Menu Close
Vempati Hema photo
జీవనస్రవంతి (సాంఘిక నవల)
వెంపటి హేమ

"నువ్వు చెప్పిన మాట వినడానికి చాలా ఇంపుగా ఉంది బాబూ! నాకూ పెళ్లి చెయ్యాలనే ఉంది. కాని ఇద్దరు బిడ్డల తల్లిని ఎవడు పెళ్లి చేసుకుని ఆ పిల్లలకు తండ్రి అవ్వడానికి ఒప్పుకుంటాడు చెప్పు? మాతృత్వానికి ప్రతీక ఐన ఆడదానికే సవతి పిల్లలంటే కిట్టదు, ఇక మగాడేం చూస్తాడు మారుటి పిల్లల్ని! ఒక మగాడు, తనవాళ్ళు కాని ఇద్దరు బిడ్డలకి తండ్రి కావడానికి ఇష్టపడగలడంటావా?"

జీవన్ ఏమని జవాబు చెప్పగలడు! తనకా సద్భుద్ది ఉందిగాని, నిర్దనుడు, నిరుద్యోగియైన తనకా మాట పైకి ధైర్యంగా చెప్పే అర్హత లేదు - అన్నది అతనికి తెలుసు. కరణంగారి సవాలుకి జవాబు చెప్పలేక మౌనంగా ఉండిపోయాడు జీవన్.

పెద్దవాళ్ళ సంభాషణలోని వేడి తెలియని పసిపాప జీవన్ చెక్కిలికి తన చెక్కిలి ఆనించి, ఒక రోజు పెరిగిన అతని గడ్డం గుచ్చుకుని గిలిగింతలు పెట్టినట్లుకాగా కిలారున నవ్వింది. ఆ పాపను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని, హృదయానికి హత్తుకున్నాడు జీవన్. ఈ పాప కూడా తనలాంటి అభాగ్యురాలే, పైగా ఆడపిల్ల! ముందుముందు ఈ పాపకు ఏమేమి అగచాట్లు రాసి ఉన్నాయో! ఏమో పాపం - అన్నభావం ఆ పాపను అతనికి చేరిక చేసింది. దగ్గరగా తీసుకుని గుండెలకు హత్తుకున్నాడు పాపను జీవన్.

క్షణం ఆగి అడిగాడు జీవన్, "పాపకు ఏం పేరుపెట్టారు" అని.

"పేరా - పాడా? దీనిని చిట్టీ - అనీ, దీని అన్నని బాబూ - అనీ పిలుస్తాము అవసరానికి ఏదో ఒక పేరు తప్పదు కదా! అంగరంగ వైభోగంగా నామకరణం జరగాలంటే, పీటలమీద కూర్చోవలసిన వాళ్ళు చల్లగా ఉండాలి కదా!" కరణంగారి కంఠంలో విరక్తి ధ్వనించింది.

మధ్యాహ్నం భోజనాలు అయ్యాక కొంతసేపు విశ్రాంతిగా పడుకుని లేచి, ఊరిలో పనుందంటూ వెళ్ళారు కామేశంగారు. పిల్లలు నిద్రపోతున్నారు. జీవన్ కి తోచనితనం మొదలయ్యింది. కాసేపలా ఉరిలో తిరిగివస్తే బాగుంటుందనిపించి సీతమ్మగారికి చెప్పాడు. కాని, అతడు ఒంటరిగా వెళ్ళడానికి ఆమె ఒప్పుకోలేదు. పాలేరు మల్లేశు కొద్దిసేపటిలో వస్తాడనీ, ఇద్దరూ కలిసి వెళ్ళవచ్చుననీ అభ్యంతరం చెప్పారు ఆమె. ఇక చేసేదేంలేక జీవన్ అరుగుమీద ఉన్న కుర్చీలో కూర్చుని, మల్లేశు రాకకోసం ఎదురుచూస్తూ, ఉదయం చదివిన పేపరునే మళ్ళీ తిరగేస్తూ ఎలాగో కష్టపడి పొద్దుపుచ్చుతున్నాడు.

