Menu Close
RSharma-Danthurthi
తెలుగు పద్య రత్నాలు 59
ఆర్. శర్మ దంతుర్తి

బృందావనంలో గోపికలకి, కృష్ణుడు కంసుడిని చూడడానికి మధురకి వెళ్ళడం, ఈ అకౄరుడనేవాడు రావడం అనేవేమీ ఇష్టం లేదు. ఈ అక్రూరుడు మొదలైనవారు తమ దగ్గిర్నుంచి కృష్ణుణ్ణి దూరంగా తీసుకెళ్ళిపోతున్నారని వాళ్ళ గోల. మనకు అతి ఇష్టమైన వాళ్ళు దూరం అవుతూంటే అలాగే అనిపిస్తుంది కదా? సరే వెళ్ళాడు కానీ వెనక్కి వచ్చాక కూడా కృష్ణుడు ఈ గోపికలని చూడ్డానికి వస్తాను అని చెప్పి రాకుండా తప్పించుకుంటున్నాడు. వాళ్ళు మాత్రం మర్చిపోకుండా ఫలానా చోటికి వచ్చి చూస్తున్నారు. ఇలా తనకోసం చూస్తున్నారని తెలిసి ఉద్ధవుణ్ణి పంపించాడు కృష్ణుడు, “వెళ్ళి వారితో చెప్పు, నేను తప్పకుండా వస్తాను’ అని చెప్పమని. ఆయన వస్తూంటే చూసిన గోపిలకి మరింత మండుకొచ్చింది. ఆయన కేసి చూడకుండా అక్కడే ఉన్న తేనెటీగలతో, భ్రమరాలతో చెప్తున్నారు ఉద్ధవుడు వినేటట్టూ, వీళ్ళ సాధింపు అయనకి అర్థం అయ్యేటట్టూ. వీటినే భాగవతంలో ‘భ్రమర గీతలు’ అంటూ పోతన రాసాడు. అందులో ఒక పద్యం ఈ నెల చూద్దాం. పద్యంలో వెక్కిరింపు సరదాగా ఉన్నా నిజం కొంచెం కనీ కనపడనట్టూ తొంగి చూస్తూ ఉంటుంది గమనించండి.

శా.
వాలిం జంపెను వేటగాని పగిదిన్ వంచించి; దైత్యానుజన్
లోలం బట్టి విరూపిఁ జేసెను; బలిన్ లోభంబుతోఁగట్టి యీ
త్రైలోక్యంబు మొఱంగి పుచ్చుకొనియెన్; ధర్మజ్ఞుఁడే మాధవుం?
డేలా షట్పద! యెగ్గు మా వలన నీ కెగ్గింపఁగా నేటికిన్.
[పోతన భాగవతం భ్రమర గీతలు 10.1-1463]

కృష్ణుడంటే విష్ణువు అవతారం, అంతకు ముందు పుట్టిన రాముడూ, వామనుడూ అవన్నీ ఈయనే అని ఈ గోపిలకి అవగాహన ఉంది. అందువల్ల అంటున్నారు వెక్కిరిస్తూ – వేటకాదు అనే పద్ధతిలో వాలిని చంపేసాడు చెట్టు వెనక నుంచి మోసంచేసి (వాలిం జంపెను వేటగాని పగిదిన్ వంచించి), రాక్షసి అయినా సరే, మహిళ అని చూడకుండా (దైత్యానుజన్ – దైత్య, అనుజ, రాక్షసుడి చెల్లెలు) ముక్కూ చెవులూ కోసేసాడు (విరూపిజేసెను). లోభం తో బలి దగ్గిరకి వెళ్ళి ముల్లోకాలు భిక్ష అడిగి మరీ పుచ్చేసుకున్నాడు (లోభంబుతోఁగట్టి యీ త్రైలోక్యంబు మొఱంగి పుచ్చుకొనియెన్). ఇటువంటి వాడయ్యా మన కృష్ణుడు. ఆయన ధర్మం తెల్సినవాడు అని వప్పుకోవడం ఎలా (ధర్మజ్ఞుఁడే మాధవుండు)? అందుకే మాట తప్పకుండా వస్తానన్నా రాకుండా అబద్ధాలు ఆడుతున్నాడు. అదీ వీరి వెక్కిరింపు. మొహం మీద ఉద్ధవుడితో చెప్పకుండా మీ మాధవుడు ఇటువంటివాడు. అయినా భ్రమరా (కీటకం) నీకు, మాకు తెలియదా అవన్నీ మరో సారి చెప్పడానికి (యెగ్గు మా వలన నీ కెగ్గింపఁగా నేటికిన్) అని వెక్కిరిస్తున్నారు. ఇదంతా ఎందుకంటే వీళ్ళని చూడ్డానికి వస్తానని చెప్పి రావడం లేదని నిష్టూరం.

