కాలం

కాలం కాలం కదిలే కాలం
నిత్య ప్రవాహం నిరంతర ప్రవాహం
అడ్డు లేదు ఆనకట్ట లేదు
బలవత్తరమైన స్వరూపం
పేదకాని పెద్దకాని
చిన్నకాని చితక కాని
అందరినీ కాల్చేటి కాలం
అన్నిటనీ మింగేసే కాలం
ఎన్నో దిగుళ్ళు బుగుళ్ళతో
గడిచింది ఎంతో కాలం
నాకు ఉన్నది పోతుందేమోనని
అనుకున్నది రాదేమోనని
వాడికున్నది నాకు లేదెందుకని
అనుమానం అవమానం ఆరాటం
ఈ తలంపులతో తల్లడిల్లుతూ
నా చూపు కాలంపై నిలవలేదే!
వేళ్ళ సందుల్లోంచి జారిపోయిన ఇసుకలా
కలుగుల జీవితంలోంచి కారిపోయిన నీరులా
జరిగిపోయిన కాలం జాడలేదు
గతం భూమిలోంచి తవ్వలేను
భవిష్యత్తును దివి నుంచి దింపలేను
ఎవ్వరూ గెలవలేని కాలం
ఎవ్వరూ శాసించలేని కాలం
గుప్పిట్లో పట్టలేను
గూడుకట్టి ఉంచలేను
కవితనోయ్!

ఎవ్వరినా! నేనెవ్వరినా!
నీహృదయంలో దాగిన రసరమ్యనినోయ్!
కటిక చీకటినే కురులలో దాచే
కొలనుల కలువలను కనులుగ దోచే
ఎర్రని తామరని పెదవులపై రాచే
సంధ్యా సమయాన్ని చెక్కిలిపై చేర్చే
మల్లికనోయ్! నీ వల్లికనోయ్!
నీహృదయంలో వెలిగే ఓ దీపిక నోయ్!
ఎవ్వరినా! నే కోమలినోయ్!
నీ హృదయంలో పురివిప్పిన నెమలినోయ్
తెల్లటి మబ్బులనే వలువగ సవరించే
ముత్యపు చినుకులనే శిరసున ధరియించే
మెరుపుల కాంతులనూ కన్నుల విరజల్లే
మువ్వల సడి చిరుగాలులు వెదజల్లే
కన్యక నోయ్! నీ నాయకి నోయ్!
ఇంతి నోయ్! చామంతినోయ్
నీ హృదయంలో విరిసిన పూబంతినోయ్!
ప్రతి కవి మదిలోకి పరుగులుతీసే
ప్రతి కవి తలపులను తీయగ ఊగించే
ప్రతి కవి కన్నులలో అనుక్షణమూ నివసించే
ప్రతి కవి ప్రియురాలిగ …కవితగా మురిపించే
కవితనోయ్! ఓ నెలతనోయ్!
నీ మదిని మురిపించే ఓ ముదిత నోయ్!
కాలం మీద కవిత చదివిన తర్వాత నాకు దేవునిపల్లి కృష్ణశాస్త్రి గారు రాసినా మేఘసందేశం పాట గుర్తుకొచ్చింది (ఆకులో ఆకునై కొమ్మలో కొమ్మనై)
గతం లేదు భవిష్యత్తు లేదు ఉన్నదంతా ఈ క్షణమే
చాలా బాగా రాశారు అరవింద రావు గారు