Menu Close
VSRao
అశోక మౌర్య
డా. వల్లూరుపల్లి శివాజీరావు

1. అశోకుడు

విద్య, శిక్షణ

అశోకుడు క్రీ.పూ. 304 లో జన్మించినట్లు చరిత్ర నుడివింది. బాల్యదశలో ఇతర రాజకుమారుల వలే అశోకుడు కూడా పరిపాలనా దక్షతను పొందటానికి కావలసిన విద్య, శిక్షణ పొందటం జరిగింది. ఒక రాజ కుమారుడి విద్యలో యుద్ధ కళలతోపాటు, పరిపాలన, ఆర్ధిక సంబధిత విషయాలు కూడా ఉంటాయి.

విద్య ప్రారంభంలో తన సోదరులతోపాటు అశోకుడి శిరస్సు ఉపరిభాగం నున్నగా గొరుగు బడటం జరిగింది. ఆ తరువాత అక్షరాభ్యాసం, తదుపరి అంక గుణితం. ఇలా సాగుతూ ఉన్నప్పుడు ‘ఉప నయనం’ జరిగింది. ఆ తరువాత అశోకుడు, అతని సోదరులు అనేక మంది విశిష్ట గురువుల నుంచి మూడు వేదాలు, తత్త్వశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, రాజకీయ శాస్త్రం, ద్రవ్య శాస్త్రం, తదితర సంబంధిత శాస్త్రా లలో విద్య, ప్రావీణ్యత పొందటం జరిగింది. శిక్షణ సమయంలో అశోకుడు రాజ్య పరిపాలన, తత్త్వ శాస్త్రం, నీతి శాస్త్రం విషయాలలో అమిత మైన శ్రద్ధ చూపించాడు. వీటిల్లో శిక్షణ తరువాత కాలంలో అయన మేధా సంపత్తి దోహదానికి చాలా ఉపయోగపడ్డాయి.

రాజకుమారులు దినం మొదటి భాగం ఏనుగులు, అశ్వాలు, రాధాలు, ఆయుధాలను ఉపయోగించటానికి కావలసిన శిక్షణకు వినియోగిస్తే, రెండవ భాగం ‘ఇతిహాసాలు’ చదవటానికి వినియోగిం చారు. వీటిల్లో సమకాలిక భారత చరిత్ర, విశ్వ చరిత్రతో పాటు పురాతన భారత చరిత్ర కూడా తెలుసు కోవాలి. ఇతిహాసాలు తెలుసుకునే వ్యక్తి ఆ కాలపు మానవాళి ప్రవర్తన, మానసిక శాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సాంఘికం, తదితర విషయాలగురించి తెలుసుకోవటం తప్పనిసరి.

ప్రారంభంలో ఇటువంటి కఠోర శిక్షణ రాజకుమారులకు తప్పనిసరి. దీని వల్ల వీరిలో విధేయత, మానసిక అభివృద్ధి పరిపక్వత చెందుతుంది. రాజులకు తమ కుమారులవల్ల భయం ఎప్పుడూ ఉంటుంది. రాజకుమారులు పీతలు లాంటివారు. ఇవి తమను కన్నవారిని తినివేస్తాయి. పురాతన కాలంలో పాలకుల కుటుంబాలలో రాజహత్యలు జరగటం సహజం. క్రమశిక్షణ లేని పుత్రులు, కోపిష్టులు, ప్రతికూలురు, దుష్టబుద్ధి ఉన్నవారు, తమ తండ్రులను కారాగారంలో ఉంచి చివరకు హత్య చేసిన ఉదంతాలు అనేకం ఉన్నాయి.

రాజుకు ఎక్కువ మంది పుత్రులుంటే వారిలో వారే కలహించుకుని తండ్రికే హాని తలపెడతారు. ఆయనకు ఒక పుత్రుడే కలిగితే, అతడు దుష్ట ప్రవృత్తుడైతే తండ్రిని రాజు కారాగారంలో ఉంచుతాడు. ఆయనకు అనేక మంది పుత్రులు కలిగితే ప్రమాదకారులయిన పుత్రుడిని (పుత్రులను) రాజ్య పొలి మేరలు, రాజధానికి దూరంగా ఉన్న ప్రాంతాలకు పంపించేవారు. అలా దూరంగా ఉంచి కొన్నాళ్ల తరు వాత రాజు ఆ పుత్రులను హత్య చేయించేవాడు.

