Menu Close
ఘాలి లలిత ప్రవల్లిక
కొలిమి (ధారావాహిక)
-- ఘాలి లలిత ప్రవల్లిక --

కిటికీ లోంచి ఆకాశం వంక చూసిన ప్రణవి మనసు బాధతో మూలిగింది. ఆకాశం దట్టమైన నీలి మేఘాలతోనిండి ఉంది. ఉండుండి ఉరిమే ఉరుములు, దివి నుంచి భూమికి దిగివచ్చే కాంతి తీగలులా మెరుపులు.

"ప్చ్...ఆ...మబ్బులు కమ్మిన ఆకాశం లాగానే నా మనసు కూడా.., నిండా గత కాలపు ఆలోచనలతో కప్పబడి ఉంది. భవిష్యత్తు ఉరుములులా నాకు భయభ్రాంతిని కలిగిస్తున్నాయి." అని మనస్సులో అనుకుంది ప్రణవి.

దబాదబా చినుకులతో వర్షం మొదలైంది. తుంపర్లు పడుతుంటే కిటికీ తలుపులు మూసేసి వచ్చి సోఫాలో కూర్చొంది ప్రణవి. వాన పెద్దదైనట్టుగా శబ్దం బయట నుంచి వినపడుతోంది.

మళ్లీ ఆలోచనలలోకి వెళ్ళిపోయింది ప్రణవి.

"వర్షం కురియగానే ఆకాశం తెల్ల బడుతుంది. కమ్ముకున్న నీలిమేఘాలు తమ బరువును దించుకుని ఆకాశాన్ని ప్రశాంతంగా వదిలేసి అవి చెల్లాచెదురై తేలిపోతాయి. కానీ నా మనసును కప్పేసిన ఈ బరువు ఎప్పుడు దిగుతుందో ...ఏమో?" అని అనుకుంటూ...మంచం వంక తలతిప్పి చూసింది.

గురకలు పెడుతూ నిద్రపోతున్నాడు జంబేష్. సుఖ భోగి అనుకుంది. ఆయన సుఖం తప్పించి ఎదుటి వారి గురించి ఆలోచించడు అనుకుంటూ నిర్లిప్తంగా అతని వంక చూసింది.

వాన పడుతూనే ఉంది. కరెంటు పోతే! ... అన్న ఆలోచన రాగానే ముందు జాగ్రత్తగా దీపం వెలిగించడానికి ఏర్పాట్లు చేసుకుంది అన్నీ రెడీ చేసుకుంది.

తలతిప్పి గోడగడియారం వంక చూసింది. టైం మూడు కావస్తోందన్నట్లగా చూపించింది గడియారం.

"ఎందుకో తనకీ రోజు నిద్ర రాలేదు. అసలు ఎప్పుడు ప్రశాంతంగా నిద్ర పోయింది కనుక ‌...ఈ రోజు రాలేదు అని అనుకోవడానికి..‌.ప్రతిరోజు ఇంతే.....భయం భయంగా బిక్కుబిక్కుమంటూ కోడి నిద్రేగా... ఈ 50 సంవత్సరాల జీవనయానంలో... నా జీవితంలో అన్నీ ఋతువులూ శిశిరాలే..." అనుకుంది.

కట్టలు తెంచుకుని ఉబికిన జ్ఞాపకాల వెల్లువకి ఆమె మనస్సు ఉప్పెనయ్యింది.

కళ్ళు, కన్నీళ్ళను స్వాగతించాయి. చెక్కిలిపై చెలరేగిన వేడికన్నీటిని ముని వేళ్ళతో తుడుచుకుంటూ ....... వద్దనుకుంటూనే గతం గుహలోకి అడుగుపెట్టింది ప్రణవి.

******

అమృతవరం పేరు చెప్పగానే అందరి మదిలో మెదిలేది... అదో అందమైన పల్లెటూరని, ఆప్యాయతలకు చిరునామానీ...మమతానురాగాలకు నెలవని. పేరుకు వంద గడపలు ఉన్నా కులమతాల అడ్డుగోడలను కూల్చేసి వరసలు కలుపుకొని పిలిచేసుకొనే వసుదైక కుటుంబాలు ఉండే గ్రామమది. ప్రేమానుబంధాలు ఎంత భారీ స్థాయిలో ఉంటాయో ఆడపిల్లల మీద ఆంక్షలు కూడా అంతే స్థాయిలో ఉంటాయి.

