Menu Close
Shabdavedhi pagetitle
-- గౌరాబత్తిన కుమార్ బాబు --

'విలాస తామ్ర శాసనం'

ఢిల్లీ సుల్తాన్ ఘియాజుద్దీన్ తుగ్లక్ కుమారుడు జునాఖాన్. ఇతడిని ఉలుఘ్ ఖాన్ లేదా మహమ్మద్ బిన్ తుగ్లక్ అని కూడా అంటారు. కలి శకం 4425లో (క్రీ.శ 1323లో) జరిగిన యుద్ధంలో జునాఖాన్ ఓరుగల్లులో కాకతీయ ప్రతాపరుద్ర చక్రవర్తిని ఓడించాడు. బంధీగా పట్టుబడిన ప్రతాపరుద్రుడు ఢిల్లీకి తరలిస్తున్నపుడు నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దాంతో కాకతీయ సామ్రాజ్యం పడిపోయింది. ముసల్మాను సేనలు మిడతల దండులా తెనుగు గడ్డ మీద పడి సంపదను దోచాయి. కాకతీయులు నిర్మించిన అనేక కోటలు, దేవాలయాలను నాశనం చేసి, మత మార్పిడులకు పాల్పడ్డారు. తురుష్కు సేనలు క్రూరమైన చర్యలతో తెలుగు నేల భయకంపితమైంది. ఆనాటి పరిస్థితిని అదే కాలానికి చెందిన విలాస తామ్ర శాసనం చెబుతూ ఉంది.

శాసనంలోని విషయం ఈ విధంగా ఉంది :-

ప్రతాపరుద్రుడను భానుడు అంతర్హితుడు కాగా లోకమున అంధకారము వ్యాపించినది. ధనికులు అనేక పాపోపాయముల చేత ధనము నిమిత్తము పీడింపబడినారు. తురుష్కులను చూచీచూడుట చేతనే కొందరు తమ ప్రాణములను వదలినారు. దేవ ప్రతిమలు సమస్తమూ భిన్నములైపోయినవి. చిరకాలంగా మహా పండిత భుక్తములగుచున్న అగ్రహారములన్నియూ అపహృతములైనవి. రైతు కుటుంబములన్నియు నాశనమైపోయినవి. ఆ మహాపత్కాలమున విత్తము, భార్య మొదలగు వేనియందును ప్రజలకు స్వాయత్తతాభావము పోయినది. తిరిలింగ దేశము రక్షించువారెవరును మనస్సుకు కూడా తట్టక కార్చిచ్చు చుట్టుకున్న అడవివలె సంతపించి పోయినది.

ఈ నేపథ్యంలోనే మహమ్మద్ బిన్ తుగ్లక్ తండ్రిని చంపి ఢిల్లీ సింహాసనం అధిష్టించాడు. తెలుగు నేలను పరాధీనత నుండి తప్పించడానికి తెలుగు నాయకులు విప్లవ యజ్ఞం ప్రారంభించారు. వీరంతా ప్రతాపరుద్రుడి ముప్పాతిక మంది సేనానులు. ఈ డెబ్బై అయిదు మంది సేనానులకు నాయకుడు ముసునూరి ప్రోలయ నాయకుడు.

ముసునూరి ప్రోలయ నాయకుడే పిఠాపురం సమీపంలోని కందరాడ గ్రామంలో 'విలాస తామ్ర శాసనం' వేయించారు.

ఓరుగల్లు పతనానంతరం తురుష్కుల అరాచకాల నేపథ్యంలో చెలరేగిన ప్రజాగ్రహం తదనంతర పరిస్థితులను ఆసరాగా చేసుకుని భద్రాచల ప్రాంత అరణ్య భూముల్లోని గిరివన దుర్గాలను తన స్థావరంగా ఏర్పరచుకుని ప్రోలయ నాయకుడు తురుష్కులతో పోరాడి వారిని ఓడించాడు. ఈ పోరాటంలో ప్రోలయనాయకుడికి అతని పిన తండ్రి కొడుకు కాపయ నాయకుడు, వేంగి పాలకుడు వేంగి భూపాలుడు తోడయ్యారు. గోదావరి ప్రాంతంలో రేఖపల్లిని రాజధానిగా చేసుకుని స్వతంత్ర రాజ్యం స్థాపించారు.

ప్రోలయ నాయకుడి స్పూర్తితో నెల్లూరు, గుంటూరు ప్రాంతాల్లో ప్రోలయ వేమారెడ్డి, నల్లగొండ, పాలమూరు ప్రాంతాల్లో రేచర్ల వెలమ సింగమనాయుడు తురుష్కుల పాలన నుండి ప్రజలను విముక్తులను చేశారు. ప్రోలయ నాయకుడు వైదిక ధర్మాన్ని పునరుద్ధరించాడు. రైతులపై ముష్కరులు విధించిన అన్యాయమైన పన్నులను రద్దు చేశాడు.

విదేశీయుల అక్రమణను అడ్డుకుని, వైదిక ధర్మాన్ని కాపాడిన ప్రోలయ నాయకుడు, స్వదేశీయులైన కళింగుల చేతిలో యుద్ధభూమిలో మరణించడం విధి వైపరీత్యం, భారతదేశ దౌర్భాగ్యం.

- ఓం తత్ సత్ -

Posted in July 2023, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!