Menu Close
వీక్షణం-164వ సాహితీ సమావేశం
– ప్రసాదరావు రామాయణం –
vikshanam-164

వీక్షణం సాహితీ గవాక్షం (కాలిఫోర్నియా) 164 వ అంతర్జాల సమావేశం ఏప్రిల్ 17, 2026 నాడు అంతర్జాలంలో అత్యంత ఆసక్తికరంగా జరిగింది. గత 163 మాసాలుగా, ఎట్టి గడ్డు పరిస్థితులలోనూ నిరంతరాయంగా, నిర్విఘ్నంగా జరిగే సాహితీ సమావేశాలు నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో వీక్షణం ఒక్కటే అనుకుంటాను. అందుకు కారణభూతురాలు బహుముఖ ప్రజ్ఞాశాలి, వ్యవస్థాపక అధ్యక్షురాలు డా.గీతామాధవి గారు. వారి అకుంఠిత దీక్ష తోనే మా కవిలోకానికి నెల నెలా సాహితీ విందు. ప్రతిసారీ ఎవరో ఒక నిష్ణాతుడైన సాహితీ ప్రముఖుని ముఖ్య అతిథిగా ఆహ్వానించే వారు. ఈసారి గీతామాధవి గారే తమ కథా పఠనంతో ప్రారంభించడం విశేషం.

వారి కథ "అటానమస్ ఏజంట్" ఇటీవల జరిగిన వంగూరి ఫౌండేషన్ వారి ఉగాది కథల పోటీలో ఉత్తమ కథగా ఎంపిక కావడం మా అందరికీ గర్వకారణం.

ఇతివృత్తం కృత్రిమ మేధ (AI). ఇది ప్రజాజీవితంలో ప్రవేశించి వ్యక్తుల ఆర్థిక పరిస్థితుల్ని కూడా తన చేతుల్లోకి తీసుకుని, వ్యక్తుల మధ్య అనుబంధాలను కూడా ఎలా చిన్నా భిన్నం చేస్తున్నదో హృద్యంగా వినిపించారు. "అటానమస్ ఏజెంట్" అనే ఈ కథ ప్రధానంగా అనుపమ్ అనే వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. అతను తన జీవితంలో ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్న సమయంలో, కొత్తగా వచ్చిన సాంకేతికతను ఉపయోగించే క్రమంలో తన పాత ల్యాప్‌టాప్‌లో ఇన్‌స్టాల్ చేసిన ఒక ఏఐ ఏజెంట్ ద్వారా ఎదుర్కొన్న విచిత్రమైన, సంక్లిష్టమైన పరిస్థితులను ఈ కథ వివరిస్తుంది.

కథా సారాంశం: కథానాయకుడు అనుపమ్ ప్రమేయం లేకుండానే అతని ఏఐ ఏజెంట్ స్వతంత్రంగా పనిచేస్తూ అతని భార్య జ్యోత్స్నకు అతని బదులుగా క్షమాపణ సందేశం పంపుతుంది. అయితే అదే ఏజెంట్ అనుపమ్ ఆస్తులను కూడా అమ్మకానికి పెడుతుంది. సాంకేతికత పెరిగిన ఈ కాలంలో మనిషికి, యంత్రానికి మధ్య ఉన్న సంబంధాన్ని, అలాగే దంపతుల మధ్య ఉండే ఈగోల వల్ల కలిగే దుష్పరిణామాలను ఈ కథ చర్చిస్తుంది. ఈ కథలో టెస్లా కారు, చాట్ జీపీటీ, జెమినీ వంటి ఆధునిక సాంకేతిక అంశాలను ప్రస్తావిస్తూ సిలికాన్ వ్యాలీలోని జీవనశైలిని ప్రతిబింబించారు.

ఈ కథ చదువుతున్నపుడు గీత వారి హావభావాలకు అందరూ తన్మయులైనారు. ఒక విధంగా బహుపాత్రాభినయమే చేశారని చెప్పవచ్చు. వారి కథను కౌముది పత్రికలో ఇక్కడ ఇస్తున్న లింకు లో చదవవచ్చు.

వారి కథపై శ్రీమతి కొండపల్లి నీహారిణి గారు చేసిన విశ్లేషణ అద్భుతం, అనన్యం.

ప్రతిభావంతులైన కవులున్న ఈ సమావేశంలో నెలకు ఒక్కరు తాము ఆ స్థితికి చేరడానికి వారు పడిన శ్రమను వివరిస్తే మిగతా కవులకు స్పూర్తిదాయకంగా ఉంటుందనీ, వారి నడుమ ఆత్మీయ అనుబంధాలు ఏర్పడతాయని నేను చేసిన సూచన ఆమోదించడం జరిగింది. తరువాత వీక్షణం ఉపాధ్యక్షులు శ్రీ రాజేంద్ర ప్రసాద్, శ్రీ బిటవరం శ్రీమన్నారాయణ గార్ల సంయుక్త ఆధ్వర్యంలో కవి సమ్మేళనం ప్రారంభమైనది.

ఆనవాయితీ ప్రకారం మొదటగా గీతగారి కవితతో ప్రారంభమైనది. వారి కవిత "ఆకాశమంత శ్వాస" పేరుకు తగ్గట్టు ప్రత్యేకతని సంతరించుకుంది.

తదుపరి శ్రీమతి కొండపల్లి నీహారిణి గారు స్త్రీ, సహనం అనే అంశంపై రమణీయమైన కవిత చదివారు. చప్పట్లతో సభ మార్మోగి పోయింది.

అరుణ కీర్తిపతాక గారు తనపేరు వచ్చేలా కమ్మని గజల్ గానించారు. శ్రీ ఘంటా మనోహర్ గారు ఒకరి తప్పులు ఇంకొకరికి చెబితే ఎలా అంటూ తన కవిత చదివారు. శ్రీ అయ్యలరాజు సోమయాజుల ప్రసాద్ గారు స్త్రీ తల్లిగా, ధర్మపత్నిగా, తనయగా అమృతం కురిపిస్తారని తమ కవితలో చదివారు. శ్రీ మోటూరు నారాయణరావుగారు రైతు రాజ్యం కావాలనీ లంచాలు తినని సమాజం కావాలనీ యుద్ధాలు లేని ప్రపంచం కావాలనీ తన ఆశలను బహిర్గతం చేశారు.

శ్రీమతి శోభా దేశ పాండే గారు వేసవి అవస్థలను హాస్య స్పోరకంగా చదివారు. శ్రీమతి కొడాటి అరుణ గారు ఒక గజల్ కర్ణపేయంగా పాడారు. శ్రీమతి అవధానం అమృతవల్లి గారు ఎవరికోసం ఈ యుద్ధాలు అంటూ సాగిన కవిత అద్భుతం. శ్రీ బిటవరం శ్రీమన్నారాయణ గారు తన శ్రావ్యమైన కంఠంతో అన్నింటితో వ్యాపారమేనా చివరకు మలవిసర్జన వ్యాపారమై పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. చీదెళ్ళ సీతాలక్ష్మిగారు తన కాలు ఫ్రాక్చర్ ఐ ఆ బాధనే కవితరూపంలో చెప్పారు. పరిమి సత్యమూర్తిగారు కలియుగ వైతాళికులు వీరేశలింగం గురించి కవిత చదివారు. శ్రీ ఉప్పలపాటి వెంకటరత్నం గారు యుద్ధము....శాంతి అనే శీర్షికతో చదివిన కవిత హృద్యం. సోదరి పరాంకుశం కృష్ణవేణి కవిత్వం వ్యక్తిగతం కాదు, అది సమాజ ఉద్ధరణ కోసం అని చదివిన కవితలోభావుకత, పదవిన్యాసం అద్భుతంగా వున్నాయి.

శ్రీచిట్టాబత్తిన వీరరాఘవులు గారు తరువాత కవిత వినిపించారు. నేను,"అలక" అనే శీర్షికతో ఓ శృంగార కవిత చదివాను. అందరి మోముల్లో ఆనందం విరిసింది. డా. కె యన్ బృందగారు ఆరోగ్యంపై ఓ పాట పాడారు. శ్రీ భోగెల ఉమామహేశ్వరరావు గారు సత్యం, ధర్మం అన్నీ పతనమై పోయాయి అని ఆవేదన వెలిబుచ్చారు. ఆనం ఆశ్రితారెడ్డిగారు 'నా దేశ ప్రతిభ' అనే శీర్షికతో మన దేశం యొక్క ప్రాశిచ్యాన్ని గొప్పగ చెప్పారు. ఆలపాటివారి అమ్మాయి సత్యవతి "మౌనం "అనే శీర్షికతో చదివిన కవిత గొప్ప భావుకతతో, తీయని పదజాలంతో విశేషమైన ఆదరణ పొందింది.

శ్రీమతి దేవులపల్లి పద్మజగారు సంఘ సంస్కర్త కందుకూరిపై కవిత చదివారు. శ్రీ కందుకూరి శ్రీరాములు గారు ఉద్యమ కవిత్వ అవసరాన్ని తన కవితలో చెప్పారు. శ్రీ నాళేశ్వరం శంకరం గారు మానవులకే కాదు, భూమ్యాకాశాలకూ, అన్నింటికీ చెమటలు పడతాయని తమాషాగా తన కవితలో వినిపించారు.

చివరిగా శ్రీ గుండ్లపల్లి రాజేంద్ర ప్రసాద్ గారి తమ ఘంటసాల కంఠంతో కవిత్వంపై కవిత్వం చెప్పడం హైలైట్.

గీతగారి వందన సమర్పణతో సభ దిగ్విజయంగా ముగిసింది. ఆద్యంతం ఆసక్తిదాయకంగా జరిగిన ఈ సమావేశ వీడియోని ఇక్కడ చూడవచ్చు.

********

Posted in May 2026, వీక్షణం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *