Menu Close
తీరిన కోరిక (కథ)
-- గరిమెళ్ళ వెంకట లక్ష్మీ నరసింహం --

గతసంచిక తరువాయి »

వైవాహిక జీవిత సాఫల్యాన్న కుసుమ గర్భవతి అయింది. గణపతి బసవయ్యల సంతోషానికి అంతులేదు. రెండు మూడు నెలల తరువాత కుసుమకు తరచు ఆరోగ్య సమస్యలు రావడంతో పట్నంలోని లేడీ డాక్టరును సంప్రదిస్తూ ఉండేవారు. నవమాసములు నిండేక కుసుమ మగశిశువుకు జన్మనిచ్చింది. కాని కుసుమ మరోమారు గర్భవతి కాకూడదని లేడీ డాక్టరు సలహా ఇచ్చింది. పుట్టిన మగశిశువుకు 'వివేక్ ' అని నామకరణం జరిగింది. ఆ తరువాత సుమారు రెండు సంవత్సరాలకు దయానిధి భార్య శాంతి తల్లి కాబోతోందని తెలిసింది. తొమ్మిది నెలలూ నిండేయి. వంశోద్ధారకుడు జన్మించేడు. 'రమణ' నామధేయుడయ్యేడు.

సుధాకరుకు ట్యూషన్ల గిరాకీ ఎక్కువయింది. జోగమ్మతో కలసి భావి జీవిత అవసరాలు ఆలోచించసాగేడు. తలదాచుకోడానికి  ‘తమదీ ' అనే ఒక ఇల్లు ఉండాలనుకొన్నారు. అలా దంపతులిద్దరూ ఏవేవో కలలు కనేవారు. ఒక రోజు డాక్టరు చెప్పడంతో జోగమ్మ గర్భవతి అని తెలిసింది. ఇద్దరి సంతోషానికి అంతు లేకపోయింది. పుట్టబోయే బిడ్డ భవిష్యత్తును ఊహించుకొంటూ ఉండేవారు. పుట్టబోయే బిడ్డ మగ అయినా ఆడ అయినా ఇంజినీరింగు చదివించాలని సుధాకర్ జోగమ్మతో తన నిశ్చితాభిప్రాయాన్ని పంచుకొనేవాడు..

ఒక రోజు సాయంత్రం సుధాకర్ బజారునుండి ఇంటికి వస్తున్నాడు. ఆ సమయంలో వెనకనుండి వస్తున్న ఒక లారీ అదుపు తప్పి సుధాకరును హఠాత్తుగా గుద్దింది. ఆ తాకిడికి సుధాకర్ స్కూటరు మీదనుండి విసిరివేయబడ్డాడు. ఎదురుగా వస్తున్న లారీ కింద బడ్డాడు. తలకు పెద్ద దెబ్బలు తగిలి రక్తస్రావం విపరీతంగా జరిగింది. ఆ ఘటనా స్థలానికి చూడవచ్చినవారిలో కొందరు సుధాకరుని ఎరుగుదురు. వారు వెంటనే సుధాకరును హాస్పిటలుకు తీసుకెళ్ళేరు. డాక్టరు చికిత్స చేస్తూండగానే సుధాకర్ తుదిశ్వాస విడిచేడు. ట్యుటోరియల్ కాలేజీ నుండి ఇంటికి బయలుదేరుతున్న దయానిధికి ఆ పిడుగువంటి వార్త తెలిసింది. హుటాహుటిన సుధాకర్ నివాసం చేరుకొన్నాడు. భర్త పార్థివ శరీరం పై పడి విలపిస్తున్న జోగమ్మను ఓదార్చ ప్రయత్నాలు చేసేడు. గణపతికి ఫోనులో జరిగినది చెప్పి వెంటనే రమ్మన్నాడు. తన భార్య శాంతిని కూడా తెమ్మన్నాడు. గణపతి భార్య కుసుమ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆమెను తేవద్దన్నాడు. గణపతి, శాంతి కూడా జోగమ్మను ఓదార్చ ప్రయత్నించేరు. సుధాకర్ అంత్యక్రియలు దయానిధి గణపతి జరిపించేరు. వారిలో వారు మాట్లాడుకొని జోగమ్మను దయానిధి ఇంటికి తీసుకెళ్ళేరు.

