Menu Close
Vempati Hema photo
జీవనస్రవంతి (సాంఘిక నవల)
వెంపటి హేమ

"అది వడ్రంగి పిట్టండి! సెట్టు మాను మీన ముక్కుతో అలా కొట్టి, పుచ్చు ఏడున్నాదో కనిపెట్టి, మానుకి కన్నం చేసి పురుగుల్ని జిగురుగా ఉన్న పొడుగైన నాలుకతో అందుకుని తింటాదండి. నెత్తిమీద ఎర్రటి కుచ్చుటోపీతో పిట్ట బలే తమాస గుంటాది. అద్గదిగో, అదేనండి" అంటూ ఎగిరి వెళ్ళిపోతున్న పిట్టను చూపించాడు.

ఇంకొంత దూరం వెళ్లేసరికి నీటి ఒడ్డున, ఒంటి కాలిమీద, జపంచేస్తున్నదానిలా నిశ్చలంగా నిలబడి ఉన్న కొంగ ఒకటి కనిపించింది.

"దాని జపమంతా చేప తన ముందరకు వచ్చేవరకే! అందుకే అంటారు, "కొంగ జపం - దొంగ వేషం అని" అన్నాడు జీవన్ దానివైపు చూస్తూ.

మడుగు లో మరోచోట కలువలు విరిసి ఉన్నాయి. ఒడ్డుననున్న సువర్ణ గన్నేరు కొమ్మ ఒకటి నీటి మీదికంతా వంగి పచ్చని పూలతో నిండి ఉంది. విరబూసివున్న ఆ కొమ్మమీద పొడుగ్గా ముక్కున్న చిన్న నీలంరంగు పిట్ట ఒకటి వాలివుంది. ఆ పిట్ట చాలా చిన్నగా ముద్దుగా ఉంది. కాని దాని ముక్కుమాత్రం దానంత పొడవుగానూ ఉంది. దానిని ఆసక్తిగా చూస్తూ అడిగాడు జీవన్, "అదేమి పిట్ట మల్లేశూ" అని.

"అదాండి? దాన్ని లకుముకి పిట్ట - అంటారండి."

అంతలో అది సూటిగా, నీళ్ళలోకి దూకి, నీటిమీద తేలిన చేపను, తనంతా ఉన్నదాన్ని, వాటంగా ముక్కున కరుచుకుని, ఎగిరిపోయి, చెట్టుమీదవాలి, ఆ చేపను కొమ్మమీద ఉంచి, కాలితో తొక్కిపట్టుకుని, ఆ చేపను ముక్కుతో పొడుచుకుని తినేసింది. దాని చిన్ని పొట్ట నిండిపోయింది కాబోలు , ఆపై "తుర్రున" ఎటో ఎగిరిపోయింది.

చూస్తూండగా యిట్టె సందెపడింది. పక్షులు గూళ్ళకు చేరే వేళ కావడంతో, మడుగులోని తుప్పల్లో గూళ్ళు కట్టిన పిట్టల సందడి క్షణ క్షణానికీ పెరుగుతోంది. అక్కడకు  రకరకాల పిట్టలు గూళ్ళను వెతుక్కుంటూ వస్తున్నాయి. అంతలో ఒక వింత శబ్దం వినిపించింది.

"అది జెముడుకాకి కూతండి. అదిగో, అక్కడ వాలింది చూడండి" అని వేలెత్తి కొంచెం దూరంలో నిద్రగన్నేరుచెట్టు కొమ్మపై వాలి కూస్తున్న పిట్టను చూపించాడు మల్లేశు. అది కాకంత ఉంది, కాని అది మామిడి చిగురు రంగు లాంటి రంగులో ఉంది.

"అబ్బాయిగోరూ! ఇది విన్నారా? ఈ పిట్ట గూటిలో సంజీవనీ పుల్ల ఉంటాదంట! ఆ పుల్ల వాసన చూపిస్తే సచ్చిపోయినోళ్ళు బతుకుతారంట! శాన్నాళ్ళు మా గేంగంతా పడి ఎతికామండి, కాని, దాని గూడు ఎక్కడా ఆపడలేదండి, ఆయ్!"

