Menu Close
Lakshmi-Iyer
సనాతన భారతీయం
ఆచార్య లక్ష్మి అయ్యర్

కబీర్ దాసు

Kabir Das
Photo Credit: Wikimedia Commons

భారతదేశంలోని అన్నీ భాషల సాహిత్య వినీలాకాశంలో సమాజంలో నైతిక విలువలు నెలకొల్పడానికై నీతి శతకాలు, నీతి పద్యాలు అవతరించాయి. 15వ శతాబ్దికి చెందిన హిందీ కవి కబీర్ దాస్, విశ్వమానవ ఐక్యత గురించి హిందూ, ముసల్మానుల ఐక్యతకు కృషి చేసిన మహనీయ కవి.

కబీర్ దాసు హిందీ నిర్గుణ భక్తి సాహిత్యంలోని జ్ఞానాశ్రయి శాఖకు చెందిన కవి. ఆకారం, గుణం, నామం లేని సర్వవ్యాపి భగవానుని నిరాకారునిగా పూజించడమే నిర్గుణ భక్తుల లక్ష్యం. దీనికి వ్యతిరేకంగా ఆకారం, గుణం, నామం లీలలు గల భగవంతుని సగుణస్వరూపుడిగా సగుణ మార్గ భక్తులు పూజిస్తారు. మనమంతా సగుణ మార్గీయులమే. నిరాకారుడు నిర్గుణుడు పేరు రూప నామ మతాలకు అతీతుడై లోకమంతా నిండిన నిర్గుణ పరబ్రహ్మను కబీరు స్వీకరించారు. ఆ నిర్గుణ భక్తిలోఒకటి జ్ఞానమార్గమనబడి సాధువైన కవులతో భక్తి వైపు, రెండవది సూఫీ మార్గం అనబడే ప్రేమ్ మార్గపు కవులతో ప్రేమ వైపు మొగ్గి విలసిల్లింది. అందులో కబీరు మొదటి కోవకు చెందిన ప్రముఖ కవి. ఆయన 15వ శతాబ్దికి చెందిన వారు. ఓ పేద బ్రాహ్మణ వితంతువుకు జన్మించిన కబీరు నీరూ, నీమా అనే ముసల్మాను దంపతులకు దొరికాడని వాళ్ళ వద్దే పెరిగారని చెప్పబడుచున్నది. ఆయన రచించిన గ్రంథం బీజక్ దానిలో సాఖీ, సబద్, రమైని అన్నమూడు భాగాలున్నాయి. కబీర్ భాషను కిచడి లేదా సధుక్కడి అంటారు. ఎందుకంటే ఆయన భాషలో హిందీ, అరబీ ఫారసీ, రాజస్థానీ, బ్రజ్, భోజపురి అన్నీ భాషల శబ్దాలుంటాయి. అందుకే ఆయన భాష అందరికీ ఆనందం కలిగిస్తుంది. చదువు లేని కబీరు తన అనుభవం వల్ల గ్రహించిన జ్ఞానముతో అంతకంటే మించిన మానవత్వంతో, ప్రేమతో, హిందూ ముస్లింల జాతి మత పరమైన కొట్లాటలు ద్వేషాలను చూసి వారిద్దరి ఐక్యతకు కృషి సల్పిన అద్వితీయ విప్లవ కవి. ఆయన తన సమాజంలో జాతి పేరిట, మతం పేరిట జరుగు తున్న అమానుష కార్యాలను, మూఢాచారాలను, సంప్రదాయాల పేరిట వెలిసిన మూఢ విశ్వాసాలను తీవ్రంగా ఖండించారు. సంప్రదాయం పేరిట మతం పేరుతో మనుషులను భౌతికంగా మానసికంగా హింసిస్తున్న మత వాదులను తీవ్రంగా నిరసించి తుదముట్టించి మానవత శంఖారావాన్ని చేసిన మానవతావాది కబీర్.

కబీరు ఆత్మలక్ష్యం ఒక్కటే. అదే మానవత్వం. మానవ ప్రేమను సమాజంలో ఎలుగెత్తి చాటారు. ఈయన పవిత్ర ప్రేమ తో కూడిన భక్తి కి ప్రాధాన్యం ఇచ్చారు. కుళ్ళు వంచనలతో భక్తి పేరిట తిరిగే దొంగ సన్యాసులను, మతం పేరిట, భక్తి పేరిట, ఆచారం పేరుతో తిరిగే బ్రాహ్మణ మతోన్మాదులను ఎదిరించారు. ఖడ్గంతో భయపెట్టి మతమార్పిడి చేసే మతోన్మాదంతో తిరిగే ముస్లిం శాసకుల వ్యవస్థను కబీరు ఖండించారు. ఈయన సాహిత్యం, పండితుల సాహిత్యం కాదు పామర సాహిత్యం. అది సమాజానికై నైతిక విలువలను మానవ విలువలను స్థాపించే౦దుకేనని నమ్మారు. పవిత్ర ప్రేమ గొప్పది అని చెబుతూ మనస్సు నిర్మలంగా వుంటే భావాలు నిర్మలంగా వుండి మనిషి మంచివాడుగా ఉండడానికి సహకరిస్తాయి అని భావించారు.

ఈయన కపట వేషధారులు అయిన దొంగ సన్యాసులను తూలనాడారు. కాషాయ వస్త్రాలు ధరించి మెడలో జపమాలలు వేసుకొని తిరిగేవాడు సన్యాసి కాదు. మనసు నిర్మలంగా లేని వ్యక్తి సన్యాసి వేషంలో తిరిగినా కానీ ముక్తి పొందలేడు.

కేశో కహన్ బిగడియో తే ముండే సౌ బార్
మాన్ కో కహన్ న ముడియో జామే విషయ వికార్ ||

తలనీలాలను వందసార్లు గుండు గీయుంచుకుంటే మాత్రం సన్యాసి అవుతారా? మనసులోని కల్మషము కపటము లాంటి వాటిని కదా విసర్జించాలి అన్నారు. ఇంకొక చోట కబీరు చేతిలో జపమాల అని తిప్పుతూ నోటితో మంత్రోచ్చారణ పైకి వినబడేలా గావిస్తూ మనసు మాత్రం పది చోట్ల పెడుతూ రకరకాల ఆలోచనలతో నిండి ఉన్న మనసుతో చేసే నామస్మరణము వ్యర్థము అంటున్నారు.(దోహా –మాలా తో కర్ మే ఫిరై).

మరి మన వేమన;
కరక్కాయలు తిని కాషాయ వస్త్రముల్
బోడి నెత్తి కల్గి బొరయు చుండు
తలలు బోడులైన తలపులు బోడులా? అని నిలదీసి అడిగారు.

సన్యాసులకు సాధువులకు కావలసినది నిర్మలమైన మనస్సు మాత్రమే కానీ ఎటువంటి అడంబరములు వేషధారణలు కాదు అని ఖచ్చితంగా చెబుతున్నారు. అలాగే ఆయన నిందను స్తుతిని ఏకంగా భావించే సమ దర్శనాన్ని కలిగినవాడు.

కబీరు సాధువుల ఉపదేశాన్ని భక్తిని గౌరవించాలి గాని వారి కులాన్ని బట్టి కాదు అన్నారు. ఖడ్గాన్ని కొనేటప్పుడు దాన్ని పదును చూడాలి కానీ బయట ఉన్న ఒరను కాదు అదేలా జ్ఞాని యొక్క ఉపదేశాన్ని చూడు, ప్రతిభను చూడు జాతిని కాదు అన్నారు.

జాతి ణ పూఛో సాధు కీ పూచ్ లీజియే జ్ఞాన్
మోల్ కరో తలవార్ కా పడా రహన్ దో మ్యాన్ ||

ఇంకో దోహే లో కబీర్ దాసు జాతుల వల్ల, మతాల వల్ల ఎవరూ గొప్పవారు కాలేరు. భగవంతుని భజిస్తే మాత్రమె భగవంతునికి ప్రియులు అవుతారు అంటున్నారు.

మన్ మక్కా దిల్ ద్వారకా కాయా కాసీ జాన్

నోటి నుండి వెలువడే ప్రతి మంచి మాట వాచక తపస్సుతో సమానము. అందుకే సత్యాన్ని మాత్రమె మాట్లాడాలని కబీరు చెప్తున్నారు.

సాంచ్ బరాబర్ తప్ నహి,ఝూట్ బరాబర్ పాప్
జాకే హిరదే సాంచ్ హై,తాకే హిరదే ఆప్

(సత్యానికి మించిన తపస్సు లేదు అసత్యానికి మించిన పాపము లేదు. సత్యం ఎవరైతే పలుకుతారో, వారి అంతరంగంలో ఆ దేవదేవుడు పరమాత్మ కొలువై ఉన్నాడు) అని చెప్తున్నారు. ఇంకొక చోట సత్యాన్ని పాలతోనూ అసత్యాన్ని సారాయి తోను పోల్చి కబీరుదాసు ఇలా అంటున్నారు;

“సులువుగా ఆచరించే సత్యాన్ని విస్మరించి, ఎక్కడో వున్న అసత్యానికి అలవాటు పడి అపద్దాలకు బానిసై బ్రతుకుతున్నారు. ప్రతిరోజు పాలవాడు వీథి వీధికి వచ్చి తిరిగి పాలను అమ్ముతాడు, కానీ వాడిని ఎవరూ పట్టించుకోరు. కానీ మరణానికి దారితీసే మద్యం ఎక్కడో ఓ మూలలో వున్నా అక్కడ జనుల గుంపు విపరీతంగా కనిపిస్తుంది. పాలలాంటి సత్యాన్ని స్వీకరించండి కల్లు లాంటి అసత్యాన్ని విస్మరించండి అని అంటున్నారు. కబీరు శబ్దాలలో

సాంచై కోయి నా పతియాయ్ ఝోఠె జ పతియాయ్
గలీ గలీ గోరస్ ఫీరైమదిరా బైఠ్ బికాయ్

కబీరు అహింసా వాది. కానీ విప్లవ కవి ప్రాణులలో ఉన్న పరమేశ్వరుని గుర్తించిన మహోన్నత వ్యక్తి. సకల చరాచరoలో నిండి ఉన్న కరుణామయుడైన ప్రేమ స్వరూపి అయిన భగవంతుని దర్శించిన మహానుభావులు. ఒక జీవిని హింసిస్తే ఆ భగవంతుణ్ణి హింసించినట్లే అని చాటి చెప్పారు. జీవిని చంపే వాడికి ఎప్పుడూ మోక్షము దొరకదు జీవిని చంపి దాని భక్షించి తమ శరీరంలో కొవ్వును పెంచుకోవడమే ఎంత అవివేకం అని అంటున్నారు. నోరులేని ప్రాణులను ప్రేమించాలే తప్ప వాటిని తినడం ఎంత పాపం! ఇలాంటివారిని యమధర్మరాజు ఖచ్చితంగా శిక్షిస్తాడు అంటున్నారు.

హిందూ–ముస్లిం జాతులలో సంప్రదాయాలు కట్టుబాట్లు అన్న పేరుతో జరిగే అన్యాయాలను అక్రమాలను ఎదిరించి పోరాడిన సంఘ సంస్కర్త, విప్లవ కవి కబీరు. హిందువులు ఏకాదశి పేరుతో పస్తులుండి పాలను పండ్లను తిని ఇష్టం వచ్చినట్లు తిరుగుతుంటారు. మరి ముస్లింలు రోజా అన్నపేరుతో ఉపవాసం వుండి అల్లా అని బిగ్గరగా అరుస్తూ రాత్రుళ్ళు ఆవు మాంసం తింటుంటారు వీరివురికి ఎలా మోక్షం లభిస్తుంది?

దిన్ భర్ రోజా రహత్ హై, రాత్ హనత్ హై గాయ్
యే తో ఖూన్ సే బందగి, కైసే ఖుషి ఖుదాయ్

శత్రువును కూడా ప్రేమతో చూడమని చెప్పే కరుణ పూరిత హృదయం కలవాడు కబీరు దాస్ ఒక వేళ చంపదగినట్టి శత్రువు చేతికి దొరికినా కీడు చేయవద్దు అంటున్నారు.

దీన్నే కబీరు నీ మార్గంలో ముళ్ళుoచే వారి బాటలో గూడ నీవు పూలను ఉంచు ముళ్ళకు పూలకు విలువ కట్టేవాడు ఆ పరమాత్మ అన్నారు.

జో తోకూన్ కాంటా బూవై .తోహి తూ ఫూల్
తోకూన్ ఫూల్ కే ఫూల్ హై బాంకున్ హై తిరశుల్

కబీర్ లోని రచన బీజక్ ను పరిశీలిస్తే దిగువ ఇవ్వబడ్డ విశేషాలు కనబడతాయి. నిర్గుణ పరమాత్ముని పై నమ్మకం: ఈయన కొలిచే భగవంతుడికి రంగు లేదు ఆయన రూపం, రంగు నామాలకు అతీతుడు. స్వయంగా దాన్ని గూర్చి ప్రస్తావిస్తూ కబీరు “నేను కొలుస్తున్న రాముడు దశరథుని సుతుడు కాడు, నేను కొలిచే నిర్గుణ పర బ్రహ్మ అలౌకిక సర్వ వ్యాపి భగవంతుని పేరు” అన్నారు. కబీరు దోహాలలో హరి, విఠల్ , రామ్, మురారి, గోవింద్ అన్న శబ్దాలు కనబడతాయి. అవన్నీ ఆయన వాడిన నామ వర్ణ రూపాతీతుడైన సర్వవ్యాపి అణువు అణువునా నిండిన అలౌకిక పర బ్రహ్మ సూచక శబ్దాలు.

కబీర్ ద్వారా ఆరాధింపబడే భగవంతుడు నిర్గుణ బ్రహ్మ స్వరూపుడైన జ్ఞాన సంపన్నుడు. ఆది, అంతము లేనివాడు. “నిర్గుణ జపహు రే భాయి, అవిగత కీ గతి లఖి న జాయి” అంటున్నాడు కవి కబీర్. అతడు జననం మరణం లేని వాడు. ఆ అక్షయ పురుషుడు సర్వత్ర వ్యాపించి వున్న మహా వట వృక్షం. అందులోని ఆకులన్నీ (మనమందరం) ఆత్మలే. పరమాత్మలో ఆత్మలన్నీ నిండినవే. ప్రతి అణువులోనూ వ్యాపించి ఉన్నాడు.

కబీర్ తన ఈశ్వరుని ఇలా కొలుస్తున్నాడు “కస్తూరి జింక తన దగ్గర నుండి వెదజల్లుతున్న పరిమళాన్ని (సువాసనలను) గుర్తించక దానికై వెదుకుతూ వెదుకుతూ వనమంతా తిరుగుతుంది అదే లాగా ఆత్మలో దాగి ఉన్న రాముని (భగవంతుని) గుర్తించకుండా మనమందరమూ గుడులు గోపురాలు అంటూ తిరుగు తున్నాము. విశ్వమంతా నిండి ఉన్న నామరూపాలు లేని ఆ పరమాత్ముని భక్తితో భజన చేసి నామస్మరణతో ఆయనలో లీనమై, ప్రతి ఒక్కరిలో ఆయనను సందర్శిస్తే ముక్తి తనకు తానుగా లభిస్తుంది. అవతార వాదాన్ని ఖండించడం హిందీ సాహిత్యంలోని నిర్గుణకవుల లక్షణం. ఈ కవులందరూ కబీర్ దాస్ తో సహా దీన్ని స్వీకరించారు. భగవంతుని అవతారాలను నమ్మలేదు కబీర్. కబీరు దాసుపై ఆది శంకరాచార్యుల వారి అద్వైత ప్రభావము స్పష్టంగా కనబడుతుంది. అవతార వాదము జనన మరణం తో ముడిపడి ఉంటుంది. కానీ నిర్గుణ సాధువుల ద్వారా పూజింపబడే భగవంతుడు జనన మరణాలకు అతీతుడని వాళ్ళ నమ్మకం. కబీర్ గురువును గోవిందుడి కంటే గొప్పని నమ్మాడు. అంటే గురువు భగవంతుడు కంటే గొప్ప ఎందుకంటే ఆయన మార్గ దర్శి. గురువు జ్ఞాన దాత. గురువు వల్లనే మనము భగవంతుని చేరగలమని ఈయన ప్రగాఢ నమ్మకం. గురువు వల్ల బ్రహ్మజ్ఞానం కలుగుతుంది, తద్వారా మనకు భగవద్దర్శనం కలుగుతుంది. అందుకే గురువు దేవుడి కంటే గొప్ప అని కబీర్ గారు నమ్మారు. జాతి, మతం పేరున, సంప్రదాయ వ్రతాల పేర్లతో గొడవపడే సమాజపు వ్యక్తులను కబీర్ తూలనాడాడు. భగవంతుని కొలవడానికి స్త్రీ, పురుష, షావుకారు పేదవాడు, కుల మత వర్గ భేదాలు ఉండరాదని కబీరు చెప్పారు.

****సశేషం****

Posted in August 2023, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!