ఇంతలో ఒక అమ్మాయి, సుమారుగా పధ్నాలుగేళ్ళు ఉంటాయి, పరుగులాంటి నడకతో, పరికిణీ కుచ్చిళ్ళు రెపరెపలాడేలా విసవిసా నడుచుకుంటూ వచ్చి, గబగబా గుమ్మాలెక్కి లోపలకు వెళ్ళింది. వెడుతూనే "అక్కా" అంటు గట్టిగా పిలిచింది.

వెంటనే జాహ్నవి పలికింది, "ఏమిటే గాయత్రీ! ఉరమని పిడుగులా ఇలా హఠాత్తుగా ఊడిపడ్డావు, ఏమిటా హడావిడి? ఒగరుస్తున్నావు కూడా, మంచి నీళ్ళు తెస్తానుండు" అంది జాహ్నవి, గదిలోనుండి సావడి లోకి వస్తూ.

"ఏమీ వద్దక్కా! ముందీ మాట విను - "హితైషిణి" వీక్లీలో ఈ వారం చిరంజీవి కథ పడింది, తెలుసా!" అంది గాయత్రి తెగ ఉబలాటపడిపోతో...

జాహ్నవి నవ్వింది, "దానికంత బ్రహ్మాండం చేస్తున్నావేమిటి? చిరంజీవి రాసిన కథలు ఏదో ఒక పత్రికలో తరచూ పడుతూనే ఉంటాయిగా, కొత్తేముంది" అంది.

"చిరంజీవి" అన్నపేరు వినగానే ఉలికిపడినట్లై, కుర్చీలో వెనక్కి జారగిలబడి ఉన్నవాడల్లా నిఠారుగా లేచి కూర్చున్నాడు జీవన్. సావడిలో సాగుతున్న సంభాషణ అతనికి చక్కగా వినిపిస్తోంది.

"అబ్బా! కాస్త ఆగక్కా! నేను చెప్పిందంతా విన్నాక నీకే తెలుస్తుందిలే, నే నెందుకంత ఇదవుతున్నానో...  హితైషిణిలో ఈవారం పడ్డ చిరంజీవి కథ అచ్చం నీ కథలాగే ఉంది. నీ సంగతంతా తెలిసివున్నవాళ్ళే, ఎవరో పనిగట్టుకుని రాసినట్లుగా ఉంది. నిజం అక్కా, నీ తోడు! ఇకపోతే, ముగింపు - అది నాకు చాలా చాలా నచ్చింది. అది చదివాక ఇక ఉండబట్టలేక ఇటు పరుగెత్తుకొచ్చా, తెలుసా?" గాయత్రి ఆత్రం పట్టలేక గుటకలు మింగింది.

"ఏదీ, పత్రిక తెచ్చావా? నా కింకా రాలేదు, మాకైతే పోష్టులో రావాలి కదా, కొద్దిగా ఆలస్యమౌతుంది" అంది జాహ్నవి.

"తేలేదక్కా. అన్నయ్య, వదిన చదువుతున్నారు. అన్నయ్య నిన్ననేదో పనిమీద రాజోలు వెళ్ళాడు. అక్కడి బుక్ స్టాల్కి అప్పుడే వచ్చాయిట "హితైషిణి" పత్రికలు. బండిల్ విప్పగానే తొలి పుస్తకం అన్నయ్యే కొని తెచ్చాడుట! దాన్ని నేను ముందుగా లాక్కుని చదివేశా! చిరంజీవి రాసిన కథ ముగింపు నాకు బాగా నచ్చింది. అది చదవగానే నీకు చెప్పాలనిపించింది. కథ పూర్తిచేసి, అన్నయ్యకి పత్రిక ఇచ్చేసి, వెంటనే ఇలా చక్కావచ్చా. ఈ సాయంత్రం పుస్తకం తెస్తాలే!"

"అబ్బా! సాయంత్రం దాకా ఆగాలా నేను? పోనీ, ఎండింగ్ చాలా బాగుందన్నావు కదా - అదొక్కటీ చెప్పు..." అంది జాహ్నవి.

"చిరంజీవి రాసిన కథకు "ఎండింగ్ బాగుందా" అని వేరే అడగాలా ఏమిటి! ఎప్పుడూ అది బాగానే ఉంటుంది. ఇక ఈ కథ ముగింపు - అంటావా... సింప్లీ, సుపర్బు! చదువరుల హృదయాలకు హత్తుకుపోయీలా ఉంది!"

