Menu Close
వీక్షణం సాహితీ గవాక్షం-131 వ సమావేశం
-- కె వి యస్ గౌరీపతి శాస్త్రి(వీరవతి) --

అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో వీక్షణం 131 వ సాహితీ సమావేశం జూమ్ (Zoom) వేదికగా సంస్థాపక అధ్యక్షులు డా. కె గీతామాధవి ఆధ్వర్యంలో జూలై 9, 2023 వ తేదీన చాలా ఆసక్తికరంగా ప్రారంభమయింది. ముందుగా డా. గీతామాధవి సభకు విశేష సంఖ్యలో విచ్చేసిన అతిథులు/కవులు/సాహితీవేత్త లందరికీ స్వాగతం పలుకుతూ, కార్యక్రమాన్ని నిర్వహించవలసినదిగా ప్రశాంతి రామ్ గారిని కోరడం జరిగినది. ఈమె ముందుగా సభికులు అందరికీ స్వాగతం పలుకుతూ, ఈ కార్యక్రమ అతిథి డా.గీతామాధవి గారిని సభకు పరిచయం చేశారు.

డా.కె. గీతామాధవి, ప్రముఖ కవయిత్రి, రచయిత్రి, గాయని, భాషానిపుణురాలు, 'నెచ్చెలి' అంతర్జాల వనితా మాస పత్రిక వ్యవస్థాపకురాలు, సంపాదకులు. ఈమె అమెరికాలో ప్రఖ్యాత సాఫ్ట్ వేర్ కంపెనీలో లింగ్విస్ట్ గా పనిచేస్తూ, వృత్తితో పాటు ప్రవృత్తిలో గూడా నిబద్ధతతో, నియమబద్ధంగా, క్రమశిక్షణతో పనిచేసే వ్యక్తి. ఈమె ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇంగ్లీషు, తెలుగు భాషలలో ఎం.ఏ.లు, తెలుగు భాషాశాస్త్రంలో పి.హెచ్.డి., అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంటులో ఎం.ఎస్. చేసి, 10 సంవత్సరాలు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి 2006 సంవత్సరములో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందినారు. ఈమె తూర్పుగోదావరి జిల్లా, జగ్గంపేటలో ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి, శ్రీ కె. రామ్మోహనరావు గార్లకు జన్మించి, శ్రీ సత్యన్నారాయణ గారిని వివాహం చేసుకొని, ప్రస్తుతం ముగ్గురు పిల్లలతో 'కాలిఫోర్నియాలో' నివాసం ఉంటున్నారు.

డా.కె.గీతామాధవి గారి రచనలు ద్రవభాష(2001), శీత సుమాలు(2006), శతాబ్ది వెన్నెల (2013) , సెలయేటి దివిటీ (2017), అసింట (2022) అనే కవితా సంపుటాలు, సిలికాన్ లోయ సాక్షిగా(2018) కథా సంపుటి, వెనుతిరగని వెన్నెల (2021) నవల ప్రచురింపబడినాయి. "అపరాజిత" (గతముప్పయ్యేళ్ల స్త్రీవాద కవితా సంకలనం 1993-2022) 2022 కు సంపాదకత్వం & ప్రచురణ వహించారు. 'గీతా కాలం', "అనగనగా అమెరికా" అనే కాలమ్స్, "నా కళ్లతో అమెరికా", "యాత్రాగీతం" అనే ట్రావెలాగ్స్, "కంప్యూటర్ భాషగా తెలుగు" భాషా పరిశోధనా వ్యాసాలు (తెలుగు, ఇంగ్లీషు భాషలలోను), మరియు "లలితగీతాలు" వీరి ఇతర రచనలు. కవిత్వంలో అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం మొ।। లగు అవార్డులు, ఈమె నవల "తెన్నేటి హేమలత" కు వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ సాహితీ పురస్కారాలు అందుకున్నారు.

డా. గీతామాధవి అనేక రేడియో కార్యక్రమాలలో విరివిగా పాల్గొన్నారు. సాహిత్య అకాడెమీ ఆహ్వానంపై భారతదేశం లోని ఢిల్లీ, బొంబాయి, కలకత్తా, అస్సామ్ వంటి అనేక ప్రాంతాల్లో సభలలో పాల్గొన్నారు మరియు దేశ వ్యాప్తంగా ప్రతిష్టాత్మక బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం, బెంగుళూరు విశ్వవిద్యాలయం, తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, నన్నయ్య విశ్వవిద్యాలయం, అనేక డిగ్రీ స్థాయి కళాశాలల్లో తెలుగు భాష, సాహిత్యాలపై ఉపన్యాసాలిచ్చారు. అమెరికాలో తానా, ఆటా, టాటా, వంగూరి ఫౌండేషన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండు, ఫ్రాన్స్ వంటి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ వేదికలపై ప్రసంగించారు. 2017 లో హైదరాబాద్ లో జరిగిన తెలుగు మహాసభలకు అమెరికా నుండి ప్రత్యేక అతిథిగా ఆహ్వానం పొంది కవిత్వ వేదికలో పాల్గొన్నారు. 2019 లో "తెలుగు టైమ్స్" వారిచే అమెరికాలోని 17 మంది తెలుగు ప్రముఖుల్లో ఒకరిగా గుర్తించబడ్డారు. అమెరికాలోని "తానా" తెలుగు బడి "పాఠశాల"కి గత దశాబ్దిగా కరికులం డైరక్టర్ గా సేవలందిస్తున్నారు.

ఈమె లలిత సంగీత గాయనిగా అనేక బహుమతులు అందుకుని, 2017 లో గీత రచయితగా, గాయనిగా సినిమా రంగ ప్రవేశం చేశారు. "గీతామాధవి” షార్ట్ ఫిలిమ్స్ అధినేత. టోరీ తెలుగు రేడియోలో "గీతామాధవీయం" పేరుతో సంగీత, సాహిత్య టాక్ షో లు నిర్వహిస్తున్నారు. కాలిఫోర్నియాలో నెలనెలా సాహితీ సమావేశాలు జరుపుకునే "వీక్షణం" రచయితల సాహితీ వేదిక, తెలుగులో రచయితలందరి వివరాలు పొందుపరిచే "తెలుగు రచయిత" వెబ్సైటు వ్యవస్థాపక అధ్యక్షులు & నిర్వాహకురాలు.