జోగమ్మకు అంధకారమయిన తన భవిష్యత్తును తలచుకొని దిక్కు తోచలేదు. తను రెండుమాసముల గర్భవతి. గత సంవత్సరమే తండ్రి పరలోకం చేరడం; ఇద్దరు తమ్ముళ్లూ చేతకానివాళ్లవడం; ఆ పరిస్థితులలో తనను ఆదరించడానికి నా అన్న వాళ్ళెవ్వరూ లేకుండా అయింది. జీవితమంతా ముందుకే ఉంది. తనకున్న చదువుతో జీవితంలో తుదివరకు జీవించగలిగే ఉద్యోగం దొరకదని అనుకొంది. దయానిధి గణపతిల కుటుంబాలు ఆదరించినా; కలకాలం వారిపై ఆధారపడడం మనసుకు నచ్చలేదు. ప్రస్తుత పరిస్థితులలో తను బతికి, పుట్టిన బిడ్డను పెంచి పెద్దచేయడం అసంభవమనుకొంది, అందుచేత వెంటనే గర్భస్రావం చేయించుకోడం అవసరమనుకొంది. సమయం చూసుకొని ముత్యాలమ్మ, శాంతి తీరికగా ఉన్న సమయంలో మనసులోని మాట కన్నీళ్లతో చెప్పుకొంది. వారి సాయం కోరింది. అది మహాపాపమని ముత్యాలమ్మ ఆప్యాయంగా నచ్చచెప్పింది. శాంతి అత్తగారి సలహాను సమర్ధించింది. జోగమ్మ ఆలోచన తెలిసిన కుసుమ కూడా ముత్యాలమ్మ, శాంతి ఇచ్చిన సలహాయే ఇచ్చింది. విషయం తెలిసిన దయానిధి గణపతి; జోగమ్మకు పుట్టబోయే బిడ్డకు జీవితంలో ఏ ఇబ్బంది రాకుండా చూసుకొంటామని హామీ ఇచ్చేరు. తన మంచి కోరిన వారి సలహా మన్నించి జోగమ్మ తన ఆలోచన మార్చుకొంది. సమస్యలను ఎదుర్కోడానికి నిశ్చయించుకొంది.

జోగమ్మకు నవమాసాలు నిండేయి. పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఒడిలోని బిడ్డను చూడగానే మాతృమూర్తి మనసు వికసించింది. మరచిపోయిన మందహాసం నేనెక్కడికీ పోలేదని జోగమ్మ పెదవులను చేరింది. దయానిధి గణపతిల కుటుంబాలు మనస్ఫూర్తిగా సంతసించేరు. పుట్టిన శిశువుకు 'రామారావు' అని, సుధాకర్ తండ్రిపేరు పెట్టేరు.

రామారావుకు ఏడెనిమిది నెలలు నిండేయి. ఒకరోజు, దయానిధి తీరికగా ఉండడం గమనించి జోగమ్మ అక్కడకు వెళ్ళింది.

"అన్నయ్యగారూ, మీతో ఓ విషయం మాట్లాడాలనుకొంటున్నాను." అని వినయంగా చెప్పింది.

దయానిధి చెప్పడంతో కుర్చీలో కూర్చొంది.

"ఏమిటా విషయం; చెప్పండి." సగౌరవంగా అడిగేడు దయానిధి.

"మీ రెండు కుటుంబాలు నన్ను కడుపులో పెట్టుకొని ఆదరించేరు. మీరు చేసిన మేలు ఎప్పటికీ మరచిపోలేను..."

"మనం స్నేహితులమమ్మా. స్నేహితులు అన్నవాళ్ళు ఒకరి కష్టసుఖాలు ఒకరు పంచుకోవాలి. లేకపోతే స్నేహానికి విలువేమిటమ్మా."

"మీరన్నది నిజమే... నాకు...పనిచేసుకోగల శక్తి వచ్చింది. నాకు తగ్గ పని...ఎక్కడయినా ...దొరికితే పని చేసుకొందాం అనుకొంటున్నాను అన్నయ్యగారు."

"మీకు ఇప్పుడు ఆ అవసరం ఎందుకొచ్చింది. ఆ విషయం మరచిపోండి. హాయిగా రాముడితో ఆడుకొంటూ సంతోషంగా ఉండండి."

"ఒంట్లో శక్తి ఉన్నప్పుడు ఒకరి మీద ఆధారపడడం అంత మంచిది కాదని, మా అమ్మ చెబుతూ ఉండేది. అది తలచుకొని ఈ ఆలోచన చేసేను. నాకిక్కడ ఏ ఇబ్బంది లేదు. అయినా నా కాళ్ళమీద నేను నిలబడితే నాకు సంతృప్తిగా ఉంటుంది. ఒక చెల్లెలిగా మిమ్మల్ని కోరుకొంటున్నాను. దయచేసి కాదనకండి. ఏదో ఓ చిన్న పని చూసిపెట్టండి." అని వినయంగా కోరింది.

దయానిధి సందిగ్ధంలో పడ్డాడు.

"సరే ఆలోచిస్తాను." అన్నాడు.

సంభాషణ ముగిసింది.

ఏదో ఓ పని చేద్దామని ఆలోచిస్తున్న జోగమ్మ ధృడ అభిప్రాయాన్ని దయానిధి గణపతి చర్చించుకున్నారు. జోగమ్మ ఆత్మగౌరవం ఆమెను అలా ప్రోత్సహిస్తోందని అవగాహన చేసుకొన్నారు. వయసులో ఉన్న మనిషి; ఎక్కడో ఒక చోట పనిచెయ్యడం శ్రేయస్కరం కాదనుకొన్నారు. ఆలోచనలో పడ్డారు.

ఒక నెల తరువాత అనాధశరణాలయం మేనేజింగ్ కమిటీ మీటింగు అయింది. గణపతి, దయానిధి, ఎక్స్ M.L.A. సత్యారావు, మరో నలుగురు వ్యవస్థాపక సభ్యులు, అనాధశరణాలయంలోని సమస్యలు చర్చించుకున్నారు. శరణాలయంలో స్త్రీలు, చిన్నపిల్లల సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ఉన్న మేనేజరు పని సంతృప్తిగా లేదని కంప్లైంట్లు వచ్చేయి. ఆమె శరణాలయంలోని నివాసంలో ఉండడం లేదని, శరణార్థులతో అగౌరవంగా ప్రవర్తిస్తోందని శరణార్థులు కమిటీ మెంబర్లకు విన్నవించుకొన్నారు. గత సంవత్సరంనుండి ఆమెపై కంప్లైంట్లు వస్తున్నాయి. ఎన్నిమార్లు  చెప్పినా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. కమిటీ ఆలోచించుకొన్నారు. వేరే సరైన వ్యక్తిని చూసి, ప్రస్తుతం ఉన్న మేనేజరుకు ఉద్వాసన చెప్పదలచుకొన్నారు. దయానిధికి జోగమ్మ విషయం జ్ఞాపకం వచ్చింది. బహుశా జోగమ్మకు ఇది సరైన అవకాశమనుకొన్నాడు. మెల్లగా గణపతికి హింట్ ఇచ్చేడు. గణపతి అంగీకరించేడు. దయానిధి కమిటీ ముందు జోగమ్మ విషయం ప్రస్తావించేడు. 8 పాసయ్యింది; సంస్కారమయినది; మంచి ఉపాధ్యాయుడుగా పేరుండెడి సుధాకర్ మాస్టారి భార్య; అనాధశరణాలయంలోని స్త్రీలు, పిల్లల సమస్యలు అవగాహన చేసుకోగలదు; అన్నివిధాలా ఆమె మేనేజరుగా ఉండడం శరణాలయంలోని వారికి ఆమోదంగా ఉంటుందని కమిటీ మెంబర్లందరు ఏకగ్రీవంగా అంగీకరించేరు. పరిస్థితుల ప్రభావం వల్ల, ఒక్కమారుగా దిక్కులేనిదయింది. ఒక అనాథకు జీవనాధారం కల్పించ దలచుకొన్నారు. ఆమెకు ఆమె బిడ్డకు శరణాలయంలో ఉచిత ఆహార వసతి సౌకర్యాలు అందజేయ దలచుకొన్నారు. నెలకు వేయి రూపాయిల జీతం మీద జోగమ్మ అనాధశరణాలయం మేనేజరుగా ఓ మంచి రోజున పనిలో ప్రవేశించింది. జోగమ్మ జీవితంలో ఒక ఊహించని అధ్యాయానికి తెర లేపింది. వంటింటి పర్యవేక్షణ; శరణాలయ శుభ్రతలో జాగ్రత్తలు తీసుకోవడం; చిన్నపిల్లల సంరక్షణలో ఆయాకు సలహాలు ఇవ్వడం; ఇలా చేతినిండా పనులు ఉండడంతో జోగమ్మ మనసుకు గతంలోకి తొంగి చూడడానికి సమయం లేకపోయింది. తన పసివాడు రామారావుతో పిల్లలకు మంచి కాలక్షేపం దొరికింది. వీలయినప్పుడు దయానిధి గణపతిల ఇళ్లకు వెళ్ళేది. శరణాలయ మేనేజిమెంటులో అవసరమయిన సలహాలు తీసుకొంటూ ఉండేది. జోగమ్మ నూతన జీవితానికి అలవాటు పడ్డది.