"చిన్నగా నల్లగా ఉన్న ఈ పిట్టని ఏమంటారు? అచ్చం ఈలవేసినట్లుగా కూస్తోంది!"

"దీన్ని ఏట్రింత అంటారండి. ఇది ఇంకా శానా ఇడ్డూరాలు సేస్తాది. ఆ గడ్డిలో మేత ఏరుకుంటున్నవి గోరువంకలండి. ఊర పిచ్చుకలు, గడ్డి పిచ్చుకలు, గిజిగాళ్ళు, గువ్వలు, పావురాళ్ళు - ఇలా నాకు శానావరకు ఈటి పేర్లు తెలుసు గాని, ఇంకా పేర్లు తెలవనివి కూడా శానా ఉన్నాయండి. ఇక కోయిల మాట సెప్పేదేంటి, కోయిలని తెలియనోళ్లుండరండి, ఆయ్!"

ఇద్దరూ కలిసి మరికొంత దూరం నడిచారు. తను ఎప్పుడూ చూసి ఎరుగని రమణీయమైన ప్రకృతి సొగసుల్ని అడుగడుగునా ఆస్వాదిస్తూ నడుస్తున్నాడు జీవన్. తామరబొడ్లు అందుకోవాలన్న కోరిక అతని మనసులోంచి తొలగిపోలేదు. మడుగువైపుగా చూస్తూ నడుస్తున్న అతనికి అవి ఒకచోట అందుబాటుగా ఉన్నట్లు అనిపించింది.

"మల్లేశు! మనం ఒకపని చేద్దామా, ఇక్కడినుండి అదిగో ఆ రాతి మీదకి దూకితే చాలు, దానిచుట్టూ చూడు, బోలెడు తామర బొడ్లున్నాయి, అవి తెంపుకు తెచ్చుకుందాము" అన్నాడు జీవన్.

మల్లేశు పకపకా నవ్వడం మొదలుపెట్టాడు. తనన్న దానిలో అంత నవ్వొచ్చేది ఏముందో అర్థంకాక తెల్లబోయి వాడివైపు చూశాడు జీవన్.

బలవంతంగా నవ్వాపుకుని అన్నాడు మల్లేశు, "అయ్యబాబోయ్! అబ్బాయిగోరూ, ఈడ నలా రాళ్ళూ రప్పలూ ఉండవండి, అంతా మెత్తని మన్నే ఉంటాదిక్కడ! అది రాయి కాదండి, తాబేలు! తల కనిపించకుండా అది కడుపులో దాసుకుంటాదండి! అదిగదిగో చూడండి, అది ఎలిపోతా ఉంది" అంటూ కదిలి వెళ్ళిపోతున్న తాబేలుని చూపించాడు.

"అబ్బా! ఎంత పెద్ద తాబేలో!" ఆశ్చర్యంగా దాన్నే చూస్తూ అన్నాడు జీవన్.

“ఈ తాబేలే కాదండి, ఇంకా శానా ఉన్నాయండి చిన్నా, పెద్దా తాబేళ్లు. మా తాత సిన్నప్పుడు ఇందులో మొసళ్ళు కూడా ఉండేవంట! అయ్యి శానా ప్రెమాదంగా మారడంతో తెల్లోల్లు వచ్చి, ఆటిని తుపాకులతో కాల్చి చంపేశారంట! మొదట్లో ఇది చాలా పెద్ద చెరువంట! మధ్యలో తూరలు ఉంచి, చెరువును రెండు ముక్కలు చేస్తూ ఈ వోడ్డునుంచి ఆ వొడ్డుకు రోడ్డు వేసినప్పుడే చెరువు అందం చెదిరి పోయిందoట. ఆపైన, చెరువు చుట్టూ తోటలూ, పొలాలూ ఉన్నోళ్ళు చెరువును చాలామట్టుకు ఆళ్ళ పొలాల్లో కలిపేసుకున్నారని సెప్పుకుoటారు. సిన్నోల్లు తప్పుగీని చేశారంటే పెద్దోళ్ళు సిచ్చలేస్తారండి, మరి ఆ పెద్దోళ్ళే  తప్పుసేత్తే …?"