ప్రశాంతి రామ్ గీతామాధవి గారిని ఆహ్వానిస్తూ “ఈ రోజు సభకు డా. గీతామాధవి విశిష్ట అతిథిగా విచ్చేసి, తాను రచించిన 'వీమా' కథా విశేషాల్ని  పంచుకోనున్నారు” అని తెలియజేసి, కథాపఠనం చేయవలసినదిగా డా. గీతామాధవి గారిని కోరినారు.

ఈ 'వీమా' కథా నేపథ్యం గురించి చూస్తే, “ఎన్ని జన్మల పుణ్యఫలమో ఈ మానవ జీవితం. ఈ మానవ జీవిగా ఈ భూమి మీద పడడం/ పుట్టడం ఒక అధ్యాయం. ఎదగడం, విద్యాభ్యాసం, ఉపాధి(పోషణ) అనేవి ఒక అధ్యాయం. ఇందులోనే వివాహం, స్వతంత్రజీవనం అనేది ఒక భాగం. ఇక్కడే ఇరుమనుషులు (ఆడ, మగ) కలవడం, ఆ కలిసే సమయంలో ఎన్నో ఆశలు/ ఆశయాలు. ఆ ఆశతోనే దంపతులవడం, తల్లిదండ్రులుగా మారడం, బిడ్డల్ని కనడం, వారిని ప్రయోజకులుగా తీర్చి దిద్దడం ఒక స్వప్నం లాంటి నిజం. ఆ స్వప్నం సుందరమైతే ఆ జీవితం ఆనందమయం. అందులో అవరోధాలొస్తే అంతా ఆవేదనా భరితం. అలా అవాంతరం ఆదిలోనే ఎదురైనా, దిగాలు పడకుండా ఎదుర్కొని, జీవితాన్ని సఫలం చేసుకోవడానికి మార్గం వెదకడం, ఆ జీవితాన్ని ఆనందమయం చేసుకోవడానికి ధైర్యంగా ప్రయత్నించడం ఒక సాహసంతో కూడిన పని.

ఈ కథలో “వీమా” అనే బాలిక 'డౌన్ సిండ్రోమ్' తో జన్మించడం, దానితో తల్లితండ్రులు వేదనకు గురి అవడం, ఆ పరిస్థితులను ఎలా తట్టుకొని నిలబడ్డారు, ఆ పాపాయిని ఎలా సాకారు అనే నేపథ్యంలో ఈ కధ నడుస్తుంది. ఆ విషయాలు సాటి సమాజంతో పంచుకోవాలనే కవయిత్రి తలంపునుంచి, అక్షరరూపం దాల్చిన ఈ కథ, సాహితీ సమావేశంలో గీతామాధవి గొంతునుండి వివిధ వేదనాభరితమైన హావ భావాలతో వెలువడింది. ఆ కథ లోని ముఖ్య విషయాలను సంగ్రహంగా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది.

వీమా కథాసారాంశం : 

సాగర్, సుమ అమెరికాలో(కాలిఫోర్నియాలో) వారి వారి వృత్తుల రీత్యా స్థిరపడతారు, ఆనందంగా గడుస్తున్న వైవాహిక జీవితం. వివాహం అయిన మూడేళ్లకి ఐ.వి.ఎఫ్. ద్వారా సుమ గర్భం దాలుస్తుంది. రాక రాక వచ్చిన గర్భం. అందరి ఆడపిల్లల్లాగానే అమ్మ తన దగ్గరికి సాయంగా రావాలని కోరుకొంది. నాన్న గారి అనారోగ్య కారణంగా అమ్మ రాలేక పోయింది. అత్తగారు వచ్చినా పెద్దగా ఉపయోగం ఉండదని తెలిసినా, ఆవిడ రాక తప్పలేదు. ఇంతలో నాల్గవ నెల నిండుతుండగా, వైద్యపరీక్ష నిమిత్తము భర్తతో కలిసి హాస్పిటల్ కి వెళ్ళడం జరిగింది. డాక్టర్ 'ఆమ్నియోసింటసిస్' డయాగ్నిస్టిక్ టెస్ట్ చేయించుకుంటావా అని అడుగుతారు. ప్రశ్నార్ధకంగా చూసిన సుమని ఉద్దేశిస్తూ, 'ఇందులో భయపడాల్సింది ఏమీ లేదని అంటూ ఒక వయసు వచ్చిన గర్భిణీలకు సాధారణంగా చేసేదేనని, ఇందులో బేబీకి జెనెటిక్ కాంప్లికేషన్స్ ఉంటే తెలుస్తుందని, కానీ దీనివల్ల నొప్పి, అబార్షన్ కావడం వంటి రిస్కులు కూడా ఉంటాయని, ఇది ఆప్షనల్ అని, మీకు ఇష్టమైతేనే చేస్తామని డాక్టర్ చెప్తారు. చివరిగా దంపతులు ఆ టెస్టుకి విముఖత చూపడం జరుగుతుంది.

తరువాత డెలివరీ డేట్ రావడం, హాస్పిటల్ కి వెళ్ళడం, టెస్టులు చేసి బేబీ అడ్డం తిరిగిందని చెప్పడం, సిజేరియన్ చేసి బిడ్డని (పాప) ఇచ్చి రూముకి షిఫ్ట్ చేయడం జరిగింది. సిజేరియన్ సమయంలో ఇచ్చిన సెడేషన్ వలన మత్తుగా ఉన్నా, ఆ మత్తులో పాపని చూసిన మొదటి క్షణాన్ని భర్త సాగర్ ముఖములోని సంతోషాన్ని, పాపకి మొదటిసారి పాలు ఇచ్చినపుడు సుమలో కలిగిన అనుభూతుల్ని అద్భుతంగా వర్ణించారు కవయిత్రి.

నాల్గో రోజున డిశ్చార్జ్ చేసే సమయానికి రొటీన్ రౌండ్స్ కి వచ్చిన డాక్టరుతో మరో స్పెషలిస్ట్ రావడం, పాపాయిని అటూ ఇటూ త్రిప్పి పరిశీలించి వెనుక మెడ వద్ద చిన్నగా ఉబ్బి ఉన్నట్లు గమనించి, పాపకి క్రోమోజోమ్ టెస్ట్ చేయించమని చెప్తారు. వారి ఆలోచన్ల నడుమనే సాగర్, డాక్టర్ చెప్పినట్లే చేద్దామని నిర్ణయించుకోవడం, ఆ రోజు నాలుగో రోజు అవడం, డిశ్చార్జ్ లోపే బర్త్ సర్టిఫికేటుకి అప్లై చేయాల్సి రావడం, ఆ సమయంలోనే సుమ కోరిక మేరకు పాప పేరుని 'రీమా' గా నిర్ణయించే ముందు పాప అనుమతి కూడా తీసుకున్నట్లు, చాలా హృద్యముగా వర్ణించారు కవయిత్రి.

పాప పుట్టిన ఆనందంతో ఇంటిని సాగర్ డెకరేట్  చేయడం, దిష్టి తీసి ఇంటిలోనికి వెళ్ళగానే డాక్టర్ చెప్పిన టెస్ట్ విషయం గుర్తుకు వచ్చి ఆ ఆనందం అంతా ఆవిరయినట్లు చెప్తారు కవయిత్రి.

క్రోమోజోమ్ రిపోర్ట్ వచ్చిన మర్నాడు ఆఫీసుకి సెలవు పెట్టి ఇంటర్నెట్ లో సాగర్ ఏవేవో శోధించడం మధ్యాహ్నం డాక్టర్ అపాయింటుమెంటు ఇవ్వడం, వస్తానన్న అమ్మని ఒప్పించి, ఇంట్లోనే ఉంచి, పలు విధాల ఆలోచనల్లో మునిగి ఉన్న సుమతో కలిసి హాస్పిటల్ కి పాపని తీసుకొని బయలుదేరుతాడు సాగర్.

నర్సు లోపలికి పిలవగానే అక్కడ ఒక పిల్లల స్పెషలిస్టు, ఒక క్రోమోజోమ్ టెస్టుల స్పెషలిస్టు, మరొకరు కౌన్సిలింగ్ స్పెషలిస్టు ఎదురుచూస్తూండడం జరిగింది. ముందుగా డాక్టర్ క్రోమోజోమ్ టెస్టు గూర్చి వారికి గల అవగాహనను ప్రశ్నించి, విషయం వివరిస్తూ, సాధారణంగా అందరికి 23 క్రోమోజోమ్స్ ఉంటాయని, డౌన్సిండ్రోమ్ గల వ్యక్తులలో ఒక క్రోమోజోమ్ అధికంగా ఉంటుందని, దీన్ని వైద్య పరిభాషలో ట్రైసమీ21 (Trisomy 21) అంటామని, ఈ అధిక క్రోమోజోమ్ వలన డౌన్సిండ్రోమ్ అనే వ్యాధి వస్తుందని, దురదృష్టవశాత్తు ఇది జన్యుపరమైన లోపమని వివరిస్తారు.

ఈ డౌన్సిండ్రోమ్ ఉన్న పిల్లలకి మిస్సింగ్ ఆర్గాన్స్, గుండెలో కన్నాలు ఉండటం సర్వ సాధారణమని, అయితే మీ పాప పూర్తి ఆరోగ్యంగా ఉందని చెప్పారు. 'డౌన్సిండ్రోమ్ ఉంటే ఏమవుతుం'దనే ప్రశ్నకు సమాధానముగా 'బుద్ధిమాంద్యము, ఎముకలు బలహీనంగా ఉండటం వలన త్వరగా నడవలేకపోవచ్చు, చెవుల్లో నాడులు చిన్నవిగా ఉండడంవలన వినికిడి సమస్య ఉండొచ్చు, అందువల్ల మాటలు రాక పోవచ్చు, ఆహార వాహిక చిన్నగా ఉండడం వలన పెద్దవేవైనా మింగడం కష్టమవుతూ ఉంటుందని వివరించారు.

జన్యులోపం ఎలా ఏర్పడుతుంది అనే ప్రశ్నకు కారణం ఇదీ అని చెప్పలేమని, ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయని, క్రోమోజోముల్లో ఇలాంటి చిన్న చిన్న అవరోధాలు ఉండడం అన్నది పిండం ఏర్పడేటప్పుడే సహజంగా జరుగుతుందని వివరించారు డాక్టర్లు. పాపకి మేమేం చేయగలమనే ప్రశ్నకి, ఇన్ఫర్మేషన్ అంతా ఫైల్ లో ఇచ్చామని అందులో మీకు ఆర్ధికంగా సహాయ పడడానికి, పాప మానసిక ఎదుగుదలకు, మానసికంగా మీరు తేరుకోవడానికి సహాయం చేయగలిగే ప్రభుత్వ సంస్థల వివరాలు ఉన్నాయని చెప్పారు. చేయవలసిందల్లా మీరు ధైర్యంగా ఉండడం, పాపకి తగిన తోడ్పాటునివ్వడం అని వివరించారు. చివరిగా 'లైఫ్ టైం ఎంత ఉండొచ్చు డాక్టర్? అనే ప్రశ్నకి సమాధానంగా దాదాపు 60 ఏళ్లు అని అన్నారు.

ఇంట్లో పెద్దావిడ(సుమ అత్తగారు) ఇండియా వెళ్లిన మర్నాడే జిల్లా సహాయక సంస్థ (రీజినల్ సెంటర్) కి ఫోన్ చేయగా కో ఆర్డినేటర్ రావడం, పాప రిపోర్టులు పరిశీలించడం, అన్నీ పరిశీలించాక, "అమెరికన్ డిసెబిలిటీ యాక్టు (ADA), కాలిఫోర్నియా లాంతర్ మేన్ యాక్టు (Lanterman Act) ప్రకారం మాలాంటి రీజినల్ సెంటర్లు డిసేబిలిటీ ఉన్న ఏ వయసు వారికైనా సహాయాలు అందజేస్తాయి. ఈ సహాయాలు ఏమేం అందుబాటులో ఉంటాయో, ఎలా పొందవచ్చో మీకు తెలియజేయడమే కాకుండా, కొంతవరకు ఆర్దిక సహాయం, ఇతరత్రా సహాయాలు కూడా చేస్తాయి. ఇందుకు మీ అమ్మాయి కూడా అర్హురాలు  అని చెప్పి కాస్సేపట్లో డాక్యుమెంట్లు, సంతకాలు అయ్యాక 'మీ పాప రీమాకి' కావాల్సిన అన్నీ సహాయాలు అందజేస్తాం అని చెప్పింది. ఈ వ్యథావేదనని తట్టుకోవడం కోసం అర్ధరాత్రి వరకు ఆఫీస్ లో గడపడం ప్రారంభించాడు సాగర్. ఇది సుమని ఒంటరి చేయసాగింది. అదే సమయంలో 'మా రీమాకే ఎందుకిలా జరిగింది?" అనే వేదన ఎక్కువగా సుమని కాల్చివేసేది.

రెండో రోజు 'ఎర్లీ స్టార్ట్' నుంచి 50 ఏళ్ల వయసుగల ఆండ్రియా వచ్చి "ఏడెనిమిది వందల మందిలో ఒకరికి ఇటువంటి ఏదో కండిషన్ ఉంటుందని, ముందుగా మీ అమ్మాయి కండిషన్ని మీరు అంగీకరించాలి. అప్పుడే తనకి సహాయ సహకారాలు అందజేయగలరని, అందుకు మీరు(తల్లితండ్రులు) ధైర్యంగా ఉండాలని చెప్పి, తనకూ ఇలా సహాయం అవసరమైన పాతికేళ్ల కొడుకు ఉన్నాడని చెప్పింది. 'ఎర్లీ స్టార్ట్' తరగతులు దగ్గర్లోని సెంటర్లో వారానికి మూడు రోజులు జరుగుతాయని, నెలల పిల్లల దగ్గర్నుంచి మూడేళ్ల వయసు వారి పిల్లల ఎదుగుదలకు తోడ్పడే ఎన్నో రకాల యాక్టివిటీస్ ఉన్నాయని, అక్కడికి వస్తే మరికొంతమంది పేరెంట్స్ పరిచయం అవుతారని, అందరితో కలసి ఉండడం ఎంతో మేలు చేస్తుందని, అనుభవం ద్వారా తెలుసుకున్నానని చెప్పింది.

ఆ మర్నాడు 'ఎర్లీ స్టార్ట్' తరగతి గదిలో అడుగుపెట్టగానే కనబడ్డ మొదటి పేరెంట్ సారాతో పరిచయం చేసుకొని, ఆమె విషయం తెలుసుకుంది సుమ. సారాకి ఇద్దరు ఆడపిల్లల తరువాత మూడో సంతానంగా పుట్టిన బాబు పుట్టినప్పుడే గుండెలో రంధ్రముతో పుటాడని, రెండేళ్లలో రెండు సార్లు ఆపరేషన్ చేయించామని, మీ పాపకి డౌన్సిండ్రోమ్ తో బాటు ఇతర ఆరోగ్య సమస్యలు ఏవీ లేవు కాబట్టి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, ఈ పిల్లలు ఆకలేస్తేనో, డైపర్ తడిస్తేనో ఏడుస్తారని, ఇతరత్రా ఎటువంటి నొప్పులు ఉండవని ధైర్యం చెప్పింది. ఆ సెంటర్ లో గల రకరకాల సమస్యలున్న పిల్లల్ని చూసి, అక్కడ టీచర్ల మాటలు, పాటలు విని నేర్చుకొంటుందని, వినికిడి లేని పిల్లలు త్వరగా అర్ధం చేసుకోవడానికి సైన్ లాంగ్వేజ్ కూడా ఇక్కడ ఆటపాటల్లో భాగమని ఇతరుల ద్వారా తెలుసుకొని, రీమాని వారానికొక రోజు తప్పనిసరిగా తీసికెళ్లసాగింది సుమ. అప్పుడు సుమలో క్రొత్త ఆశలు చిగురించాయి.

అక్కడ చేర్పించిన తర్వాత మెల్ల మెల్లగా పల్టీలు కొట్టడం, ఏ పొజీషన్ లో నయినా కమ్ఫర్ట్ గా కూర్చోవడం, అయిదో నెలలో బోర్లా పడడం, ఎనిమిది నెలలకి పాకడం, పధ్నాలుగు నెలలకి అడుగులు వెయ్యడం ప్రారంభించింది రీమా.

రీమా రెండవ పుట్టినరోజునాడు మొదటి మాటగా "దాదీ" అనగానే సాగర్ ఆనందానికి అవధుల్లేవు. క్రమక్రమంగా 'దో' అంటే బయటికని, 'దీ' అంటే ఇవ్వు అని తనకే ప్రత్యేకమైన కొన్ని పదాలు పలుకుతూ ఉందని అర్ధమైంది. వారానికి రెండు సార్లు స్పీచ్ థెరఫీకి తీసుకెళ్తూనే ఉన్నారు. అయితే ఇంట్లో తెలుగులో మాట్లాడుకోవడమే అలవాటు. అందువల్ల మా సంభాషణల్ని గమనించడం ద్వారా తెలుగు అర్ధం అవుతోందని అనుకున్నారు, కానీ ఎంత ప్రయత్నించిన ఒక్కమాట కూడా పలికించలేక పోయారు. పాపని ఎక్కడికి తీసికెళ్లినా డౌన్సిండ్రోమని ఇట్టే కనిపెట్టేసే వారు, ముఖ్యంగా ఇండియన్స్. దానివలన 'రీమా' ని బర్త్ డే పార్టీలతో సహా ఎక్కడికి తీసికెళ్లవద్దని అనేవాడు సాగర్. అయితే, పాపని ఎర్లీ స్టార్ట్ ప్రోగ్రామ్, డౌన్సిండ్రోమ్ నెట్ వర్క్ గ్రూప్ లాంటి చోట్లకి తీసుకెళ్లడం వల్ల, మాలాంటి పేరెంట్స్ వల్ల, నేర్చుకొన్న విషయాల వల్ల, పాపని తనంతట తాను బ్రతికే స్వతంత్రతని నేర్పాలని లక్ష్యం పెట్టుకోవడం వల్ల, వచ్చిన ధైర్యం వలన సాగర్ ని ఒప్పించి/ ఎదిరించి ఒక బర్త్ డే పార్టీకి తీసుకొని వెళ్ళింది సుమ.

అక్కడ అంతా వారిని బాగా రిసీవ్ చేసుకోవడం, అన్ని ఆటల్లోనూ చిన్నారిని ముద్దుగా భాగస్వామ్యురాలిని చేయడం, కూర్చోబెట్టి కేకు పెట్టడం అక్కడ రీమా బుద్ధిగా ప్రవర్తించడం వీడియో తీసి, వారాంతంలో సాగర్ కి చూపించింది సుమ. అప్పుడు సాగర్, సుమ వాదనల్ని అంగీకరించి ఇక సాధ్యమైనంత వరకు రీమాని బయటి ప్రపంచానికి పరిచయం చేద్దామని ఒప్పుకున్నాడు.

పాపకి మూడో ఏడాది నిండే సమయానికి ఎర్లీ స్టార్ట్ ప్రోగ్రామ్ పూర్తి కావడంతో ప్రీ స్కూల్ లో జాయిన్ చేయడం కోసం వెదకడం ప్రారంభించారు. ఇందులో జాయిన్ చేసే ముందు టాయ్లెట్ ట్రైనింగ్ వగైరా ఇంట్లో నేర్పించాలి, తల్లితండ్రులను అనుమతించరు, అంతేకాకుండా ఆ స్కూల్స్ ఒక్కపూటే పనిచేస్తాయి. మిగతా పిల్లలతో సమానంగా అన్ని స్కిల్స్ ఉన్నాయని చూపించాలి. అయితే దాదాపు అన్ని స్కూల్స్ అప్లికేషన్ ఇవ్వడానికి నిరాకరించాయి. పట్టుదలగా వెదకడం వలన ఇండియన్స్ నడుపుతున్న ఒక ప్రీ స్కూల్ పట్టుకొని మాట్లాడగా, అక్కడ మేనేజర్ 'అడ్వాన్స్ పే జేసి, రేపట్నుంచి జాయిన్ చేయండి' అని చెప్పడం, వెంటనే జాయిన్ చేయడం జరిగిపోయాయి. ఒక ఏడాది పూర్తయ్యేసరికి, అక్షరమాలలో కొన్నింటిని పలకడం, తోటి పిల్లల్తో ఆటపాటలు, క్రమశిక్షణ పాటించడం, పెద్ద వాళ్ళతో పలకరింపులు వాళ్ళకి 'బై' చెప్పడం లాంటివి అలవాటయ్యాయి రీమాకి.

ఆ సంవత్సరంలోనే పబ్లిక్ స్కూల్ లో కిండర్ గార్టెన్ లో చేర్పించడానికి అప్లికేషన్ పెట్టారు. అప్లికేషన్ లో 'డీసెబిలిటీ' గురించి చూడగానే అర్హత పరీక్ష అవసరం లేకుండా 'స్పెషల్ డే క్లాస్' లో సీటిచ్చామని చెప్పారు. అది కూడా ఇంటి దగ్గర స్కూల్లో కాకుండా మూడు మైళ్ళ అవతల మరో స్కూల్లో ఇచ్చారు.

తదుపరి స్కూల్ ప్రిన్సిపాల్ తో మాట్లాడడానికి వెళ్లారు. అతను అన్నీ విని పాప కండిషన్ వల్ల స్కూల్ డిస్ట్రిక్ట్ అలాట్ మెంట్ ప్రకారం స్పెషల్ డే క్లాస్ లో సీటు వచ్చిందని, స్పెషల్ డే క్లాస్ అంటే 'రీమా లాంటి పిల్లలకి పూర్తి సహకారం అందించే విధంగా విడిగా నిర్వహించే తరగతి. ఇందులో రెండు రకాలున్నాయని 'మైల్డ్ టు మోడరేట్', 'మోడరేట్ టు సివియర్'. పిల్లల కండిషన్ ని బట్టి ఎందులో సీటు ఇవ్వాలో డిస్ట్రిక్ట్ వారు నిర్ణయిస్తారు. ఇందులో టీచర్ తో పాటు,ఇద్దరు ముగ్గురి పిల్లలకి ఒక సహాయక టీచర్, ఎయిడ్ ఉండడం వలన స్పెషల్ అటెన్షన్ ఇవ్వడానికి కుదురుతుంది అని వివరించి, పాపకి 'మోడరేట్ టు సివియర్' క్లాస్ లో సీటు ఇచ్చినట్లు చెప్పారు.

ఇండివిడ్యుయల్ అస్సెస్మెంట్ చెయ్యకుండా డౌన్సిండ్రోమ్ అన్న పదం చూసి 'మోడరేట్ టు సివియర్' అని ఎలా నిర్ణయిస్తారు అనే సుమ ప్రశ్నకు సమాధానంగా, ఇవన్నీ మీ అమ్మాయి మంచి కోసమే చేస్తామని, నచ్చకపోతే 45 రోజుల తర్వాత 'ఇండివిడ్యుయలైజ్డ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ (IPE)' అస్సెస్మెంట్ చేయించమని రిక్వెస్ట్ చేయవచ్చని, అప్పుడు అర్హతను బట్టి 'మైల్డ్ టు మోడెరేట్' అని భావిస్తే మరో స్పెషల్ డే క్లాస్ కి మార్చే అవకాశం ఉందని, మామూలు క్లాస్ లో చేర్చే అవకాశం లేదని తెలుసుకొని వెనుదిరిగారు.

ఆ రాత్రి నెట్వర్కులో ఈ విధమైన కేసులను గూర్చి శోధించి, పబ్లిక్ స్కూళ్ళు అన్నీ స్పెషల్ డే క్లాస్ పేరుతో పిల్లల్ని సామాజికతకు దూరం చేస్తున్నాయని భావించిన తల్లితండ్రులు కోర్టులను ఆశ్రయిస్తున్నారని, మాకు ఇదే దారని గ్రహించి, వర్కు వీసా నిబంధల వలన అంతవరకు వెళ్లకపోవడమే మంచిదని భావించి, ఇండివిడ్యువల్  అస్సెస్మెంట్ కి అప్ప్లై చేయడానికి నిర్ణయించుకొంటారు. రెండు నెలల తరువాత  డిస్ట్రిక్ట్ సైకాలజిస్ట్ తో బాటు ఇద్దరు ముగ్గురు స్పెషల్ టీచర్లున్న టీంతో 'ఇండివిడ్యుయలైజ్డ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ (IPE)' మీటింగ్ జరిగింది.

ఆ మీటింగులో పాపకి 'డౌన్సిండ్రోమ్' ని 'మోడరేట్ టు సివియర్' కండిషన్ గా పరిగణించి ముందు చూసిన స్కూలులోనే సీటుని కొనసాగిస్తామని చెబుతారు. ఇంటిప్రక్కనే గల స్కూలులో 'మైల్డ్ టు మోడరేట్ స్పెషల్ తరగతిలో సీటు ఇవ్వొచ్చుగా అనే ప్రశ్నకు, కుదరదు అనే సమాధానం వస్తుంది. చర్చ అనంతరం విచారంగా ఇంటికి వచ్చి డౌన్సిండ్రోమ్ నెట్వర్కు ఫోరం లో బాగా తెలిసిన 'రెబెకా'ని సంప్రదించి, ఆమె సలహా ప్రకారం నెట్వర్కు ఈమైల్ లో పోస్ట్ చేసి, మిగతా తల్లితండ్రుల సలహా మేరకు డిస్ట్రిక్ట్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. వారు క్షమాపణ తెలియజేస్తూ, మరో నెలన్నరలో రీమా కోసం మరో సైకాలజిస్టుని పంపి రీఅసెస్స్మెంట్ చేసి, వారి ఇంటిప్రక్క స్కూలులోనే మామూలు తరగతిలో కాక 'స్పెషల్ డే క్లాస్' లో సీటు ఇవ్వడం జరిగింది.

అప్పట్నుంచి ప్రతీ విద్యా సంవత్సరం ఆఖరులో ఐ.ఈ.పి జరుగుతూనే ఉండి. ప్రతీసారి మామూలు తరగతిలో సీటు కోసం అభ్యర్ధించడము జరుగుతూనే ఉంది. స్కూలువారు మాత్రం 'ఫిజికల్ ట్రైనింగ్ క్లాస్, ఆర్ట్ క్లాస్, భోజన విరామ సమయంలో మిగతా పిల్లలతో కలుపుతున్నా'మని  చెప్తూనే ఉన్నారు. అదృష్టం కొలదీ రీమాకి లాంగ్వేజ్ స్కిల్స్ బాగా పట్టుబడ్డాయి. ఇదంతా బడి చదువువల్లనో, స్పీచ్ థెరపీ, లేదా ముద్దుగా కొనిచ్చిన ఐ పాడ్ పెట్టుకొని అదేపనిగా యూట్యూబ్ నించి మాటలు వినడం వల్లనో జరిగిందని భావించారు.

అలా రీమాకి పదేళ్లు నిండాయి. ప్రతీ ఏడాది 'స్పెషల్ డే క్లాస్' లో ముందుకు వెళ్తూనే ఉంది. అక్షరాలు అన్నీ వ్రాయగలుగుతోంది. రెండవ తరగతి వరకూ పుస్తకాలు చదవగలుగుతోంది. లెక్కల్లో కూడికలు, తీసివేతలు వంటి లాజిక్కులు మాత్రం అర్ధం కావడం లేదు. మాటల్లో స్పష్టత ఇప్పటికీ రాలేదు. తన పేరుని "వీమా"గానే పలుకుతోంది. తినడం, స్నానం, బట్టలు మార్చుకోవడం వంటి పనులు స్వంతంగానే చేసుకోవడం, ఐ-పాడ్ మీద అతి వేగంగా ఆటలు ఆడడం, పాటలు, డాన్సులు అంటూ ఎప్పుడూ నవ్వుతూ, తుళ్లుతూ ఉంటుంది. అన్నిటికీ మించి అబద్ధం ఆడడం రాదు. ప్రత్యేకమైన కళ్ళు కలిగి, కల్మషరహిత మనసుతో ఉంటుంది. తనేమిటో తనకి తెలియదు. ఎప్పటికీ తెలుస్తుందో లేదో, తెలియక పోతేనే బాగుణ్ణు. కానీ రీమా ఆనందాన్ని చూస్తూంటే క్రొత్తవెలుగు కనిపిస్తోంది అనే అమ్మ 'సుమ' ఆవేదనా భరితమైన, ఆనందకరమైన భావనలు కథకు ముగింపు.

నలుగురికి ఇటువంటి విషయాలు స్ఫూర్తిని అందించాలని ఈ కథను వ్రాశానని రచయిత్రి చెప్పడం హర్షించతగ్గ విషయం.

సమావేశంలో ఆ తరువాత ఈ  కథను శ్రీ ఏ.కే. ప్రభాకర్ గారు విశ్లేషిస్తూ: “ఈ కథ ఒక పర్ఫార్మన్స్. ఇప్పుడు ఈ కథను వినడం కాదు, చూశాను. ఈ కథ గీత వినిపిస్తున్నప్పుడు నాకు ముందుగా డా. వి.చంద్రశేఖర రావు వ్రాసిన ‘జీవని’ కథ గుర్తుకు వచ్చింది. ఇక్కడ, ఈ 'వీమా' కథలో తల్లి చాలా స్ట్రాంగుగా, బేలెన్స్డుగా ఉంది. ప్రతీ సందర్భాన్ని ఆమె ఎదుర్కొంది.

కథకి అనేక విధమైన పార్శ్వాలు ఉంటాయి. ప్రధానంగా, ఇటువంటి కథలు వ్రాసేటప్పుడు ఏమవుతుందంటే, సమాచారాన్ని ఇవ్వడం ఒక ఛాలెంజ్. 'జీవని' కథలో తండ్రి స్వయానా డాక్టర్ కాబట్టి సమాచారాన్ని ఇవ్వడానికి ఏమీ ఇబ్బంది లేదు. ఇక్కడ, డౌన్సిండ్రోమ్ అంటే ఏమిటి? డౌన్సిండ్రోమ్ ఉన్న పిల్లలలక్షణాలు ఏమిటి? డౌన్సిండ్రోమ్ ఉన్న పిల్లలు ఎలా ప్రవర్తిస్తారు? వారి అవసరాలు ఏమిటి? వాళ్ళ ఇబ్బందులు ఏమిటి? ఎలా ఎదుర్కోవాలి? తల్లితండ్రులు ఏమిచేయాలి? అనేది పేరెంటింగ్ సమస్య, ఇది చాలా కష్టమైన అంశం. వాటికి సంబంధించిన సమాచారాన్నంతా కథలో ఒకేసారి ఇవ్వకుండా గీత ఏం చేశారంటే, టైం టు టైం అలా చెప్పుకుంటూ వెళ్లారు. వైద్యపరిభాషకు సంబంధించిన అనేక విషయాలను ఎక్కడా విసుగు కలిగించకుండా చెప్పడం గొప్ప.

ఒక స్వీయ జీవిత అనుభవం కానీండి, ఒక సమాచారం కానీండి, కథగా మారాలంటే కేవలం సమాచారం ఇస్తే వ్యాసం అవుతుంది. జీవితాన్ని యథాతథంగా చెప్పినప్పుడు కూడా కథకాదు. అది వాస్తవం. వాస్తవాన్ని అక్షరీకరించడం, వాస్తవాన్ని సాహిత్యీకరించడం, కళగా మార్చడం చేయడానికి కొన్ని ఉద్వేగాలు, కొన్ని సంఘటనలు, కొన్ని సన్నివేశాలు, సంభాషణలు, పాత్రలు, సంఘర్షణలు అవసరమవుతాయి. ఇవి చాలా ముఖ్యమైనవి.

డా. వి చంద్రశేఖర రావుకి వెసులుబాటు ఏమిటంటే అతను స్వయంగా డాక్టరు అవడం. అతను కథ వ్రాసినది 1991 లో అంటే ఇప్పటికి దాదాపు 32 సంవత్సరాలు పూర్వం. ఆ రోజుకి ఈ రోజుకి పిల్లల్ని పెంచడంలో ఉన్న వెసులుబాటు ఏమిటి? క్రొత్తగా శాస్త్రం, వైద్యం అభివృధ్ధి చెందిన తరువాత వచ్చిన వెసులు బాటులు ఏమిటి? ఇండియాలో ఉన్న తల్లితండ్రులకి అమెరికాలో ఉండే తల్లితండ్రులకి గల కథా నేపథ్యం, అమెరికా అందులోనూ కాలిఫోర్నియాలో కథను ఇంత చక్కగా అల్లటం ఎలా సాధ్యమయింది? ఎడా పెడా కవిత్వం వ్రాస్తూ, అప్పుడప్పుడు కథలు వ్రాసే గీతకి ఈ అల్లటం (fabrication) ఎలా అలవాటు అయ్యిందంటే, తాను రాసిన సిలికాన్ లోయల సాక్షిగా కథల్లోలాగా స్వీయ జీవితానుభవాలకి కొంత కాల్పనికతని జోడించడం ద్వారా వాస్తవం సాహిత్య రూపం ధరించింది.

కానీ ఇక్కడ ఒక్క అక్షరం కూడా కాల్పనికతకు చోటు లేదు. అది ప్రధానమైన అంశం. అంటే కఠోరవాస్తవికతను చెప్పడం చాలా కష్టం. వాస్తవం, డైరీ, సమాచారం వాటికవే కథలు కావు. దాన్ని సాహితీకరించడానికి ఎన్నివిషయాలు తీసుకొచ్చారు ఈమె. బిడ్డ కడుపులో పడినప్పట్నుంచి, 10 ఏళ్లు వచ్చే వరకు నలుగుతున్న కథ, బయటికి చెప్పుకోవలసినటువంటి కథ, బయటికి ఎలా చెప్పాలో తెలియనటువంటి కథ.

ఇప్పుడు ఈ కథ అంతా సుమా వెర్షన్ లోనే ఉంటుంది. సాగర్ వెర్షన్ వేరే ఉంటుంది. దాదాపు ఒక గంట సేపు నడిచింది ఈ కథ. ఇది చాలా పెద్ద కథ. ఇది చదివినంత సేపు, వింటున్నంత సేపు నవలగా వ్రాస్తే బాగుండును అనే ఆలోచన వచ్చింది. నవలకు కావలసినంత 10 సంవత్సరాల జీవితాన్ని, ఇంతసమాచారాన్ని, ఆమె ఎర్లీ స్టార్ట్, ప్రీస్కూల్, కిండర్ గార్డెన్ స్కూల్ అదంతా ఒక ప్రాసెస్ ఐతే, ఆ బిడ్డకి ఏర్పడే సమస్యల్ని చెప్పటం, ఆ బిడ్డని అర్ధం చేసుకోవడం తల్లిగా, తండ్రి ఏమనుకొంటున్నాడు, సాగర్ వెర్షన్ ఏముంటుంది ఇది నన్ను ఆలోచింపచేసిన విషయం.

కథ బలం ఎక్కడ ఉందంటే, సంఘర్షణలో ఉంది. సంఘర్షణ లేకుంటే ఇటువంటివి కథలుగా మారవు. సంఘర్షణ మొట్టమొదటిగా ఆ బిడ్డను ఉంచుకోవాలా, లేదా అనే దగ్గర మొదలయింది. తనలో తాను సంఘర్షణ, ఇక్కడ రెండు సంఘర్షణలు కూడా ఏర్పడవచ్చు. భర్తకి, ఆమెకి మధ్యన ఉంచుకుందామని ఆమె, వద్దని భర్త, ఇక్కడ సంఘర్షణ క్రియేట్ చేయవచ్చు. జీవని కథలో అలా ఉంది. బిడ్డ పుట్టిన తరువాత ఎదుర్కొనే సవాళ్లలో కూడా సంఘర్షణ ఉంటుంది..

నాకు డా. దేవరకొండ శ్రీరామమూర్తి వ్రాసినటువంటి మరో కథ గుర్తొచ్చింది, అదేంటంటే 'చిగురించని శిశిరం'. అందులో బిడ్డకి పుట్టేటప్పుడు మెదడుకి సరియైన ఆక్సిజన్ అందక వచ్చే బుధ్ధిమాంద్యమునకు సంబంధించిన కథ. అది తండ్రి తరపున చెప్పినటువంటి కథ, ఇక్కడ తల్లి తరపున చెప్పిన కథ.

అక్కడ అత్తగారికి ఈ బిడ్డ అంటే ఇష్టం లేదు. జీవని కథలో తండ్రికి ఆ బిడ్డంటే ఇష్టం ఉండదు, ఆ బిడ్డ పెరిగి పెద్దదై స్కిల్స్ డెవలప్ చేసుకొని మంచి చిత్రకారిణిగా మారినప్పుడు, ఆ బిడ్డ నాది అంటాడు. అంతవరకు దెయ్యం పిల్ల అని ప్రక్కకు త్రొసేసిన తండ్రి. ఇక్కడ ఈ కథలో సంఘర్షణ ఏంటంటే, పుట్టకముందు ఒక సంఘర్షణ జరిగింది, బిడ్డను ఉంచుకోవాలా లేదా అని, పెరిగే సందర్భములో సాగర్ ఆమెని బయటకు తీసికెళ్ళడానికి, అదే బర్త్ డే పార్టీకి వద్దంటాడు, అదో సంఘర్షణ. ఈ సంఘర్షణలు నవల అయితే ఇంకా విడమరచి(elaborate గా) చూపించవచ్చు. కథ వ్రాయడం చాలా కష్టం.

కథకి ప్రైవసీ కావాలి, కట్టిపడేసే తత్త్వం కావాలి, ఒక వాతావరణాన్ని ఏర్పరచాలి, ప్రతి మూడ్ ని, మూడ్ కు అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పరచాలి. హాస్పిటల్ వాతావరణం వేరు, ఎర్లీ స్టార్ట్ వాతావరణం వేరు, ప్రీస్కూల్ వాతావరణం వేరు, కిండర్ గార్డెన్ వాతావరణం వేరు, ఇంటి వాతావరణం వేరు, వాటితో పాటు మనసులో ఉన్నటువంటి భావాలకు అనుగుణంగా ఉండేటటువంటి వాతావరణం.

ఆమె హాస్పిటల్ కి వెళ్ళేటప్పుడు అక్కడ మోడువారిన చెట్టు, ఇంటి దగ్గర అత్తగారు తిట్టేటప్పుడు సంఘర్షణల్ని చూపిస్తూ కూడా సమాచారాన్ని అందిస్తుంది. ఇది టెక్నికల్ గా కూడా చాలా గమ్మత్తైన కథ.

గీత ఇన్ఫర్మేషన్ తో పాటు ఉద్వేగాలని బేలన్స్ చేస్తూ నడిపారు కథని. కథ ఆకట్టు కోవడానికి కారణం, ఇందులో ఉద్వేగాలు ఉన్నాయి.

ఈ కథలో పెద్ద విశేషం ఏమిటంటే కథని సామాజీకరించి చెప్పడం. అలాగే డౌన్సిండ్రోమ్ ఉన్న తల్లిగా ఆమె పడుతున్న ఆవేదనని, ఆ వాతావరణాన్ని కూడా మోడువారిన చెట్లు, చిగురించిన చెట్లు గా వర్ణించారు. ఈమె సహజంగా కవయిత్రి కాబట్టి ఇటువంటి సున్నితమైన అంశాలను ఇందులోకి తీసుకు రాగలిగారు.

ఏ కథ అయినా లోపల బాగా నలిగినపుడు మంచి కథగా బయటికి వస్తుంది. వేదనలోంచి కథ వస్తుంది కానీ ఆ వేదనని సాహిత్యీకరించడం ఎలా? అన్నది బాగా తెలిసిన కథ. ఇలా సాహిత్యీకరించడానికి కావలసిన కథాంగాలు ఉండటంవలన ఇది పరిపూర్ణమైన కథ అయింది.” అని డా. ప్రభాకర్ గారు తన విశ్లేషణ ముగించారు.

తరువాత గీతామాధవిగారు వీక్షణం ఫేస్ బుక్ నెలవారీ కవిత్వ పోటీల్లో భాగంగా జూన్ నెల పురస్కారానికి గాను  పి.వి.ఆర్ మూర్తి , విశాఖపట్టణం గారి "గుండె కన్రెప్పల వేదన" అనే కవితని ఎంపిక చేయడం జరిగిందని తెలియజేస్తూ, వారిని అభినందించి, అవార్డుని అందజేశారు. శ్రీ మూర్తి గారు డా. గీతా మాధవి గారికి, వీక్షణం గ్రూపు వారికి ధన్యవాదాలు తెలియజేశారు.

తదనంతరం ప్రశాంతి రామ్ గారి ఆధ్వర్యంలో నిర్వహింపబడిన కవిసమ్మేళనం ఆసక్తిదాయకంగా నిర్వహించబడినది.

ఇందులో సాధనాల వెంకట స్వామినాయుడు, మీరా సుబ్రహ్మణ్యం, డాక్టర్ కె. గీతామాధవి, పిళ్ళా వెంకట రమణమూర్తి, టి.సోమశేఖర శర్మ, మేడిశెట్టి యోగేశ్వరరావు, బి.నాగేశ్వరరావు, అయ్యల సోమయాజుల ప్రసాద్, కందేపి రాణి ప్రసాద్, దేవి గాయత్రి, చీదేళ్ళ సీతాలక్ష్మి, టి. వసుమతీ దేవి, కె.వి.యస్ గౌరీపతి శాస్త్రి, సీత ముళ్లపూడి, సి.హెచ్ వీర రాఘవులు, రామాయణం ప్రసాదరావు, డి.వి.ఆర్. మూర్తి, రత్నలక్ష్మి, జి. రాజేంద్ర ప్రసాద్, జె.అమృతవల్లి, డా.కె సంధ్యారాణి, ఇంగువ మాధురి, భోగెల ఉమాకవి, మండా వీరస్వామి, ఎ. కృష్ణదాస్ మొదలగు అనేకమంది కవులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

వసుమతీ దేవి గారు ఆలపించిన 'బంటురీతి కొలువు' అనే త్యాగరాజస్వామి వారి కీర్తన, ప్రశాంతి గారు పాడిన స్వీయ రచన 'కురిసే మేఘమయి ఉన్నదా' అనే పాట ఈ సమావేశంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కవులందరూ చక్కని కవితలతో కార్యక్రమాన్ని రంజింపజేశారు.

డా.గీత గారు ఈ కథను విశ్లేషించిన డా. ప్రభాకర్ గార్కి, స్పందించిన, కథను, విశ్లేషణలను ఓపికగా విన్న సభికులకు ధన్యవాదాలు తెలియజేస్తూ సమావేశానికి ముగింపు పలికారు.

Posted in August 2023, వీక్షణం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!