Menu Close
VSRao
అశోక మౌర్య
డా. వల్లూరుపల్లి శివాజీరావు

2. అశోకుడు

శుసిమ

బిందుసారకు అనేకమంది భార్యలు (సుమారు 16), ప్రియురాళ్లు ఉన్నందువల్ల ఆయనకు అనేక మంది పుత్రులు కలిగారు. కొన్ని గ్రంధాల ప్రకారం వీరు సుమారు 101 మంది ఉండవచ్చు. ఆయనకు తన జ్యేష్ఠ భార్య ద్వారా కలిగిన జ్యేష్ఠ పుత్రుడు శుసిమ అంటే అత్యంత ప్రేమ. మరో భార్య, బ్రాహ్మణస్త్రీ శుభద్రాంగికి జన్మించిన పుత్రుడు అశోకుడు అంటే ఆయనకు అయిష్టం.

ఆ రోజులలో బిందుసార మగధ సామ్రాజ్యం నాలుగు రాష్ట్రాలుగా విభజించటం జరిగింది. అవి:

తూర్పున ‘తోశాలి’ (Toshali, ఇప్పటి ఒడిశా/కళింగ రాష్ట్రంలోని 'థాయూలి': దయా నది ప్రక్కన, భుభనేశ్వర్ కు 7 కి.మీ. దూరంలో ఉంది.);

పశ్చిమాన ‘ఉజ్జయిని’ (ఇప్పటి మధ్యప్రదేశ్ లో ఉంది);

దక్షిణాన ‘సువర్ణగిరి’ (ఇప్పటి కర్ణాటక రాష్ట్రంలోని Gadaga జిల్లాలో ఉన్న సువర్ణగిరి గ్రామం);

ఉత్తరాన ‘తక్షశిల’. ఈ తక్షశిల పాటలీపుత్ర కు 2,000 కి.మీ. దూరంలో ఉంది. ప్రతి రాష్ట్రానికి రాజ పుత్రులను తన ప్రతినిధిలుగా/పరిపాలకులుగా బిందుసార నియమించటం జరిగింది. వీరికి సహాయకులుగా మహా మాత్యలు (మహా మంత్రులు), మంత్రి వర్గాలను నియమించటం జరిగింది.

క్రీ.పూ. 284-283లో బిందుసారకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమం చేపట్టినప్పుడు దానిని అణచటానికి బిందుసార అశోకుడిని పంపించటం జరిగింది. అశోకుడు సైన్య సమేతంగా తక్షశిలలో ప్రవేశించాడు. అప్పుడు అచ్చటి ప్రజలు వీరిని ప్రతిఘటించడానికి బదులు అశోకుడిని స్వాగతించి “మేము మీ మీద తిరుగబడటానికి ఇష్టం లేదు; యదార్ధానికి మహారాజు బిందుసార మీద కూడా. అసలు కారణం దుష్టులు అవినీతిపరులైన మీ అధికారులు మమ్ములను అణచివేస్తున్నారు, తద్వారా మాకు స్వేచ్ఛ కరువైంది.” అని విన్నవించారు. చివరకు అశోకుడు కారణంగా తక్షశిలలో జరిగిన వ్యతిరేక ఉద్యమం ఆది నుంచి అంతం వరకు హింస రహితంగా, శాంతియుతంగా ముగిసింది!

ఆ తరువాత అశోకుడి పాటలీపుత్రకు విజయంతో తిరిగివచ్చినప్పుడు, బిందుసార తన రాజ ప్రతినిధిగా ఇతనిని ఉజ్జయిని పంపించటం జరిగింది.

అశోకుడు ఉజ్జయిని లో ఉన్నప్పుడు తక్షశిలలో మరొకసారి వ్యతిరేక ఉద్యమం ప్రజ్వలిల్లింది. దీనిని అణచటానికి బిందుసార ఈ సారి శుసిమను సైన్యంతో పాటు తక్షశిలకు పంపించటం జరిగింది. అచ్చటికి వెళ్లే ముందు ఈ తన జ్యేష్ఠ పుతృడిని యువరాజుగా నియమించాడు బిందుసార.

కాని తక్షశిల ప్రజలు శుసిమ, అతని మంత్రుల దుర్నడతలు, దౌర్జన్యాల వల్ల విసిగిపోయి తిరుగుబాటు ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. దీనిని శుసిమ నియంత్రించలేని స్థితిలో ఉండటం జరిగింది. ఇది బిందుసారకు తెలిసి పాటలీపుత్రకు రప్పించి శుసిమ స్థానే అశోకుడిని తక్షశిలకు పంపించమని ఆజ్ఞ జారీ చేసాడు. అశోకుడు రాజధానికి తిరిగి వచ్చే లోపలే బిందుసార తీవ్ర అనారోగ్యంతో మంచం మీద ఉండవలసి వచ్చింది.