అశోకుడిని పాటలీపుత్రకు 2,000 కి.మీ. దూరంలో ఉన్న తక్షశిలకు పంపించాడంటే ఈ పుత్రుని వల్ల తనకు ప్రమాదం ఉందని గ్రహించినట్లు గోచరిస్తుంది. ప్రతికూలుడైన ఈ కుమారుడిని తనకు బహుదూరంగా ఉంచాలని బిందుసార నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో (క్రీ.పూ. 284-283) అశోకుడి వయస్సు సుమారు 20-21 ఏళ్ళు మాత్రమే.

వాయువ్య (North-West) దిశలో ఉన్న తక్షశిల నగరానికి చేరుకోవాలంటే విశాలమైన పీఠభూమి ని నడయాడాలి, అనేక నదులను దాటాలి, విస్తారమైన అడవులలో ప్రయాణించాలి. ఆ సమయంలో తక్షశిల అస్థిరంగా, సంక్షోభంలో ఉన్న ప్రాంతం. అటువంటి ప్రదేశానికి అశోకుడిని పంపించటం ఈ పుత్రుడిని మట్టు పెట్టాలని బిందుసార నిర్ణయించటం శోచనీయం.

అప్పటి పంజాబులో తక్షశిల అతి ముఖ్యమైన నగరం. యదార్ధానికి ఈ నగరం మూడు పట్టణాల సముదాయం. చిన్న చిన్న కొండలమీద నెలకొనివున్న అనేక మిట్టలు, దిబ్బలు, తిప్పల తో కూడిన ఈ పట్టణాలలో అనేక బుద్ధ స్తూపాలు, బౌద్ధుల మఠాలు, ఆశ్రమాలు అన్ని దిక్కులలో నెలకొని ఉన్నాయి. బిందుసార-అశోక కాలంలో అచ్చటి ప్రజలలో ఎక్కువ మంది ‘భీర్ దిబ్బ’ (Bhir Mound) చుట్టూ నివసి స్తూ ఉండేవారు. అచ్చటికే అశోకుడు తండ్రి ఇచ్చిన సైన్యంతో రావటం జరిగింది.

అశోకుడు తక్షశిలకు పంపబడిన సమయంలో ఆ ప్రదేశం మౌర్య రాజ్యం మీద తిరుగుబాటు దశలో ఉంది. తక్షశిలను చుట్టుముట్టి ఈ తిరుగుబాటును అణచటానికి, బిందుసార అశోకుడితో పాటు గజ దళం, అశ్వదళం, అశ్వారూఢులైన సైనికులు, కాల్బలం పంపించాడు. ఆశ్చర్యకరంగా వీటికి అవసరమైన ఆయుధాలను మాత్రం వెంట పంపలేదు.

అశోకుడు బయలుదేరేముందు అతని అనుయాయులు, సేవకులు “రాజకుమారా! మనకు యుద్ధ ఆయుధాలు లేవు; మరి మనం ఎలా, వేటితో యుద్ధం చేయాలి” అని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా అశోకుడు “నాకు రాజు అయ్యే యోగ్యత ఉంటే, అనేక యుద్ధ ఆయుధాలు నా ముందు ఉంటాయి” అని ప్రకటించాడు. ఈ మాటలు పలికిన వెంటనే భూమి చీల్చుకుని దేవతలు అనేక ఆయుధాలను పైకి తీసుకువచ్చారు. ఇది కొంచెం అతిశయోక్తి అనిపించినా ఈ మాటలు అశోకుడి ధైర్యానికి ప్రతీకలుగా పరిగణించవచ్చు. చివరికి అశోకుడు చతుర్విధ యుద్ధ బలగంతో తక్షశిలకు బయలుదేరాడు.

బిందుసార పుత్రునికి ఆయుధాలు నిరాకరించిన విషయం చరిత్రకారులు అనేక విధాలుగా వ్యాఖ్యానించారు. రాజు వద్ద ఆయుధాలు లేవంటే నమ్మశక్యం లేని విషయం. కేవలం తనకు అయిష్టుడయిన అశోకుడి దండయాత్ర విఫలం అయితే అతనిని మగధనుంచి శాశ్వతంగా తొలగించవచ్చు. ఈ విధంగా తన ప్రియ పుత్రుడు ‘శుసిమ’ సింహాసనం అధిష్టించటానికి ప్రత్యర్థి ఉండడు.