చాకలి పద్దు చదువు చాలు అంటారు. ఎలిమెంటరీ స్కూల్ వాసనలే గాని హైస్కూల్ గుమ్మం ఎక్కలేదు అక్కడ చాలా మంది బాలికలు. అంతకుమించి చదవాలన్న కోరిక ఎవరిలో అన్నా బలంగా నాటుకుని ఉంటే...అతి ప్రయాస మీద పైటేసే వరకూ వారికి చదువడానికి అనుమతి ఉండేది. ఆ తర్వాత వారెంత మొత్తుకున్నా, ఇంటిలిజెంట్ స్టూడెంట్స్ అయినా ఆగిపోవలసిందే! ఇంట్లో పనులు నేర్చుకుంటూ గడప లోపల జీవితం గడపాల్సిందే.

ఆ గ్రామంలో ఈడొచ్చిన పిల్లను పొరుగింటికి కూడా పంపరు.

అలాంటి ఆ ఊరికి హై స్కూల్ లో డ్రిల్ మాస్టర్ గా ట్రాన్స్ఫర్ మీద వచ్చారు ఆంజనేయులు.

పిల్లలకి శారీరక, మానసిక ఆరోగ్య ఎదుగుదలకు మెడిటేషన్, ఎక్సర్సైజులు చేయిస్తూ... ఏ వయసులో ఎలాంటి మార్పులు వస్తాయి, ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో...ఏ ఏ ఆహారాలు ఏ సమయంలో ఎలా తీసుకోవాలో, తదితర ఎన్నో విషయాలను పిల్లలకు చెప్పేవారు.

ఏ టీచర్ అన్న లీవ్ పెడితే. ఆ క్లాస్ కి వెళ్ళినప్పుడు వాళ్లకి ఎన్నో నీతి కథలు చెప్పి వారి ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చేవారు. పిల్లలకు ఆంజనేయులు గారు అంటే చాలా ఇష్టం.

పిల్లలను దారిలో పెడుతున్నాడని ఆ గ్రామ ప్రజలకు కూడా వీరంటే చాలా ఇష్టం. వారి మాటకు విలువ గౌరవం ఇస్తారు. వారొచ్చిన కొద్దికాలంలోనే ఆ ఊరి ఆడపిల్లల పరిస్థితి గ్రహించారు.

తల్లి దండ్రులకు పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేసి ఆడపిల్లలు చదివితే వచ్చే లాభాలు, వారికి చదువు ఎంత అవసరం ఉందో విడమర్చి చెప్పారు.

'బేటి పడావో బేటి బచావో' పదకం గురించి అవగాహన కలిగించారు.

ఆడపిల్ల చదువు ఇంటికి వెలుగు అంటూ ఉపాధ్యాయులు అందరూ అనేక కోణాలలో స్త్రీ విద్య గురించి అవగాహన కలిగించారు. అన్ని విధాలుగా చెప్పడంతో ఆంజనేయులు గారి మీద ఉండే గౌరవంతో వారి పిల్లలను బడికి పంపించడం మొదలుపెట్టారు ఆ గ్రామస్తులు.

ఆడపిల్లలకి స్పెషల్ గా ఆత్మ రక్షణ కొరకు కర్రసాము, కరాటే, కొన్ని కొన్ని పట్లు నేర్పించేవారు. ఏదైనా ఆపద వస్తే ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలో కూడా తెలియజేసేవారు. మగ పిల్లలకి ఆడపిల్లలతో మసులుకునే విధానం చెప్పి వారిని ఎలా గౌరవించాలో చెప్పేవారు. సోదరి భావంతో చూడాలి అనే చెప్పేవారు.

ఆడపిల్లల పై చదువుల కోసం పిల్లలు ఇబ్బంది పడకూడదని ఉమెన్స్ కాలేజీ బస్సు ఆ ఊరికి వచ్చే ఏర్పాటు కూడా చేశారు. ఇలా అందరికీ మంచి చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు ఆంజనేయులు.

