శిరీషా డెంటల్ హాస్పిటల్, పుదుచ్చేరీ.
డాక్టర్ రమేష్ మంచి పేరున్న వైద్యుడని తెలుసుకుని, శ్రీకృష్ణ తన తల్లిని ఇక్కడికి తీసుకొచ్చాడు. సాధారణంగా వైద్యులు అపాయింట్మెంట్ ఇచ్చిన సమయానికి రోగులను చూడడం బహు అరుదు. కానీ డాక్టర్ రమేష్ మాత్రం అలా కాదు. చెప్పిన సమయానికే రోగులను పరీక్షించే క్రమశిక్షణ గల వైద్యుడిగా అతనికి మంచి పేరు ఉంది. అయితే ఈ రోజు శ్రీకృష్ణ విషయంలో అలా జరగలేదు. అతడు గత పది నిమిషాలనుంచి నిరీక్షిస్తున్నాడు. అక్కడ నిరీక్షిస్తున్నవారిలో అధిక శాతం మొబైల్ ను చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. కొందరు గుసగుసగా కబుర్లు చెప్పుకుంటున్నారు.
అతనికి అస్తమానం మొబైల్ చూడటం ఇష్టం లేదు. పంటి నొప్పితో బాధపడుతున్న తల్లి మౌనంగా కూర్చుని ఉంది. అటూ ఇటూ చూస్తున్న అతని చూపు, పదే పదే రిసెప్షన్ డెస్క్ దగ్గర కూర్చున్న అమ్మాయి వైపే వెళ్లుతోంది. ఆమె ఏదో చదువుకుంటూ ఉంది. అందంగా ఉంది. వయసు పాతికేళ్ల లోపే అనిపిస్తోంది. ఆసుపత్రిలో పలకరించడానికి వేరెవ్వరూ లేరు. శ్రీకృష్ణ మనసులో ఒక కొంటె ఆలోచన మెరిసింది. అతడు నేరుగా ఆ అమ్మాయి దగ్గరకు వెళ్లాడు.
"చూడండి మిసెస్!" అని సంభాషణ మొదలుపెట్టాడు.
"మిస్ నీలా! నీలవేణి.” అందామె.
“సరైన పేరు. నీలి కుంతలాలు మీకు శోభనిస్తున్నాయి."
"థాంక్స్"
"మిస్ నీలా, డాక్టరిలా ఆలస్యం చేస్తే మీకే ప్రమాదం.”
అతను సరసమాడడానికి వచ్చాడని ఆమె అర్ధం చేసుకుంది.
"నాకా, ఆస్పత్రికా?"
"మీకే."
"ఏమిటో?"
"మీ అందం, చందం."
"అవి వయసు పిల్లలు అందరికీ వుంటాయి."
"కానీ ఎవరిది వారిదే. అందులో మీరు స్పెషల్"
"ఏమిటో?"
“విశాల నేత్రాలు, సింగారి కనుబొమలు, ఓర చూపులు."
"నేను మీకేసి చూడలేదే?"
"చూడకున్నా వచ్చాను. చూసి వుంటే"
"వుంటే?"
"చెప్పేందుకు యేముంది? మూర్చరోగి అనే వారు."
"అయితే చూడనులెండి" ఆమె తన దుప్పటా తీసి తలపైన కప్పుకుంది.
"తీసేయండి, మేఘం కప్పిన చంద్రునిలా వున్నారు"
"మీతో చికాకే."
“చికాకులు, పరాకులు ప్రేమలో భాగమే"
"దీన్ని ప్రేమ అనరు. కాలక్షేపానికి ఆడే సరసం అంటారు."
"ఎంత మాట. మీకు దయలేదు. నా కన్నుల్లో ఆరాధన కనబడలేదా?"
"ఆరాధన లక్ష్యమేమిటో?"
"ప్రేమ!"
"అనుకున్నాను. అందుకే అత్తగారికి కాఫీ పంపించాను. మీకు అక్కడ వుంది. వెళ్ళి త్రాగండి"
శ్రీకృష్ణకి అర్ధమైంది. ఈమెది వెనుకడుగువేసే వ్యవహారం కాదని.
"మీ మాటల తేనె చాలు. నాకు కాఫీ వద్దు. మీ ఫోన్ నంబరు ఇవ్వండి"
"ఎందుకు?"
"మాట కలిపాను, ఇంక, చేతులు కలిపి అలా"
"అలా మూతులు కలిపి. అంతేగా చాలానే వుంది ఆశ."
"ఆశలేనిది ఎవరికీ? మనసిచ్చే మగువే లేదు."
