Menu Close
Satyam-Mandapati
‘అనగనగా ఆనాటి కథ’ 12
సత్యం మందపాటి

స్పందన

ఒక అసమర్ధుడైన సామాన్యుడు సమాజంలో బ్రతకలేకపోయినప్పుడు, కనీసం ఊహల ఊయలలో ఊగుతూ, కొన్ని క్షణాలు తన మనసుకి సంతోషం కలుగుజేసుకునే ఆశ, అవకాశం ఉంటాయా? ఉంటే అవెలా ఉంటాయి? మరి మళ్ళీ ఆ కలలోనించీ ఇలలో కాలు పెడితే, ఆ మానసిక ప్రవృత్తి ఎలా ఉంటుంది? ఈ చిన్న భావనతో ఎన్నో ఏళ్ల క్రితం ఈ కథ వ్రాసిన వెంటనే ఆనాటి ప్రముఖ మాసపత్రిక ‘జ్యోతి’ వారు వెంటనే స్పందించి ప్రచురించారు. చదివి ఎలావుందో చెబుతారు కదూ!

ఆస్‍మాన్‍సే…

(ఈ కథ ‘జ్యోతి’ మాసపత్రిక ఏప్రిల్ 1974 సంచికలో ప్రచురింపబడింది)

Aasmaansae story image

గోపాలం నౌబత్ పహాడ్ పైన నుంచుని చుట్టూ చూశాడు. రంగురంగుల నియాన్ లైట్లతోనూ, రోడ్డు పక్కన వరుసగా ఉన్న మెర్క్యురీ దీపాలతోనూ, కదిలే కార్ల లైట్ల వింత వెలుగులతోనూ భాగ్యనగరం మెరిసిపోతున్నది.

భాగ్యనగరమని హైద్రబాద్‍కు పేరు రావటానికి కారణం అక్కడ అందరూ తనలాంటి భాగ్యవంతులేనా? అసలు దరిద్రులే లేరా? అదోరకమైన వింత ఆలోచన వచ్చింది గోపాలానికి.

చుట్టూరా చూశాడు. ఆకుపచ్చటి నియాన్ లైట్ల అందమైన కాంతి ముందు వెలవెలా పోతున్న మామూలు గుడ్డి దీపాలు కనపడ్డాయి. ఆతని ఆలోచనకు ఏదో జవాబు స్ఫురించినట్లయింది.

అక్కడ అందంగా కత్తిరించబడ్డ లాన్ మీద పడుకున్నాడు. చేయి తల క్రింద ఉంచుకుని అలా ఆకాశం వేపు చూశాడు.

తనలోనే వెన్నెల అంతా నింపుకుని మిడిసిపడుతున్న చంద్రుడి ముందు వెలవెలా పోతున్న నక్షత్రాలు ఎన్నో కనపడ్డాయి. గోపాలానికి నవ్వు వచ్చింది. పెద్దగా నవ్వేశాడు కూడాను.

ఒకళ్ళకు ఒకళ్లు ఆనుకుని, లోకాన్ని మరచి ఏదో మైమరుపులో ఉన్న నవదంపతులు ఇతని నవ్వు విని, కొంచెం దూరంగా జరిగారు.

మెత్తటి భుజాల నునుపునీ, మెరుపునీ, అందమైన వీపు తెల్లదనాన్నీ దాచలేక పోతున్నది ఆమె తొడుక్కున్న నీలం రంగు స్లీవ్‍లెస్ బ్లవుజ్.

ఉన్నదో లేదో అని అనుమానం వస్తుందని కాబోలు, వంపులు తిరిగిన నడుముని, అనుమాన నివృత్తి కోసం, బాగా కనపడేటట్లుగా చీర ఎంతో క్రిందకు కట్టిన ఆమె, మళ్ళీ అతనికి దగ్గరగా జరిగింది.

ఆమెను చూడగానే ఊహాలోకంలో విహరిస్తున్న గోపాలానికి సావిత్రీ, గాయత్రీ గుర్తుకి వచ్చారు.

సావిత్రిలో అదొక విధమైన ఆకర్షణ ఉంది. అందంకన్నా ఆమెలో ఆ ఆకర్షణ ఎక్కువగా ఉండటానికి కారణం, ఆమె మాట తీరూ, ఆ మాటలను అందంగా చెప్పే ఆ తీయటి, ఎర్రటి పెదవులూ.

“ఈ ఎయిర్‍కూలర్ ఇంత చల్లదనాన్ని ఇస్తున్నా, నీ సన్నిధిలో ఎంతో వెచ్చగా ఉంటుంది” అనేది తన నీలి కళ్ళలో మరింత సోయగాన్ని నింపుతూ.

“ఈ ఫోం పరుపుల మెత్తదనం, నీ హృదయం ముందు ఎందుకూ పనికిరాదు” అనేది తన హృదయం మీద వాలి తన్మయత్వంతో కళ్ళు మూసుకుని.

తను నవ్వేవాడు.

“నవ్వకు, అలా నవ్వితే నీ హృదయ స్పందన ఎక్కువయి, నా ఆనందం చెదిరిపోతుంది” అనేది! అంటూనే తన నవ్వుని, ఆమె పెదవులతో ఆపేసేది.

పెళ్ళయిన తర్వాత ఎక్కడ ఉందో, ఎలా ఉందో సావిత్రి!

సావిత్రిలో ఉన్నది ఆకర్షణ అయితే, గాయత్రిలో ఉన్నది అసలైన అందం. అందమైన అందం ఆమెది. సన్నగా సన్నజాజి తీవలా ఉంటుంది. మల్లెమొగ్గలలోని సుమధురమైన గుబాళింపు ఉన్నది ఆమెలో. హరివిల్లులా వంపు తిరిగిన ఆమె ముక్కులోనే ఆ అందం ఉన్నదో, ఆమె లేత గులాబీ రంగు బుగ్గలలోని లావణ్యంలోనే ఆమె అందం ఉన్నదో చెప్పటం కష్టం.

తనని వదిలి ఒక్క క్షణం కూడా ఉండగలిగేది కాదు. ఆమెనీ, ఆమె లక్షల ఆస్తినీ స్వంతం చేసుకోమనేది.

“నాకున్న ఎన్నో లక్షల ఆస్తి నాకు చాలు. కాని అమూల్యమైన నిన్నూ, నీ అందాన్ని మాత్రం జన్మజన్మాలకూ కోరుకుంటాను!” అనేవాడు.

గాయత్రి మత్తుగా నవ్వేది. ఆ మత్తులోనే తన సర్వస్వం దాసోహం చేసింది. తను ఆమెని పెళ్ళాడలేనని చెప్పినప్పుడు ఒక్క క్షణం అదోలా చూసింది. మరో క్షణంలో గలగలా నవ్వింది.

‘ఓకే, నువ్వు సుఖంగా ఉంటే నాకదే చాలు!” అన్నది. తన చేతిని మృదువుగా ముద్దు పెట్టుకుని కనుమరుగైంది. విచిత్రమైన మనిషి!

సావిత్రిలోని ఆకర్షణా, గాయత్రిలోని అందం, రెండూ పూరిగా వున్నాయి మాలతిలో.

అందుకే ఆమెతో అసలు పరిచయం లేకపోయినా మాలతిని పెళ్ళి చేసుకోవటానికి వెంటనే అంగీకరించాడు. మాలతి అందంకన్నా, ఆకర్షణకన్నా మించిన ఆస్థితో తన స్వంతమయింది.

“మీకు అందరిలా ఉద్యోగాలు చేసే అవసరం లేదు కనుక, ఎప్పుడూ నా ముందే కూర్చుని నా కళ్ళల్లోకే చూస్తూ ఉండండి!”

ఆమె చెప్పింది నిజమే కాబట్టి, అందులో తనకీ ఒక విధమైన ఆనందం కనపడింది. అందుకే అదే పని చేసేవాడు. జీవితంలోని మాధుర్యాన్ని తమకంటే ఎక్కువగా ఎవరూ చవిచూడలేదేమో!

ఫ్రిడ్జిలోనించీ అప్పుడే తీసిన వెన్నముద్దలాటిది మాలతి మనసు. మెత్తగా జారిపోయే ఇంపోర్టెడ్ కారులోని సౌఖ్యం ఉంది ఆమె ఒడిలో. స్కాచ్ విస్కీలో ఉన్న కిక్ ఉన్నది ఆమె నడకలో, నాజూకుతనంలో.

ప్రక్కనే కూర్చున్న నవదంపతులు మెల్లగా లేచారు. ఆమె అతని చేయి పట్తుకుని తన తలని అతని భుజానికి ఆనించి నెమ్మదిగా నడుస్తున్నది.

ఒక బిచ్చగాడు వాళ్ళ వెంటపడి డబ్బులు అడుగుతున్నాడు.

గోపాలానికి కోపం వచ్చింది. అసలు భారతదేశంలోని బిచ్చగాళ్ళందరినీ దేశంలోనించీ తరిమేయాలి. అప్పుడే దేశం బాగుపడుతుంది. అప్పుడు ‘గరీబీ హఠావో’ లాటి నినాదాలతో పని ఉండదు.

ఆ జంట మెల్లగా వెళ్ళి కార్లో కూర్చున్నారు. ఆమె డ్రైవ్ చేస్తున్నది. అతను ఆమెను ఆనుకుని కూర్చున్నాడు.

మాలతికి ఇండియాలో చేసిన కార్లంటే మహా చిరాకు. రెండు విదేశే కార్లను కొనిపించింది. పార్టీలకు పెద్ద కారు. షికార్లకు చిన్న కారు. లేడీస్ క్లబ్ ప్రెసిడెంట్ కనుక ఆమాత్రం హోదా అవసరం అనేది. మినిస్టర్ గారి భార్య, కలెక్టర్ గారి భార్య తన చుట్టూ తిరుగుతుంటే, “వీళ్ళంతా నా శాటిలైట్లు” అనేది.

ఆమె పెదవుల మధ్యనించీ వచ్చే ఆ ‘తీయటి’ మాటలను తను ఆ పెదవుల మీదే మింగేసేవాడు.