"ఆ దేవుడు వేస్తాడులే వాళ్లకి శిక్ష" అన్నాడు జీవన్.

ప్రతి తోటలోనూ, ప్రతి పొలంలోనూ పనులు చక్కబెట్టుకుంటూ అటూ ఇటూ తిరుగుతున్నారు జనం. వ్యవసాయమంటే ఏడాది పొడుగునా రకరకాల పనులు ఉంటాయి. నేల పదునుచేసి విత్తనాలు వెయ్యడం, సరైన సమయంలో నీరు పెట్టడం, మొక్కల మధ్య పెరిగిన కలుపు తియ్యడం, చీడల్ని దులపడం, చక్కగా పెరిగిన పొలం పశువులబారిన పడకుండా కాపాడడం - ఇలా ఏవేవో పనులు ఉంటూనే ఉంటాయి సంవత్సరం పొడుగునా. అంతేకాదు, పంటను పండించడం ఒక ఎతైతే దాన్ని పరుల పాలైపోకుండా కాపాడి, చేరవలసిన చోటుకి చేర్చడం మరొక ఎత్తు! ఇలా రైతులు, పొలాన్ని తమ నిరంతర పర్యవేక్షణలో ఉంచి కాపాడుతూ ఉండవలసి ఉంటుంది. కృషీవలుని ఎడతెగని పరిశ్రమ మనకు అన్నం పెడుతుందన్నది నిజం!

అంతలో "డబ్ డబ్" మంటూ ట్రాక్టర్ వస్తున్నట్లు చప్పుడు వినిపించింది. ఆ ట్రాక్టరు దగ్గరగా రాగానే దాన్ని నడుపుతున్న వ్యక్తికి మల్లేశు నిఠారుగా నిలబడి, మిలటరీ పద్ధతిలో "శాల్యూట్" చేశాడు. ఆయన దానికి ప్రతిగా చిరునవ్వుతో బదులిచ్చారు. అంతలో ట్రాక్టరు వాళ్ళను దాటి ముందుకి వెళ్ళిపోయింది. మల్లేశు వెళ్ళిపోతున్న ట్రాక్టరు వైపు ఆరాధనగా చూస్తూ, చెప్పసాగాడు...

"ఆయనేనండి మా మేజరు గారు! ఆయనకి ఒక కన్నూ, ఒక సెయ్యీ కూడా యుద్ధంలో పోయాయంట! అయినా, ఆయిన దేనికీ ఎనకడుగు ఎయ్యరండి. మా గొప్ప యగసాయమండి ఆయినది, ఆయ్! అంతా సొంతంగా సూసుకుంటారండి."

సూర్యాస్తమయం కావడంతో పడమటి దిక్కున ఆకాశంలో సంధ్యారాగం, ఆకుపచ్చని వరి పొలాలపైన సిందూర వర్ణంలో పరుచుకుని ఉండి, ఎంతో అందంగా కనిపిస్తోంది. ఆ సందె వెలుగులో వరి పొలాలన్నీ వింత అందంతో మెరిసిపోతూ కనిపిస్తూ, సుతారంగా వీస్తున్న పైరుగాలికి అలలు అలలుగా తలలూపుతున్నాయి. పనులకెళ్ళిన జనమంతా పని ముగించి ఇళ్ళకు తిరిగి వెడుతూండడంతో సందడి మొదలయ్యింది. కాలువ పైన వంతెనగా వేసిన తాటి దుంగ మీదుగా, తలపై బరువున్నా కూడా జంకకుండా ఎంతో లాఘవంగా జనం ఆ తాటి దుంగపై అటు ఇటూ విసురుగా నడుస్తున్నారు. కాలవ గట్టునున్న బూరుగు చెట్టును ఆశ్రయించుకుని ఉన్న ఋషిపక్షుల గుంపు పగలంతా నిద్రపోయి, సాయంకాలం నిద్ర లేచి, గోలగా అరుచుకుంటూ వాటిలో అవి కీచులాడుకుంటున్నాయి. అంతలో వాటిని ఆకలి కవ్వించడంతో నెమ్మదిగా ఒకటొకటీ పళ్ళతోటలను వెతుక్కుంటూ ఎగిరి వెళ్ళిపోతున్నాయి.

పాలుపితికే వేళ అవ్వడంతో తల్లికోసం అరిచే ఆవుదూడల "అంబా" రావాలు వినవస్తున్నాయి. దూరంగా ఎక్కడో అరచిన లేగదూడ అరుపు వినగానే, కంగారుపడ్డాడు మల్లేశు. 'అబ్బాయిగోరూ! ఇక ఇంటికాడికి ఎడదారండి. ఆవుదూడకి సురుకుపాలు ఎక్కవండి, అది అమ్మగోరికి లొoగదండి. పాలు పితిగీ ఏళలో నేను తప్పకుండా దగ్గరుండాలండి! ఆ తరువోతేనండి ఇంటికెల్లేది. రేపు మళ్ళీ ఒద్దాం రండి, మీకు సూపియ్యాల్సిన ఇశేసాలు ఇంకా శానా ఉన్నాయండి. ఈ ఏలకి సాలు" అంటూ చురుగ్గా ఇంటిదారి పట్టాడు మల్లేశు. వాడిని అనుసారించి నడిచాడు జీవన్.

*      *       *

వాళ్ళు ఇల్లు చేరేసరికి ఇంట్లో దీపాలు వెలుగుతున్నాయి. పాలతప్పేలా చేత్తోపట్టుకుని, మల్లేశు రాకకోసం ఎదురుచూస్తూ నిలబడి ఉంది సీతమ్మగారు. పాలు పితికే వేళ మించిపోవడంతో అటు ఆవు, ఇటు దూడా కూడా తెగ అరుస్తున్నాయి. వస్తూనే మల్లేశు లేగదూడను విడిచిపెట్టేడు. అది వెంటనే తల్లిదగ్గరకు పరుగెత్తింది. తప్పేలా పట్టుకుని పాలు పితకడానికి ఆవుదగ్గరకు వెళ్ళారు సీతమ్మగారు.

గుమ్మంముందు ఎవరికోసమో ఆత్రంగా ఎదురు చూస్తూ, కాలుగాలిన పిల్లిలా అటూ ఇటూ అల్లంగం తిరుగుతున్న కరణంగారు ఆగారు. జీవన్ కనిపించగానే ఆయన ముఖం వికసించింది.