"అయ్యో పాపం! చూడడానికి బాగానే వున్నారుగా?"
"ఆ మాట మీరు అన్నారు. అందుకే మిమ్మల్నే వేడుకుందామని"
'మీ కిది వేడుక అని నాకు తెలుసు." అని ఆమె అంటూండగా బెల్ మ్రోగింది. ఆమె లేచి, శ్రీకృష్ణ తల్లి తో, "రండి ఆంటీ!"అని లోపలికి తీసుకుని వెళ్ళింది.
శ్రీకృష్ణ ఆమె వెనుక నడుస్తూ, "ఆకర్షణీయమైన విగ్రహమే" అని అనుకున్నాడు. ఆమె మాటకు మాట చెప్పిన తీరు, సరసాన్ని ఆస్వాదించిన మానసిక పరిణతి అతనికి నచ్చాయి.
ట్రీట్మెంటు ముగిసిన తర్వాత, ఆమె దగ్గరకు వెళ్ళి, "విడిచి వెళ్ళాలంటే దిగులు. రెండు రోజుల విరహానికి మీ ఫోన్ మందు ఇవ్వండి ప్రేమ డాక్టర్." అన్నాడు.
"లంఖణం లాగే విరహం కూడా ఓ మందు." అంది ఆమె మనోహరంగా నవ్వుతూ.
"పాదరసం లాంటి వారు మీరు." అని శ్రీకృష్ణ వెళ్ళిపోయాడు.
ఆమె అతడు వెళ్ళిన వైపే కొద్ది సేపు చూస్తూ వుండిపోయింది. ఇంత బాహాటంగా సరసమాడిన వ్యక్తిని ఆమె ఇదే మొదటి సారి కలవడం. అతను అందంగా, హుందాగా వున్నాడు. మంచి వుద్యోగం వుండే వుంటుంది, లేకుంటే ఈ హాస్పిటలుకు రాడు. ఇలా ఆలోచించుకుంటూ వుండిపోయింది.
@@@
రెండు రోజుల తర్వాత శ్రీకృష్ణ తల్లిని తీసుకుని హాస్పిటలుకు వెళ్ళాడు. అక్కడ నీలవేణి స్థానంలో, ఒక మధ్యవయసు స్త్రీ వుంది. మొగమాట పడుతూ ఆమెను, "నీలవేణి రాలేదా?" అని అడిగాడు.
ఆమె నవ్వుతూ, "నా మేనకోడలు. మొన్న నాకు ఒంట్లో బాగాలేకపోతే వచ్చింది. తను ఇంజినీరింగ్ ఫైనల్ చదువుతోంది."
"ఆ చెప్పింది. ఇది నా కార్డ్. తనకు వుద్యోగం కావాలంటే నన్ను కలవమనండి." అని గాంభీర్యం ప్రదర్శించాడు.
"చాలా థాంక్స్. తనకి కాంపస్ వుద్యోగం వచ్చింది. అది నచ్చకపోతే, మీ దగ్గరకి వస్తుంది. కాస్త్ హెల్ప్ చెయ్యండి." ఆమె గొంతులో గౌరవం ధ్వనించింది.
“అమ్మయ్య! మేనేజ్ చేసాను,” అని అనుకుంటూ తల్లి దగ్గరికి వెళ్ళాడు శ్రీకృష్ణ.
నీలవేణిని కలవలేక పోవడం అతనికి నిరాశ కలిగించింది. ఆమె రూపమే కాకుండా, ఆమె మాట తీరు అతనికి నచ్చింది. జీవితమొక ప్రయాణం. ప్రతి స్టేషనులో కొందరిని కలుస్తాం, ఆ తర్వాత విడిపోతాము అని అనుకున్నాడు.
మేనత్త యిచ్చిన కార్దుని చూసి, “శ్రీకృష్ణా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్" అని పైకి పెద్దగా చదివి, నీలవేణి ముసిముసిగా నవ్వుకుంటూ యిలా అనుకుంది,
“ప్రపంచం చాలా చిన్నది. నా కలలోకి వస్తున్న ఆ వ్యక్తి, నన్ను కలవాలనే కోరుకుంటున్నాడు. అందుకే కదా తన కార్డు యిచ్చాడు. త్వరలో కలవబోతోంది. కలిసిన ఆ క్షణం యెంత మధురంగా వుండబోతోందో?"
"నీకు వుపయోగిస్తుందా" అని మేనత్త ఆశగా అడిగింది.
"ఆహా! నాకు కాంపస్ సెలెక్షన్లో వుద్యోగం వచ్చింది ఈ కంపనీలోనే."
అతనితో సరస సంభాషణలాడుతున్నట్లు వచ్చిన కలలతో ఆ రోజు రాత్రి నీలవేణికి సరిగా నిద్రపట్టలేదు.
@@@
శ్రీకృష్ణా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, బెంగళూరు.
ఒక్క నిమిషం కంపనీ ప్రాంగణంలో నిల్చుంది నీలవేణి. మనసులో యేవో మధురోహలు. శ్రీకృష్ణ చిలిపి ముఖం కళ్ళ ముందు కదలాడింది. నవ్వుకుంటూ లోనికి వెళ్ళి అప్పాయింటుమెంటు లెటరులో నిర్దేశించినట్లు, హెచ్. ఆర్. కల్యాణి ని కలిసింది.
కల్యాణి చిరునవ్వుతో, "స్వాగతం నీలవేణీ. జాయినింగ్ రిపోర్టు యిచ్చి, మన కంపనీ స్థాపకుడు శ్రీకృష్ణని కలిసి రా." అంది.
నీలవేణి ఆమె చెప్పినట్లే రిపోర్టునిచ్చి, శ్రీకృష్ణని కలవడానికి వెళ్ళింది. ఒక్క నిమిషం ఆమె గుండె తెలియని ఆనందంతో వేగంగా కొట్టుకుంది. ఆమె మెల్లగా, అతని గదిలోకి అడుగుపెట్టింది.
"నీలా! ఎంత ఆశ్చర్యం!"అంటూ శ్రీకృష్ణ తన కుర్చీలోంచి లేచి ఆమెతో కరచాలనం చేసాడు. అతని కరస్పర్శతో ఆమె ఒళ్ళు పులకించింది.
"కూర్చో!" "నా కోసం వస్తావని అనుకోలేదు. ఎంత శుభదినం."
ఆమె మునిపంటితో పెదవి కొరుకుతూ, "నేను వుద్యోగం కోసం వచ్చాను." అంది.
"ఎంత నిర్దయ."
"నిర్దయకాదు. నిరుద్యోగం. ఆ రోజు మిమ్మల్ని కలవకముందే నాకీ వుద్యోగం వచ్చింది."
"అంటే దేవుడు మనల్ని, ఆశీర్వదించాడనేగా దాని అర్ధం!"
"మనల్ని కాదు, మన అధికారి- వుద్యోగి బంధాన్ని. మీరు మీ కుర్చీలో కూర్చుంటే, అధికారిలా మాట్లాడే మూడ్ వస్తుంది."
“ఈ రోజు నువ్వెంత అందంగా వున్నావో చెప్పనీ!"
"మీరిక్కడ చూడాల్సింది నా ప్రతిభని."
"ఎందుకలా దూరం చేస్తున్నావు?"
నిజంగా ప్రేమించిన వాడైతే, తనని ఇంత కాలం చూడకుండా వుంటాడా? నెపం నా మీదకు నెట్టే వాలకమే చెబుతోంది, అతనొక ఫ్లర్ట్ అని. అకస్మాత్తుగా వచ్చిన ఆ భావన, ఆమె మనసుని కష్టపెట్టింది. ఆమె గంభీరంగా ఇలా అంది.
“మీరా? నేనా? అయినా ఆ చర్చ అనవసరం. అధికారిగా నాకు చెప్పేది యేమైనా వుందా?"
చేసేది లేక, శ్రీకృష్ణ తన కుర్చీలో కూర్చుని, “ప్రతి వుద్యోగిని, ప్రొఫెషనలుగా ఎదిగేలా చెయాలన్నది నా లక్ష్యం. అలా వారు ఎదిగితే, నా కంపనీ మంచి ఫలితాలు, లాభాలు సంపాదిస్తుంది. మీరు కూడా మీ ప్రతిభను మెరుగుపెట్టుకుని, ఒక మంచి ప్రొఫెషనల్ కావాలన్నది నా ఆకాంక్ష. వెళ్ళి కల్యాణిని కలవండి. ఆమె మీ ట్రైనింగుకి ఏర్పాటు చేస్తుంది." అని చెప్పాడు.
నీలవేణి లేచి నిలబడి, "థాంక్స్! సీ యూ." అని, గది బయటికి వచ్చి నేరుగా కల్యాణి దగ్గరికి వెళ్ళింది.