కారణం ఏదయినా అనుకున్న ప్రణాళిక ప్రకారం అశోకుడు సైన్య సమేతంగా ఖడ్గాలు ఒరలలో ఉంచుకునే తక్షశిల ప్రవేశించాడు. కాని అచ్చటి ప్రజలు వీరిని ప్రతిఘటించడానికి బదులు తమ గృహాలలోనుంచి రహదారులు, బాటలలోకి వచ్చి అశోకుడిని స్వాగతించి “మేము రాజకుమారుడి మీద తిరుగబడటానికి ఇష్టం లేదు; యదార్ధానికి మహారాజు బిందుసార మీద కూడా. అసలు కారణం దుష్టులైన మీ అధికారులు మమ్ములను అణచివేస్తున్నారు, తద్వారా మాకు స్వేచ్ఛ కరువైంది.” చివరకు అశోకుడి తక్షశిల దండ యాత్ర ఆది నుంచి అంతం వరకు హింసారహితమే!

తక్షశిల

ఒకప్పటి గాంధార (ఇప్పటి ఆఫ్గనిస్తాన్) రాజ్యానికి రాజధాని అయిన తక్షశిల నగరానికి వేలాది ఏళ్ల చరిత్ర ఉంది. రామాయణ కాలంలో తక్షశిలను శ్రీరాముడు సోదరుడు భరతుడు స్థాపించి దానికి తన భార్య ‘మాండవి’ ద్వారా కలిగిన పుత్రులు ‘తక్ష’, ‘పుష్కల’ నామాల మీద నగరాలను స్థాపించి వీరిని రాజులుగా చేశాడు. కాలక్రమేణా ఈ రెండు రాజ్యాలు కలిసిపోయిన తరువాత ‘తక్షశిల’ నామం సంతరించు కుంది.

మహాభారత కాలంలో అర్జునుడి మనుమడు పరీక్షిత్ పట్టాభిషేకం తక్షశిలలోనే జరిగింది. ఆ తరువాత క్రీ.పూ. 700 వరకు తక్షశిల చరిత్ర మరుగున పడింది. గౌతమ బుద్ధుడు బౌద్ధ మత స్థాపన తరువాత వాయువ్య దిశలో ఉన్న గాంధార రాజ్యంలో బౌద్ధమత వ్యాప్తికి తక్షశిల చాలా ప్రాముఖ్యత వహించింది.

పరీక్షిత్ పుత్రుడు జనమేజయుడు మరణానికి 7 రోజుల దూరంలో ఉన్నప్పుడు వైశంపాయన మహర్షి మహాభారతాన్ని 24,000 శ్లోకాల రూపంలో వివరించటం తక్షశిలలోనే జరిగింది. ప్రపంచంలో మొట్టమొదటి విశ్వవిద్యాలయం తక్షశిలలోనే స్థాపించటం జరిగింది. అప్పటి విశాల భారతావనిలోని అనేక విద్యాలయాలకు ఈ జగత్విశ్వవిద్యాలయం అనుబంధ నిలయం, మార్గదర్శి. ప్రసిద్ధి చెందిన, ఘనకీర్తి గల అనేక మంది విద్వాంసులు, గురువులు, పండితులు ఈ విశ్వ విద్యాలయం ఆకర్షించింది. వీరిలో అతి ముఖ్యులు: ఆయుర్వేద వైద్యులు, గౌతమ బుద్ధ వైద్యుడు, ‘జీవక కుమార బచ్చ’ (Jīvaka Kumar Bhaccha: క్రీ.పూ. 6-5 శతాబ్దం); సంస్కృత వ్యాకరణవేత్త, వ్యాకరణ గ్రంథకర్త ‘పాణిని’ (Pāṇini), చాణక్య (కౌటిల్య: క్రీ.పూ. 350-275), మరియు విష్ణుశర్మ (సుమారు క్రీ.పూ. 200). మహాయాన బౌద్ధమత శాఖ తక్షశిల విద్యాలయంలో స్థాపించబడింది.

గ్రీకుల దయవల్ల ‘తక్షిల (Taxila) గా నామాంతరం చెందిన ఈ తక్షశిల నగరం ఈ రోజు పాకిస్తాన్ లో భాగమయిపోయింది.

