Menu Close
Vempati Hema photo
జీవనస్రవంతి (సాంఘిక నవల)
వెంపటి హేమ

దారిలో జీవన్ అడిగాడు, "మల్లేశూ! ఆ కొబ్బరి తోట విషయమంతా నీకు బాగా తెలిసినట్లు చెప్పావు, అక్కడ గాని ఎప్పుడైనా  పని చేశావా?"

మల్లేశు సిగ్గుపడుతూ చిన్నగా నవ్వాడు, "అబ్బాయిగోరు! మీగ్గనక నిజం సెపుతున్నానండి, లేపోతే సచ్చినా ఒప్పుకోనండి, ఆయ్! ఈ తోట ఒక్కటే నేమిటండి, ఈ ఊళ్ళో కొబ్బెర తోటలన్నింటి అట్టుపుట్టు ఆనవాళ్ళన్నీ నాకు సుబ్భరంగా తెలుసండి. ఆయ్! కొబ్బరసెట్లన్నీ ఒకేలా ఆపదతాయిగాని, నిజానికి అన్ని కాయల కొబ్బరీ ఒకే తీరుగా ఉండదండి. కొన్నింటికి రుసెక్కువ, కొన్నాటికి నూనెక్కువ. ఒక్కోదానికి కొబ్బెర దడసరి, కొన్నిటికి పలసన! కొన్నాటి కొబ్బరి మెత్తగా తియ్యగా ఉంటాది, కొన్నాట్లకి పిప్పిలాగుంటాది - ఇలా ఏయేయో తేడాలు! ప్రతి సెట్టు గుట్టు నాకు తెలుసండి. నాకే ఏంటి, మా గేంగులో ప్రతొక్కడికీ తెలుసండి, ఆయ్!

మీకు ఉన్నదున్నట్టుగా అంతా ఇవరంగా సెప్పేత్తానండి, మీరు నన్ను తప్పట్టుకో కూడదండి మరి... ఆయ్! నాకు ఒక కొబ్బరి బొండం తాగాలని బ్రెమ పుట్టిందనుకోండి, ఈ రేత్తిరికాడ ఎల్లిపోయి, అదే సెట్టు బొండం దింపుకుని తాగేస్తానండి. దింపు తీసేటోడు అంత సరంజామా ఒళ్లంతా సుట్టి సుట్టి కట్టుకున్నాడుగాని, మా కైతే సిన్న తాడుముక్క సానండి. తాడు రెండు కొసలు కలిపి ముడేసి, దాంతో రెండు కాల్లకు కలిపి బందమేసి, దాని సాయంతో సెట్టు మొవ్వు దాకా ఎక్కగలమండి! తాడు దొరక్కపోతే తాటేకైనా సానండి. డబ్బు అవసరపడినా అలాగే ఏదో ఓ సెట్టుకి బందమేసుకుని ఎక్కి, నాడెమైన నాలుగైదు కాయలు గుట్టుసప్పుడు కాకుండా దింపు కెల్లిపోతామండి. ఆ కాయలు శెట్టి కొట్టుకాడ ఇచ్చి, మాకు కావాల్సిన సరుకులు తీసుకుంటామండి. ఆ శెట్టి మాకంటే దొంగ నా కొడుకండి! నాలుగు కాయలుచ్చుకుని రెండు కాయల డబ్బు లివ్వడానికి ఏడ్చి రాగా లెడతాడండి."

అంతలో ఒక పిట్ట పెద్దగా అరిచి గోలచేస్తో, వాళ్ళ తలలమీదుగా ఎగిరిపోయి అక్కడున్న ఒక మోడువారిన కొబ్బరి చెట్టుమీద వాలింది. వెంటనే మల్లేశు దానికి దండం పెట్టాడు. ఆ పక్షి వైపే ఆశ్చర్యంగా చూస్తూ నిలబడిపోయాడు జీవన్.

మల్లేశు చెప్పాడు, "అబ్బాయిగోరూ! అది పాలపిట్టండి! అది ఆపడితే ఆ రోజు శుబం జరుగుద్దంట!"

