పునాది -- పద్మావతి రాంభక్త
బాల్యపు పసితనం
అమ్మ కొంగు చుట్టూ
అమాయకంగా తిరుగుతుంది
నాన్న గుండెలపై
నిశ్చింతగా నిదురిస్తుంది
యవ్వనపు తుంటరితనం
అమ్మ కంట్లో ఊరే కన్నీటిచుక్కల్ని చూడదు
నాన్న లోలోపల ఎగసే
నిట్టూర్పు శబ్దాల్ని వినదు
పొడుగు చెట్టుతో
పరుగు గాలితో
పోటీపడుతూ
కొత్త ప్రపంచమేదో ఊరిస్తూ
రారమ్మని తలుపులు తెరుస్తుంది
తలపుల్లో అంతటా
భవిష్యత్ రంగుల స్వప్నాలు
పురి విప్పి ఆడుతూ
సమయాన్ని ఆక్రమిస్తాయి
పునాది తీసి
బలంగా నిలబెట్టిన
అరిగిన చేతులు
చూపులకు ఆనవు
కాలం తొందర చేస్తూ
ముందుకు తోస్తున్నపుడు
తనదైన విత్తనం
మొక్కై నవ్వినపుడు
అల్లుకున్న చిక్కని సాలెగూట్లో
మురిసి ముక్కలవుతున్నప్పుడు
పాదు చేసి నీరందించిన శ్వాసల సంగతే పట్టదు
అరిగి అలసిన వెన్నెముక
వంగినపుడు
పడ్డ కష్టం
చుక్కల్ని చూపినపుడు
ఎదిగి విస్తరించిన కొమ్మలపై
ప్రాణం కొట్టుమిట్టాడుతుంది
అప్పుడు
గోడపై వేళ్ళాడే
బొమ్మలను చూస్తూ
గతపు చిట్టడవిలో
క్షణ క్షణాన్నీ
అపురూపంగా తడుముతూ
తచ్చాడుతున్నప్పుడు
కనపడని గాయమేదో
నిశ్శబ్దంగా
అంతరాంతరాల్లో సలపడం
మొదలుపెడుతుంది
కునుకు! -- ఎస్.హరికృష్ణ
కునుకు రాని వేళ
మనసు పారిపోవునో?!
మనసు పారిపోగ
కునుకు దూరమగునో?!
***
నిదుర రాని వేళ
చివురు వేయని కల
వెదకి చూడ చూడ
యెదను, పొరల దాగి!
***
కనులు చూచినవి
వీనుల విని యున్నవి
వనులు ఆమనులు
ఆనలు అశనులన్ని
***
నదులు పారిపారి
ఉదుటుల ఉరుకుల
ఉదధి చేరినట్లు
పదిలమై,ఈ మదిని!
***
గతము మారినట్లు
బ్రతుకు విరిసినట్లు
కథల మార్చునది
కలల వల-మనసే!
***
నిదుర పేదలకు,
ఆదమరచు భోగికి
ఆధారమదే- మది,
పదుల అరల గది!
***
మనసు తేలికైన,
కునుకిట్టె దరిసేను!
దినుసు బరువైన,
మిన్కు తారల లెక్కలే!
***
కనులు ద్రృశ్యాసక్తలు
వీనులు శబ్దాకర్షలు
ఆన్ని నిల్వజేసెడి
పొన్ను గిన్నె ఈ చిత్తమే!
***
కనులు సోరణగండ్లు
వీనులు వార్తల బళ్ళు
మనసు రారాజుకు
ఆ నిష్పత్ర సుపర్ణుకు!
*****
నువ్వు -- డా. రవూఫ్
ఏ గాయమూ బాధించదు నన్ను
నవనీత వాక్యమై నా ప్రతి ఒక గాయాన్ని
స్పృశిస్తావు నువ్వు.!
బాధల చెట్టునై నాలోకి నేను
ముకుళించుకు పోcయినప్పుడు
మందానిలమై తాకుతావు
అంతట ....
పులకాంచితమౌతుంది నా మేను!
రంగులు రువ్వుతావు
ఇంద్రచాపమై విప్పారుతావు.
సెలయేటి గలగలవి నువ్వై
గుసగుసలు పోతావు.
నా హృదయ ధ్వానమైన
సజల నేత్ర మేఘమా ,
నువ్వు కురుస్తూనే ఉంటావు
ఆ సంతోషపు జల్లుల్లో నేను
తడిసి ముద్దౌతూనే ఉంటాను.