గణపతి కొడుకు వివేక్, దయానిధి కొడుకు రమణ, రెండు సంవత్సరాల తేడాతో హైస్కూలులో అడుగు పెట్టేరు. జోగమ్మ కొడుకు రామారావు మిడిల్ స్కూలులో ప్రవేశించేడు. జోగమ్మ గర్భవతి అని తెలిసిన తరువాత కడుపులో బిడ్డను ఇంజినీరు చేయాలని సుధాకర్ కు దృఢమయిన ఆశయముండేది. ఎన్ని కష్టాలు పడైనా స్వర్గంలో ఉన్న భర్త కోరిక తీర్చాలని జోగమ్మ సంకల్పించుకొంది. ఆ సంకల్పం నెరవేరాలంటె కొడుకు తెలివితేటలుగా అన్ని క్లాసులలోను మంచి మార్కులు తెచ్చుకోవాలి. శరణాలయ వాతావరణం వాడి చదువుకు అనుకూలంగా లేదనుకొంది. కాని తను చేయగలిగింది ఏదీ లేదు. జోగమ్మ తన మనసులోని మాట దయానిధికి, గణపతికి చెప్పదలచుకోలేదు. రామారావుకు శరణాలయంలో చదువుకోడానికి సరైన వాతావరణం లేదేమో అని దయానిధి, గణపతి కూడా అభిప్రాయబడ్డారు. వాడు ప్రతి రాత్రి దయానిధి ఇంట ఉండి చదువుకోవచ్చని అనుకొన్నారు. దయానిధి వాడికి చదువులో సాయం చేయడానికి అవకాశం లభిస్తుందని అనుకొన్నారు. జోగమ్మతో ఆ విషయం చర్చించేరు. జోగమ్మ సంతోషించింది. తన కొడుకు చదువు విషయంలో వారు తీసుకొంటున్న శ్రద్ధకు ధన్యవాదాలు చెప్పుకొంది. రామారావు ప్రతిరాత్రి, పెందలికడనే భోజనం చేసి దయానిధి ఇంటికి వెళ్లడం ప్రారంభించేడు. శ్రద్ధగా చదువుకొని అక్కడే పడుకునేవాడు. ఉదయాన్నే లేచి శరణాలయానికి వెళ్ళేవాడు.

గణపతి కొడుకు వివేక్ 12 వ తరగతి మంచిమార్కులతో పాసయ్యేడు. తోటి వాళ్ళందరు ఇంజినీర్లో డాక్టర్లో కావాలనుకొంటున్నారు. అది తెలిసిన వివేక్ కూడా ఇంజినీరింగు చదవాలని కుతూహలబడ్డాడు. దానికి ఎంట్రన్సు పరీక్షలు రాయదలచుకొన్నాడు. తన ఆలోచన తండ్రితో పంచుకున్నాడు. గణపతి సందిగ్ధంలో పడ్డాడు. తను, కొడుకును M.A. చదివించి I.A.S. చేయించ దలచుకొన్నాడు. దయానిధితో ఆ విషయం చర్చించేడు. "గణపతీ, వివేక్ కోరుకొన్నట్లు చేయడమే మంచిది. I.A.S. పరీక్ష రాయడానికి ఏ డిగ్రీ అయినా ఫరవాలేదు. ఇంజినీర్లు డాక్టర్లు కూడా I.A.S. పరీక్షలు రాసి సెలెక్ట్ అవుతున్నారు. M.A. పాసయిన తరువాత I.A.S. కి సెలెక్టయితే మంచిదే. సెలెక్ట్ కాకపొతే; నన్ను చూస్తున్నావుగా; ఈ ఉద్యోగం కూడా సత్యారావుగారి ధర్మమా అని నాకు దొరికింది. ఇంజినీరింగు అయిన తరువాత I.A.S. కు సెలెక్ట్ కాకపోయినా సమస్య ఉండదు. అంచేత వాడు కోరుకొన్నట్లే కానీ." అని దయానిధి సలహా ఇచ్చేడు. గణపతికి ఆ సలహా నచ్చింది. వివేక్. ప్రముఖ ఇంజినీరింగు కాలేజీల ఎంట్రన్సు పరీక్షలు రాసేడు. IIT ఖర్గపూర్ లో సీటు పొందేడు. రెండేళ్ల తరువాత దయానిధి కొడుకు రమణ, 12 మంచి మార్కులతో పాసయ్యేడు. తనకు కెమిస్ట్రీలో Ph.D. చేయాలని కోరిక ఉన్నట్లు తండ్రితో చెప్పేడు. I.A.S. ఆఫీసరు కావాలని తనకు ఆశయం లేదన్నాడు. దయానిధి మనసులో నిరాశ చెందేడు. విషయం గణపతితో చర్చించేడు. ఇద్దరూ ఆలోచించుకొని రమణను వాడు కోరిన చదువే చదివించడం మంచిదని అభిప్రాయబడ్డారు. రమణ B.Sc. లో జాయినయ్యేడు.

జోగమ్మ కొడుకు రామారావు బాగా తెలివితేటలుగా చదువుకొంటున్నాడు. వాడు 12 లో ఉన్నాడు. తరచూ జోగమ్మ కొడుకుతో, “బాబూ, నువ్వు బాగా కష్టపడి మంచిమార్కులు తెచ్చుకొని ఇంజినీరు కావాలి. అది మీ నాన్నగారి ఆశ." అని నొక్కి నొక్కి చెప్పేది. జోగమ్మ ఉద్యోగంలో ప్రవేశించినాటినుండి, అది దృష్టిలో పెట్టుకొని వీలయినంత వెనకేస్తూ ఉండేది. శ్రద్ధతో చదువుకొని ఇంజినీరు అయి; తల్లి కోరిక, స్వర్గంలో ఉన్న తండ్రి కోరిక నెరవేర్చదలచుకొన్నాడు. మాటల సందర్భంలో ఒక రాత్రి దయానిధి రామారావును "రామా నీకు ఏమి చదవాలని ఉంది." అని అడిగేడు. రాముడు ఇంజినీరింగు చదవాలని ఉందన్నాడు. "M.B.B.S. చదవాలని లేదా. డాక్టరువయితే, ఎందరివో రోగాలు బాగుచెయ్యగలవు." అని రాముడి మనసు తెలుసుకోడానికి దయానిధి అడిగేడు. అది తన దివంగత తండ్రి కోరిక అని, తన తల్లి కూడా కష్టపడి బాగా చదువుకొని ఆ కోరిక నెరవేర్చాలని తనతో పలు మార్లు చెప్పిందని రాముడు వినయంగా జవాబిచ్చేడు. దయానిధి సంతోషించేడు. ఆ మరునాడు, గణపతితో ఆ విషయం చెప్పేడు. ఇద్దరూ స్వర్గస్తుడయిన తమ మిత్రుని కోరిక తీర్చదలచుకొన్నారు. తమ అభిప్రాయాన్ని జోగమ్మతో పంచుకొన్నారు. జోగమ్మ వారికి కృతజ్ఞతలు చెబుతూ వారందజేసే ఆర్ధిక సహాయాన్ని ఋణరూపంగా ఇస్తే సంతోషిస్తానంది. గణపతి వడ్డీ లేని ఋణం ఇస్తానన్నాడు. జోగమ్మ కృతజ్ఞతతో అంగీకరించింది.