రాముడు కనిపిస్తే అలా చూస్తూ ఉండడమే తప్ప మనస్సు పనిచేసేది కాదుట ఎవరికీ. అయితే కృష్ణుడి సంగతి వేరు, ఆయన కనిపిస్తే వళ్ళు మర్చిపోయి చుట్టుపక్కల ఎవరు ఉన్నారు అనే స్పృహ కూడా పోయేదిట జనాలకి. అంత సమ్మోహనంగా ఉండేదిట ఆయన రూపం. అటువంటి వాడు దూరం అవుతూంటే మనసులో ఎంత కష్టమో తెలియడానికి జయదేవుడి అష్టపదులు చదివితే చాలు. బృందావనంలో ఉండే గోపిలకి చెవులకి ఏమి వినిపిస్తోందో చెప్పడానికి జయదేవులు అనే మాట – హరిరితి హరితి జపతిస కర్ణం. హరి అనే మాట తప్ప ఇంకేదీ చెవుల్లో పడడం లేదు. అదే జపంగా సాగుతోంది. ఇదే రామకృష్ణులు చెప్పే విషయం కూడా. సాధనలో కొంత దూరం వెళ్ళాక భక్తుడు భగవంతుడి విషయం తప్ప మరేమీ వినిపించుకోలేని స్థితిలోకి వెళ్తాడు అంటారు. అంతచేసినా భగవంతుడు కనిపిస్తాడా? ఆ విషయం భగవంతుడికి తప్ప మరొకరికి తెలియదు. అందువల్ల అలా సాధన చేస్తూ ఉండడమే మనం చేయగలిగినది.

ప్రహ్లదుడు కూడా భగవంతుడు కనిపించడం కోసం ఎంతో అలమటించి, అనేకానేక కష్టాలు పడ్డాకే భగవద్దర్శనం చేసుకున్నది. ఈ కష్టాలు కూడా తన స్వంత తండ్రి చేతిలో, ఎవరో అవతలి వారి ద్వారా కాదు. అయితే చివర్లో శ్రీహరి చెప్తాడు అందరితో నరసింహావతారంలో తనకి ఎందుకంత కోపం వచ్చిందో హిరణ్యకశిపుడి మీద – స్వంత కొడుకు అని చూడకుండా తన భక్తుడైన ప్రహ్లాదుణ్ణి అనేకానేక కష్టాలు పెట్టాడు కదా, అందుకే అంత కోపం. అయితే ఇందులో మరో మెలిక ఉంది. ఎవరు ఎన్ని కష్టాలు పెట్టినా ప్రహ్లదుడు భగవద్దర్శనానికి అర్హుడో కాదో చూడ్డం, ఈ కష్టాలన్నీ పెట్టినవాడికి శిక్ష, అంతా అయ్యాక తన స్వంత ద్వారపాలకుడైన హిరణ్యాక్షుడికి మంచి గతి. అందుకే ప్రహ్లాదుడు, ‘నన్ను ఎలా చూసినా మా తండ్రికి మంచి గతి రావాలి (తండ్రి కనక)’ అని అడిగితే విష్ణువు చెప్తాడు, ‘నీ తండ్రి నాకు ఎంతో ఇష్టుడైనవాడు కనక వళ్ళో పెట్టుకుని మరీ సంహరించాను. నా చేయి తగలగానే ఆయన పాపాలన్నీ తీరిపోయాయి’ అని. దీన్నే భగవంతుడు రసవాదంలో చెప్పిన పరుసవేది వంటివాడు అని చెప్పడం కూడా చూడవచ్చు. ఆ రాయిని తగలగానే ఏదైనా సరే బంగారంగా మారుతుంది.

********

Posted in May 2026, సాహిత్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *