుడు వారితో వున్న సంబంధాలు ఏమవుతాయి? అందుకే గాసిప్ ఎప్పుడూ కూడా బంధాలను, బంధుత్వాలను చెడగొడుతుంది. మనుషుల మధ్య వివాదాలను, సంఘర్షణలను ప్రేరేపిస్తుంది. మనుషుల తెర వెనుక వున్న చీకటి రహస్యాలను బయటికి లాగి వారి జీవిత గుప్త విషయాలను పదిమందిలో బట్టబయలు చేస్తుంది. మనుషుల మధ్య వున్న నమ్మకం, విశ్వాసాలను పూర్తిగా నాశనం చేసేస్తుంది. కష్టాలలో లేక సమస్యలలో వున్న మనిషి మనసు విప్పి ఎవరితోనన్నా సంప్రదింపులు చేయాలంటే పదిసార్లు ఆలోచించాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. ఒక మనిషి ఇంకో మనిషికి కష్టకాలంలో కాస్తంత సహాయం చెయ్యడానికి ఈ గాసిప్ అడ్డుగోడగా నిలుస్తుంది. వ్యక్తులను దగ్గర చేయటానికి బదులు వారి మధ్య దూరాలను పెంచుతుంది. మరి మనుషుల మధ్య నమ్మకం కూలిపోతే అంతేగా! అంతేకాదు, ఈ గాసిప్ మనుషుల పేరుప్రతిష్ఠలను సమూలంగా నాశనం చేసేస్తుంది. వారి వ్యక్తిత్వాన్ని వేలు పెట్టి చూపిస్తూ సవాలు చేస్తుంది. గాలికంటే వేగంగా ప్రయాణిస్తూ నలుదిక్కులా చిటికెలో వ్యాపించే ఈ గాసిప్ చేసే నష్టం అంతా ఇంతా కాదు. అందుకే అతి వినాశక సాధనాలైన అగ్ని, ఆయుధాల శక్తి కూడా గాసిప్ నాలుకకున్న పదును కంటే తక్కువే అని Richard Steele అనే ఒక Anglo-Irish రచయిత అన్నారు. అయినా చెడుకి వున్న ఎక్కువ ఆకర్షణ వలన అందరూ చప్పున చెడునే నమ్ముతారు కానీ ఆ గాసిప్ వుత్త గాసిపేనేమో, దానిలో అసలు నిజమేమీ లేదేమో అని నిదానంగా ఆలోచించేవారు తక్కువగా వుంటారు. దానివలన వ్యక్తులు, వారి తప్పేమీ లేకపోయినా కూడా, గాసిప్ బాధితులుగా మారి వారి విశ్వసనీయతని, ఆంటే credibility ని కోల్పోతారు. పదిమందితో కలవటానికి తమగురించి ఎవరేమనుకుంటున్నారో అన్న జంకుతో తమకు తామే లక్ష్మణరేఖలను గీసుకుంటారు. చేయని నేరానికి తమకు తామే ఒంటరితనం శిక్షలను వేసుకుంటారు. అప్పుడప్పుడు గాసిప్ బయటినుంచి చూస్తే చాలా అపాయరహితంగా, కేవలం వినోదమాధ్యమంగా, చాలా అమాయకమైనదిగా కనిపించవచ్చు. కానీ లోతుగా పరిశీలిస్తే అది నిజం కాదు. గాసిప్ చాలా అపాయకరమైనది. గాసిప్ చేయబడ్డవారితో పాటు గాసిప్ చేసేవారు కూడా తమ విశ్వసనీయతను కోల్పోతారు. ఎందుకంటే గాసిప్ చేయబడ్డవారి కంటే అది చేసేవారి వ్యక్తిత్వం గురించే ఎక్కువ చెప్తుంది. అందుకే గొప్పబుద్ది కలవారు ఆలోచనల గురించి, సగటుబుద్ధి కలవారు సంఘటనల గురించి మరియు స్వల్పబుద్ధి కలవారు వ్యక్తుల గురించి చర్చిస్తారు అని Elenor Roosevelt, అమెరికా మాజీ అధ్యక్షుని భార్య అన్నారు. ఇంకో విషయం ఏమిటంటే గాసిప్ చేసేవారు ఇవాళ ఇతరుల గురించి చేయచ్చు, కానీ రేపు మన గురించి కూడా అలాగే గాసిప్ చెయ్యరని గారంటీ ఏదీ లేదు. గాసిప్ చేసే ఆ స్వభావం ఎక్కడకు పోతుంది? అలాగే గాసిప్ చేయటంలో ఇవాళ మనతో కలిసిన వ్యక్తులు రేపు మన గురించి గాసిప్ చేయటానికి ఇతరులతో చేతులు కలపరు అని కూడా ఏమీ గారంటీ లేదు. అందుకే గాసిప్ చేసేవారిని మనం సమర్ధించకూడదు. వారు చెప్పేది మనం వినకుండా ఇంక వారిని అంతటితో ఆగమని అడిగితే వారు చెప్పేది వినటంలో మనకి ఎటువంటి ఆసక్తి లేదు అని వాళ్ళకు అర్ధం అయిపోతుంది. నువ్వు నాకు చెప్పబోయే విషయంలో ఏదన్నా నిజం కానీ, ఎటువంటి మంచి కానీ, లేక ఎటువంటి లాభం కానీ లేనప్పుడు నాకెందుకు చెప్పాలనుకుంటున్నావు అని ప్రసిద్ధ గ్రీకు తత్వవేత్త, సోక్రటీసు అడిగాడట. మనందరం కూడా ఈ ప్రశ్ననే వేస్తె ఇంక గాసిప్ చెప్పేవారెవరూ మన దగ్గరకు కూడా రారు. అలాకాకుండా వారు చెప్పే చెత్త గాసిప్ ని విని ఆనందిస్తుంటే వారికి ఇంకొంచెం ఎక్కువ గాసిప్ చెయ్యటానికి ఉత్సాహం ఇంకా రెట్టింపు అవుతుంది. అందుకే గాసిప్ సాహిత్యం కంటే ఎక్కువగా అందరికీ నచ్చుతుంది అని Hugh Leonard అనే Ireland కి చెందిన ఒక నాటకకర్త అన్నారు. మన నాలికను మనం నియంత్రణలో వుంచుకోవాలి. అందుకే గాసిప్ చేయటం ఒక అలవాటుగా మారినవారికి మానవాళికి అత్యంత గొప్ప శత్రువైన తన నాలికను అదుపులో పెట్టుకోవటం చేతకాదు అని అమెరికాకు చెందిన Mark Twain అనే ఒక రచయిత అన్నారు. ఇంకో విషయం ఏమిటంటే గాసిప్ లో చాలామటుకు అబద్ధాలు, అతిశయోక్తులు, కల్పితాలు, ఎదుటివారిపట్ల అగౌరవం కలిసిపోయి వుంటాయి. గాసిప్ వలన ఇతరులకు కష్టనష్టాలు సంభవిస్తాయి. ఇతరులకు గౌరవం ఇవ్వని ఈ నీచమైన అలవాటు మనుషులను అధోగతికి లాగేసే ఒక ఊబిలాంటిది. అదీగాక ఇతరుల జీవితాల గురించి గాసిప్ చేసేవారు బహుశా వారి సొంత జీవితాలతో చాల అసంతోషంగా వున్నారేమో! ఆ నిరాశను, నిస్పృహను ఇలా తీర్చుకుంటున్నారేమో! అందుకే మనం విన్న గాసిప్ విషయాలని మనం ఎప్పుడూ నమ్మకూడదు. కళ్ళతో చూసినవాటిని సగమే నమ్ము, చెవులతో విన్నవాటిని అస్సలు నమ్మకు అని వుత్తగానే అన్నారా?

కధలు చెప్పటం, వినటంలాంటి ప్రాచీన సాంఘిక అలవాట్లలాగా గాసిప్ చేయటం కూడా దురదృష్టవశాత్తు చాలా పురాతనమైన అలవాటు. రీసర్చ్ ఏం చెపుతోందంటే, ఇప్పటికీ కూడా ప్రజల ప్రతిదిన సంభాషణలలో 14% గాసిప్ పాత్ర వుంటుందట. ఒకొక్కసారి గాసిప్ నీతిఅవినీతిల మధ్య, పాపపుణ్యాల మధ్య, నైతికత, ఈర్ష్యాసూయల మధ్య, సత్యాసత్యాల మధ్య వున్న కూడలిలో నిలుచుంటుంది. అది ప్రయాణించాల్సిన దిక్కుని మన తెలివి, విచక్షణాలతో మనమే నిర్ణయించాలి. ఈ digital యుగంలో వార్తలు అతి వేగంగా పయనిస్తాయి. అందులో గాసిప్ ఇంకొంచెం ఎక్కవ వేగంగా పయనిస్తుంది, ఎందుకంటే వినటానికి చాలా వినోదాత్మకంగా వుంటుంది కదా! అందులోను అది ఇతరుల గురించి కూడాను. అంటే మనం చేసే గాసిప్ వలన మనకి చీమ కూడా కుట్టదన్నమాట. అవునా? అందుకే అంత రెట్టింపైన ఆనందం! కానీ ఇలాంటి చెడు ఆనందం మనకు వద్దు. అందుకే మనం ఈ గాసిప్ విషయంలో చాలా జాగ్రత్తగా వుందాము. గాసిప్ అన్నది పని పాట లేని వట్టి సోమరిపోతుల ఆయుధం. తమ వైపు నుండి అందరి దృష్టిని మళ్ళించటానికి ఇతరుల పేరు ప్రతిష్ఠలతో వాళ్ళు ఆడుకునే ఒక ఆట. ఇలాంటి నీచమైన ఆటలు మనకు వద్దు. ఇంతకంటే మెరుగైన పనులతో మనం మన కాలాన్ని గడుపుదాము. ఆ గాసిప్ కోరలలో మనం ఇరుక్కుపోవద్దు. హితులు, స్నేహితులను గాసిప్ తో మనం వెన్నుపోటు పొడవకూడదు.