దేవి తో అశోకుడి ప్రేమ

అశోకుడి తొలి ప్రేమ వృత్తాంతం అవంతి రాజ్యంతో ముడిపడి ఉంది. తక్షశిల ప్రతిఘటన అశోకుడు శాంతియుతంగా ముగించిన తరువాత బిందుసార సంతతించి ఈ 22 ఏళ్ల రాజకుమారుడిని తన సామ్రాజ్యంలో భాగ మైన అవంతి రాజ్యానికి రాజప్రతినిధి (Viceroy) గా క్రీ.పూ. 282 లో పంపించటం జరిగింది.

మరొక అభిప్రాయం ఏమిటంటే తక్షశిలలో అశోకుడి విజయం తన ప్రియ పుత్రుడు శుసిమ రాజు కావటంలో అడ్డు తగలవచ్చని బిందుసార ఈ శుభద్రాంగి పుతృడిని పాటలీపుత్రకు దూరంగా ఉజ్జయినికి పంపించి ఉండవచ్చు. ఈ రాజప్రతినిధి బాధ్యత 10-11 ఏళ్ల పాటు నిర్వహించాడు.

అంతకు ముందు మధ్య భారతం లోని మాల్వా (Malwa) ప్రదేశంలో అవంతి రాజ్యం చంద్రగుప్త తన ఆధీనంలోకి తీసుకురావటం జరిగింది. మగధ రాజధాని పాటలీపుత్ర నుంచి మాల్వా రాజధాని ఉజ్జయిని వెళ్లాలంటే సుమారు 1,000 కి.మీ. ప్రయాణించాలి. ఆ రోజులలో గతుకులు, గుంటలు, నదులతో నిండిన మార్గంలో ప్రయాణించాలంటే కొన్ని నెలలే పడుతుంది. వర్షాకాలంలో ప్రయాణం బళ్ళు, వృషభాలు, పశువులు, రధాలతో కూడిన సైన్యం ప్రయాణించాలంటే సాధ్యం కాదు. అదీగాక వింధ్య పర్వత శ్రేణి చాలా చోట్ల 1,100 మీ. (3,600 అడుగులు) ఎత్తులో ఉంటుంది.

ఉజ్జయిని చేరేముందు అశోకుడి చివరి మజిలి ఆ నగరానికి తూర్పు వైపున ఉన్న విదిష పట్టణం. ఈ ప్రదేశం అశోకుడి ప్రేమతోనే గాక ఆయన తదుపరి జీవితం, చరిత్రతో కూడా ముడిపడి ఉంది.

అశోకుడు విదిష పట్టణంలో విడిది చేసినప్పుడు అచ్చటి ముఖ్య నాయకుడు, వ్యాపారస్తుడు ‘దేవ’ అనే వ్యక్తి ఆతిధ్యం పొందాడు. రాజ ప్రతినిధి ముఖ్య కర్తవ్యం పన్నులు వసూలు చేయటం కాబట్టి అశోకుడికి ‘దేవ’ తో సాన్నిహిత్యం పెరిగింది. ఆ సమయంలో ఆయన పుత్రిక అత్యంత సుందరి అయిన ‘వెదిశదేవి’ ని తొలిచూపులోనే ప్రేమించటం జరిగింది. ఈ మౌర్య రాజపుత్రుడిని కలిసే వరకు వైశ్య వర్ణానికి చెందిన ‘దేవి’ జీవిత వివరాలు తెలియవు. ఈమె వైశ్య వర్ణస్థురాలయినందువల్ల ఈమెకు ‘వైశ్య పుత్రీ-దేవి’ అనే నామం కూడా ఉంది.

తొలిచూపులు తరువాత వీరిరువురికి వివాహం అయిందో లేదో తెలియదు. వివాహం ఆ కాలపు రాచరిక వ్యవస్థలో న్యాయబద్ధమైనది కాకపోవచ్చు. అయినా అశోకుడి దృష్టిలో దేవి న్యాయబద్ధమైన భార్యే! వివాహం తరువాత ఉజ్జయినిలో ఆమెకు క్రీ.పూ. 280 లో ఒక సుందరుడయిన బాలుడు, ‘మహేంద్ర’ (పాలీ నామం: మహేంద), జన్మించాడు. రెండు ఏళ్ల తరువాత ఒక పుత్రిక కలిగింది. ఆమె పేరు ‘సంఘమిత్ర’. మహేంద్ర, సంఘమిత్ర జననం అశోకుడి జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం, ఆయన భవిష్యత్తు జీవితాన్ని మలుపు తిప్పిన విషయం.