"సరే! అదేమిటో చెప్పు!" బ్రతిమాలుతున్నట్లుగా అడిగింది జాహ్నవి.

"కథానాయిక పేరు సౌభాగ్య! కాని, నేతిబీరకాయలో నెయ్యి ఎంతో ఆమె జీవితంలో సౌభాగ్యమూ అంతే! మొదట్లో అల్లాగే అనిపిస్తుంది. కాని చివరకొచ్చేసరికి ఆమెకు తగిన పేరే పెట్టినట్లు మనకు తెలుస్తుంది. "నేనింకా చదువుకుంటాను" అంటూ, అచ్చం నీలాగే, ఘొల్లున గోలపెడుతున్న పిల్లకు, గొప్ప జమీందారీ సంబంధం, తప్పిపోకూడదు - అంటూ బలవంతంగా మెడలు వంచి మరీ, పెళ్లి చేస్తారు పెద్దవాళ్ళు... "

జాహ్నవి గాయత్రికి అడ్డొచ్చింది, "పూసలు గుచ్చినట్లు మరీ అంత ఇదిగా చెప్పొద్దు, ముఖ్యమైనది ముగింపు. అది మాత్రం చెప్పు. కథంతా రేపు వివరంగా చదువుకుంటాలే" అంది.

"సరే, విను... ఆమె భర్త అకస్మాత్తుగా మరణిస్తాడు. ఆ సమయానికి వాళ్లకు ఒక కొడుకు ఉన్నాడు. ఆమె ఆ బిడ్డను తన తల్లిదండ్రులదగ్గర విడిచివెళ్లి హాస్టల్లో ఉండి చదువుకుంటుంది. పెద్దచదువులు  చదివి  ఉద్యోగస్తురాలౌతుంది. ఆమె సహోద్యోగి ఒకడు, ఆమెను ప్రేమించి, ఆమె కొడుకును తన స్వంత కొడుకుగా చూసుకుంటానని వాగ్దానం చేసి మరీ ఆమెను పెళ్లాడుతాడు! తన పేరు, తనగోత్రం ఆ పిల్లాడికి ఇవ్వడం కోసం లీగల్గా వాడిని దత్తత తీసుకుంటాడు. కథ సుఖాంతం! అక్కా! ఎండింగ్ చాలా బాగుంది కదూ! చిరంజీవి రాసిన కథలు చదువుతూంటే, అతడు మంచి ఆదర్శాలున్నవాడు - అనిపిస్తుంది కదూ ! ఆయన రాసిన కథలన్నీ దిశానిర్దేశకాలుగా, ఆదర్శవంతంగా ఉంటాయి! ఔనా..." అంటూ జాహ్నవి వైపు చూసింది గాయత్రి.

"పోవే! నీకన్నీ గొప్పగానే కనిపిస్తాయి! "పిల్లకాకి కేం తెలుసు ఉండేలు దెబ్బ" అన్నట్లుగా, ఇంకా నువ్వు చిన్నపిల్లవి కదా, నీ కెలా తెలుస్తుంది చెప్పు ఈ లోకపు తీరుతెన్నులు! కథలు నిజాలు కావు, కేవలం కల్పితాలు మాత్రమే! ఆ కల్పనా కథల్ని చదివి, ఇక వాస్తవాలు కూడా అల్లాగే ఉంటాయి - అనుకోడం శుద్ధ తెలివితక్కువ పని. రచయితలు ఏవేవో ఉహించి రాస్తూంటారు, చదువేవాళ్ళ మెప్పుకోసం. అవన్నీ అభూత కల్పనలు! ఆ కథల్లోని ఆదర్శాలనే కథ రాసినవాళ్ళు అక్షరాలా పాటిస్తారనుకోడం నీ అమాయకత్వం, అంతా భ్రాంతి! సినిమాలో శ్రీరామ చంద్రుని పాత్ర ధరించిన వ్యక్తి నిజజీవితంలో శ్రీరామ చంద్రుడిలా ఉంటాడనుకుంటున్నావా ఏమిటి? ఎంత మాత్రం అనుకోలేవుకదా! ఇదీ అంతే... ఆదర్శాలు కథల వరకే పరిమితం, ఇకపోతే రచయిత జీవితం రచయితదే! ఆటను రాసే కథలకీ, అతని జీవితానికి ఏ సంబంధం ఉండదు." నొక్కి వక్కాణించింది జాహ్నవి.

