Menu Close
C-Vasundhara Photo
తెలుగు సాహిత్య చంద్ర చంద్రికలు
డా.సి.వసుంధర

శ్రీనాథుడు – కొనసాగింపు ...

వల్లభరాయుడు చాటు పద్యాలను, దృశ్య, శ్రవ్య కావ్య రచనలు చేసినట్లున్నాడు. వాటిని గూర్చి శ్రీనాథుడు ప్రశంసించాడు.

క్రీడాభిరామం

ఇది రావిపాటి తిప్పన సంస్కృతంలో వ్రాసిన ‘ప్రేమాభిరామం’ అనే నాటకానికి అనుసరణ. క్రీదాభిరామం వ్రాయాలని సంకల్పించి మొదలుపెట్టిన వాడు వినుకొండ వల్లభరాయుడు. అయితే అదే సమయానికి శ్రీనాథుని తో వల్లభరాయనికి పరిచయం ఏర్పడింది. క్రీడాభిరామం ఎవరు వ్రాశారు? అన్న ప్రశ్నకు ఆరుద్ర వివరణ క్లుప్తంగా ఇక్కడ పొందుపరుస్తున్నాను.

వల్లభరాయడు వ్రాసిన ప్రతి పద్యాన్ని అతడు (శ్రీనాథుడు) సంస్కరించినట్లు కనపడుతుందని చెప్పి శ్రీనాథుడు తన పద్యాల నెన్నిటినో అందులో కలిపాడు అన్నారు ఆరుద్ర.

క్రీడాభిరామానికి ఓరుగల్లు కథారంగం. ఈ తెనుగు నగరంలో ఇద్దరు మిత్రులు ఒకనాడు తిరిగిన అనుభవాలే ఈ రూపకంగా రూపొందించాడు శ్రీనాథుడు. లభించిన ఈ నాటకంలో 294 గద్య పద్యాలున్నాయి. అందులో చివరి గద్యలో ఇలా ఉంది.

“ఇది శ్రీమన్మహామంత్రి శేఖర వినుకొండ తిప్పయామాత్య నందన.....సుకవిజనవిధేయ వల్లభారాయ ప్రణీతంబయిన క్రీదాభిరామాంబను వీధి నాటకంబున సర్వంబు ఏకాశ్వాసము.”

గద్యలో కవి పేరు ఇలా ఉన్నా ఈ కావ్యాన్ని శ్రీనాథుడే వ్రాశాడని వేటూరి ప్రభాకర శాస్త్రి గారు సాక్ష్యాధారాలతో నిరూపించారు. శ్రీనాథుని పద్యాలతో తైపారు వేసి శాస్త్రి గారు నిరూపించిన తరువాత పండితులు ఆయన వాదాన్ని అంగీకరించారు అని ఆరుద్ర తెల్పారు. (స.ఆం.సా. పేజీ 716).

క్రీడాభిరామం లాక్షిణికులకు పనికివచ్చి నట్లే సాంఘిక చరిత్రకారులకు కూడా బాగా పనికి వస్తుందన్నారు ఆరుద్ర. ఆచార వ్యవహారాలూ ఈ గ్రంథం వల్ల తెలుస్తున్నాయి. నానా రకాల వ్యక్తులను శ్రీనాథుడు పరిచయం చేశాడు. ఆరుద్ర ఇలా అన్నారు.

ఈ పుస్తకం లేకపోతే తెనుగు చరిత్రలోని ఒక ప్రకరణం లోని వివరాలు లోపించేవి. ఆనాటి రసిక జీవనం మనకు తెలిసేది కాదు. శ్రీనాథుని ముద్ర ప్రతి పుటలో కన్పిస్తుందన్నారు.

శ్రీనాథుని పయనం విజయనగరం వైపు సాగింది. (క్రీ.శ 1428-38) రెండవ దేవరాయలు ఆ సామ్రాజ్యాధిపతి. అతని ఆస్థానంలో ముమ్మయ్య అనే కవితో శ్రీనాథునికి పరిచయం ఏర్పడింది. విజయనగర ప్రకృతి అందాలకు మురిసిపోయి “పంపా విరూపాక్ష బహు జటా ఝూటి....” అంటూ మురిసిపోయాడు. కానీ కన్నడ రాజ్యలక్ష్మికి శ్రీనాథుని మీద దయ రాలేదు. ఆహార విహారాలు నచ్చని వస్త్రధారణ శ్రీనాథుని బాధపెట్టాయి. కష్టమొచ్చినా, సుఖమొచ్చినా కవులనోట వచ్చేవి కమ్మని పద్యాలే. అందునా శ్రీనాథుడు. అందుకే అంటాడు

“కొల్లా యుంచితి గోక సుట్టితి
మహాకూర్పాసముందొడ్గితిన్
వెల్లుల్లిన్ దిల పిష్టమున్ మెసవితిన్ ....
తల్లీ కన్నడ రాజ్యలక్ష్మీ దయలేదా నేను శ్రీనాథుడన్”

అంటూ అక్కడ తిండి తినలేక బట్టగట్ట లేక ఎంతో బాధ పడ్డాడు. రెడ్డిరాజుల తరువాత ఈ కవిరాజుకు అన్నీ కష్టాలే.

కొందరి కవుల ఈర్ష్యాఅసూయలను తట్టుకొని ప్రౌఢదేవరాయల ఆస్థానంలో స్థానం సంపాదించిన శ్రీనాథుడు తనను ఒకప్పుడు ‘నీకు బిరుదులు లేవు’ అని హేళన చేసిన డిండిమ కవి సార్వభౌమ బిరుదాంకితుడైన అరుణగిరి నాథునితో వాదానికి దిగాడు. దేవరాయల అనుమతితో జరిగిన ఈ వాగ్యుద్ధంలో విజయనగర రాజుల కులగురువైన చంద్రభూపక్రియాశక్తి బడయరు మధ్యవర్తిగా ఉన్నాడు. అపుడు చుళికీకృత సంస్కృత వాజ్మయ జలనిధి అని చెప్పదగ్గ శ్రీనాథుడు డిండిమ భట్టును ఓడించాడు. అతని కంచు ఢక్క ను పగలగొట్టించాడు.  ప్రౌఢదేవరాయలు శ్రీనాథుని ప్రశంసించి డిండిమ భట్టు కున్న కవిసార్వభౌముడు బిరుదును శ్రీనాథునికి సమర్పించాడు.

ప్రౌఢరాయలు తన ముత్యాలశాల లో సభామధ్యంలో శ్రీనాథునికి కనకాభిషేకం చేశాడు. ఆ బంగారును అక్కడి కవులకు పంచారు శ్రీనాథుడు.

ఇంతటి మహా భోగ భాగ్యాలను అనుభవించిన శ్రీనాథుడు తనకంటూ ఏమీ దాచుకొనక అంత్యదశలో అత్యంత వేదనలకు గురికావడం భాధాకరం.

విజయనగరంలో చక్కటి రాజపోషణే లభించింది శ్రీనాథునికి. కానీ శ్రీనాథకవి మనసంతా ఆంధ్రభూమి పైనే ఉండేది. రెడ్డి ప్రభువులకే తన జీవితం అంకితం ఇవ్వాలని అనుకొన్న శ్రీనాథ కవి ఒక నిర్ణయానికి వచ్చి, తన ప్రభువును, మిత్రుడును అయిన పెదకోమటి వేమారెడ్డి ఆత్మకు శాంతి కలిగించడానికై “నందికంత పోతరాజు కఠారి” ని (వీర ఖడ్గం) తిరిగి తేవడానికి తన బావమరిది దుగ్గన తో కలిసి విజయనగరం నుంచి బయలుదేరాడు శ్రీనాథుడు. ఆ ప్రయాణాన్ని రాచకొండ మీదుగా సాగించాడు. ఆనాడు రాచకొండలో ప్రభువు, ముమ్మడి సింగమనాయకుడు.

ఈ సింగమ నాయకుడు ఈ పేరుగల (ఆ వంశంలో) వారిలో మూడవ వాడు. కనుకనే ముమ్మడి సింగమ నాయకుడు అని పిలువబడ్డాడు. తన తాతలాగే ఇతనికి “సర్వజ్ఞ” బిరుదు ఉంది.

ఈ సింగమ నాయకుడు తన పన్నెండవ ఏట దండెత్తి వచ్చి పెదకోమటి వేమారెడ్డిని సంహరించి అతని వద్దనున్న “నందికంత పోతరాజు కఠారి” ని తీసుకొని పోయాడు. 1420 లో ఇది జరిగింది.

శ్రీనాథుడు సింగమ నాయకుని సభలో తన పద్యాలతో విజయభేరి మ్రోగించి ఆయన వద్ద నున్న “నందికంత పోతరాజు కఠారి” ని తిరిగి తీసుకోగలిగాడు. అది తీసుకొని విజయం సాధించాడు.

ఆంధ్ర సాహిత్య చరిత్రలో కవిసార్వభౌమునికి జరిగిన “కనకాభిషేకం” “నందికంత పోతరాజు కఠారి” ని తిరిగి తీసుకొని రావడం శాశ్వత స్థానాన్ని సంపాదించుకొన్నాయి.

శ్రీనాథుల వారు అక్కడి నుండి రాజమహేంద్రవరం చేరారు. తాను చేజెర్ల వెలమల కులం నుండి తెచ్చిన కఠారిని వీరభద్రారెడ్డి కి సమర్పించాడు. రెడ్డి రాజులు పొంగిపోయారు. ఇక్కడే కాశీ ఖండం రచించి అల్లాప వీరభద్రారెడ్డి కి అంకితమిచ్చాడు. రెడ్డి రాజులకు కర్పూర వసంతరాయలు అనే బిరుదు ఉంది. వేమారెడ్డి, వీరభద్రారెడ్డి తర్వాత వాడు దొడ్డారెడ్డి. ఇతనికి ‘రాజ కుంజర సింహం’ అనే గుర్రం ఉండేదని దానినెక్కి నాల్గు మూరల దూరం దూకించే వాడని శ్రీనాథుడు (కాశీ ఖండం -53) వ్రాశాడు.

శ్రీనాథుల వారు అటుతర్వాత శివరాత్రి మహత్యము, కాటమరాజు కథ మొదలైనవి రచించారు. శ్రీశైల యాత్ర సాగించారు. అయితే శ్రీనాథుని సంసారం గురించి, సంతానం గురించి ఆరుద్ర గారి రచనలలో లేదనే చెప్పవచ్చు.

పోలవరపు కోటేశ్వర రావు గారి రచన ‘కొండవీటి ప్రాభవం’ అన్న దానిలో ఉన్న విషయాలను నేను ఇక్కడ ప్రస్తావించదలచాను. దీనికి పాఠకోత్తములు, పండితులు అన్యదా భావింప వద్దని నా మనవి (Dr.సి.వసుంధర)

కొంతకాలం తర్వాత శ్రీనాథునికి తను పుట్టిన స్థలానికి, ఆంధ్ర దేశానికి వెళ్లి రెడ్డిరాజుల వద్దనే గడపాలని అనిపించి అక్కడకు చేరాడు. కాని అక్కడ పరిస్థితులు రాజకీయంగా, సమాజపరంగా తారుమారై ఉండడం వల్ల శ్రీనాథునికి ఆశ్రయం అనుకున్న విధంగా లభించలేదు. ఆదరణ పూర్తిగా కరువైంది. అప్పుడు పోతనను ఆదర్శంగా తీసుకొని బొడ్డుపల్లి అనే గ్రామంలో సేద్యం ప్రారంభించాడు. కష్టపడి పండించిన పంటలు కృష్ణా వరదల్లో కొట్టుకొని పోగా శిస్తు కూడా కట్టలేని పరిస్థితి ఎదురైంది.

రాచరికపు శిస్తు కట్టనప్పుడు అత్యంత కఠినమైన శిక్షలు రైతులు అనుభవించేవారు. అయితే అది బ్రాహ్మణేతరులకు మాత్రమేయని మనకు తెలుసు. కాని శ్రీనాథునికి (బ్రాహ్మణునికి) ఘోరమైన శిక్ష వేయడం అదే మొదటిసారి గావచ్చునని పరిశీలకుల మాట. ఆ శిక్షా విధానాన్ని శ్రీనాథుడు పద్యంగా శాశ్వతీకరించాడు.

కృష్ణవేణమ్మ గొనిపోయె నింత ఫలము
బిలబిలాక్షులు తినిపోయె తిలలు పెసలు
బొడ్డుపల్లెను గొడ్డేరి మోసపోతి
నెట్లు చెల్లింతు టంకంబు లేడు నూర్లు!

శ్రీనాథుని సంసారం, సంతానం గూర్చి, భార్యను గూర్చి గాని తెలియదు. బావమరుదులు ముగ్గురు. అందులో దగ్గుపల్లి దుగ్గన శ్రీనాథునితో కలిసి ఉంది శ్రీనాథుని గురువుగా భావించాడు.

అత్యంత కఠినమైన శిక్షను అనుభవించిన మహాకవి శ్రీనాథుని జీవిత విధానం “తనవారి కెంత గల్గిన తన భాగ్యమై తనది గాక తధ్యము సుమతీ” అన్న పద్యాన్ని తలపిస్తూ అందరికీ గుణపాఠం వంటిది. ఆ మహాకవికి జోహార్లు.

**** సశేషం ****

Posted in August 2023, సమీక్షలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!