"శుభమా! ఇంకా నయం, కొంచెంలో తప్పిందిగాని, అది తలమీద తన్నిజుట్టు పీక్కుపోయేది!"

"అది మోడైన కొబ్బెర సెట్టుకి తొర్ర సేసి, అందులో గుడ్లు ఎడతాదండి. అలాంటప్పుడు వాటి నెవరైనా ఎత్తుకు పోతారేమోనని కాపలా కాస్తాదండి తల్లి పిట్ట! దాని గూడున్నా కాడికి ఎవరైనా వస్తేశాను, ఇలాగే గోలసేసి, తన్ని తగిలెయ్యాలని సూస్తాదండి. మనం బెగే ఈడ నుండి ఎలిపోవాలి."

"పిట్ట చాలా అందంగా ఉంది! అంత అందానికి ఆపాటి జాగ్రత్త ఉండాలి మరి " అన్నాడు జీవన్ నవ్వుతూ.

"ఆయ్! పిట్టయితే అందంగానే ఉంటాదండి, కాని కూతే కసిరినట్లుంటాది!"

వాళ్ళలా మాటాడుకుంటూ కొంత దూరం నడిచి వెళ్ళి ఒక కాలువగట్టు ఎక్కారు. జీవన్ ఈ ఊరు వస్తున్నప్పుడు చూసిన దానికన్నా ఈ కాలవ కొంచెం పెద్దదిగా, ఎక్కువ నీటితో ఉంది. కాలవ పక్కగా ఒక కచ్చారోడ్డు ఉంది, తేలికగా ఒక రెండెడ్ల బండి నడుస్తుంది ఆ రోడ్డుమీద.

"మా ఊళ్ళో ఇటోటీ, అటోటి రెండు కాలువ లున్నయ్యండి. దీన్ని పంటకాలు వంటారు, రెండవదాన్ని రేవటి కాలవ అంటారండి. ఇయి రెండూకూడా ఆటి ఎంబడే ఉన్న పంట పొలాలకు నీరందిస్తాయండి."

"మల్లేశూ! ఈ కాలవ వార నున్నది ఏమి చెట్టు, ఇంత అందంగా తమాషాగా ఉంది? దీనికి ముళ్ళు కూడా ఉన్నాయి!" ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు జీవన్.

జీవన్ మల్లేశు చెపుతున్నవన్నీ శ్రద్ధగా వింటూండడంతో వాడు తానొక పెద్ద "గైడ్" అన్నట్లుగా భావించుకుంటూ, ఇంకా ఇంకా చెప్పాలని ఉబలాట పడుతున్నాడు. పట్నం బాబుకి తెలియని వెన్నో తనకు తెలుసు - అన్నది వాడు గ్రహించాడు. అది వాడికి ఎంతో ఆనందాన్నిచ్చింది.

"అది పేము డొంకండి, చెట్టవ్వదండది. దాని కర్ర ఇరిసి, ఒలిసి దవ్వతీస్తే మంచి పేకబెత్తెం బుద్దండి. మల్లోడ మల్లేశు అంటే ఈ సుట్టుపక్కల అందరికీ తెలుసండి. బడి పంతుల్లంతా బెత్తం కావాలంటే నన్నే అడుగుతారండి. ఆరికి సప్పలై సేసేది నేనే! అబ్బాయిగోరూ! మీక్కూడా ఓటి కోసివ్వనా? గాలిలో ఇసురుగా ఆడిస్తే "సుయ్యి సుయ్యి" మంటా సప్పుడు వస్తాదండి. కొడితే తట్టు తేలిపోవాలిసిందే! దెబ్బకి దయ్యం దిగిపోద్ది" అంటూ గొప్పగా చెప్పేడు వాడు.

"ఒద్దు మల్లేశూ! నాకేం వద్దు. అయ్యవారు పాఠం బాగా చెపితే చాలు, పిల్లలు శ్రద్ధగా వింటారు. కొట్టి, భయపెట్టి చదువు నేర్పాలనుకోడం తప్పు. అది మనకొద్దు" అన్నాడు జీవన్.

గతుక్కు మన్నాడు మల్లేశు. వాడికి అంతా అర్థమైంది. "ఐతే, అబ్బాయిగోరూ! పంతుళ్ళకి బెత్తాలిచ్చి నేను శానా సెడ్డపని సేత్తున్నానన్నమాటే కదండీ? ఇహనుండీ సచ్చినా ఆ తప్పు సెయ్యనండి. అమ్మోరిమీన ఆన, ఆయ్!"

"ఔనుగాని మల్లేశూ! నువ్వు ఎంతదాకా చదువుకున్నావు?”

మల్లేశు తలవంచుకుని సిగ్గుపడ్డాడు. "ఆయ్! ఎంతదాకానో కూడా నాండి! అసలు బూడిదలో ఏలెట్టింది లేదండి. బడి సదుగేం లేదండి నాకు. నా యన్నీ సెట్టూ, సేమా, పొలమూ, పుట్టా నేరిపిన ఇద్దెలేనండి. మా అయ్యనోపాలి అడిగినానండి, బడికెల్లి సదూకుంటానని. ఎంటనే మా అయ్య నా ఈపుమీన రేవెట్టేసిండు. నా ఎనుబూసలు కిరకిర లాడిపోయినయ్!

"యదవ నాయాలా! మల్లీ సదువు సదువంటా నోరెత్తి, సదువు ఊసు ఎత్తినావంటే నిలువునా సీరేత్తా! సదుగులు గిదుగులు - అయ్యన్నీ కడుపు నిండినోల్లకి! మనలాటోల్లకి సదువేంటిరా కొడకా! పొట్ట కాలకుండా పట్టెడన్నం దొరికితే శాను, అన్నీ ఉన్నట్టే మనకి! సదుగంటే సముద్దరం రా, ఈ ఒడ్డుకాడ బయలెల్లి ఆ ఒడ్డుకి సేరుకోడం మనవల్ల నౌద్దా ఏంటి ? అంత సత్తువ మనకేడదిరా! ఆ ఒడ్డూ సేరలేక, ఈ ఒడ్డుకూ సేరువ కాక మద్దెలో మునిగి సత్తామ్! సదువు సదువని ఎగబడితే, సివరాకరుకి అటు సదువూ రాదు, ఇటు పనీ రాదు! రెంటికీ సెడిన రేవడి వౌతావు" అంటూ ఒకే ఇదిగా నా తల తినేసి, సివరాకారుకి నన్ను మన కరనంగోరింట్లో పాలేరుగా ఎట్టేసిండండి."

మల్లేశు చెప్పిన దానిలో సబవు కొంతైనా ఉందనిపించింది జీవన్ కి. ఇప్పుడు తన పని చూస్తే, అక్షరాలా అలాగే ఉంది కదా! రెంటికీ చెడిన రేవడి బ్రతుకు లాగే ఉంది తన బతుకు! అటు ఉద్యోగమూ రాదు, ఇటు కాయకష్టమూ చేతకాదు - అనుకుని మనసులోనే ఉసూరుమని గాఢంగా నిట్టూర్చాడు జీవన్.

"ఏమాట కామాటే సెప్పుకోవాలండి, అబ్బాయిగోరూ! కరనంగోరి ఇంట్లో పని తక్కువండి. మడి, ఆశారం అంటూ శానా పనుల్ని ముట్టుకోనీరండి! దాంతో సుఖంగా గడిసిపోతా ఉంది బతుకు. అమ్మగోరు శానా శానా మంచోరండి. కడుపునిండా బువ్వ ఎడతారు, పండగలూ, పబ్బాలూ వస్తే పప్పలు ఇంటికి కూడా అట్టు కెల్లమని ఎడతారండి. సంకురాత్తిరికి, దసరాపండుక్కి కొత్త బట్టలు కుట్టిస్తారండి. అబ్బాయిగార్లొస్తే సిల్లర సేతిలో ఎట్టకుండా ఎల్లరు! ఇంకేం గావాలి సెప్పండి!"