ఏడు అంతస్థుల హోటల్ కావును, లైట్లతో మెరిసిపోతూ నౌబత్ పహాడ్ మీదనించీ చూస్తుంటే, నగ్నంగా నిలబడ్డ అప్సరసలా కనపడింది గోపాలానికి.

వాన వచ్చేటట్టుగా ఉంది. పెద్దగా గాలి వీస్తున్నది.

ఆకాశం ఫెళ్ళుమని ఉరిమింది.

ఉలిక్కిపడ్డాడు గోపాలం.

మళ్ళీ పెద్దగా ఉరిమింది ఆకాశం.

ఎక్కడో పిడుగు కూడా పడ్డట్టుంది.

గోపాలం ఆశల ఆలోచనలు విశాలాకాశంలోకి ఎగిరిపోయి, చిరుజల్లుగా క్రిందకు పడటం మొదలుపెట్టాయి.

అతను లేచేంతలోనే వాన పెద్దదవుతున్నది.

చటుక్కున పైకి లేచి చుట్టూ చూశాడు.

తను కొండ మీద అందరికన్నా ఎత్తులో ఉన్నాడు. అంటే ఆకాశంలో ఉన్నాడు. ఇప్పుడు వాన వస్తున్నది. తల దాచుకోవాలి. తను ఆశాలోకపు ఆకాశం మీదనించి భూమి మీదకు రావాలి. ఊహాలోకంనించీ వాస్తవ ప్రపంచంలో అడుగుపెట్టాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ఆకలితో మాడుతున్న పొట్టలో ఏమైనా పడేయాలి.

సుఖంగా ఉన్న తాత్కాలిక ఊహాలోకపు కొండలు ఎక్కినా, వాన రూపంలో వచ్చే ఆకలీ, జీవన సత్యాలు భూమి మీదకు బలంగా లాగుతాయి. గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే ఇదే కాబోలు!

వాన ఇంకా పెద్దదయింది.

గోపాలానికి ఆకలి ఇంకా పెరిగిపోతున్నది.

చెప్పులు లేని కాళ్ళతో చకచకా కొండ దిగటం ప్రారంభించాడు.

పెరిగిన అతని గడ్డం, ఇందాక అతను పడుకున్న లాన్ కన్నా ఎక్కువ దుబ్బుగా ఉంది.

లోతుకుపోయిన అతని కళ్ళు, అతని ఊహాలోకపు అమ్మాయిల శరీరపు వంపులకన్నా లోతుగా ఉన్నాయి.

తను కాలేజీలో ఉండగా మొదటినించీ తననీ, తన దారిద్యాన్నీ చూసి అసహ్యించుకుని, అతని ఊహల్ని ఆ ఊహాలోకంలోనే ఉంచి, అతనికి దూరంగా పారిపోయిన సావిత్రిలా వేగంగా పరుగెత్తుతున్నాడు ఇందాకటి బిచ్చగాడు.

“నువ్వు ప్రపంచంలో ఊపిరి పీల్చటానికి అనర్హుడివి. నిన్నెలా ప్రేమిస్తాను” అని అతని ముఖం మీదే అనేసి, తన ఉనికినే అపహాస్యం చేసిన గాయత్రి నవ్వులా ఆకాశం ఉరుముతున్నది.

వానలో తడుస్తూ పరుగెత్తుతున్న డొక్కలు ఎండిపోయిన కుక్కని చూడగానే తన భార్య మాలతి గుర్తొచ్చింది. ఉద్యోగం రానీయమని ఎంత మొత్తుకున్నా వినకుండా రోగిష్టి మాలతితో పెళ్ళి చేశారు. వాళ్ళు ఇచ్చిన కట్నం డబ్బుతో తన చెల్లెలుకి మొగుడు దొరికాడుగానీ, తనకి ఉద్యోగం దొరకలేదు. కానీ తనకి మాత్రం నాలుగేళ్ళలో నలుగురు పిల్లలు తయారయారు.

వాన బాగా పెద్దదయింది.

గోపాలం గబగబా భూమి మీదకు వచ్చేస్తున్నాడు.

తన ఇంట్లో కూడా వాన కురుస్తూనే ఉంటుంది. గమ్మత్తేమిటంటే, బయట వాన తగ్గినా, తన ఇంట్లో ఇంకా కురుస్తూనే ఉంటుంది. ఆ పూరికొంప వానాకాలం వెళ్ళిపోయిన కొన్ని వారాల దాకా వర్షిస్తూనే ఉంటుంది.

అతను పూర్తిగా భూమి మీదకు దిగాడు.

ఎదురుగా చూశాడు. హోటల్ కనపడింది. వాళ్ళు వృధా చేసేటంత అన్నం చాలు తన కుటుంబంలో అందరి కడుపులూ నిండటానికి.

గోపాలం దీర్ఘంగా నిట్టూర్చాడు.

కానీ ఆకాశం వేపు చూడలేదు. ఎందుకో భయం వేసింది.

నేల మీద నిటారుగా నుంచుని, ఆకలి బాధకు తాళలేక “అమ్మా!” అని పెద్దగా అరిచి, బావురుమన్నాడు!

Posted in August 2023, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!