మహిళా అభ్యున్నతిని కాంక్షించే ఆంజనేయులు గారి కూతురే ప్రణవి. ఎంతమందినో మార్చగలిగిన వారి మాటలు...ప్రణవి మనసుకి చేరుకోలేదు.

ఏదో పిరికితనం, ప్రతి చిన్న దానికి భయపడుతుంది. ఎవరో వచ్చి ఏదో చేస్తారనుకొనే రకం. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూసుకుంటుంది. ఎవరిని ఏమీ అనేది కాదు.

"ఏం మాట్లాడితే ఏమోతుందో .... తన మాటల వల్ల ఎవరైనా బాధపడతారేమో. ఎవరికైనా తన మాటలు ఇబ్బంది కలిగిస్తాయో...ఏమో..." ఇలా అనవసరమైన భయాలతో ఉండేది. తన కింద చీమను కూడా నలుగనివ్వదు. చాలా జాగ్రత్తగా ప్రతిదీ చూసుకుంటుంది.

సినిమా చూస్తూ అందులో లీనమైపోయేది. సినిమాలో పాత్రలకి కష్టం వస్తే ఈమె ఏడ్చేసేది. చాలా సున్నితమైన మనస్థత్వం.

చదివేటప్పుడు పుస్తకాల్లో లీనమైపోయేది. పక్కన ఎటువంటి డిస్ట్రబెన్స్ ఉన్నా పట్టించుకునేది కాదు. ఆమె కళ్ళ ముందు అది పూర్తి చేయాలి అనే పట్టుదలే కనబడేది. ఎప్పుడూ స్కూల్ ఫస్ట్ వచ్చేది.

ఎవరు ఏ హెల్ప్ అడిగినా తనకు చేతనైనంత వరకు సహాయంచేసేది. చేయలేకపోతే తెగ బాధ పడిపోయేది.

స్నేహితులు కూడా పెద్దగా లేరు. ఉన్నవాళ్లంతా... చదువుకి సంబంధించి మాట్లాడే స్నేహితురాళ్ళే.

ఇల్లు, బడి తప్పించి ఇంకేం తెలియదు. తెలుసుకోవాలని అనుకోదు. తల్లిదండ్రుల చాటున అమాయకంగా పెరిగింది.

"నువ్వు ఇలా ఉంటే ఎలారా తల్లి. ఎల్లవేళలా మేముండము. పూర్వం మహిళలు ఎలా ఉన్నా కాలం వెళ్ళిపోయేది. కుటుంబాల్లో ప్రేమలు, మమకారాలు అభిమానాలు ఎక్కువ ఉండేవి. అప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. పెద్దల నీతి బోధలతో పిల్లలు సక్రమమైన మార్గంలో నడుచుకుంటూ ఉండేవారు. అందుకేనేమో అప్పట్లో క్రైమ్ శాతం తక్కువగా ఉండేది. మంచి మనుషులకి కాస్త చోటు ఉండేది.

నేటి పరిస్థితులలా కాదు. అమాయకుల్ని టార్గెట్ గా పెట్టుకుంటారు. కీడెంచి మేలెంచమన్నారు. నువ్వు మరీ ఇంత అమాయకంగా ఉండక, మారు అని నచ్చ చెప్పారు ఆంజనేయులు గారు.

"అలాగే నాన్నగారు"అని అనడమైతే అంది కాని ఆచరణలో పెట్టలేకపోయింది ప్రణవి.

నాయనమ్మ పోరుతో డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ఉండగానే ప్రణవికి, జంబేష్ తో పెళ్ళి నిశ్చయమైపోయింది.

జంబేష్, అనసూయ రామయ్య ల ద్వితీయ పుత్రుడు. చూడటానికి చాలా మంచి వాళ్ళులా కనపడ్డారు. పెద్దకోడలు, అత్త మధ్య నున్న అన్యోన్యతను చూసి అందరూ ముచ్చట పడ్డారు. ఇలాంటి ఇంట్లో ఆడపిల్లని ఇస్తే ఆరళ్ళు ఉండవని సంబరపడ్డారు.