రాముడు చదువుకు దయానిధి ప్రోత్సాహం మెరుగులు దిద్దింది. విశాఖపట్నం ఇంజినీరింగు కాలేజీలో అడుగుపెట్టేడు. తన భర్త కోరిక నెరవేరినందులకు జోగమ్మ ఎంతో సంతోషించింది. ఆ కోరిక నెరవేర్చినందులకు దయానిధి గణపతిలను వేనోళ్ళ పొగిడింది. మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞతలు సమర్పించుకొంది. గణపతి గతంలో తను ఇచ్చిన హామీ నెరవేర్చుతూ రాముడు చదువుకు కావలిసిన ఆర్ధిక సహాయం అందజేస్తున్నాడు.

వివేక్, ఇంజీరింగు ఫస్టు క్లాసులో పాసయ్యేడు. అమెరికాలో New York పట్టణంలోని యూనివర్సిటీలో M.S. ప్రోగ్రేము చేసి, అదే పట్టణంలో ఒక బహుళజాతి కంపెనీలో ఉద్యోగపర్వం ప్రారంభించేడు. వివేక్ పెళ్లికొడుకుల లిస్టులో పడ్డాడు. ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసరుగా పనిచేసున్న సంజయ గుప్తాగారి అమ్మాయి నీరజతో పెళ్లి కుదిరింది. నీరజ కంప్యూటరు ఇంజినీరింగు పాసయి ఢిల్లీలో, ఒక ప్రయివేటు కంపెనీలో నెలరోజులై పని చేస్తున్నాది. వివేక్, నీరజ, ఒక ఇంటివాళ్లయ్యేరు. గణపతికి కుసుమకు ఒక పెద్ద బాధ్యత తీరింది. పెళ్లయిన ఏడెనిమిది నెలలకు నీరజ, అమెరికా నేలమీద అడుగుపెట్టింది. త్వరలోనే ఒక కంప్యూటర్ కంపెనీలో ఉద్యోగం పొందింది. వివేక్, నీరజలు ఉద్యోగంలో బాగా స్థిరబడ్డారు.

గణపతి కొడుకు వివేక్ గూర్చి తెలుసుకున్నాం గదా. దయానిధి కొడుకు రమణ విషయం తెలుసుకొందాం. రమణ 92% మార్కులతో B.Sc. పాసయ్యేడు. బెనారస్ హిందూ యూనివర్సిటీలో M.Sc. చేసి, అక్కడే Ph.D. కూడా చేసేడు. భాభా ఎటామిక్ రీసెర్చ్ సెంటరులో సైన్టిస్టుగా ముంబైలో ఉద్యోగంలో చేరేడు.

కాలచక్రం తిరగడంతో రాముడు ఇంజినీరింగు చెప్పుకోదగ్గ మార్కులతో పాసయ్యేడు. జంషెడ్పూరులో టాటావారి ఉక్కు కర్మాగారంలో ఇంజినీరుగా ఉద్యోగం దొరికింది. జోగమ్మ కలలు ఫలించేయి. భర్తను తలచుకొని, 'మీ కోరిక నెరవేరింది' అని, ఆనంద బాష్పాలతో మనసులో చెప్పుకొంది. సంతోషంతో పొంగిపోయింది. పుత్రరత్నాన్ని దగ్గరగా హద్దుకొని వాడి తలపై ముద్దుల వర్షం కురిపించింది. తల్లీ, కొడుకు, బజారులో పేరున్న దుకాణంలో నేతి మిఠాయి కొనుక్కొని దయానిధి గణపతి లకు ఉభయులూ సాష్టాంగ నమస్కారం చేసి అందజేసేరు. రెండు కుటుంబాల వార్లకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసేరు. మంచిరోజు చూసుకొని రాముడు ఉద్యోగంలో ప్రవేశించేడు.

****సశేషం****

Posted in August 2023, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!