Menu Close
Venkat Nagam
మన ఊరి రచ్చబండ
వెంకట్ నాగం

నవ్వుల రోజు

"నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు" - ఎవరేమన్నా దులుపుకొని వెళ్లిపోయేవారికి అతికినట్లు సరిపోయే సామెత ఇది. "ఎవరైతే చిరునవ్వుల్ని ధరించరో వారు పూర్తిగా దుస్తులు ధరించినట్లు కాదు" అని చెప్పకనే చెప్పారు మహాత్మా గాంధీ - మీ చిరునవ్వుతో మీరు ధరించిన దుస్తులు సంపూర్ణం అవుతాయి అనే లోతైన అర్థం దాగుంది ఇక్కడ. "నవ్వడం భోగం, నవ్వించడం యోగం, నవ్వలేకపోవడం రోగం" అని ప్రవచించారు తెలుగు రచయిత, దర్శకులు, నటులు, ప్రత్యేకించి హాస్యకథా చిత్రాలు తీయటంలో చెయ్యి తిరిగిన మన జంధ్యాల. అన్నట్లు నవ్వులకి ఒక ప్రత్యేక దినం అంటూ ఒకటి ఉంది. 1995లో మార్చి13న భారతీయ వైద్యుడు డా. మదన్‌ కటారియా ప్రపంచ నవ్వుల దినాన్ని సృష్టించాడు. ఒక నవ్వుల క్లబ్ గా మొదలైన ఈ పండుగ రానురాను 65 దేశాలలో ఆరువేల కు పైగా నవ్వుల క్లబ్ లుగా రూపుదిద్దుకుంది. ఇప్పుడు ప్రతి సంవత్సరం మే నెల మొదటి ఆదివారం ‘ప్రపంచ నవ్వుల దినోత్సవం’ గా నిర్వహించబడుతుంది. దైనందిక జీవితంలో "నవ్వు" ఎంత ముఖ్యమో తెలుసుకోవడమే ఈ నెల రచ్చబండ చర్చ ఉద్దేశ్యం.

ప్రతి మనిషికీ - ఎక్కడ పుట్టినా, మరెక్కడ పెరిగినా... అర్థం అయ్యే భాష నవ్వు. బహుశా ప్రతి ఒక్కరి నవ్వులోనూ అర్థం కూడా ఒకటే. మనం నేర్చుకోనక్కరలేని భాష "నవ్వడం" కావచ్చు. పుట్టుక నుండే మనకు నవ్వు వస్తుంది. మరో విశేషం ఏంటంటే, నవ్వు మనకు తెలీకుండానే వస్తుంది. వచ్చిన నవ్వును బలవంతంగా మనం ఆపగలమే కానీ, బలవంతంగా నవ్వలేం - బలవంతపు నవ్వు ఇట్టే తెలిసిపోతుంది.

ముందుగా కొన్ని సినిమా పాటల్లో నవ్వు నేపధ్యాన్ని ప్రస్తావిస్తాను. "నవ్వు" మీద ఎస్. పి. బాలు పాడిన పాటలలో రెండు పాటలు ఈ సందర్భంగా నాకు గుర్తుకు వచ్చాయి. "నవ్వుతూ బతకాలిరా.. తమ్ముడూ .. మాయదారి మల్లిగాడు సినిమా (1973) - ఈ పాటలో "అన్నాయం జరిగినపుడు - అక్కరమం పెరిగినపుడు... వున్నాడురా దేవుడు…వాడు ఒస్తాడురా తమ్ముడు... . అందుకే.. నవ్వుతూ బతకాలిరా.. తమ్ముడూ" అంటూ రచయిత ఆత్రేయ ఒక గమ్మత్తైన యాసలో నవ్వుతూ బ్రతకమని సూపర్ స్టార్ కృష్ణ పాత్ర ద్వారా మనకు చెబుతాడు. ఆయన రచించిన మరోపాట "సిరిమల్లె పూవల్లె నవ్వు.... చిన్నారి పాపల్లె నవ్వు......” జ్యోతి సినిమా (1976) పాటలో నాయికను "సిరిమల్లె" పువ్వులా చిరకాలం నవ్వాలని నాయకుడు కోరుకుంటాడు. "నవ్వుతూ బతకాలిరా.. తమ్ముడూ" పాటలో 15 సార్లు "నవ్వుతూ" పదప్రయోగం చేసారు ఆత్రేయ, ఇక "సిరిమల్లె పూవల్లె నవ్వు" పాటలోనైతే ఏకంగా పాతిక సార్లు "నవ్వు" పదప్రయోగం చేసారు ఆయన. తద్వారా మనకు "నవ్వు" ఎంత ముఖ్యమో ఈ రెండు పాటల ద్వారా ఆత్రేయ మనకు పదే పదే "నవ్వుతూ" చెప్పారు అని మనం గుర్తించాలి.