"ఆ, వచ్చావా! నీకోసమే ఎదురుచూస్తున్నా” అంటూ అతనికి ఎదురుగా వచ్చారు కరణంగారు, "ఇందాకా మా సుబ్బరామయ్య నీకోసం వచ్చాడు, ఒకసారి చూసి, పలకరించిపోదామని! పనిలో పనిగా చెప్పిపోయాడు, రేపు వాళ్ళు అంతర్వేది వెళుతున్నారుట - బండిలో బోలెడు ఖాళీ ఉందిట. నువ్వు వస్తావేమో కనుక్కోవాలనుకున్నాడుట. సమయానికి నువ్వు లేవని బాధపడ్డాడు. నిన్నడక్కుండానే, నీ తరఫున నేను మాటిచ్చేశా - నువ్వు తప్పకుండా అంతర్వేది వస్తావని. రేపు ఇక్కడుండి నువ్వు ఏం చెయ్యాలిట! ఎల్లుండి గాని మేజరుగారింటికి వెళ్ళేది లేదు కదా! ఈ గడ్డమీదున్న పుణ్యక్షేత్రం అంతర్వేది! అంతర్వేదిలో ఉన్న లక్ష్మీనరసింహస్వామివారు గొప్ప మహిమున్న దేవుడు. గోదావరి పాయ ఐన వశిష్ఠ వెళ్లి సముద్రంలో కలిసిన సాగరసంగమ క్షేత్రమది! ఇక్కడున్నన్నినాళ్ళూ యాజులు తరచూ అక్కడికి వెళ్లి, దైవ దర్శనం చేసుకుని వచ్చేవాడు. ఇప్పుడు కనక నువ్వు ఆ స్వామి దర్శనం చేసుకుని, ప్రసాదం తీసుకెడితివా చాలా సంతోషిస్తాడు. కాని, నువ్వు, నిలవుండే ప్రసాదం కావాలని ప్రత్యేకంగా అడిగి తీసుకోవలసి ఉంటుంది. లేకపోతే అడంగు జేరేవరకూ ఆ ప్రసాదం నిలవుండదు. ఈ సంగతి మర్చిపోకు సుమీ!"

"సరే నండి! రేపు నేనెళ్ళి యాజులు తాతయ్య పేరు మీద అర్చన చేయించి, తప్పకుండా ప్రసాదం - అదే, పొడిప్రసాదం కూడా తీసుకువస్తానండి" అన్నాడు జీవన్. అతనికి అలా అయాచితంగా వచ్చిన అవకాశానికి చాలా సంతోషమయ్యింది.

"ఐతే తొందరగా భోజనం చేసి, నిద్రపో! రేపు మళ్ళీ బ్రాహ్మీ ముహూర్తాని కల్లా సిద్ధంగా ఉండాలి మరి. రేపటికి కావలసినవన్నీ ఈ రాత్రికే సిద్ధంచేసి పెట్టుకోడం తెలివైనపని."

"ఆయ్" అన్నాడు జీవన్ ఉత్సాహంగా.

ఆ కొంటెతనానికి కరణంగారు అతనివైపు ప్రీతిగా చూస్తూ చిరునవ్వు నవ్వారు.

*        *        *

బ్రాహ్మీముహూర్తం యొక్క రాకను తెలియజేస్తూ, ఆకాశమంతా ఒకవిధమైన సన్నని వెలుగుతో నిండిపోయింది. అప్పటికి గడియారం నాలుగున్నర చూపిస్తోంది. అంతవరకూ చీకటిలో మసక మసకగా ఉన్న ప్రకృతి ఇప్పుడు ప్రస్ఫుటంగా కనిపించసాగింది. చల్లబడిన గాలి మెల్లగా వీస్తోంది. అంతవరకూ విచ్చలవిడిగా తిరిగిన నక్తంచరులైన జంతువులు వేటను మాని వెనుదిరిగి తమతమ నివాసాలకు వెళ్లిపోసాగాయి. రాత్రంతా సంచారం చేసి అలసిన వెన్నెల పులుగులు గూళ్ళకు మళ్ళుతున్నాయి. మొగ్గలుగా ఉన్న పూలు, నెమ్మదిగా వికసించడం మొదలయ్యిoది! ఆ సమయానికే "శల్యూష" మని మరోపేరు ఉంది. ఇంగ్లీషులో ఐతే దాన్ని "ఫాల్సు డాన్" అంటారు. అది ఇంచుమించుగా ఒక అరగంట సేపు ఉంటుంది. ఆ తరవాత పరిసరాలన్నీ మరింత చీకటిలో మునిగిపోతాయి. ఆ కొద్దీసేపూ చిన్నబోయి ఉన్నవేగుచుక్క మళ్ళీ దేదీప్యమానమై, మరింత ప్రకాశవంతంగా కనిపిస్తుంది.

సరిగా భ్రాహ్మీ ముహూర్త సమయానికల్లా ముత్యాలు గుర్రపుబండి వచ్చి సుబ్బరామయ్యగారి గుమ్మంముందు ఆగింది. అప్పటికే ప్రయాణానికి సిద్ధంగా ఉన్న సుబ్బరామయ్యగారు, ఆయన భార్య సావిత్రమ్మ గారు సామాను బండిలో ఉంచి, బండి ఎక్కారు. చేతిసంచీతో వచ్చిన జీవన్ కూడా బండి ఎక్కి , చివరలో కూర్చున్నాడు. అతన్ని సాగనంపడానికి వచ్చిన కామేశంగారు వాళ్ళకి వీడ్కోలు చెప్పగా బండి కదిలి ముందుకు సాగింది.

సుబ్బరామయ్యగారు జీవన్ తో ఆ కబురు ఈ కబురు చెపుతూ మధ్యలో కొడుకుని తలుచుకున్నారు. “మాకు ఒక్కడే అబ్బాయి. నిరుడు అంతర్వేది మాతో వాడు కూడా వచ్చాడు. ఈ సంవత్సరం నువ్వు! ఇన్నాళ్ళూ మా అబ్బాయి ఎప్పుడూ మాతోనే ఉండేవాడు. ఈ సంవత్సరమే పై చదువులకంటూ ఊరు విడిచి వెళ్ళాడు. వాడు చదువు పూర్తిచేసుకుని వచ్చి, మా ఊళ్ళోని హైస్కూల్లోనే ఉద్యోగం చేస్తూ మాదగ్గరే, ఆస్తి వ్యవహారాలను చూసుకుంటూ, ఇక్కడే ఉండాలన్నది మా ఆలోచన! వాడి చదువు పూర్తయ్యేవరకూ కొన్నాళ్ళు మాకీ ఎడబాట్లు తప్పవు, వాటిని మేము ఓర్చుకోకా తప్పదు" అన్నారు ఆయన ఒక నిట్టూర్పుని జతచేసి.

బండి కొంతదూరం వెళ్లేసరికి అరుణోదయమయ్యి తూరుపుదిక్కు రాగరంజితమయింది. ఆకాశం వింతవింత రంగులతో కొత్త కొత్త అందాలను సంతరించుకుంది. రోడ్డుకి ఇరువైపులా కనుచూపు మేర వ్యాపించి ఉన్నాయి వరిపొలాలు. చల్లగాలి కవి అల్లనల్లన కదిలి, అలలు అలలుగా కనిపిస్తూ హరిత సముద్రమా అనిపిస్తున్నాయి! పొలాల గట్లపైన అక్కడక్కడ ఉన్న ఈతచెట్లకు గిజిగాళ్ళు కట్టిన గూళ్ళు గాలికి ఊయల లూగుతున్నాయి. నిద్రలేచి పక్షులు తమ కలరవాలతో, అప్పుడప్పుడే కళ్లు తెరుస్తున్న ప్రకృతిని పలుకరిస్తున్నాయి. వరిచేలకే రెక్కలువచ్చి ఎగిరిపోతున్నాయేమోనన్న భ్రాంతికలిగేలా, లెక్కకు మిక్కిలి రామచిలుకలు పొలాలమీదుగా గుంపులు గుంపులుగా కిలకిల రవాలతో ఎగిరి ఎటో పోతున్నాయి. ప్రకృతిలో అనునిత్యం కనిపించే ఈ నిసర్గరమణీయమైన ఉదయ ప్రభాసం జీవన్ కి - ఇంతవరకూ ఎప్పుడూ చూసి ఎరుగడేమో - మనసుకి మత్తెక్కించేటంత మనోహరంగా కనిపించింది. అతడు అటే చూస్తూ తన్మయత్వంలో నిండా మునిగిపోయాడు. అది అతనికి ఒక, "కవితల కందని ఒక కమనీయ దృశ్య కావ్యం" లా కనిపించడంతో ముగ్ధుడయ్యాడు.

****సశేషం****

Posted in July 2023, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!