అల్ప సంతోషులు వాళ్ళు! ఆ రోజు బాగా గడిస్తే చాలు తృప్తిపడిపోతారు. రేపటి రోజును గురించి ఆలోచించరు ఈ శ్రమజీవులైన పాటకజనం! రెక్కాడితేగాని డొక్కాడని పరిస్థితిలో కూడా సంతృప్తితో బ్రతుకుతారు కదా వాళ్ళు - అనుకున్నాడు మనసులో జీవన్.

ఆ దారి వాళ్ళను ఒక మడుగుదగ్గరకు చేర్చింది. అంతవరకూ ఒడ్డున, కప్పల్ని పట్టడానికి పొంచివున్న పాము ఒకటి, వీళ్ళ అడుగులు రేపిన ప్రకంపనాలని గుర్తుపట్టి, వెంటనే మడుగులో మొలిచిన మొక్కల మీదుగా పాకుతూ, మడుగులో దట్టంగా పెరిగివున్న రెల్లుదుబ్బుల్లోకి వేగంగా వెళ్ళిపోయి, తెగ బారెడు పొడవైన ఆ పాము క్షణంలో కనుమరుగయ్యింది.

"అమ్మో! ఎంత  పెద్ద పామో" అంటూ కంగారుపడ్డాడు జీవన్.

మల్లేశు నవ్వాడు, "అది జెర్రిగొడ్డండి! ఉత్తి పిరికి గొడ్డు! మనం వస్తున్నామని కప్పల్ని ఏటాడ్డం మానేసి పారిపోయినాది సూడండి" అన్నాడు.

"అది త్రాచుపాము కాదా? అంత పెద్ద పాముంది మరి !"

"అచ్చంగా ఇది త్రాసుపాములానే ఉంటాది గాని, దీనికి పడగ ఉండదండి. దీంది ఏరే జాతండి. ఈటికి ఇసం అస్సలుండదండి, ఆయ్! ఈటికి పల్లేగాని ఇసపు కోరలుండవండి. ఎలకల్ని, తొండల్ని పట్టడానికి ఇయి ఇల్లకాడికి కూడా వస్తాయండి. సరిగా సూడకుండానే, త్రాసు పామనుకుని జనం ఈటిని కనిపించగానే, ఎనకా ముందూ సూడకుండా సిటుక్కున సంపేత్తారండి. ఎలకల్ని పట్టుకుని, మనకి సాయం సెయ్యడానికి వచ్చిన దీన్ని సంపడాం సుద్ద అన్నేయ్యం కదండీ?"

"ఔను కదూ! పాముల్లో కొన్ని విషం లేనివి కూడా ఉంటాయని చదివా. కాని పామనగానే జనం ఇకనేం ఆలోచించకుండా వాటిని చంపేస్తారు, పాపం! నిజానికి ఏ పామునీ పనిగట్టుకుని చంపనక్కర్లేదు. వాటి దారిన అవి వెళ్ళిపోతుంటే, వాటినలా పోనివ్వడమే మంచిపని కదా! వాటికి మనం హాని తలపెడితేగాని అవి మన జోలికి రావు. మనిషే, అవి కనబడితే చాలు తరిమి తరిమి చంపుతాడు."

ఇద్దరూ మాటాడుకుంటూ మడుగు వొడ్డుకి వచ్చారు. ఎదురుగా విశాలంగా విస్తరించి ఉన్న మడుగు ఉంది! మడుగులో చొప్ప, జమ్ముగడ్డి విస్తారంగా పెరిగివుంది. అవి మొలవని చోట ఉన్న ఖాళీలను, ఒకోచోట ఒకోరకంగా - తామరలు, కలువలు, తూటి తీగలు, గుర్రపుడెక్క లాంటి నీటిమొక్కలు భర్తీ చేశాయి. మొత్తానికి మడుగంతా రకరకాల నీటి మొక్కలతో నిండివుండి, ఆకుపచ్చటి రంగులో, మధ్యమధ్యన  విరిసిన పలురంగుల పూలతో కనువిందుగా, అందంగా కనిపిస్తోంది ఆ మడుగు. కాని ఆ నీరు వాడకానికి పనికిరాదు. పొలాలలో నిలవై ఉన్న మురుగునీరు ఈ మడుగులోకి వదులుతారు.

క్షణక్షణానికీ మల్లేశుకి హుషారు పెరిగిపోతోంది. సంతోషంగా చెప్పడం మొదలుపెట్టాడు, "ఈ మడుగుని గురించి సెప్పాలంటే శానా ఇసయమే ఉన్నాదండి - దీన్ని దేవకన్నికల మడుగు అంటారండి. శాన్నాల్లకు ముంగటి రోజుల్లో ఇది పెద్ద సెరువుగా తియ్యటి నీళ్ళతో ఉండేదంట. అప్పట్లో ప్రెతి రోజూ నడిరాత్తిరి కాడ సొర్గం నుండి దేవకన్నెలు వచ్చి, ఈ సెరువులో తానాలు సేసేటోల్లంట! ఆమీన… “, మడుక్కి ఆవలగా  కనిపిస్తున్న ఆలయ శిఖరాన్ని చేయెత్తి  చూపిస్తూ చెప్పాడు మల్లేశు, "అల్లదిగో, మడుక్కి ఆవలి దిక్కున అవుపిస్తున్న ఆ గుడిలోని సామివోరికి పూజలు సేసి, డాన్సాడి తొలికోడి కుయ్యగానే తిరిగి సొర్గానికి ఎలిపోయీవోరంట! ఓ రాత్తిరికాడ మెలుకువొచ్చినోళ్ళకి, డాన్సాడుతున్నప్పుడు ఆళ్ళ కాళ్ళ మువ్వలు సేసే సప్పుడులు ఇనిపించేవంట! మాతాత సెప్పేటోడు. మాతాతకి ఆల్లతాత సేప్పేడంట! తరవోత ఆల్లు రావడం మానేశారంట! క్రెమంగా సెరువు మడుగైపోయిందంట, ఆయ్! ఆళ్ళ ఒంటిని నలుసుకున్న నలుగుబిండి ఈ మడుగులో జమ్ముగడ్డై మొలిసినాదంట!"

మాట్లాడుతూ అంతలో ఆగిపోయాడు మల్లేశు. గట్టిగా ఉపిరి లోపలకు పీల్చుకుని సంతోషంగా అన్నాడు, "అబ్బాయిగోరూ! గాలంతా ఘుమఘుమలాడతా ఉన్నాది కదండి! డొంకలో మొగలి పూవు గీని యిడిసింది గావును! సూత్తానుండండి" అంటూ మడుగు ఒడ్డున ఏపుగా పెరిగిన మొగలిపొద దగ్గరకు వెళ్ళాడు మల్లేశు.

"ఒద్దు, మల్లేశూ! అటు వెళ్ళకు, మొగలిపొదలో నాగుపాము లుంటా యంటారు!" ఎప్పుడో, ఏదో పుస్తకంలో చదివిన విషయం గుర్తొచ్చి భయంతో కేకేశాడు జీవన్.

"ఈ మల్లోడలో పాములు లేని సోటు లేదండి, మనమే కూంతంత కళ్ళు తెరుసుకుని జాగరత్తగా మసులుకుంటేషాను, అయి మనజోలికి రావండి. ఎదురుపడ్డప్పుడు మనం కదలకుండా నిలమడిపోతే అయి మన్నేం సెయ్యవండి. ఆటి దారిన అయి తప్పుకు ఎలిపోతాయి. ఆటికి మనం సెబ్బర సెయ్యకపోతే అయి మనకు సెడు సేయవు. మనవే ఆటి ఎంట తగులుకుని, పారిపోతున్నా కూడా ఇడిసిపెట్టకుండా తరిమి తరిమి సంపుతామండి, ఆయ్! మీరీడనే నిలమడి ఉండండి, నేనెల్లి సిటికెలో మొగలిపొత్తి తెంపి తెస్తా సూడండి..." అలా మాటాడుతూనే ఒక్క పరుగున మొగలిపొద వైపుగా వెళ్ళిపోయాడు మల్లేశు.

