అయ్యగారి వారి ఆణిముత్యాలు
(అయ్యగారి సూర్యనారాయణమూర్తి విరచిత పద్యశ్లోకాలు)
నరసింహప్రార్థన కం. చేదయ నీ పేరు వినా యేదయిన దయామయా! మఱేదయ దయ? నీ వే దయనీయుల ప్రోదయ(1) మాదయితా! నీ దయా(2) సమస్తము నృహరీ! (1) ప్రోది [=ఉత్సాహము/పోషణము]+అయ (2) నీది+అయా= నీది తండ్రీ! 278 అచ్చతెనుఁగుకయిత తరళము తెనుఁగు మాటలు తేనెమూటలు తెల్వికిన్ దగు బాటలౌ యనుఁగు జంటలు సామెతల్ పలుకాడ మువ్వల సవ్వడుల్ తెనుఁగు పాటలు గీటురాళ్ళయి తేటతెల్లము సేయవే కనుఁగొనంగను దీపి గుర్తులు, కల్గునే సరిజోడులే?279 సీ. చుట్టుకైదువుజోదుపట్టి పొగరుగట్టు పెకలించివేసిన బేసికంటి తిగరక్కసుల ప్రోళ్ళఁ దెగటార్చినట్టిఁడు తోలు బట్టగఁ గట్టు దొడ్డవేల్పు గాలిమేతరితొగ కలువలరాయడు తొడవులు గాఁగఁ గుత్తుకను విసము నేలుకోటినిఁ గావఁ దాలిచి వడఁకుగు బ్బలిబొట్టెతోడ గొండిలి యొనర్చు తే.గీ. బత్తితోడను గయిమోడ్చి పట్టుపట్టి కొలువ నెవరన్న దెంచక కోరికలను సులువుగాఁ దీర్చు బోళాకు సోలి మ్రొక్కఁ గలుగు సేమంబు మాటలఁ దెలుపఁ గలమె? భావము- చక్రయోధుడైన విష్ణువు యొక్క పుత్రుడగు మన్మథుని గర్వము అను కొండను ఊడబెరికిన ముక్కంటి, మువ్వురు రక్కసుల పురములను నాశనము చేసినట్టి వాడు, పులితోలును వస్త్రముగా ధరించిన పెద్ద దేవుడు, వాతాశనముల (పాముల) సమూహము, చంద్రుడు అలంకరణములు కాగా ప్రకృతిజనమును కాపాడుటకు కంఠములో విషమును ధరించి మంచుకొండ కూతురితో నృత్యము చేయువాడు, భక్తితో నమస్కరించి శ్రద్ధతో కొలిచే వారెవరైన వారి కోరికలను సులభముగా తీర్చు వాడు, దాపరికములేని వాడు అయిన ఈశ్వరునకు వాలి మ్రొక్కితే లభించే క్షేమము మాటలలో (కవితలతో) తెలుపలేము. 280 కవిత్వసేద్యము చం. మన మొక క్షేత్ర, మచ్చటను మాధవభక్తుఁడు(1) కర్షకుండు, వి త్తనమెగ భక్తి, శ్రద్ధ గతి తప్పని నాగలి, యెడ్లు హస్తముల్, ఘనమగు భావమే జల, మలంకృతు లెర్వులు, బాసదోసముల్ కనుఁగొనఁ గల్పుమొక్కలు, ఫలంబు కవిత్వము, కావ్యముల్ సిరుల్ (1) (ఉ)మాధవుని భక్తుడు 281 తోఁటమాలి సీ. ఒకచంద(1) మొకవర్ణ(2) మకలంకముగఁ గూర్చి ప్రకటింప సుందరభావ మొకటి యొకయెత్తుగడ చిత్త మొకరీతిఁ గదలించి మత్తకోకిల వలె హత్తుకొనఁగ నొకప్రాస యొకబాస(3) యిఁకఁ జాలుఁ జాలన మరిమరి వచ్చుచు మనసు దోఁచ నొకవేళ నొకమూర్తి(4) నికటమై సకలంబు మఱపించి పెనవేయ మాలికలను తే.