నేటి తరానికి పూర్తిగా పరిచయం లేని పాత తరం నటుడు "మంత్రవాది శ్రీరామ మూర్తి"
బాగా సంపాదన ఉన్న కాలములో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పటికీ, ‘ఇంక సినిమాలు చాలు’ అని సంతృప్తితో సినిమా రంగం నుండి విరమించుకున్న బహు కొద్దీ మంది నటులలో అందాల నటుడు మంత్రవాది శ్రీరామమూర్తి గారు ఒకరు. 1951 లో ఆకాశ రాజు అనే సినిమాలో హీరో గా తెరంగేట్రం చేసి వరుసగా టింగు రంగా, పేద రైతు, రాజేశ్వరి, మరదలు పెళ్లి సినిమాలలో నటించాడు. 1953 లో పెంపుడు కొడుకు సినిమాలో, 1954 లో జ్యోతి సినిమాలో నటించాడు. ఆ విధంగా 3 ఏళ్లలో 7 సినిమాల్లో నటించాడు. ఈ సినిమాల వల్ల ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉండటం వలన దర్శక నిర్మాతలు సినిమాల్లో నటించమని బాగా ఒత్తిడి చేసేవారు కానీ వారి ఒత్తిడికి తల ఒగ్గక చిత్ర పరిశ్రమకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు.
శ్రీరామమూర్తి గారు 1920 నవంబర్ 12 న గుంటూరు జిల్లాలో జన్మించారు. తండ్రి చిన్న శేషయ్య లాయర్. శ్రీరామమూర్తి గారు ఏ సి కాలేజీలో బిఎ చదివారు. విద్యార్థి దశలో చిత్ర కళ మీద మంచి అభిరుచి ఉండటం వలన ఎన్నో పెయింటింగ్స్ వేశారు. చిన్న తనంలో నాటకానుభవం లేకపోయినప్పటికీ హైస్కూలులో చదివేటప్పుడే నందలాల్ అనే నాటకంలో శివుడి వేషం వేసాడు. ఇంతటి అందగాడు సినిమా లో బాగా రాణిస్తాడు అనే అభిప్రాయం ఆనాటి నాటక సినీ సీనియర్ నటుడు, నాగయ్య గారి పోతనలో శ్రీనాథుడు, పెద్దమనుషులు లో చైర్మన్ అయిన జంధ్యాల గౌరీనాథ శాస్త్రికి అనిపించింది. స్వయంగా సినిమా తియ్యాలనుకొన్న శాస్త్రి గారు. ‘’మహారధి కర్ణ’’ సినిమాలో తాను కర్ణ పాత్రవేసి, మంత్రవాదిని కృష్ణుడి పాత్రలో పరిచయం చేయాలనుకొని మధురలో షూటింగ్ అనీ అన్నిఖర్చులు పెట్టుకొని వెయ్యి నూట పదహార్లు ఇస్తామని చెప్పాడు. రెండు నెలల్లో షూటింగ్ అన్నాడు కానీ ఆ కబురు రాలేదు సినిమా ఆగిపోయింది. ఇలా తొలి సినిమా పౌరాణిక కృష్ణ వేషం చెయ్యి జారిపోయింది మంత్ర వాదికి. రామారావు తో శాస్త్రి అదే సినిమా తీద్దామనుకొన్నా అదీ కుదరలేదు. గుంటూరు కాలేజిలో ముక్కామల కృష్ణమూర్తి సీనియర్. ముక్కామలతో చాలా నాటకాలలో వివిధ పాత్రలు ధరించి ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేశాడు మంత్రవాది. అప్పుడే నందమూరి తో అక్కడే పరిచయం ఏర్పడింది.
ఇక సినిమాలపై ఆశ వదిలి లా చదవటం ప్రారంభించాడు. 1946లో ప్రభుత్వోద్యోగి అయ్యాడు మంత్రవాది. కొన్నేళ్ళ తర్వాత గౌరీనాధ శాస్త్రి తాను "ఆకాశరాజు" సినిమా తీస్తున్నాననీ "నువ్వే హీరో" అని వెంటనే రమ్మని టెలిగ్రాం ఇచ్చాడు. ఈ సినిమాకు విశ్వనాథ సత్యనారాయణ కధతో పాటు మాటలు, పాటలు రాశారు. ఇక్కడ కూడా ఒక తమాషా జరిగింది. ఈ సినిమాకు శాస్త్రి మొదట NTR నే బుక్ చేశాడు కానీ రెండు రోజుల్లో షూటింగ్ ఉందనగా విజయా వారు ఆయన్ను పర్మినెంట్ ఆర్టిస్ట్ గా నెల జీతంపై బుక్ చేసుకొన్నారు. కనుక తప్పుకోవాల్సి వస్తే, జాక్ పాట్ మంత్ర వాదికి దక్కింది. వెంటనే మద్రాస్ వెళ్లి తనకు పరిచయమున్న ముక్కామల ఉంటున్న పాండీ బజార్‌లోని నారాయణ హోటల్ లోనే ఉన్నాడు. కానీ ఆకాశ రాజు సినిమా అట్టర్ ఫ్లాప్ అయి రెండో రోజే డబ్బాలు లేపేశారు. సాంకేతిక లోపాలతో స్క్రీన్ పై బొమ్మ బాగా కనపడక పోవటం మాట వినిపించకపోవడం ముఖ్య కారణం. భరించలేని ప్రేక్షకులు కుర్చీలు బల్లలు పగలగోట్టేశారు. తెర చింపేశారు. నిరాశపడ్డాడు మన హీరో. తర్వాత టింగ్ టింగ్ మంటూ టింగు రంగాలో అవకాశం వచ్చింది. ఇందులో "రాజా మహారాజా" అనే ఒక శాస్త్రీయ గీతం ఉంది. "తాపీ తాత" పాటరాస్తే టివి రాజు సంగీతం కూరిస్తే ఘంటసాల మొదటిసారిగా పాడారు. ఘంటసాలకు ఇదే మొట్టమొదటి శాస్త్రీయ గీతం. రాజుకు కూడా ఇదే మొదటి సినిమా. పాట రాయటానికి ట్యూన్ కట్టటానికి రెండు నెలలు పట్టింది. ఘంటసాల పదిహేను రోజులు ప్రాక్టీస్ చేశారు. హీరో మంత్రవాది కూడా తీవ్ర సాధన చేశాడు. చివరికి 7నిమిషాలున్న ఈ పాటను సింగిల్ టేక్ లో రికార్డ్ చేసి రికార్డ్ సృష్టించారు ముగ్గురూ. తమజీవితంలో ఒక మంచి శాస్త్రీయ గీతం వచ్చినందుకు మాష్టారు, రాజు, శ్రీరామ మూర్తి పరమానందం పొందారు. ఒకరినొకరు బాగా అభినంది౦చు కొన్నారు.
రక్షరేఖ సిని దర్శకుడు పద్మనాభన్ తమిళ తెలుగు భాషల్లో నిర్మించే "రాజేశ్వరి" చిత్రంలో మంత్రవాదిని హీరోగా ఎంపిక చేశాడు. తమిళ హీరో ఎ౦.జి. రామ చంద్రన్, "ఎందుకు ఈ ఫ్లాప్ నటుడు?" అని అసిస్టెంట్ డైరెక్టర్ లంక సత్యం గోల చేసినా డైరెక్టర్ వినిపించు కోలేదు. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఎమ్జీఆర్ సరిగ్గా నటించలేక పోతున్నాడని, ఆయన్ను తీసేసి మన శ్రీరామమూర్తికే తమిళ హీరో చాన్స్ ఇచ్చాడు డైరెక్టర్. దీనికి ఓగిరాల రామచంద్ర రావు సంగీత దర్శకుడు. అప్పుడు మన మామ మహాదేవన్ ఆయనకు సహాయ సంగీత దర్శకుడు. పాటలన్నీ ఘంటసాలతో పాడించాలనుకొన్నా, ఆయనకు ఖాళీ లేకపోవటంతో ఆ ఛాన్స్ పి.బి .శ్రీనివాస్ ను వరించింది. కానీ ఆయన డిగ్రీ పరీక్షలు రాస్తూ ఉండటంతో పిఠాపురం నాగేశ్వరరావు కు ఆ అదృష్టం దక్కి అన్ని పాటలు పాడి హిట్ చేశాడు. అప్పటినుండి ఆయన్ను ఆంధ్రా రఫీ అనే వారు. ఇందులో అంజలి దేవి హీరోయిన్. భానుమతి మూడు భాషల్లో తీస్తున్న "చండీ రాణి" సినిమాలో హీరో రామారావు కు తండ్రి వేషం వేయమని మంత్రవాది ని కోరి మొదట యువకుడుగా ఉండి, తర్వాత ముసలి వాడు అయ్యే పాత్ర అనీ మూడు భాషల్లోనూ అతనినే నటించమని అడిగింది. పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేకుండా అప్పుడే ముసలి పాత్ర ఏమిటి అందులో రామారావు కు తండ్రి గా. నేను నటించను అని కరాఖండి గా చెప్పేశాడు శ్రీరామ మూర్తి. భానుమతి ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. రామారావు హీరోఇజం ఆయనదే, నా హీరోఇజం నాదే. నేను చేయను. అందులో ఆకాశ రాజు ఫెయిల్యూర్ నన్ను వెంటాడుతోంది అదీకాక హిందీలో కూడా నేనే చేయాలంటున్నారు. నేను చేయను‘’ అని గట్టిగా చెప్పిన వ్యక్తిత్వం మంత్రవాదిది. ఈ పాత్ర చివరికి హాస్యనటి శ్రీలక్ష్మి తండ్రి అమరనాథ్ కు దక్కింది.
ఆజానుబాహువు, మహా అందగాడు, స్ఫురద్రూపి శ్రీరామ మూర్తి. అందుకే మరో ఎన్‌టి.ఆర్. అనిపించేవాడు. గుంటూరులో మెహర్ బాబా ఫోటో స్టుడియో పెట్టి విజయవంతంగా నడిపాడు. సినీ రంగంలో ఆనాటి నందమూరి తారక రామారావు కు అన్నింటా సాటి, మేటి అని అనిపించుకొన్న నటుడు మంత్రవాది.
చిత్రకళపై అభిరుచి ఉన్న శ్రీరామ మూర్తి మద్రాస్ లోని మిత్రుడు టి.ఎన్. శాస్త్రి వద్ద ఆ కళ నేర్చి నిష్ణాతుడయ్యాడు. దేశనాయకుల చిత్రాలు పరమాద్భుతంగా వేసేవాడు. ఎగ్మూర్‌లో "స్కూల్ ఆఫ్టర్ ఆర్ట్స్అండ్ వుడ్ క్రాఫ్ట్స్" కాలేజి లో హెచ్ వి రామ గోపాలం అక్కడ ఫైనలియర్ విద్యార్ధి. మంచి చిత్రకారుడు. శ్రీరామమూర్తి వేసిన నెహ్రు చిత్రాన్ని చూసి అభినందించాడు. అప్పుడు స్వర్గసీమ సినిమా నిర్మాణం జరుగుతోంది. ఆర్ట్ డైరెక్టర్ గా ఆ కాలేజి లెక్చరర్ నారాయణ రావు ను తీసుకోగా, రామ గోపాల౦ అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్‌గా వెళ్ళాలి కానీ, అతడు మిత్రుడిలో ఉన్న కళా ప్రతిభ తెలిసినవాడు కనుక శ్రీరామ మూర్తికి అవకాశం కల్పించాడు. కానీ వాహిని వారినుంచి ఎన్ని నెలలైనా పిలుపు రాలేదు. హీరో కావాల్సిన వాడు కనుక ఈ అవకాశం మిస్ అయి ఉండవచ్చు. విధి చేసే వింత పని ఎవరికి తెలుసు? కానీ, మొదటి రెండు సినిమాలలో మంత్రవాది పెయింటర్ పాత్రలే పోషించటం యాదృచ్చికమే అయినా, మనకు తమాషాగా ఉంటుంది. టింగ్ రంగా లో ఆయన చిత్రం వేస్తూ "కవి కలముకు, కళ కుంచె కు" అని పాడిన పాట ఆ రోజుల్లో సూపర్ హిట్ అయింది. అందరి నాలుకలపై నర్తించింది.
గుంటూరు చేరి మెహర్ బాబా భక్తుడిగా మారి అదే పేరుతొ ఫోటో స్టుడియో పెట్టి, సెటిల్ అయి పెళ్ళి చేసుకొని పిల్లల్ని కని హాయిగా, ప్రశాంతంగా గృహస్థ జీవిత మాధుర్యం అనుభవించాడు మంత్రవాది. అమెరికాలో ఉన్న కూతురు వద్ద ఆ దంపతులు చాలాకాలం ఉన్నారు. 1-2-2011 న మంత్రవాది కరీంనగర్ నుంచి కారులో హైదరాబాద్ వస్తుంటే, ఎదురుగా వస్తున్న గేదెను తప్పించబోయి డ్రైవర్ కారు పక్కకు తిప్పగానే అది కాలువలోకి జారిపోగా, ఆ షాక్ కు గుండెపోటు వచ్చి అందాల నటుడు మంత్రవాది శ్రీరామమూర్తి 91వ ఏట అక్కడికక్కడే మరణించాడు.