పొడవాటి బాకులలాంటి ఆకులతో, ఆ ఆకులపొడుగునా, గ్రద్ద గోళ్ళలా వంపు తిరిగిన మూడు వరసలుగావున్న ముళ్ళతో, మడుగు వారగా పెరిగి ఉన్న ఆ మొగలిడొంకనే చూస్తున్నాడు జీవన్.

జాగ్రత్తగా ఆకుల్ని తప్పిం చుకుంటూ, మొగలి కాండాలపై కాళ్ళు వేసి పైపైకి ఎక్కుతూ మొగలి పొదలోకంతా వెళ్లి, క్షణంలో పువ్వుని కోసి తెచ్చి జీవన్ చేతుల్లో ఉంచాడు మల్లేశు. ఆ పువ్వుని ఎప్పుడూ, బొమ్మలో తప్ప ఎదురుగా చూసివుండని జీవన్ దానివైపు ఆశ్చర్యంగా చూశాడు.

ప్రకృతిలో ఆ పువ్వొక విచిత్రం! మూరెడు పొడుగున ఉన్నఆ మొగలి పువ్వు - నిడుపుగా ఉన్న బంగారు వన్నెరేకులతో, ఘుమఘుమలాడుతూ ఉంది. రంగు వేరైనా, చాలావరకూ ఆ పొద తాలూకు ఆకుల పోలికతో ఉన్నాయి ఆ పూరేకులు! రేకు రేకుకీ మధ్య పువ్వారం ఉంది. ఒకదాని కంటే ఒకటి - లోపలకు వెళ్ళినకొద్దీ ఆ రేకులు చిన్నవౌతూ బొత్తిలా, ఒక పొత్తిగా ఏర్పడి ఉన్నాయి. అందుకే దాన్ని మొగలిపొత్తి - అని కూడా అంటారు.

తలెత్తి చూసిన జీవన్కి మల్లేశు ఒంటిమీద, మొగలిముళ్ళు గీరుకున్న చోట్లలో ఎర్రగా రక్తం చిమ్ముతున్న గాయాలు కనిపించి కంగారు పడ్డాడు. అతని కంగారు చూసి నవ్వాడు మల్లేశు.

"ఇయేమీ పెద్ద లెక్కల్లోయి కావండి. రేపటి కంతా తగ్గిపోతాయండి. కొన్నిపనులు సేసీటప్పుడు ఇటువంటివి మనకు తప్పవండి, ఆయ్" అంటూ, అటూ ఇటూ వెతికి చూసి నేలమీదున్న ఒక మొక్క ఆకులు కోసి, వాటిని రసం వచ్చీలా నలిపి ఆ రసాన్ని పుళ్ళమీద రాశాడు మల్లేశు. వెంటనే రక్తం కారడం ఆగిపోయింది.

ఆహ్లాదకరంగా ఉంది మొగలిపూవు సువాసన. జీవన్ మొగలి పొత్తిని ముక్కుకి దగ్గరగా ఉంచుకుని వాసన చూస్తూంటే, మల్లేశు హెచ్చరించాడు, "మరీ దగ్గరగా ఎట్టుకోమోకండి, మీకు మొగలిరేకులకున్న ముళ్ళు గుచ్చుకుంటాయి" అంటూ, ఆ పొత్తిని అందుకుని, ఒకచిన్న మొగలిరేకు తీసి అతనికి ఇచ్చి, దాన్ని తనవెంట తెచ్చిన చేతి సంచీలో ఉంచి, తను పట్టుకున్నాడు మల్లేశు..

అంతలో వాడి ముఖంలో దిగులు చోటుచేసుకుంది, "మా అమ్మగారికి మొగలిరేకులతో రకరకాల జడలు కుట్టడం తెలుసునండి. మా అమ్మాయిగారు బాగా ఉన్న రోజుల్లో, ప్రతి వారం అమ్మయిగారికి బలే బలే అందమైన జడలు కుట్టేటోరు మా అమ్మగోరు. పెద్ద జడేమో, మా అమ్మాయిగోరు నడిసినంత మేరా మొగలిపూల గుమగుమలేనండి! ఇక ఇప్పుడేముంది, ఆ అందమంతా పోయింది. అప్పట్లో నేను మొగలిపొత్తులకోసం మొగలిపొదలన్నీ ఎతికి ఎతికి ఆటిని కోసి తెచ్చేటోన్ని" అంటూ నిట్టూర్చాడు మల్లేశు.

మరి నాలుగడుగులు నడిచేసరికి అక్కడ జమ్ముగడ్డి లేని జాగాలో మడుగులో తామర పెరిగివుంది. నీటిమీద పరుచుకున్నవి కొన్ని, నీటి పైకంతా పెరిగినవి కొన్ని పెద్దపెద్ద తామరాకులు, వాటిమధ్యలో విరిసిన తామరపూలు, వాటి మొగ్గలూ ఉన్నాయి. మధ్యమధ్య ఒకోచోట రేకలు విడిచిన తామర బొడ్లూ కూడా ఉన్నాయి.

"అబ్బాయిగోరూ! తామరపూలు రేకలు రాల్చేశాక ఆటి బొడ్లు నెమ్మదిగా ఎదుగుతాయండి. ముదిరిపోకముందు అయి ఒలుసుకుని గింజలు తీసుకు తింటే బలే రుసిగా ఉంటాయి. కాని ఇక్కడ దగ్గరలో ఒక్కటి కూడా లేదండి."

"ఐతే మనం ఈ గట్టుమీదుగా లోపలకు వెళ్ళి తామరబొడ్లు విరిచి తెచ్చుకుందాము" అంటూ జీవన్ అటువైపుగా రెండడుగులు వేశాడు.

వెంటనే మల్లేశు అతన్ని మరో అడుగు ముందుకు వెయ్యనీకుండా అడ్డుగా నిలబడ్డాడు. "అయ్యబాబోయ్, అబ్బాయిగోరూ! అది అస్సలు గట్టుకాదండి, దొంగూబి! గట్టనుకుని అడుగేస్తే ఇక అంతే సంగతులండి - లోపలికి లాగేసి సంపేస్తాది. అలా ఈ మడుగు శానామందిని తన పొట్ట నెట్టుకుందండి - ఒక్క మా తాత మాత్రం దీనికి అంకకుండా బతికి బయటికి వచ్చాడంట !"

"అదెలా?" ఆశ్చర్యంతో అడిగాడు జీవన్ .

"ఓ పాలి మా తాత సేపలు పట్టడానికి గాలం, బుట్టా అట్టుకు మడుక్కి బయలెల్లాడంట! ఇలాగే ఇసికతో గట్టులా ఆపడితే అడుగేశాడంట! అంతే, దిగబడిపోయాడు! దొంగూబి లాగేస్తా ఉంటే, సేతిలోని గాలం, గీలం - అన్నీ ఒగ్గేసి, అడ్డంగా పడి ఈతకొట్టుకుంటూ ఒడ్డుకి వచ్చేసినాడంట! ఈ కత నాకు ఎప్పుడూ సెప్పేటోడు - "ఓలే, మల్లిగా! దాన్ని నేలనుకుని ఇడిపించుకోడానికి గింజుకున్నావంటే అది నిన్ను మింగేస్తాది, నీరనుకుని ఈదుకుని ఒడ్డుకి రావాల, అదేరా కిటుకు" అనీవోడు. ఈ మడుగులో శానా సోట్ల ఉందండి ఈ దొంగూబి."

అంతలో ఎక్కడో "టక్ టక్ టక్" అంటూ కర్రమీద ఇనుముతో కొడుతున్న చప్పుడులా వినిపించి, జీవన్ కి, అది వింతగా అనిపించి, ఆశ్చర్యంగా వింటూ నిలబడ్డాడు.

****సశేషం****

Posted in June 2023, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!