"అంతేనంటావా అక్కా!" గాయత్రి గొంతుకలో అంతులేని నిరాశ!

జీవన్ కి వాళ్ళ మాటలన్నీ చక్కగా వినిపించాయి. జాహ్నవి విశ్లేషణ అతని మనస్సుని చివుక్కు మనేలా చేసింది. కాని, ఆమె మాటలు కూడా నూటికి తొంభై పాళ్ళు సబవైనవే కదా - అనుకుని అంతలోనే మనసు సరిపెట్టుకున్నాడు.

చాలామంది రచయితలు, రాజకీయ వేత్తల్లాగే ఒకటి చెప్పి వేరొకటి చేస్తూoటారు. రచయితలు తమ రచనల్లో చెప్పే మాటలకీ, నిజ జీవితంలో వాళ్ళ చేసే చేతలకీ పొంతన ఉండదు. ఒకటి చెప్పి, దానికి వ్యతిరేకమైన వేరొకటి చేస్తూంటారు. అలాంటివారి సంఖ్య ఎక్కువే కావచ్చు, కాని తను మాత్రం అలా కాలేడు ఒక్కనాటికీ... తను, అన్నమాట అన్నట్లుగా నిలబెట్టుకోవాలని శాయశక్తులా ప్రయత్నిస్తాడు. తను అన్న మాటకు తానే విలువ నివ్వకపోతే, తనమాటను ఇంకెవరు పట్టించుకుంటారు! తనకు ఆ అవకాశం రావాలేగాని, ఆమెకు తను తప్పక మేలు చేస్తాడు. పాపం! ఆ అమ్మాయి జాహ్నవి, జీవితంలో పెద్ద దెబ్బ తిని ఉండడం వల్ల అలా మాట్లాడింది. ఆమె అనుభవం అటువంటిది, అందులో ఆమె తప్పేమీ లేదు - అనుకున్నాడు జీవన్.

*   *   *   *

సాయంకాలమౌతోంది. ఎండ చల్లబడింది. పిట్టలు నెమ్మదిగా గూళ్ళకు చేరే ప్రయత్నంలో పడ్డాయి కాబోలు, కరణంగారి ఇంటి చూరుకు కట్టిన వడ్లకంకులను పొడుచుకు తినే ఉరపిచ్చుకల సంఖ్య క్రమంగా తగ్గసాగింది.

పశువుల్ని మళ్ళేసుకు రాగానే సీతమ్మగారు చెప్పారు గావును, "రండి అబ్బాయిగోరూ! మనం కూంచేపలా తిరిగొద్దారి, ఇక పదండి" అంటు వచ్చాడు మల్లేశు జీవన్ దగ్గరకు. ఇద్దరు బయలుదేరి  రోడ్డుమీదికి వచ్చి కలిసి నడవసాగారు.

ఆ ఊళ్ళో అక్కడక్కడ ఒకో డాబా ఇల్లు కనిపించినా, అక్కడ చాలావరకూ అన్నీ పెంకుటిళ్ళే ఉన్నాయి. అరుదుగా ఒక్కో  పాత మండువా లోగిలి కూడా కనిపిస్తూ వచ్చింది. ఈ ఇళ్ళన్నీ దాటాక విశాలమైన పెరడులో రెండంతస్తుల మేడ ఒకటి కనిపించింది. దాని పక్కనున్న ప్లే గ్రౌండ్ లో పిల్లలు ఆడుకుంటున్నారు. ఆ మేడ ఆ ఉరి హైస్కులని, ఆ మేడకి ఉన్న బోర్డుని చదివి తెలుసుకున్నాడు జీవన్. అంతేకాదు, ఆ పేరునుబట్టి దాన్ని యాజులుగారే ఆ ఉరి హైస్కూలుకి విరాళంగా ఇచ్చారని కూడా అర్థం చేసుకున్నాడు. ఏ మనిషినైనా సరే ఇన్నేళ్ళు ప్రాణంగా ఊరిజనం గుర్తుపెట్టుకున్నారంటే, ఉరకనే అది ఎలా జరుగుతుంది! దానికి తగినంత కారణం ఉండి తీరుతుంది.

దారిలో చాలామంది మల్లేశుని ఆపి, పలుకరించి జీవన్ గురించిన వివరాలు అడుగుతున్నారు.

"ఈ అబ్బాయిగోరు మన కరనంగో రింటికాడికి పట్నం నుండి వచ్చారండి. యాజులుగోరి తాలూకు బందుగులు" అంటూ గొప్పగా తలెత్తి మరీ చెపుతున్నాడు మల్లేశు.

జనాలు జీవన్ పట్ల గౌరవం ప్రదర్శిస్తున్నారు. కొందరైతే యాజులుగారి కుటుంబ క్షేమ సమాచారం అడిగి తెలుసుకుంటున్నారు కూడా. యాజులుగారి వ్యక్తిత్వమే తనకా గౌరవాన్ని తెచ్చి ఇచ్చిoదని అర్థం చేసుకున్నాడు జీవన్.

స్కూలు దాటి కొంతదూరం వెళ్ళాక వచ్చిన పుంత దారి పట్టారు ఇద్దరు. ఆ పుంతకు అటు ఇటు అరటి తోటలున్నాయి. అలా కొంత దూరం వెళ్ళాక అక్కడ ఒక ఖాళీ స్థలంలో చిన్నా పెద్దా రకరకాల పాక ఇళ్ళు, ఓ తీరూ - తెన్నూ లేకుండా అడ్డదిడ్డంగా వెయ్యబడి ఉన్నాయి. ఆ పాకల మధ్య కుక్కలు, కోళ్ళు తిరుగుతున్నాయి. కొన్ని చోట్ల ఆ ఇళ్ళ ముందు కట్టి ఉన్న మేకలు, వాటిముందు పడేసిన చెట్టు కొమ్మలనుండి ఆకుల్ని తెంపుకుని నములుతున్నాయి. చిన్న పిల్లలు మట్టిలో కూర్చుని ఆడుకుంటున్నారు. పనులకు వెళ్ళలేని పెద్ద వయసువాళ్ళు, పనికి వెడుతూ తల్లులు ఇళ్లదగ్గర వదలి వెళ్ళిన చంటి పిల్లల్ల్ని ఆడిస్తూ కనిపిస్తున్నారు. మరీ ముసలివాళ్ళు గుమ్మాల్లో కూచుని కునికిపాట్లు పడుతున్నారు. పనుల కెళ్ళిన పెద్దవాళ్ళు ఇంకా ఇళ్ళకు తిరిగి రాలేదు. వచ్చేవేళ అవ్వడంతో వాళ్ళకోసం ఇళ్ళదగ్గరున్న వాళ్ళు ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.

"ఇదేనండి మా గూడెం" అన్నాడు మల్లేశు. ఆ గూడెంలో ఉన్న జనం కొత్తమనిషి కనిపించేసరికి, జీవన్ వైపు వింతగా చూస్తూ నిలబడిపోయారు. ఏమాత్రం తీరుగా లేని ఇళ్ళమధ్యనున్న వంకర - టింకర దారుల వెంట మలుపులు తిరుగుతూ నడుచుకుంటూ వెళ్ళసాగారు వాళ్ళు.

మరి కొంత దూరం వెళ్ళాక, అల్లంత దురాన ఉన్న ఒక ఒంటి నిట్రాటతో వేసిన పాక ఇంటిని వేలితో చూపించి చెప్పాడు మల్లేశు, "ఆ ఏపసెట్టు కాడున్న గుడిసేనండి మా ఇల్లు! అయ్యా, అమ్మా, ఇంకా సిన్నా - సితకా సెల్లెల్లు, తమ్ముళ్ళు - అంతా అందులోనే ఉంటామండి. నేనే పెద్దోడి నండి, ఆయ్! అమ్మా, అయ్యా యగసాయం పనుల కెలతారండి." గర్వంగా తన కుటుంబాన్ని జీవన్ కి పరిచయం చేశాడు మల్లేశు.