"నవ్వులో శివుడున్నాడురా" పుస్తకం పేరుతొ శ్రీ రమణ అనే ఒక రచయిత వ్రాసిన పుస్తకం ఒకటి అమెజాన్ వాడు అమ్ముతున్నాడు అని నాదృష్టికి వచ్చింది. హాస్య నేపథ్యంతో కూడిన వ్యాస సంపుటి ని ఒక పుస్తకంగా రచయిత శ్రీ రమణ వెలువరించారు. ఇక పద్యాల విషయానికి వస్తే.. ముఖ్యంగా నవ్వు పై వేమన రాసిన ఒక పద్య రత్నాన్ని ఇక్కడ చెప్పుకోవాలి.

భూమి నాది యనిన భూమి ఫక్కున నవ్వు
దాన హీనుఁ జూచి ధనము నవ్వు
కదన భీతుఁ జూచి కాలుఁడు నవ్వును
విశ్వదాభిరామ వినురవేమ

దీని తాత్పర్యము: శాశ్వతంగా భూమిపై జీవించలేని మానవుడు "ఈ భూమి నాది" అంటే భూమి ఫక్కున నవ్వుతుంది. దానం చేయని వాడిని చూసి ధనం నవ్వుతుంది. యుద్ధమంటే పారిపోయే వాడిని చూసి యముడు కూడా నవ్వుతాడు. ఇక్కడ కాలుడు అంటే యముడే కాదు, అష్టనాగములలో ఒకడు అనే అర్థం కూడా ఉంది. సందర్భం వచ్చింది కాబట్టి ప్రస్తావిస్తున్నాను అష్టనాగములు అంటే ఎనిమిది సర్ప రాజములు: 1. అనంతుడు, 2. తక్షకుడు, 3. వాసుకి, 4. శంఖపాలుడు, 5. పద్ముడు, 6. కర్కోటకుడు, 7. క్రోకుడు, 8. కాలుడు. మరి కాలుడు ఒక కాటు గాని వేసాడంటే దెబ్బకు యముడు ప్రత్యక్షం అవ్వాల్సిందే కదా! మన పెదాలను దాటిన నవ్వు, పాటల్లో, పద్యాల్లో చేరి, పుస్తక రూపు దాల్చి ప్రపంచాన్నే చుట్టి వచ్చింది అని చెప్పడానికి ఈ ఉదాహరణలు పేర్కొనడం జరిగింది.

ప్రశాంతత అనేది నవ్వుతోనే మొదలవుతుంది.. మీ  చిరునవ్వే.. మీ  జీవితాన్ని అందంగా తయారు చేస్తుంది.. నవ్వు రాళ్లనైనా కరిగిస్తుంది.. పాషాణ హృదయాలను కదిలిస్తుంది.. నవ్వుకు కులం, మతం, ప్రాంతం.. అన్న భేదం లేదు. అందరినీ అందంగా, ఆనందంగా ఉంచే ఒకే ఆయుధం నవ్వు.. ఒక్క చిరునవ్వు కొత్త వారిని సైతం మీకు పరిచయం చేస్తుందనడంలో అతిశయోక్తి కాదు.. అలాంటి నవ్వు.. అందిరికీ చిరకాలం ఉండాలి.. తద్వారా ప్రేమను, ఆహ్లాదాన్ని, ఆప్యాయతను, ఆనందాన్ని తెచ్చిపెట్టాలి అని కోరుకోవడం తప్పు కాదు కదా!

