Menu Close
GSS-Kalyani
జ్ఞానానందమయం
శ్రీ శేష కళ్యాణి గుండమరాజు

బలవంతుడు

ఒకరోజు ప్రసూనాంబ పూజా-భోజనాలూ ముగించుకుని, ఆరుబయట కూర్చుని, కృష్ణానంద చేత లెక్కలు చేయిస్తోంది. అప్పుడు ఆ ఊరి వస్తాదు వీరన్న తన తండ్రి సూరయ్యతో వచ్చాడు.

సూరయ్య ప్రసూనాంబకు వినయంగా నమస్కారం చేసి, "ప్రతి ఏడూ మనూళ్ళో కుస్తీ పోటీలు జరుగుతూ ఉంటాయి కదమ్మా? ఈ ఏటి పోటీలు వచ్చే వారం జరగబోతున్నాయి. మా వీరన్న మనూరి మల్లయ్యగాడితో పోటీ పడుతున్నాడు. వీరన్న ఆ పోటీలో గెలిచేటట్టు వాడిని ఆశీర్వదించండమ్మా!", అన్నాడు.

ప్రసూనాంబ నవ్వి, "ఏం వీరన్నా? ప్రతిరోజూ సాధన చేస్తున్నావా?”, అని అడిగింది వీరన్నను.

వీరన్న సిగ్గుపడిపోతూ తల దించుకుని, "ఊఁ!", అన్నాడు.

"సరే వీరన్నా! విజయోస్తు!", అని వీరన్నను దీవించి పంపింది ప్రసూనాంబ.

కొద్దిసేపటి తర్వాత ప్రసూనాంబ దగ్గరకు మల్లయ్య వచ్చాడు.

"ఏమిటి మల్లయ్యా విషయం? వచ్చే వారం కుస్తీ పోటీలో పాల్గొంటున్నావటగా? సాధన చేస్తున్నావా?", అడిగింది ప్రసూనాంబ.

"ఓ! చేస్తున్నానమ్మా! మీ దీవెనలు కావాలి", అన్నాడు మల్లయ్య.

“నీ ప్రయత్నం గట్టిగా చెయ్యి మల్లయ్యా. ఆపై ఆ భగవంతుడు చూసుకుంటాడు! గెలుపు నీదే!", అంది ప్రసూనాంబ.

"అమ్మా! మీ దీవెనలు ఫలించాలి. మీరు ఈ పోటీ చూడటానికి తప్పకుండా రావాలమ్మా!", అన్నాడు మల్లయ్య.

"అలాగే వస్తానులే! మరి గెలిస్తే నాకు మిఠాయి ఇవ్వాలి!", చెప్పింది ప్రసూనాంబ నవ్వుతూ.

"అలాగే. పట్టుకొస్తానమ్మా! బాబుకి జీడిపప్పు పాకం ఇష్టం కదా? అది పట్టుకొస్తా!", అని చెప్పి వెళ్ళిపోయాడు మల్లయ్య.

జరిగినదంతా అక్కడే ఉండి గమనించిన కృష్ణానంద ప్రసూనాంబాతో, "బామ్మా! జీడిపప్పు పాకం తీసుకురమ్మని వీరన్నకు చెప్పలేదేం?", అని అడిగాడు.

అందుకు ప్రసూనాంబ,"చూస్తూ ఉండరా! మల్లయ్యే పోటీలో గెలుస్తాడు!", అంది చిరునవ్వుతో.

"ఏం కాదు! ఖచ్చితంగా వీరన్నే గెలుస్తాడు! ఎందుకంటే మల్లయ్య వీరన్న కంటే సన్నగా ఉన్నాడు. వీరన్న కండలు చూశావా? ఎంత పెద్దవిగా ఉన్నాయో!", ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి మరీ అన్నాడు కృష్ణానంద.

"చూద్దాంలేరా ఆనందూ! ఒకవేళ వీరన్న గెలిస్తే నేను నీకు జీడిపప్పు పాకం కొనిపెడతా. సరేనా?", అంది ప్రసూనాంబ కృష్ణానంద బుగ్గలను నిమురుతూ.

కుస్తీపోటీరోజు రానే వచ్చింది. కృష్ణానంద ప్రసూనాంబతో కలిసి పోటీని చూడటానికి వెళ్ళాడు. పోటీలో మల్లయ్య పెద్దగా కష్టపడకుండా వీరన్న పై గెలుపు సాధించాడు! పోటీ ముగిశాక ప్రసూనాంబకు నమస్కరించి జీడిపప్పు పాకం ఉన్న మిఠాయి పొట్లం కృష్ణానంద చేతిలో పెట్టాడు మల్లయ్య. కృష్ణానంద, ప్రసూనాంబలు ఇంటికి చేరుకున్నారు.

"బామ్మా! నువ్వన్నట్లు ఇవాళ్టి పోటీలో మల్లయ్యే గెలిచాడు. సన్నగా ఉన్నా మల్లయ్యే గెలుస్తాడని నువ్వు ముందే ఎలా చెప్పగలిగావూ?", ప్రసూనాంబని ఆశ్చర్యంగా అడిగాడు కృష్ణానంద.

ప్రసూనాంబ చిన్నగా నవ్వి, "చూడు కృష్ణా! వీరన్నకి పెద్ద పెద్ద కండలున్నాయి. అందులో సందేహం లేదు. మల్లయ్య వీరన్న కన్నా సన్నగా ఉన్నాడు. అదీ నిజమే! అయితే, వాళ్ళు నా ఆశీర్వాదం కోసం ఇక్కడకు వచ్చినప్పుడు వాళ్ళ ప్రవర్తనలో చిన్న తేడా ఉంది. నేను అది గమనించాను. అందుకే ఈ పోటీలో మల్లయ్య గెలుస్తాడని చెప్పాను", అంది.

అర్ధంకానట్లు చూశాడు కృష్ణానంద.

"సరే! మరి కాస్త వివరిస్తా విను! వీరన్న నా దగ్గర నిలబడినప్పుడు మొహమాటంగా వాళ్ళ నాన్న వెనుక దాక్కోవడానికి ప్రయత్నించాడు. నేను అతడిని అడిగిన ప్రశ్నకు సమాధానం కూడా సరిగ్గా ఇవ్వలేకపోయాడు. అతడి మోహంలో నాకు ఈ పోటీలో నెగ్గనేమోనన్న సంశయమూ, కొద్దిగా భయమూ కనపడ్డాయి. ఆ తర్వాత వచ్చిన మల్లయ్యలో నాకు ఆత్మవిశ్వాసం కొట్టొచ్చినట్లు కనపడింది. మల్లయ్యకు పోటీలో తనదే గెలుపన్న నమ్మకముంది. అందుకు తగ్గ ప్రయత్నం కూడా చేశాడు. వీరన్నకు కండ బలమే తప్ప గుండె ధైర్యం లేదు. మల్లయ్యకు మనోధైర్యం మెండుగా ఉంది. గుండె ధైర్యం కలవాడే నిజమైన బలవంతుడు. అందుకే పోటీలో మల్లయ్య సులువుగా గెలిచాడు!", అంది ప్రసూనాంబ.

"ఓహో! మల్లయ్య గెలుస్తాడని నువ్వు ఎందుకన్నావో నాకు ఇప్పుడర్థమైంది బామ్మా! ఏదేమైనా నాకు తియ్యటి మిఠాయి దొరికింది!", అన్నాడు కృష్ణానంద జీడిపప్పు పాకం ముక్కను కొరుకుతూ.

****సశేషం****

Posted in August 2023, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!