కనిపుర స్తూపం

‘దేవి’ అశోకుడిని కలిసినప్పుడు దేవి బౌద్ధ మతస్తురాలు. తన పిల్లలు బాల్య వయస్సు దాటిన తరు వాత ఈమె వీరిని సాంచి పట్టణానికి తీసుకువెళ్లి వీరిచే బౌద్ధ సన్యాస దీక్ష ‘పబ్బజ్జ’ (పాలీ భాష: Pabbajjā; సంస్కృతం: ప్రవరాజ్య: Pravarajya) స్వీకరింపజేసింది. దీని అర్ధం ‘ప్రపంచాన్ని విడనాడటం’.  సనాతన ధర్మంలో బ్రాహ్మణ, క్షత్తియ్ర, వైశ్య వర్ణాలలో ఈ వయస్సువారికి ‘ఉపనయనం’ జరుగుతుంది. అలాంటిదే ఈ పబ్బజ్జ.

బౌద్ధ మతం స్వీకరించే వారు ఈ ప్రధమ దశ దాటిన తరువాత 20 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు పూర్తి సన్యాసత్వం స్వీకరించి భిక్షువులు అవుతారు. మహేంద్ర, సంఘమిత్రలు తల్లి కారణంగా ఈ విధం గా బౌద్ధ భిక్షవులు అవటం జరిగింది.

ఆ కాలంలో విదిషకు 10 కి.మీ. దూరంలో ఉన్న 'సాంచి' (Sanchi) అనేక బౌద్ధ స్తూపాలకు నిలయంగా ప్రసిద్ధి చెందింది. ఉజ్జయినిలో వాయువ్య దిశలో 330 అడుగుల విస్తీర్ణం, 105 అడుగుల ఎత్తైన ఒక స్తూపం నిర్మించబడింది.  దీనిని ‘కనిపుర స్తూపం’ (Kanipura stupa) అంటారు.

తరువాత కాలంలో అశోకుడు మౌర్య రాజు అయినప్పుడు కూడా దేవి తన ఇద్దరు పిల్లలతో ఉజ్జయిని లోనే ఉండిపోయింది. ఆమె స్వర్గస్తురాలయిన తరువాత తన జ్యేష్ఠ భార్య జ్ఞాపకార్ధం అశోకుడు ఈ కనిపుర స్తూపం బాహ్య గోడను ఇటుకలతో పునఃనిర్మించి దానికి కొత్త రూపు తీసుకురావటం జరిగింది. కొంత కాలం తరువాత దేవి-అశోక సంతతి మహేంద్ర, సంఘమిత్ర జ్ఞాపకార్ధం దేవి స్తూపం ప్రక్కన రెండు చిన్న స్థూపాలు నిర్మించటం కూడా జరిగింది.

అది కాలక్రమేణా నల్లమట్టితో కప్పబడి ఒక దిబ్బగా మారిపోయింది. ఈ దిబ్బ ‘వైశ్య తెక్రి’ (Vaishya Tekri: వర్తకుడి దిబ్బ) గా పేరొందింది. సుమారు 2,300 ఏళ్ల కనిపుర స్తూపంతో కూడిన ఈ వైశ్య తెక్రి దిబ్బను చూడటానికి అనేక మంది సందర్శకులు ఉజ్జయిని సందర్శిస్తారు. భారత ప్రభుత్వం ఈ స్థూపాన్ని1951 లో ‘రక్షిత కట్టడం’ (Protected Monument) గా ప్రకటించింది.

Vaishya-Tekri

సాంచి లోని ‘వైశ్య తెక్రి’ (Vaishya Tekri) దిబ్బ: దీని క్రింద మట్టితో కప్పబడిన అశోకుడి జ్యేష్ఠ భార్య ‘దేవి’ జ్ఞాపకార్ధం నెలకొల్పబడిన కనిపుర స్తూపం. ఈ స్తూపంతో పాటు ఇచ్చట మహేంద్ర, సంఘమిత్ర స్తూపాలు కూడా ఉన్నాయి.

వచ్చే సంచికలో అశోకుడు మౌర్య సామ్రాజ్యాధిపతి కావటం, దీనికి సంబంధించిన విషయాలు గురించి తెలుసుకుందాము.

మీ అభిప్రాయాలు, స్పందన తెలియజేసేందుకు నా ఈ మెయిల్: dr_vs_rao@yahoo.com

****సశేషం****

Posted in July 2023, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!