చిరునవ్వును మానవ భాషగా అభివర్ణిస్తారు. ఆత్మీయంగా నవ్వితే ఇతరుల మనసు మన సొంతమే! ఈ లోకంలో పసిపిల్లల నవ్వును మించిన సౌందర్యం లేదు. ఎదుటి వారిని చిరునవ్వుతో పలకరించండి. ఇక మీరూ అజాత శత్రువే. ద్వేషించేవారు సైతం నవ్వుతో కూడిన మీ ‘ప్రపంచ భాష’కు దాసోహమంటారు. ముఖంపై కాసింత చిరునవ్వు ఉంటే మరే ఇతర అలంకారం అవసరమా? ప్రశాంత వదనంపై నుంచి కాస్త చిరునవ్వు నవ్వు చిందించండి, మీ సొమ్మేమీ పోదు, పైగా అవతలి వాళ్లు ఒక వేళ వత్తిడిలో ఉంటే మీ నవ్వే వాళ్లలో ఉత్తేజాన్ని నింపుతుంది.

ఆధునిక ప్రపంచంలో ఉరుకుల పరుగుల జీవితం గడపడం సర్వ సాధారణమైంది. ఆ వేగంతో సాగకుంటే జీవితమే గడవని పరిస్థితి చాలా మందిది. వర్తమాన పోటీ ప్రపంచంలో విద్యార్థులకు చదువు ఒత్తిడి.. గృహిణికి వేళాపాళా లేకుండా ఇంటి పని, లేదా ఆఫీసు పని, లేదా రెండూను. ఇంటి యజమానికి ఉద్యోగ, లేదా వ్యాపార ఒత్తిడి.. ఇలా ప్రతి ఒక్కరూ క్షణం తీరిక లేని జీవితం గడుపుతున్నారు. దీంతో ఆనందం కరవైంది. నవ్వు అనేది లేకుండా పోయింది. ఇంట్లోని కుటుంబ సభ్యులు కూడా పరస్పరం ఒక చోట కలుసుకోవడం, నవ్వుకోవడం అరుదుగా మారింది. పిల్లలకైతే పాఠశాలకు ఆలస్యమవుతే అసహనం, పెద్దలకు కార్యాలయానికి సమయానికి వెళ్లకపోతే పరిస్థితి అగ్గి మీద గుగ్గిలమే, ఇంట్లో వంట కాకపోతే ఇల్లాలికి చికాకు.. దాంతో ఉదయం లేచినప్పటి నుంచి అసహనంతో ప్రారంభమైన జీవితం నిద్రపోయేసరికి ఒత్తిడితోనే ముగుస్తోంది. మరి దీనికి సహజ పరిష్కారం "చిరునవ్వు" అంటే అతిశయోక్తి కాదు. నవ్వుతో కొన్ని రకాల రోగాలు దూర మవుతాయంటారు ఆధునిక ఆరోగ్య నిపుణులు. శరీరంలో రోగ నిరోధక శక్తిని మింగేసే కార్టిసోల్ పదార్థంపై చిరునవ్వు ప్రభావం చూపి దానిని అణిచివేస్తుందని వైద్య నిపుణులు ఢంకా బజాయించి చెబుతున్నారు.

ఆత్మీయులుగాని, పరిచయం ఉన్నవారుగాని స్నేహితులు, బంధువులు కనిపిస్తే మాటకన్నా ముందు మనకు మనస్సులో నుంచి వచ్చే భావనే ‘చిరునవ్వు’. నవ్వినట్లుగా పెదాల మధ్య కనిపించేదే చిరునవ్వు. మహాభారతాన్ని రాసిన తిక్కన 32 రకాల నవ్వులు ఉన్నట్లు పేర్కొనగా.. అందులో మొట్టమొదటిది చిరునవ్వే. ఈ రకం నవ్వును శాంతికి సంకేతంగా భావిస్తారు. కొద్దిపాటి స్నేహాలను అప్పుడే ఏర్పడిన పరిచయాలను గట్టిగా ధ్రువపరిచేదే ‘చిరునవ్వు’. నవ్వు విలువను తెలియని చాలా మంది ఎప్పుడూ రుసరుసలాడుతూ, చిర్రుబుర్రు లాడుతూ జీవితాన్ని గడిపేస్తుంటారు. ఇంకొంత మంది నిత్యం ధుమధుమలాడుతూ ఉంటారు - దుర్వాసుడి వలె. దీంతో కొత్తవారు వీరికి దగ్గర కాలేరు. పైగా ఉన్నవారు కూడా చాలా మంది వీరి తీరుతో రోజురోజుకు వీరికి దూరమవుతారు. అయితే నవ్వే ఓ ఆయుధం గా చేసుకొని ఈ సమస్యల నుండి వీరు చాలా వరకు బయటపడవచ్చు. కొన్ని సందర్భాల్లో మనం చిందించే నవ్వు ఇతరుల బాధను మాయం చేస్తుంది, ఒక విధమైన సుహృద్భావ సంబంధాన్ని కలిగిస్తుంది. నగర, పట్టణ జీవనంలో ఒత్తిళ్లతో కూడిన జీవనానికి చిరునవ్వు ఒక మందులా పని చేస్తుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు, గృహిణులు, వ్యాపారులు.. ఇలా అందరికీ నవ్వు ద్వారా ఉపశమనం అయ్యే లాఫింగ్ థెరపీ అవసరమని మానసిక నిపుణులు ఇప్పుడు బల్ల గుద్ది చెబుతున్నారు.