ఆమెను చూసి కల్యాణి," శ్రీ సరదాగా వుండే మనిషి. అబ్బాయిలను హాండ్ సమ్, హీరో, చాంప్, బడ్డీ, లాంటి పేర్లతో, అమ్మాయిలను, స్వీటీ, ఏంజల్, మిస్ స్మైల్స్, లేడీ లక్, లాంటి పేర్లతో పిలుస్తాడు. సరదాకే. మనసులో యే కల్మషముండదు. నేను చేరిన క్రొత్తలో, నువ్వెందుకు పెళ్ళి చేసేసుకున్నావు. నాలాంటి ఆరాధకుడికి నిరాశ మిగిల్చావు అని టీజ్ చేసేవాడు. ఆ మాట మా ఆయనతో కూడా చెప్పాడు. ఫన్నీ ఫెలో"
నీలవేణికి తన అనుమానం నిజమని తెలిసిపోయింది. అనవసరంగా ఆశపడ్డాను అని తనని తాను నిందించుకుంది. ఆమె భావరహితంగా కల్యాణితో, "నా జాయినింగ్ రిపోర్ట్ ఒక సారి యిస్తారా?" అని అడిగింది.
"ఎందుకు?" అంటూనే ఆమె బల్ల మీద ఒక ప్రక్కగా వున్న ఆ కాగితం ఆమె చేతిలో పెట్టింది.
"సారీ! కల్యాణి. నేనిక్కడ పని చేయలేను" అని ఆ కాగితం చించివేసి ఆమె వడివడిగా నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోయింది.
కల్యాణి నివ్వెరపోయి, గబగబా శ్రీ కృష్ణ దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పింది. నీలవేణి తీసుకున్న నిర్ణయానికి నిశ్చేష్టుడయ్యాడు శ్రీ కృష్ణ.
"శ్రీ సరదాగా వుంటాడు అని చెప్పాను. ఆ మాట విని ఆమె ఈ నిర్ణయం తీసుకుందా? ఆమెకు అలాంటి వాతావరణం నచ్చదా? లేక నీవేమైనా ఆమెను అన్నావా?"
శ్రీకృష్ణ తమ మధ్య జరిగిన కథని చెప్పి, "ఒక స్త్రీ గా నీ అభిప్రాయం యేమిటి?" అని అడిగాడు.
కల్యాణి నవ్వుతూ, "ఒక కన్నె పిల్ల మన్సులో నువ్వు ప్రేమ విత్తు నాటావు. అది ఇప్పుడు మొక్కయ్యింది. నీది ప్రేమా లేక సరసమా అని ఆలోచించి, అది కేవలం సరసమే అనుకుంది. అందువల్ల ప్రేమ మొక్కను పీకేసే వుద్దేశ్యంతో ఆమె వెళ్ళిపోయింది. పూర్ గాల్! సున్నితమైన మనసు."
"నిజానికి నాకు కూడా ఆ అమ్మాయి నచ్చింది. అందుకే కాస్త చనువు తీసుకున్నాను."
"మరి, ఆ మాట చెప్పక సరసమెందుకు? నువ్వు ప్రేమ నిస్తే ఆ పిల్ల ప్రాణమిస్తుంది. వదులుకోకు." అని కల్యాణి వెళ్ళిపోయింది.
కల్యాణి చెప్పిన మాటలు అర్ధం చేసుకున్న శ్రీకృష్ణ, నీలవేణికి ఫోన్ చేసాడు. ఆమె ఫోన్ ఎత్తి, అతని మాటలు వినబడగానే పెట్టేసింది. ఆ తర్వాత నంబర్ బ్లాక్ చేసింది. శ్రీకృష్ణకి కోపం వచ్చింది.
"చెప్పేది వినే ఓపిక లేని అమ్మాయితో నాకెందుకు? ఇప్పుడిప్పుడే పెళ్ళి చేసుకునే వుద్దేశ్యం కూడా లేదు. నాకోసం పుట్టిన అమ్మాయి అయితే, నాకు దొరక్క పోదు.” అని అనుకున్నాడు.
@@@
దాదాపు రెండు సంవత్సరాల తర్వాత, శ్రీకృష్ణ, నీలవేణి ఢిల్లీ విమానాశ్రయం లాంజ్ లో అనుకోని విధంగా తారసపడ్దారు.
శ్రీకృష్ణ మెరిసే కళ్ళతో, "నీలా! ఎన్నాళ్ళకి?” అంటూ ఆమె చేయిపట్టుకున్నాడు.
ఆ చూపులకి, ఆ స్పర్శకి ఆమె మనసు తెలియని హాయిని పొందింది. కానీ తన భావాలను బయటపడనివ్వకుండా గంభీరంగా, "రెండు సంవత్సరాల పది రోజులు.” అంది.