గీ. తోఁటమాలిగ వనమాలి తోడు గాఁగఁ బట్టుకొని బుట్ట, పూసిన బత్తిపూల(5) నెంచి నింపుచు నేతెంచి హృదయ మలర దొరకు నాసేవ(6) యన నిత్తు విరులసరుల (1) ఆకారము (2) రంగు (3) మాట (4) విగ్రహము (5) భక్తి అనే పువ్వులను (6) యజమానికి నేను చేయు సేవ/ సేవ లభించునా? భావము ఒక్కొక్క ఆకృతిలో(ఛందస్సులో) ఒక్కొక్క రంగును(రంజింపజేయు సొంపును) నిర్మలముగా కూర్చి ఒక్కొక్క చక్కని భావాన్ని ప్రకటించేలాగా, ఒక్కొక్క (పద్య)ప్రారంభము ఒక్కొక్క రీతిలో జరిగి ఎదను కుదిపి (చిగురు టాకులు తిని) చాల సంతోషంతో పాడే కోకిలలాగా హత్తుకొనిపోగా, ఒక్కొక్క ప్రాస మఱియు ఒక్కొక్క మాట ఇంక చాలు చాలనే వఱకు మాటిమాటికి (అనుప్రాసగా) వచ్చి మనస్సును హరించగా, ఒక్కొక్క సమయంలో (సందర్భంలో) ఒక్కొక్క స్వరూపం దగ్గఱగా కనిపించి అన్నిటిని మఱచిపోయేలా (పద్య)మాలికలతో చుట్టివేయగా, ఆకులు మఱియు పువ్వులతో అల్లిన మాలను (ప్రీతిగా) ధరించే విష్ణువు తోటమాలిగా తోడు ఉండగా, బుట్ట చేతిలో పట్టుకొని (నా)కవితల పూదోటలో విరబూసిన భక్తి అనే పుష్పాలను చూచి ఎంపిక చేసి కోసి నింపు కొని వచ్చి మనసు సంతోషపడేలా యజమానికి నేను చేసే సేవ మళ్ళీ లభిస్తుందా అనే విధంగా పూవులవరుసలను సమర్పిస్తాను. 282 కం. లాలితమృదుకవితావన(1) మాలి(2)ని వనమాలి మాలి(3) మహనీయకృపా శీలినిఁ బాలితనతజన పాళిని నయశాలి వీనిఁ బడయ భజింతున్ (1) కవితావన=కవితాపుష్ప (2) మాల కలవాడు (3) తోట కాచువాడు భావము- లాలింపబడిన సున్నితమైన కవితాపుష్పములను మాలగా ధరించేవాడు, ఆకులు మఱియు పువ్వులతో అల్లిన మాలను ప్రీతిగా ధరించేవాడు, పైన చెప్పబడిన తోటమాలి, గొప్పదయకలవాడు, ఆశ్రయించిన వారిని రక్షించేవాడు, న్యాయశీలుడు అయిన పరమాత్మను పైనచెప్పబడిన పూవులవరుసలను స్వీకరింపుమని ఆరాధిస్తాను. 283 పలుకులమ్మ సీ. పలికించునది యంబ, తిలకించునది మాత, పులకించునది తల్లి, మూర్తికవిత నొలికించు రస మమ్మ, కులికించుఁ(1) బద మల్ల(2), చిలికించుఁ(3) గృప తాయి(4) పలువిధములఁ, జెలికించు(5) నంబిక చెలఁగి నా హృదయమ్ము, తొలికించు(6) దీవన లెలమి ధాత్రి(7), తొలఁగించు జనయిత్రి దొరలు దోసమ్ముల, వెలిగించు జ్ఞానదీపికల జనని, తే.గీ. పలుకుకలికియె కలిగించు తలఁపులకును గులుకు లలుకును దానె నా తొలిపలు కగు ‘నమ్మ’యై ముందుముందున నమ్మకమ్ము తోడ వర్ధిల్ల నడిపించుఁ దో డగుచును! (1) వేయు (2) అల్ల=తల్లి (3) ప్రసరించు (4) తల్లి (5) కదలించు (6) కురియించు (7) తల్లి 284