ఆ గూడెం దాటాక కొంత దూరం కొబ్బరి తోటల వెంట నడిచారు వాళ్ళు. పేరుకవి కొబ్బరితోటలు, కానీ కొబ్బరి చెట్లకు మధ్యలో రకరకాల ఫలవృక్షాలు కూడా ఉన్నాయి. దాని పక్కనే నిండుగా మామిడి చెట్లతో ఉన్న విశాలమైన మామిడి తోట ఒకటి కనిపించింది.

ఆ తోటని చూసి ముగ్ధుడై, "మల్లేశూ! ఈ తోట ఎవరిదీ" అని అడిగాడు జీవన్.

మల్లేశు కళ్ళు మెరిశాయి, "ఇది మా మేజరుగోరి తోటండి. ఇందులో ఈ బూప్రెపంచంలో ఉన్న అన్ని రకాల మామిడిసెట్లు ఉన్నాయండి. అయ్యబాబోయ్! ఇదొకటే నేంటండి! ఇలాంటి య్యెన్నో తోటలు ఉన్నాయి ఆరికి! ఆయ్! ఆరికి టాట్టరుతో సేసే గొప్ప యగసాయం కూడా ఉన్నాదండి. రోజులో ఒక్క చ్చనమైనా తీరిగ్గా కూకోరండి మేజర్ గోరు. అన్నీ సొయంగా ఆయినే సూసుకుంటారు, ఆయ్! ఈ తోటకావలనున్న చెరుకు పొలాలూ ఆరియేనండి. ఏటా దగ్గరుండి, బెల్లం వండిస్తారండి. తేనెపాకం మాసెడ్డ రుసి! అచ్చంగా తేనెలాగే ఆపడతాదండి. బెల్లం వండేటప్పుడు పాకం సిక్కబడగానే తీసి, సీసాల్లో పోసి ఐనోల్లకందరికీ పంచిపెడతారండి. మన కరనంగోరికీ ఇస్తారండి. నేనో పాలి తిన్నానండి! మినప రొట్టెలో, అట్టులో - ఎలా తిన్నా బాగుంటాదండి. సీతమ్మగోరు ఎప్పుడు సేసినా నాకూ ఎడతారండి." నోరూరింది మల్లేశుకి.

ఇద్దరూ చెరుకు పొలాలు దాటిన తరువాత, పంట పొలాలనుండి  మురుగు నీటిని మడుగులోకి తీసుకుపోయే బోదికాలవ ఒకటి వాళ్లకి అడ్డంగా వచ్చింది. ఆ బోది కాలవకి ఆవలనున్న కొబ్బరి తోటలో దింపు తీస్తున్నారు. ఒకడు చెట్టెక్కి ముదిరిన కొబ్బరి కాయలు కోసి కింద పడేస్తున్నాడు. యజమాని తాలూకు మనిషి కాబోలు, కింద పడుతున్న కొబ్బరికాయలను పర్యవేక్షిస్తూ తోటలో నిలబడి ఉన్నాడు.

బోదికాలవ గట్టున, అటూ ఇటూ చూస్తూ నిలబడ్డ జీవన్ ని చూసి, తోటలో ఉన్న వ్యక్తి మల్లేశుని అడిగాడు, "ఈయనగో రెవర్రా మల్లేశూ?"

మల్లేశు జీవన్ ని పరిచయం చేశాడు, "యాజులుగోరి తాలూకు బందుగులు, కరనంగోరి ఇంటి కాడికి సుట్టం సూపుగా వచ్చారు."

"ఐతే కరణం గోరింటికి పట్నం నుండొచ్చిన బందువులు తమరేనాండి " అంటూ ముందుకి, బోదికాలవ దాకా వచ్చి అతడు జీవన్ ని తోటలోకి ఆహ్వానించాడు. "దండాలండీ అబ్బాయిగోరూ! తోటలోకొచ్చి ఒక బొండం తాగి వెళ్ళండి, దావతి తీరుద్ది. ఏసవికాలంలో కొబ్బరి నీరు తాగితే శానా మంచి చేస్తది. అస్సలు వడదెబ్బ తగలనీదండి, ఆయ్!"

జీవన్ కి అతనెవరో తెలియకపోయినా, అతని ఆహ్వానాన్ని అందుకుని, బోది కాలువ దాటి తోటలోకి వెళ్ళాడు జీవన్, కొబ్బరికాయలను చెట్టునుండి ఎలా దింపుతారో చూడాలన్న కౌతుకంతో.