ఒక మనిషి ఎంత సంతోషంగా వున్నాడో తెల్సుకోడానికి అతను రోజుకు ఎన్నిసార్లు మనస్ఫూర్తిగా నవ్వుతున్నాడో లెక్కవేస్తే సరిపోతుంది అని ఒక అంచనా. ఒంటరిగా ఉన్నప్పటి కంటే జనంలో వున్నప్పుడు మనం 30 రెట్లు ఎక్కువగా నవ్వుతాం అని ఒక అంచనా.  నిజజీవితంలో మనకు నవ్వు తెప్పించే సందర్భాలు సినిమాల్లో కామెడీ సన్నివేశాలంత పదునుగా వుండవు. ఎదుటివారి ముఖకవళికలు, కామెంట్లు, చేష్టలు చాలు మనం పగలబడినవ్వేందుకు. మరో ముఖ్యమైన విషయం ఒకటుంది. ఆడవాళ్లు మగవాళ్లకంటే ఎక్కువసార్లు నవ్వుతారట. మనసు దోచుకున్న మగువను నవ్వించడానికి మగవాళ్లు నానా తంటాలూ పడితే తమకు నచ్చిన వాడి సన్నిధిలో అతివలు అధికంగా నవ్వులు కురిపిస్తారట. తమ మీద తామే జోకులు వేసుకుని నవ్వుకోగలిగేవాళ్లకు ఆత్మవిశ్వాసం అత్యధిక స్థాయిలో ఉంటుంది అని పరిశీలకుల అభిప్రాయం. ఈ మధ్య నాటు నాటు పాట గాయకుల్లో ఒకరైన రాహుల్ సింప్లిగంజ్ తో ఒక టీవీ ఇంటర్వ్యూ లో యాంకర్, ఆయనను "నల్ల బంగారం" అని ఆట పట్టించాడు. దానికి సమాధానంగా రాహుల్ సింప్లిగంజ్ అది తనకు సరైన పోలిక అని అంటూనే తనని తాను "నల్ల బంగారం" అని వర్ణించుకోవడంలోనే ఆనందం పొందుతానని, ఇతరులను నిందించి లేదా అవమానించి తను పొందే ఆనందం కంటే తన మీద తానే జోకులు వేసుకోవడం బాగుంటుంది అని వినమ్రంగా చెప్పాడు. నేను ఈ మధ్య వీక్షించిన ఆహ్లాదకరమైన యూ ట్యూబ్ వీడియోలలో ఇదొకటి. తమ మీద ఇతరులు పేల్చే జోకుల్ని తట్టుకోలేని వాళ్లు ఆత్మన్యూనతతో బాధపడుతున్నట్టే అని మానసిక నిపుణుల ఉవాచ. సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌ ఎక్కువగా వున్న ఉద్యోగులే ఎక్కువ సామర్థ్యంతో పని చేయగలుగుతారని మరో అధ్యయనం తేల్చి చెప్తోంది. మొదలు పెట్టిన సామెత "నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు" ను నమ్ముకుంటే మెరుగైన స్థితిలో ఉంటామేమో? ఇవన్నీ ఊహించే మన పెద్దలు మనకు ఉపశమనం కలిగించే తగిన సామెతలు ముందే సిద్ధంచేసి ఉంచారేమో?

అసలు మన దేశంలో హాస్యానికి మొదటి నుంచి ప్రముఖ స్థానం వుంది. రాజుల ఆస్థానాలలో విదూషకులు అందుకే వుండేవారు. బీర్బల్‌, తెనాలి రామకృష్ణ వంటి వారి కథలు గిలిగింతలు పెడతాయి. జానపద గీతాల్లోనూ, హాస్యరసం పుష్కలం. బిల్డప్పులు ఇస్తూ గ్రామాలలో తిరుగుతూ బతుకుతెరువు కోసం కొందరు తుపాకిరాముడిగా అవతారమెత్తి కోతలు కోస్తూ అందరికి ఆనందాన్ని కలగజేస్తుంటారు. ఇప్పటికీ పలు జానపద కళా ప్రదర్శనలలో "తుపాకిరాముడి" ప్రదర్శన ఐదు, పది నిమిషాల పాటూ ఉంటుంది. దీనికి కొనసాగింపుగా పాపులర్ యాంకర్, నటుడు బిత్తిరిసత్తి హీరోగా 'తుపాకీ రాముడు' 2019లో ఒక సినిమా వచ్చింది.

నవ్వడం ఆరోగ్యానికి చాలా మంచిదని నేటి డాక్టర్లు సైతం చెబుతున్నారు. హాస్యం హాయిగా వున్నామనే భావన కలిగిస్తుంది. క్రమంగా ప్రపంచమంతటా హాస్యాన్ని, నవ్వును ఒక ప్రత్యామ్నాయ చికిత్స సాధనంగా నేడు గుర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా, బ్రిటన్‌ ఇతర పాశ్చాత్య దేశాలలో ఆస్పత్రులకు అనుబంధంగా పలు నవ్వుల ఆస్పత్రులు ఏర్పడ్డాయి. వీటిలో హాస్య చిత్రాలు, వీడియోలు చూపిస్తారు. పెద్ద కారణం లేకుండా నవ్వడం పిచ్చి అనుకుంటే మీరు పొరబడినట్టే. కడుపుబ్బ నవ్వేవారు ఒత్తిడి తగ్గించుకుని ప్రపంచంలో హాయిగా సర్దుకోగలరని ఈ ఆసుపత్రులవారు బలంగా నమ్ముతారు. తమ సమస్యలను, సంకోచాలను పక్కనబెట్టి హాయిగా నవ్వడం ద్వారా మెరుగైన జీవనానికి రోగులను సిద్ధం చేయడమే నవ్వుల ఆస్పత్రుల ముఖ్య ఉద్దేశ్యం.

జీవితంలో ఎన్నడూ నవ్వని వారు సరాసరిన 72.9 ఏళ్లు అప్పుడప్పుడూ మాత్రమే నవ్విన వాళ్లు 75 ఏళ్లు, బిగ్గరగా నవ్వేవాళ్లు 79.9 ఏళ్లు జీవించినట్లు పరిశోధనల్లో తేలింది. మొహమాటం కోసం ఉత్తుత్తి నవ్వులు చిందించేవారి ఆయుష్షులో ఎలాంటి మార్పులేదట. బిగ్గరగా నవ్వే వారి ముఖంపై ఉండే కండరాలు సంకోచ, వ్యాకోచం చెంది కాంతివంతమైన వర్ఛస్సుతో ఉంటారు. కాబట్టి నవ్వడం వల్ల చర్మం కూడా బాగుంటుంది అని తెలుస్తుంది. క్రీములు వగైరా వాడనవసరం లేకుండా యాంటీఏజింగ్ గా నవ్వు పనిచేస్తుంది, కాబట్టి హాయిగా నవ్వుతూ ఎన్నో బెనిఫిట్స్ ని కాణీ ఖర్చు లేకుండా మనం పొందొచ్చు.

తాను ఒత్తిడి కి గురైన సమయంలో… రాజేంద్రప్రసాద్ సినిమాలు చూడటం జరుగుతుందని,.. ఇక రాజేంద్రప్రసాద్ సినిమా చూసిన తర్వాత పూర్తిగా ఒత్తిడి తగ్గి .. మైండ్ లో భారం మొత్తం పోతుందని మాజీ ప్రధాని, ఆర్థికవేత్త పీవీ నరసింహారావు తన బయోగ్రఫీ లో.. రాజేంద్ర ప్రసాద్ నటన గురించి సినిమా గురించి రాయటం జరిగింది. మరి రాజేంద్రప్రసాద్ సినిమా అంటే పొట్ట చెక్కలయ్యే కామెడీ సీన్లతో నవ్వుకోవడం ఖాయం కదా! ప్రధాని పీవీ నరసింహారావు అంతటి మహానుభావుడిని తన కామెడీ తో ఆకట్టుకున్న రాజేంద్రప్రసాద్, ఆయా సినిమాల బృందం ధన్యులు కదా?