మౌర్య సింహాసనానికి పెనుగులాటలు, హత్యలు

ఉజ్జయినిలో దాదాపు 11 సంవత్సరాలు అశోకుడు మౌర్య సామ్రాజ్య ప్రతినిధిగా తన బాధ్యలు నిర్వర్తించే సమయంలో పాటలీపుత్ర లో తన తండ్రి బిందుసార తీవ్ర అనారోగ్యంతో ఉన్న వార్త తెలిసింది. ఈ మగధ చక్రవర్తి మృత్యు ముఖ ద్వారం వద్ద ఉన్న పరిస్థితి తీవ్ర రాజకీయ పరిణామాలకు దారి తీస్తుంది. తండ్రికి సంభవించిన ఈ పరిస్థితి అశోకుడికి తెలిసి వెంటనే ఉజ్జయినికి వదలి పాటలీ పుత్రకు బయలుదేరాడు. తండ్రి మరణంవల్ల సింహాసనం కోసం జరిగే పోరాటంలో రక్తం చిందించవలసి వస్తుందని అశోకుడికి తెలుసు. దానికి సిద్ధపడే రాజధానికి పయనమవటం జరిగింది. ఆ సమయంలో అశోకుడి పుత్రుడు మహేంద్ర వయస్సు 10 సంవత్సరాలు, పుత్రిక సంఘమిత్రకు 8 ఏళ్ళు. జ్యేష్టభార్య ‘దేవి’, పిల్లలను తనతో పాటలీపుత్రకు తీసుకువెళ్లాడు.

అశోకుడు పాటలీపుత్ర చేరినప్పటినుంచి రాజు అయ్యేవరకు జరిగిన సంఘటనలు, సంగతులు, వివరాలు పూర్తిగా తెలియవు. వీటిని గురించి ఒక్కొక్క గ్రంధం ఒక్కో విధంగా తెలియజేశాయి. ఒక గ్రంధం (దీపవంశ) అశోకుడు వందమంది సవతి సోదరులను చంపించినట్లు ఉదహరించింది.

మరొక గ్రంధం (మహావంశ). ఒక సవతి సోదరుడిని మాత్రం మట్టుపెట్టినట్లు తెలియజేసింది. ఒక రాజుకు అనేక మంది పుత్రులు ఉన్నప్పుడు సింహాసనం కొరకు వారి మధ్య పోరాటాలు, పెనుగులాటలు, బ్రాతృ హత్యలు సహజం.

తండ్రి బిందుసారకు అనేక మంది భార్యలున్నందువల్ల వారి ద్వారా లెక్కకు అందని పుత్రులు ఉండటం సహజం. సింహాసనం అధిష్టించడానికి ముందు, అధిష్టించిన తదుపరి అశోకుడు తన సవతి సోదరులందరిని మృత్యుమార్గంలో పయనింప జేయటం మాత్రం యదార్ధం! కాని తన తమ్ముడు (శుభద్రాంగి రెండవ పుత్రుడు) ‘విష్టశోక’ కు ఏమాత్రం హాని చేయలేదు.

దీపవంశ గ్రంధం ప్రకారం బిందుసార మరణం తరువాత అశోకుడు రాజుగా నియమితుడవటానికి 4 ఏళ్ళు పట్టింది. ఈ సమయంలో పాటలీపుత్ర రక్తంతో తడిసిపోయింది. సింహాసనం ఎక్కిన తరువాత కూడా కొన్ని ఏళ్ల పాటే పాటలీపుత్ర రక్తసిక్తమవటం జరిగింది.

బిందుసార మరణం

బిందుసారకు ఉత్తరాధికారిని నిర్ణయించే తతంగంలో అశోకుడితో పాటు మంత్రుల పాత్ర చాలా ముఖ్యమైనది. దీనికి ముందు ఒకప్పుడు బిందుసార జ్యేష్ఠ పుత్రుడు యువరాజు ‘శుసిమ’ ప్రధానమంత్రి ‘రాధా గుప్త’ బట్టతల మీద అరచేతితో చరచి (slap), ఎగతాళి చేసి ఆ పెద్దమనిషిని ఘోరంగా అవమానించటం జరిగింది. ఈ అవమానాన్ని భరించలేని ప్రధానమంత్రి ఇతర మంత్రులు, రాజాధికారులను శుసిమకు వ్యతిరేకంగా సంఘటితం చేసి ఈ యువరాజును రాజు కాకుండా చేయాలని సంకల్పించాడు.

ఈవిషయం గురించి ఒక మంత్రి ఈ క్రింది విధంగా వర్ణించాడు: “ఈ రోజు ప్రధానమంత్రిని తన చేతితో చరిచాడు. ఇతను రాజు అయినప్పుడు తన కరవాలాన్ని మనమీద పడవేస్తాడు. అందువల్ల మనం ఇతను సింహాసనం అధిష్టించకుండా చూడాలి.” ఈ సంఘటన తరువాత ప్రధానమంత్రి 500 రాజాధికారులను ఏకం చేసాడు. ఆ సమయంలో “భవిష్యవాణి అశోకుడు తప్పనిసరిగా చక్రవర్తి అయి ఈ భూమిమీద ఒక ఖండాన్ని పాలించగలడు అని పలికింది. అందువల్ల సమయం వచ్చినప్పుడు మనం అతనిని సింహాసనం మీద కూర్చుండపెడదాము” అని నిర్ణయంచటం జరిగింది.

ఇది జరిగిన కొద్ది రోజులకే తక్షశిలలో పైన చెప్పినట్లు తిరుగుబాటు ఉద్యమం మరొకసారి తీవ్ర రూపం దాల్చింది. దీనిని అణచటానికి ఈసారి మంచానికే పరిమితమయిన బిందుసార తాను యువ రాజుగా నియమించిన యువరాజు శుసిమను పంపించాడు. శుసిమ వెళ్లిన కొన్నాళ్ళకు బిందుసార మృత్యుద్వారానికి అతి దగ్గరగా చేరువయ్యాడు. ఆయన శుసిమను వెనక్కి పిలిపించి అతని స్థానంలో అశోకుడిని పంపించమని ఆజ్ఞాపించాడు. ఇది నచ్చని మంత్రుల సమాఖ్య అశోకుడు తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నాడని బిందుసారకు నమ్మపలికారు. మరణశయ్య మీద ఉన్న రాజుతో “యువరాజు శుసిమ వెనక్కి రావటానికి చాలా రోజులు పడుతుంది గాబట్టి ప్రస్తుతం అశోకుడికి పట్టాభిషేకం చేసి తిరిగి వచ్చిన వెంటనే ఇతని స్థానంలో శుసిమ ను రాజుగా చేయండి” అని సలహా ఇచ్చారు. ఈ సలహా విన్న వెంటనే బిందుసార ఆగ్రహించాడు కాని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు.

అప్పుడు అశోకుడు “సింహాసనం న్యాయంగా నాదే అయితే దేవుళ్లే రాజ మకుటం నా శిరస్సు మీద పెడతారు” అని ప్రకటించాడు. ఈ మాటలు విన్న వెంటనే చంద్రగుప్త పుత్రుడు, రెండవ మౌర్య చక్రవర్తి బిందుసార నోటినుంచి రక్తం కక్కుకుని క్రీ.పూ. 272 లో స్వర్గారోహణం చేయటం జరిగింది.

చండ-అశోక

తండ్రి మరణం తరువాత దాదాపు 4 ఏళ్ల తరువాత క్రీ.పూ. 268 లో తన కుటుంబం నుంచి సింహాసనానికి ప్రత్యర్థి లేని సమయంలో అశోకుడు మూడవ మౌర్య చక్రవర్తిగా రాజ మకుటాన్ని ధరించటం జరిగింది. తండ్రి రాజు అయ్యేటప్పటికి మహేంద్ర వయస్సు 14 ఏళ్ళు. ఈ 4 ఏళ్ల కాలంలో పాటలీపుత్రలో అనేక రక్తసిక్తమైన సంఘటనలు జరిగాయి. తక్షశిల నుంచి రాజధానికి తిరిగివచ్చిన శుసిమ ఒక కందకంలో పడిపోయాడు. ఈ పడటం నేరుగా క్రింద ఉన్న నిప్పులమీద పడి, బ్రతికి ఉండగానే నిప్పుల మీదనే మరణించాడు. ఈ ఘటన అశోకుడి ప్రమేయంతోనే మంత్రుల సహాయయంతో జరిగింది.

చక్రవర్తి కాకముందే అశోకుడు జ్యేష్ఠ పుత్రుడు రాజు అయ్యే సంప్రదాయానికి, తన తండ్రి కోరికకు గండికొట్టి సింహాసనాన్ని తానే స్వాధీనం చేసుకోవాలనే పన్నాగంలో అనేక హత్యలు చేయటం జరిగింది. అశోకుడు చక్రవర్తి అయిన తొలి రోజులలో ఎంత కర్కశంగా, భీతికరంగా ప్రవర్తించాడంటే చరిత్రకారులు ఆయనకు ‘చండ-అశోక’ (Chanda-Asoka) అనే ‘బిరుదు’ ఇచ్చారు.

బిందుసార అంపశయ్యమీద ఉన్న సమయంలో అశోకుడికి సహకరించిన కుట్రదారులు ఇప్పుడు ఈ నూతన మౌర్య రాజు యెడల తిరస్కార ధోరణిలో ఉండటం మొదలైంది. దీనిని గమనిం చిన అశోకుడు వారి విధేయత పరీక్షించాలని ఒక రోజు “పుష్పాలు, పండ్లతో నిండియున్న ప్రతి వృక్షాన్ని నరికివేయాలి; కాని ఈ ప్రయత్నంలో ముళ్ళతో ఉన్న వృక్షాలను మాత్రం నరకకూడదు” అని ఆజ్ఞాపించాడు. చూడటానికి ఇది సులువయిన పని అయినా, యదార్ధానికి ఇది అసాధ్యమైన పని. ఎందుకంటే ముళ్ళతో ఉన్న వృక్షాలు సాధారణంగా పుష్పిస్తాయి, కాయలు కాస్తాయి.

ఈ రాజాజ్ఞకు ఎదురు చెప్పకూడదు; ఈ పరీక్షకు కారణం అడుగకూడదు; ఇది వీలుకాకపోతే మరణం వినా గత్యంతరం లేదు. అశోకుడు ఇచ్చిన ఈ అసాధారణమైన, అసంగతమైన ఆజ్ఞలో ఉన్న ప్రాధాన్యత కేవలం గుడ్డిగా రాజభక్తిని ప్రదర్శించుకోటానికి మాత్రమే. ఈ ఆజ్ఞ నూతన మౌర్య రాజు మూడు మార్లు చెప్పినా మంత్రులు పట్టించుకోలేదు, లెక్కచేయలేదు. ఫలితంగా వెంటనే అశోకుడు ‘500’ కంఠాలను తన కరవాలానికి లేదా తనకు నమ్మకమైన వారి కత్తులకు బలి చెయ్యటం జరిగింది.

ఈ దారుణ శిరచ్చేదన కేవలం మంత్రులకే పరిమితం కాలేదు. ఇంకా ఎంతోమంది అశోకుడి కర్కశత్వానికి బలి అవటం జరిగింది. ఈసారి అంతఃపురంలో ఉన్న స్త్రీలు. దీనికి కారణం వీరు తమతో సుఖం పంచుకున్న మౌర్య చక్రవర్తికి జరిగిన అవమానం. వీరు చేసిన పెద్ద తప్పు ఈయనను అలక్ష్యం చేసి, అవమానకరంగా మాట్లాడటం.

ఒకసారి వసంత ఋతువులో తన అంతఃపుర స్త్రీలతో కలిసి తూర్పు పాటలీపుత్రలోని పుష్ప వనంలో విహరిస్తున్నప్పుడు అనేక పుష్ప వృక్షాలను వీక్షిస్తూ నడుస్తున్నారు. అప్పుడు అశోకుడికి సుందరమైన పుష్పాలతో ఉన్న ‘అశోక’ వృక్షం కనిపించింది. తన పేరుతో ఉన్న ఈ పుష్పాన్ని చూసి ఆయన అమిత సంతోషంతో భావావేశం పొందాడు. ఈ ఆనంద స్థితిలో ఉన్న అశోకుడు ఆరాత్రి శయనాగారంలో తన ప్రియురాళ్లతో శృంగారంలో మునిగి ఉండటం జరిగింది. ఆ సమయంలో కొంత మంది యువ స్త్రీలు గరుకుగా ఉన్న ఆయన శరీరాన్ని ప్రేమతో స్పృశించినప్పుడు, నిమిరినప్పుడు అసహ్యించుకొనటం జరిగింది.

అశోకుడు దీర్ఘ నిద్రలో ఉన్నప్పుడు వీరు కోపంతో, పగతో ఆయనకు ఇష్టమైన అశోక వృక్షానికి ఉన్న అన్ని పుష్పాలు, కొమ్మలను నరికివేశారు. ఈ విషయం తెలుసుకున్న అశోకుడు అందమైన తన ప్రియ వృక్షాన్ని నరికినందుకు ఈ స్త్రీలు అందరిని అగ్నికి ఆహుతి చేయటం జరిగింది. ఇలా దగ్ధం కాబడిన స్త్రీలు 100 మంది వరకు ఉండవచ్చని చరిత్రకుల అంచనా!

చండ-గిరిక

ఇంత ఎత్తున తన స్వీయ పర్యవేక్షణలో అశోకుడు జరిపే వరుస హత్యలను నూతన ప్రధాన మంత్రి చూసి ఒక తలారి అధికారిని నియమించమని రాజుకు సూచించాడు. ఇక నుంచి రాజుకు బదులు ఈ తలారి-అధికారి హత్యలు చేసే బాధ్యత నిర్వహిస్తాడు. దీని వల్ల రాజుకు మరక అంటదు. ఈ సూచన అశోకుడికి నచ్చి ఈ బాధ్యత సమర్థతతో నిర్వహించే వ్యకి కోసం రాజ్యం నలుమూలల గాలించటం జరిగింది. చివరకు తూర్పు మగధ రాజ్యంలోని ఒక గ్రామంలో చేనేత కుటుంబంలోని 18 ఏళ్ల యువకుడు లభించాడు.

అతని పేరు ‘గిరిక.’ అతని భీకరమైన రూపం, పైశాచికానంద వైఖరి కారణంగా అతనికి క్రమేణా ‘ఉగ్ర-గిరిక’ (చండ-గిరిక) అనే నామం ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ చండ-గిరిక అశోకుడి అనుయాయులతో తన గొప్పతనాన్ని చెప్పుకుంటూ తాను ‘ఈ జంబూద్విపం అంతటిని సంహరించగలనని’ ప్రగల్భాలు పలికాడు. చండ-గిరిక సూచన ప్రకారం అశోకుడు పాటలీపుత్రలో ఒక కారాగారం నిర్మించి అందులో అందమైన కందకం తవ్వి అతనికి అప్పచెప్పటం జరిగింది. ఈ కారాగృహం బయటకు ఎంత సుందరంగా ఉందో, లోపల అంత భీకరంగా, భయకరంగా ఉంటుంది. చండగిరిక తన అధికారాన్ని ఉపయోగించి ఖైదీలను అనేక పద్ధతులతో, రకాలుగా చిత్రహింసలకు గురిచేశాడు. అశోకుడు సూచించిన వారిని మాత్రం చివరకు బ్రతికి బట్ట కట్టనీయడు!

తొలినాళ్లలో అశోకుడు చేసిన, చేయించిన దుష్కృత్యాల వల్ల ‘చండ-అశోక’ గా పేరుగాంచిన ఈ మౌర్య చక్రవర్తి తదుపరి కాలంలో నిర్వహించిన సత్కృత్యాల కారణంగా, ధర్మ కార్యాలవల్ల ‘ధర్మ-అశోక’ గా ప్రపంచమంతటా పేరొందాడు.

ప్రారంభంలో అశోకుడి క్రూరత్వం సింహాసనం ఆక్రమించుకోటానికే పరిమితమయింది. దీనిని సాధించటానికి పైన చెప్పినట్లు జ్యేష్ఠ సవతి-సోదరుడితో పాటు అతనిని సమర్ధించిన అనేక మంది ఇతర సవతి సోదరులను హతమార్చడం ఆయనకు తప్పనిసరి అయింది. రాజు అయిన తరువాత కూడా ఈ దారుణ హింస రాజ కుటుంబానికి బయట ఉన్న వారి విషయంలో జరిగింది. ఈ అతి దారుణమైన హింస రాజు అవటానికి, ఆ తరువాత దాన్ని పదిలం చేసుకోటానికి మాత్రమే అయినా, ఈ క్రూర మనస్తత్వం సింహాసనాన్ని పదిలం చేసుకున్న తరువాత కూడా కొనసాగింది.

అశోకుడు ‘చండ-అశోక’ పేరు స్థానే 'ధర్మ-అశోక' గా ఎలా మారిందీ, తదితర విషయాలు వచ్చే సంచికలో తెలుసుకుందాము.

మీ అభిప్రాయాలు, స్పందన తెలియజేసేందుకు నా ఈ మెయిల్: dr_vs_rao@yahoo.com

****సశేషం****

Posted in August 2023, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!