కనుక మనందరం ఈ గాసిప్ దెయ్యాన్ని దూరంగా తరిమికొడతామని, దాని కోరలలో మనం ఇరుక్కుపోమని, మంచి పనులతో మన కాలాన్ని సద్వినియోగపరుస్తామని శపధం పడదాం. సరేనా?

సరే, మరి ఇప్పటికి ఇంతటితో ఆపి మళ్ళీ వచ్చే నెల ఇంకో మంచి విషయాన్ని వెంటబెట్టుకుని మీ ముందుకు వస్తాను. అంతదాకా సెలవు తీసుకోనా?

********

Posted in May 2026, వ్యాసాలు

6 Comments

  1. రమణీ విష్ణుభొట్ల

    ఎంతో పరిశోధన, పరిశీలన చేసి, అవగాహనతో, విశ్లేషణతో ఆద్యంతం ఆసక్తికరంగా అందించిన వ్యాసం!
    అభినందనలు రాధిక గారు!

  2. భాస్కర్ పులికల్

    రాధిక గారు మరో మంచి వ్యాసం. మీరు ఏది వ్రాసిన కూలంకుషంగా రీసెర్చ్ చేసి వ్రాయడం వల్ల మీ వ్యాసాల నాణ్యత ఏ మాత్రం తగ్గదు. శీర్షికకు కూడా మంచివి, unique. అందు వల్ల పాఠకులకు కొత్త విషయాలు తెలుస్తున్నాయి. అభినందనలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *