సాయంత్రం నాలుగు గంటలు.
ప్రాంజల్ గోపురం అని పెద్ద అక్షరాలతో చెక్కబడి ఉన్న తమ ఇంటి ముందు టాక్సీ దిగాడు. అతడు వస్తాడని ముందే తెలిసిన సింహాద్రి ఒక్క పరుగున వెళ్ళి అతడి బాగ్స్ ని, సూట్కేస్ ని అందుకున్నాడు.
ప్రాంజల్ సింహాద్రి భుజం తట్టాడు. ఆ తట్టడంలో ఒక ఆప్యాయత ఉంది. చిటికెలో గ్రహించేశాడు సింహాద్రి ప్రాంజల్ లో కలిగిన మార్పుని. పొంగిపోయాడు కూడా.
'తనకి ఎవ్వరూ లేకపోవడం ఏమిటి? ఇంత మంది ఉండగా'... అనుకున్నాడు.
ధృతి కిచెన్ లోకి వెళ్ళింది.
సంపంగి మంచి నీటితో పాటు కాఫీ తెచ్చిఇచ్చింది. తన గదిలోకి సరాసరి వెళ్ళిపోయాడు ప్రాంజల్.
అక్కడ ధృతి కి చెందిన ఒక్క వస్తువు లేదు. ఆమె వస్తువులు పిల్లల గదిలోకి తరలించబడ్డాయి. ప్రాంజల్ కిటికీ లోనుంచి చూస్తూ చాలా సేపు గడిపాడు. కింద ఉయ్యాల ల దగ్గర సిమెంట్ సిటింగ్ ఛైర్స్ లో అందరూ కూర్చుని ఉన్నారు. ఎప్పటిలా వసంత్ తన వాగ్ధాటిని మొదలెట్టాడు.
"ఇప్పుడు లెసన్ నెంబర్ 12!" అన్నాడు.
"కానే కాదు. 13. అన్నాడు సౌమిత్!"
"అవును అవును!” అన్నాడు శ్రావణ్.
"హహహహ!" గట్టిగా నవ్వాడు వసంత్.
అందరి మొహాల్లో చిరునవ్వులు.
"శ్రావణ్! నువ్వు నాకు ఇప్పటికి అర్ధం అయ్యావు. నీ కోపం, అసహనం కూడా. కొందరికి అధికారం కిక్కు నిస్తుంది. దానితో వాళ్ళు చేసే విన్యాసాలు కొన్ని ప్రాణాంతకమైనవిగా ఉంటాయి. మీ వార్డెన్ ఎంత చదువుకున్నా, గొప్ప ఉపాధ్యాయుడైనా స్టూడెంట్ ని తిట్టిపోస్తేనే చదివేసుకుంటారు అనే ఏటిట్యూడ్ తో ఉంటారు. ఘోరాతిఘోరంగా తిట్టి మనిషిని గాయపరుస్తారు. ఆ గాయం భరించలేనిది. ఆ తిట్లు తిట్టే వ్యక్తులు తల్లో, తండ్రో అయితే పిల్లవాడిని మానసికంగా చంపేసినట్టే. అదొక హింస. మాటల్తో గాయపరిచి మనిషిని బలహీన పరచడం, నిందలు వేయడం, అపవాదులు వేసి ఆనందపడడం, నువ్వో నష్టజాతకుడివి అని తల్లిదండ్రులే అంటే ఆ పిల్లవాడు కుంచించుకుని గిడిసబారి పోతాడు. ఇంక బంధువులు ఉంటారు. వారి సంగతులు చెప్పనే అక్కర్లేదు.
నేను ఒక దగ్గర చదివాను. దీనికో అద్భుతమైన మందు ఉందట. సౌమిత్, శ్రావణ్ చప్పట్లు కొట్టి మరీ ఆసక్తిగా ముందుకు ఒంగారు. అందరికీ ఒకటే కుతూహలం.
'నువ్వెందుకు పనికిరావు. అన్నప్పుడు లోలోపల నవ్వుకుంటూ
"చాలు చాల్లే! చెప్పొచ్చావ్!
"నేను చాలా గొప్పవాడిని!" అనుకోవాలి.
"నీకేమి రాదు" అనగానే
"ఎవరన్నారు? నేను నీకంటే జీనియస్ ని" అనుకోవాలి.
ఏమాటలు మిమ్మల్ని కించపరిచేవిగా ఉన్నా దానికి విరుగుడు ఒక్కటే. మనని ఆహ్లాదంగా ఉంచే వాటిని గుర్తు చేసుకుంటూ హాయిగా సాగిపోవడమే. కుంగిపోకూడదు. సంపంగి గొప్ప హాయిగా ఆవలించింది.
శ్రావణ్ వసంత్ ని గట్టిగా కౌగిలించుకున్నాడు.
★★★
పొద్దున్నే కాఫీ టైము.
"నేను వెళ్ళిపోతున్నా!" అంది సావిత్రి కిచెన్ దగ్గరికి నిల్చుని అపర్ణా, ధృతి లతో. ఆమె మొహం లో దుఃఖం, దిగులు.
అపర్ణ చేస్తున్న పని ఆపి -
"ఎక్కడికి వెళ్ళేది? అత్తవారి ఇంటికేగా? వెళ్ళి వస్తూ ఉంటావు. నీ స్థానం నీకు ఇక్కడ ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది కదా? నువ్వేళ్ళేది అక్కడ అమ్మ లాంటి అత్తగారిని, చెల్లెలు లాంటి ఆడబిడ్డ ని చూసుకుని రావడానికి. రెండిళ్ళ పనులు అంటే బాధ్యత పెరిగిందని అర్ధం.
అసలు ఒక ఆడది అత్తవారింటికి వెళ్తోంది అంటే పుట్టింటిని చూసుకున్నట్టే ఇంకో ఇంటిని చక్కదిద్దదానికి ఆహ్వానం అందిందని అర్ధం. నువ్వు 'వెళ్ళిపోతున్నా' అని 'డిక్లేర్' చేస్తే ఎలా?
ఇక్కడి వ్యాపారం శక్తి ఉన్నన్నాళ్ళు మీ పెద్దన్న చూసుకున్నారు. ఇప్పుడు వయసు పెరుగుతోంది కాబట్టి కరుణాకరం ఓ చెయ్యి వెయ్యాలి. మనం కలిసి కదా పని చేయాల్సింది? 'వెళ్ళి వస్తా 'అనాలి. అయినా ఈ ఆదివారం మన అందరం 'అన్నవరం' పోతున్నాం. ఇంకో నాలుగు రోజులు ఇక్కడే!" అంది.
సావిత్రికి, ఆ వెనుకే నించున్న అనసూయ కి అపోహలు పటాపంచలు అయిపోయి నిలువెత్తు లక్ష్ములు ఆ ఇంట దర్శనం ఇస్తున్నట్టు అయింది.
కరుణాకరం, శ్రీధర్ రావు, మనోహర్, అనులేఖ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చారు. అరుకు నుంచి కాఫీ గింజలు తీసుకొచ్చాడు శంకర్రావు. వాటిని వేయిస్తోంది సురేఖ.
ఆ వాసన కి ఇల్లంతా "ఆహా!" అనిపించేలా ఉంది.
“దేన్ని ఎలా అనుకున్నా కాఫీ మాత్రం వ్యసనం కాదు బాబూ!" అన్నాడు శ్రీధర్ రావు.
“కానీ పొద్దున్న ఒక్కసారి ఒక్క కప్పు తాగితే చాలు బావా! 'అందింది మందు..దొరికిందే సందు’ అని ఒక్కసారి, ఇంటికి ఎవరొస్తే వాళ్ళతో 'కంపెనీ ఇవ్వాలి కదా' అంటూ కప్పులు కప్పులు లాగించకూడదు. వదినలకి అసలే మొహమాటం!" అంది అనులేఖ. అందరి మొహాల్లో నవ్వు.
కాఫీ గింజల్ని వేడి నీళ్ళల్లో వేసి ఉడికిస్తోంది ధృతి. "అదేంటి? పొడి చెయ్యలేదు?" అంది అపర్ణ.
“సమస్యలు కాఫీ గింజలతో బాయిల్ అయిపోతున్నాయి చూడు! గట్టిగా ఉండే కాఫీగింజలు నీటితో ఉడికి రసాన్ని ఊరించి, నీటి రంగుని మార్చి సుగంధాల్ని వెదజల్లే కాఫీ ని ఇస్తాయి!" అంది.
అందరూ ఆమె వైపు చూశారు.
ఆమె జీవితాన్నిచూసే దృష్టి అమోఘం!!
అక్కడికి కొద్ది దూరం లో సోఫా లో కూర్చున్న ప్రాంజల్ అన్నీ చూస్తూ, వింటూ ఉన్నాడు.
పిల్లలు, వసంత్ అల్లరి చేస్తూ కిచెన్ లో అడుగుపెట్టారు.
“అమ్మా బోయిల్డ్ ఎగ్స్ రెండు నాకు!" అన్నాడు సౌమిత్.
"నాకు ఒకటి!"అంది జాజి.
“నేను కొంచెం పెద్ద కదా. నాకు మూడు!" అన్నాడు గిరిధారి.
“సేమ్ టూ సేమ్" అన్నాడు త్రిలోక్.
అందరి వైపు నవ్వుతూ చూస్తూ ఎగ్స్ ని నీటిలో వేసి బాయిల్ చేస్తోంది ధృతి.
ఎగ్స్ బాయిల్ అవుతుంటే ఆమెకు తండ్రి భరద్వాజ కళ్ళల్లో మెదిలాడు. ఆయన మాటలు చెవిలో పదే పదే వినపడుతున్నాయి ఆమెకి కన్నీళ్లు వచ్చే ముందు లోలోపల జరిగే మార్పులని తట్టుకోలేకపోతున్న శరీరం లో మార్పులు నిశితంగా గమనిస్తున్న వ్యక్తులు ఇద్దరు. వసంత్. ప్రాంజల్.
తండ్రి ఏమన్నాడో వసంత్ కి చెప్పింది.
తన కష్టాలు చెప్తూ ఏడుస్తూ ఉంటే బంగాళా దుంపల్ని, కోడి గుడ్లని, కాఫీ గింజల్ని నీటిలో బాయిల్ చేసి చూపించిన తండ్రి -
“నువ్వు ఎలా ఉందామనుకుంటున్నావ్?
గట్టిగా ధీటుగా ఉండే దుంపలా ఉందామనా? ఉడికించాక మెత్తబడి ముట్టుకుంటే చితికిపోయేలాగా?
లేక అతి జాగ్రత్తగా పట్టుకోకపోతే కిందపడి చితికిపోయే గుడ్డులాగానా? లేక నీటిలో బాయిల్ చేస్తే గట్టిపడే ఘనపదార్ధం లా తయారవుతావా?
కాఫీగింజలు మరిగిస్తే నీటి రంగు మారి సువాసనలు వెదజల్లే సుగంధం లా మారుతావా?"
తండ్రి మాటలు వినిపిస్తున్నాయి.
మరుగుతున్న నీటి వైపే చూస్తోంది.
"నీటితో కదా జీవితాన్ని పోల్చేది. ఈ మూడింటికీ ఒకే రకమైన ప్రతి కూలత ఎదురయ్యింది.
అంటే ఒకేలా ఒకేరకమైన గిన్నెల్లో అదే గ్యాస్ వేడిని, వేడి నీటిని చవి చూశాయి.
కానీ ఒక్కొక్కటి ఒక్కోలా స్పందించాయి అని గమనించావా?" తండ్రి మాటలే మారు మోగాయి.
ఆమె కంటినుంచి నీళ్ళు రాలకుండా వసంత్ ఒక టమాటా తీసి చేత్తో చిదిపితే రసం చిమ్మి స్టవ్ చుట్టూ పడింది.
“ఏంట్రా ఈ పని? ఇక్కడ కటింగ్ బోర్డు, చాకు ఉండగా? ఇప్పుడు టమాటా దేనికి? "అడగబోయి తనని ఆలోచనల నుంచి మళ్ళించడానికే అని అర్ధం అయి చెమ్మగిల్లిన కళ్ళ తోనే నవ్వింది ధృతి.
★★★
వసంత్ రాకతో సాయంత్రం అవగానే అందరూ ఒక దగ్గర చేరడం, అందరికి ఉపయోగకరంగా ఉండే ఏదో ఒక విషయం మీద అవగాహన పెంచుకోవడం దిశగా సాగే ఆ చిన్న మీటింగ్ అందరికి ఇంట్రస్టే!
వసంత్ వచ్చాకే ఆ ఉత్సాహం మొదలయింది.
అతడు చెప్పే విధానం కూడా చాలా బాగుంటుంది.
వసంత్ చక్కటి కధలు చెప్పడం లేదనీ ఉపన్యాసాలు ఇస్తున్నాడని అలిగి పిల్లలు షటిల్ ఆడుకోవడం మొదలు పెట్టారు. పిల్లలు కాస్త దూరం లో ఉండడం చూసి సీరియస్ విషయాల్ని ప్రస్తావన లోకి తీసుకు వచ్చాడు వసంత్.
భామతో ఎవ్వరూ సరిగా మాట్లాడడం లేదు. అందరూ అదోలా ట్రీట్ చేయడంతో ఒంటరి అయిపోయింది. సావిత్రి అయితే కూతురి వైపు కన్నెత్తి చూడడం లేదు.
ఆ పిల్లనే గమనిస్తున్నవసంత్ ఏమయినా చేసుకుంటుందేమో అని డౌట్ వచ్చి ఆ రోజు ఆమె విషయం ప్రస్తావనకు తీసుకొచ్చాడు.
భామతో అన్నాడు.
"ఒక తల్లికి తన బిడ్డ మీద పూర్తి ప్రేమ ఉంటుంది. ఎలా అయితే దగ్గరుండి పిల్లకి తినిపిస్తోందో, సరిగా చదవకపోతే గట్టిగా మందలిస్తూ ఖచ్చితంగా వ్యవహరిస్తుంది. అది కూడా ప్రేమ తోనే. ప్రేమ ని వ్యక్తం చేసే తీరు మారుతుంది అంతే!
సావిత్రి అత్త లోకానికి మాత్రమే భయపడుతోంది. అది ఎంత అనవసరమో తెలుసుకోవడానికి తగిన సమయం పడుతుందే తప్ప ప్రేమ ఎక్కడికి పోతుంది? పైగా దైవం వంటిది తల్లి ప్రేమ. ప్రేమే తల్లి అసలు స్వరూపం, స్వభావం. కాబట్టి ఏ మాత్రం మారదు!" అన్నాడు.
సావిత్రి మొహం పాలిపోయింది.
ఆమెలో మాతృత్వపు మమత ఉప్పొంగి కన్నీరు ధారాపాతంగా రాలింది. ఓదార్పుగా ఆమె పొదవి పట్టుకుంది ధృతి.
చూడండి సత్యభామా! తలవంపు మిమ్మల్ని ఎప్పుడూ బలహీనుల్ని చెయ్యదు. బలవంతులుగా చేస్తుంది.
జీవితం ఒక గుణ పాఠం నేర్పింది గనుక మీరిప్పుడు అప్రమత్తతో, ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకుని ముందుకి సాగుతారు. జరిగిన దాన్ని పూర్తిగా మరిచిపోయి చదువులో పడండి!" అన్నాడు.
సావిత్రి భామ పక్కకి వచ్చి కూర్చుని ఆమెని దగ్గరగా తీసుకుంది. కన్న కూతురిపట్ల తన ప్రవర్తన లోకం మాట్లాడే పరువు పై ఆధారపడి ఉండడం బాధ కలిగించే విషయమని అర్ధం అయింది.
ఈ రోజు ప్రాంజల్ కూడా వచ్చి కూర్చున్నాడు. ధృతి వెంటనే లేచి వెళ్ళిపోబోయింది.
వసంత్ పిన్ని చేతిని పట్టుకుని కూర్చోబెట్టాడు.
"ధృతి పిన్ని! ప్రేమ ఒక భావావేశం కాదు. మనిషి ఉనికి. సహనం అనే మట్టితో ఆడవారి సృష్టి జరిగింది.
ప్రాంజల్ బాబాయికి ఒక గుణపాఠం జీవితం విలువ నేర్పింది.
"ఏదైతే ఉన్నదో అది ప్రేమించడం ఆనందం."
"ఏదైతే లేదో దాన్ని ప్రేమించడం దుఃఖం"అని తెలుసుకున్నాడు. క్లుప్తంగా చెప్పాలంటే బాబాయ్ తెలుసుకోవలసింది ఇంతే.
"మిణుగురు పురుగుల వెంట పడడం కుదురుతుందా? ఇవి చీకట్లో మాత్రమే తిరుగుతూ ఉంటాయి."
అసలు సంగతి ఏమిటంటే-
'నీ ప్రేమ స్వీకరించలేదని, నీకు నిరాశ. బాబాయ్ గారి తీరు హృదయం లోగుచ్చుకుని నీకు అమర్యాద జరిగినట్టు దూరంగా జరిగి, అనాశక్తికరంగా ఉండే ప్రయత్నం చేస్తున్నావు.
'ఎప్పటికి, ఎన్నటికి ప్రేమించను!' అని లోపల తీర్మానించేసుకున్నావు.
ఇవేమీ మీ ఇద్దరికి మనఃశాంతిని ఇవ్వవు. పైగా పరిస్థితిని మరింత చెడగొడ్తాయి.
ఒక్కసారి ఆలోచించు పిన్ని!
మీది అతి పవిత్రమైన వివాహ బంధం.
ఆ బంధాన్ని, ప్రేమించడాన్ని ఎలా కాపాడుకోవాలి?
జరిగిన దాని నుంచి బయట పడే మార్గం ఏమిటంటే-
నువ్వు ఓర్పు వహించి ప్రేమించే విధానాన్ని మార్చుకొని తీరాలి.
బాబాయ్ కూడా నిజ స్థితిని దర్శించాడు.
ఏమి చేయాలో తోచని స్థితి లో కొట్టుకుంటున్న వ్యక్తిగా చూడు.
బాధ కలగడం అనేది ప్రేమలో ఒక భాగమని తెలుసుకుని దీనికి కూడా నువ్వు బాధ్యత వహించాల్సిందే.
ప్రేమ ని గుర్తించక తాను ఉండాల్సిన కేంద్రం నుంచి దూరంగా వెళ్ళి ఒక చేదు అనుభవం తో వెనక్కి తిరిగి వచ్చి కేంద్రంలో నిలబడ్డవాడు కదా? మరి ప్రేమ ప్రకాశించినప్పుడే పరమానందం!" అన్నాడు.
ప్రాంజల్ నెమ్మదిగా వచ్చి ధృతి పక్కన తలవంచి కూర్చున్నాడు.
మీదొక చిక్కు ప్రశ్న ధృతి పిన్ని ద్వారా తెలిసింది. సమాధానం వింటారా? అడిగాడు ప్రాంజల్ ని.
తల ఊపాడు ప్రాంజల్.
“నేను ముక్కుమూసుకుని తపస్సు చేయలేను అన్నారు. అలా చేయనే ఒద్దు.
“తపస్సు అంటే మనం పాటించే ధర్మాచరణే!
మనం అది మానేసి పరుగులెడితే ఆ తపస్సు క్షయం అవుతుంది.
ధర్మాన్ని తు. చ. తప్పకుండా పాటిస్తే ఆ శక్తి సంకల్పాన్ని ఫలింపజేసి కార్యానికి సాఫల్యం వస్తుందట.
తపస్సు స్వధర్మ వ్యక్తిత్వం చదివి తెలుసుకున్నాను! అన్నాడు వసంత్.
అది విని కళ్ళు మూసుకుని నిట్టూర్చాడు ప్రాంజల్.
****సశేషం****
రచయిత్రి పరిచయం ..
|