అంతే కాకుండా

"మా జంబేష్ ఏ అమ్మాయిని చూసినా నచ్చలేదని చెప్పేవాడు. మీ అమ్మాయిని చూసి వచ్చాక బాగా నచ్చిందని ఇంకెవరిని చేసుకోనని పట్టుపట్టి కూర్చున్నాడు." అంటూ జంబేష్ అన్న రాజన్ చెప్పడంతో బక్కపల్చగా ఉన్నాడు, స్థిరమైన ఉద్యోగంకాదు...అని ముందు సంశయించినా

"పిల్లను ఇష్టపడే వాడు పిల్లను సుఖపెడతాడు. అందాన్ని ఏమన్నా కొరుక్కు తింటామా? డబ్బు దేముంది? ఈనాడు ఉండేది రేపు ఉండకపోవచ్చు చంచలి" అంటూ అందరూ అనేసరికి..

ఆంజనేయులు గారు ప్రణవిని "నీకు ఇష్టమేనా?" అని అడగబోయారు.

ఇంతలో ప్రణవి బామ్మ కలగజేసుకుని "దాని మొహం దానికి ఏం తెలుస్తుంది? మనమే చూసి చేయాలి గాని." అనేసరికి ప్రణవి అభిప్రాయంతో పని లేకుండానే సంబంధం ఖాయపరిచేసుకున్నారు.

ఎవరూ లేని సమయం చూసి "అమ్మ నీకు మనస్పూర్తిగా ఇష్టమేనా! ఇష్టం లేకపోతే చెప్పు క్యాన్సిల్ చేసేస్తాను." అంటూ ప్రణవిని అడిగారు ఆంజనేయులు.

"నేను ఎక్కడైనా అడ్జస్ట్ అయిపోగలను కదా నాన్న! అలాంటప్పుడు ఎవరైతే ఏమి. నాకూ స్వతంత్ర నిర్ణయం తీసుకునే అలవాటూ ఎటూలేదు! మీరు ఎలాగో అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. మీ ఇష్టమే నా ఇష్టం." సంతోషంగా చెప్పింది ప్రణవి.

ఆంజనేయులు గారు తన విషయంలో తీసుకునే శ్రద్ధకి, ఆయనకు గల అవ్యాజమైన ప్రేమకి పొంగిపోయింది ప్రణవి.

వివాహముహుర్తం దగ్గర పడుతోంది. బంధువుల రాకలు మొదలయ్యాయి.

పల్లెటూరులో పెళ్లి.... అందులో  ఆంజనేయులు గారి ఇంట్లో....ఖర్చులకు వెరవని మంచీ, మర్యాదలు

వారి గుణంలో చోటు చేసుకోవడంవల్లో తరతమ భేదాలు లేకుండా అందర్ని సమదృష్టితో చూసే వారి ఇంటి కార్యం అవడంవల్లో.....ఏమో మరి, బంధుమిత్రుల రాకలు నెల రోజుల ముందు నుంచే మొదలయ్యిపోయాయి.

ఇక ఆంజనేయులు గారి ఇంట్లో పెళ్లి సందడే....సందడి.

విఘ్నేశ్వరుడు బియ్యం మూట కట్టడంతో మొదలైనాయి పనులు. ఇంటికి సున్నాలు వేయడాలు, గడపలకు రంగులు ముగ్గులు, ఇంట్లో ముగ్గులు పచ్చళ్ళు బట్టలు ....అబ్బో ఒకటేంటి ఎన్నో పనులు....చేసే వాడికి చేసుకున్నంత.

"ఇప్పుడు అందరూ అన్నీకేటరింగ్ వాళ్ళకు అప్పచెప్పేసి హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారు. అలా చేయకూడదూ మాష్టారు." ఈ హడావిడి చూసిన పొరుగింటి పానకాలరావు అన్నారు.

"మీ సలహాకు ధన్యవాదములు సోదరా. కాని ఇలా అందరూ కలిసి చేసుకోవడంలో ఉండే తృప్తి అందులో ఉండదు. అందుకే నేను దానిని ప్రిఫర్ చేయలేదు." అని చెప్పారు ఆంజనేయులు.

పనులు సాఫీగా సాగిపోతున్నాయి.

****సశేషం****

Posted in August 2023, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!