"ఒరేయ్ వీరిగా! రెండు గోరుమీగడతో ఉన్న మంచి బొండాలు తియ్యరా" అంటూ దింపు తీస్తూన్న గవళ్ల వీరాయి నుద్దేశించి గట్టిగా కేకేశాడు ఆతను.

వెంటనే, చెట్టుమీదున్న మనిషికి వినిపించాలని ఇంకా గట్టిగా అరిచాడు మల్లేశు, "అరే ఈరాయ్! బొండాలకి ఆ సెట్టు సరి కాదురా, నే సెవుతున్నా శరదగా ఇనుకో! కడ వరుసలో, ఆ నేరేడు సెట్టుకాడున్నది గంగాబొండం సెట్టు. ఆదైతే నీల్లుతాగినా, మీగడ తిన్నా గొప్ప రుసి గుంటాది, నామాటిను" అన్నాడు చొరవగా.

"ఔనురా! గంగాబొండం ఐతే బాగుంటాది. అయ్యే ఓ రెండు దింపు" అన్నాడు యజమాని తాలూకు మనిషి కూడా.

వెంటనే వీరాయి చెట్టు దిగి వచ్చాడు. మల్లేశు వీరాయికి గంగా బొండం చెట్టుని చూపించాడు.

చెట్టు ఎక్కబోతుండగా, "గోరుమీగడ ఉండేలా జాగర్తగా సూడు" అంటూ వీరాయిని, మల్లేశు మళ్ళీ హెచ్చరించాడు. వీరాయి గంగాబొండాల చెట్టు ఎక్కాడు.

ఆ కొబ్బరి తోట మంచి పరువంలో ఉందేమో దిగుబడి బాగుంది. దింపు అయ్యిన ప్రతి చెట్టు క్రిందా నేలమీద గుట్టలు గుట్టలుగా కాయలు పడి ఉన్నాయి. ఆ సంవృద్ది చూస్తూన్న జీవన్ కి అనిపించింది - ఈ పల్లెల్లో పండిన సరుకు పట్నానికి రవాణా కాకపోతే, పట్నం పచ్చగా ఎలా ఉంటుంది? పల్లెలే కదా పట్నాలకు జీవగర్రలు! పల్లెలు లేకుంటే పట్నంలో జనం తిండికి లేక మాడి చావాల్సిందే! అందుకే, పల్లెల్ని నిరశించడం అన్నది విశ్వాసం లేనితనానికి గుర్తవుతుంది."

వీరాయి దింపిన గంగాబొండాల్ని అందుకున్నాడు మల్లేశు. వాటిని కత్తి తీసుకుని లాఘవంగా చెలిగి, బెజ్జం చేసి, ఒకటి జీవన్ కి, ఇంకొకటి యజమాని తాలూకు మనిషికీ ఇచ్చాడు.

ఇంతవరకు, పట్నంలో జనం, బోండాలమ్మే కొట్టుముందు నిలబడి, కొబ్బరి బొండాన్ని "స్ట్రా"లతో పీల్చి తాగడం మాత్రమే చూసిన జీవన్ కి, చెట్టు క్రింద కూచుని కొబ్బరి బొండం తాగడం ఎలాగో తెలియలేదు. పక్కనున్న వ్యక్తి తాగడం మొదలెట్టేవరకూ ఆగి, అతనిని అనుకరిస్తూ ఆ కొబ్బరినీళ్లను తాగాలనుకున్నాడు.

నీరు తాగడం అయ్యాక, మల్లేశు కాయ పగలేసి, మీగడ తీసి ఇచ్చాడు తినమని. ఆ కాయలో మీగడ చాలా ఉంది, కాయ పెద్దదిగా ఉండడంతో. వీరాయికీ, మల్లేశుకీ చెరోకొంత ఇచ్చి తను తిన్నాడు జీవన్.

కొంతసేపు యజమాని తాలూకు ఆసామీ అడిగిన ప్రశ్నలకు క్లుప్తంగా జవాబులు చెప్పి, ఆపై సెలవు తీసుకున్నాడు జీవన్. మళ్ళీ బోదికాలవ గట్టువెంబడి నడక సాగించాడు మల్లేశు వెంట జీవన్.

****సశేషం****

Posted in May 2023, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!