ఆ జవాబుతో అతని మనసు ఆనందంతో గంతులేసింది. నీల నాదే. రోజులు లెక్కిస్తోందంటే ఆమె మనసులో నేనున్నాను, అని అనుకున్నాడు.
“రా! అక్కడ కూర్చుందాం." అంటూ చనువుగా ఆమె చెయ్యిపట్టుకుని సొఫా వైపు నడిపించాడు. నీలవేణి అభ్యంతర పెట్టలేదు. ఇద్దరూ ప్రక్క ప్రక్కనే కూర్చున్నాక, ఆమె లోలోన భయపడుతూ, "పెళ్ళి చేసుకున్నావా?" అని అడిగింది.
"నా పెళ్ళి కూతురు రెండు సంవత్సరాల పది రోజుల క్రితం నన్ను వదిలి వెళ్ళిపోయింది. నువ్వు చేసుకున్నావా?"
"ఎలా చేసుకోను? పదహారేళ్ళ పిల్లలా నీ ప్రేమలో పడిపోయాను. నా యుక్తాయుక్త విచక్షణ యేమయ్యాయో? తలచుకుంటే సిగ్గేస్తుంది. నిన్ను వదిలి వచ్చిన రోజు, అక్కడ పార్కులో కూర్చుని ఎంతగా యేడ్చానో?"
"నన్ను నువ్వు అపార్ధం చేసుకున్నావు."
ఎలా అర్థం చేసుకోను? నీది సరసమో, ప్రేమో ఎలా తెలుస్తుంది? నేను ఒక సామాన్య యువతిని. నీవు ఇంకొకరితో సరసంగా మాట్లాడే మాటలు నన్ను బాధిస్తాయి. ఏదో ఒక రోజు, నా లాంటి ఓ ఆడపిల్ల నా దగ్గరకు వచ్చి, ‘మీ ఆయన ప్రేమలో పడిపోయాను, దయచేసి మా పెళ్లికి అనుమతి ఇవ్వండి’ అని యేడిస్తే నేనేం చేయాలి? ఆ ఊహే నన్ను వణికించింది. నీకు దూరంగా పారిపోవాలనిపించింది.”
శ్రీకృష్ణకి, ఒక వారం రోజుల క్రితం, కల్యాణి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి.
“నువ్వు నీలవేణిని ఇంకా మర్చిపోలేకపోతున్నావు. అంటే ఆమె అమాయక ప్రేమ నీ గుండెను తాకింది. ఆమె కూడా నిన్ను మర్చిపోలేక బాధపడుతూనే ఉంటుంది. ఆడపిల్లలు తొలిప్రేమను అంత తేలికగా మర్చిపోరు. నిజాయితీగా, నిలకడగా మాట్లాడి ఆమెను నీదానిగా చేసుకో.”
అతడు వెంటనే స్పందించాడు.
“నీలా! ఈ రెండేళ్లలో నేను ఎవ్వరితోనూ సరసమాడలేదు. కల్యాణిని అడుగు. నువ్వు తప్ప నాకు ఎవరూ అక్కరలేదు. నువ్వే నా ప్రియకాంతవి, నా ధర్మపత్నివి. నన్ను నమ్ము.”
“ఈ రెండేళ్లలో నాకు ఒక్కటే అర్థమైంది. నిన్ను నేను మర్చిపోలేనని. అందువల్ల నమ్మకం చేసేదేముంది? అంతగా నీ ప్రేమలో పడిపోయాను.”
“నీ ప్రేమకు అవమానం కలిగించే పని ఏదీ చేయను. నన్ను నువ్వు అపార్థం చేసుకునేలా ప్రవర్తించను. నన్ను విశ్వసించు. అన్యోన్యంగా కాపురం చేస్తూ హాయిగా జీవిద్దాం.” అంటూ అతడు ఆమె భుజం చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకున్నాడు.
ఆమె అతడి భుజంపై తలవాల్చి, ప్రశాంత చిత్తంతో కనులు మూసుకుంది.
బాగుంది
సున్నితమైన మనుషులు వాళ్ళ పరిచయం ప్రేమగా మారితే ఎలాఉంటుందో తెలియచెప్పే కథ
సుఖాంతం సంతోషం కలిగించేది
సుఖాంతం సదా ఆనందదాయకం. మనస్సు లోని అలజడి ప్రభావంతో లోకకళ్యాణం లేదా వినాశనం జరుగుతుంది.