సినిమా ద్వారానే కాకుండా నేటి యువత కొత్త విషయాలను మీమ్స్ ద్వారా తెలుసుకుంటున్నారని పలు స్టార్ట్ అప్స్ కంపెనీలు పసిగట్టాయి. మీమ్స్ అంటే ఉదాహరణకు పేరొందిన సినిమాలో ఉన్న పాత్రలతో కూడిన పాత సీన్ ఫోటోలకు నవ్వు పుట్టించే వర్తమాన వ్యాఖ్యానం జతచేయడం. వాట్స్ ఆప్, ట్విట్టర్ తదితర మీడియాలలో మీమ్స్ పేలని రోజు అంటూ ఉండదు. మీరు చక్కగా మీమ్స్ చేయగలరా? క్రియేటివిటీగా ఆలోచించగలరా? అయితే మీకు బంపర్ ఆఫర్.. అవును అక్కడ మీరే మీమ్స్ చీఫ్ .. జీతం కూడాఎక్కువే... నెలకు రూ.లక్ష ఇస్తారట.. బెంగళూర్ స్టార్టప్ కంపెనీ ‘స్టాక్ గ్రో’ కంపెనీ ఈ ఆఫర్ ఇచ్చింది. ఈ మేరకు లింక్‌డిన్‌లో పోస్ట్ చేసింది. ఈ జాబ్ కోసం ఔత్సాహికులు దరఖాస్తు చేయడమే కాదు.. అలాంటి వ్యక్తిని రిఫర్ చేసిన సరే సర్ ప్రైజ్ గిప్ట్ గా ఐప్యాడ్ ఇస్తామని సదరు కంపెనీ చెబుతోంది. వర్తమాన అంశాలపై అభ్యర్థులు సెటైరికల్ మీమ్స్ రూపొందించాలి. అర్హత కలిగిన సీనియర్లను వారిని చీఫ్ మీమ్స్ ఆఫీసర్‌గా నియమించుకునేందుకు సిద్ధమయ్యామని ఆ కంపెనీ చెప్పుకొచ్చింది. సో... మన పెద్దలు చెప్పిన "ఆలస్యం అమృతం విషం" అన్న విషయంను ఒకసారి గుర్తుకు తెచ్చుకొని.. సృజనాత్మకత ఉన్న పాఠకులారా మీకు ఆసక్తి ఉంటే .. ఈ జాబ్‌కు అప్లై చేసుకొని.. మీమ్స్ జాబ్ పట్టండి, ఒకచేత్తో లక్షలు - మరో చేత్తో ఆరోగ్యాన్ని సంపాదించుకోండి.

ప్రతి ఒక్కరి జీవితం లో నవ్వు తప్పక ఉండాలి. నిజంగా నవ్వు ఒక దివ్యౌషధమని చెప్పొచ్చు. అనారోగ్య సమస్యలు కి నవ్వు నిజంగా పరిష్కారం అనే చెప్పాలి. నవ్వడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా..?  ఆశ్చర్యం కలుగుతుంది కదా! ప్రపంచ నవ్వుల దినోత్సవాన్ని మొదట్లో జనవరి రెండో ఆదివారం నాడు జరుపుకునేవారు. ప్రపంచవ్యాప్తంగా చాలా పశ్చిమ దేశాలలో జనవరిలో చలి వాతావరణముంటుంది కాబట్టి, వాతావరణం అనుకూలించే సమయానికి ఈ తేదీని మార్చాలని హాస్య ప్రియులు కోరారు. ఒక పక్క చలికి గజగజ వణుకుతూ మరోపక్క నవ్వమంటే ఎవరికైనా కష్టసాధ్యమే కదా! దాంతో లాఫ్టర్స్‌ క్లబ్‌ ఇంటర్నేషనల్‌ వాళ్లు ఈ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే మొదటి ఆదివారం నాడు జరపాలని నిర్ణయించారు. మొట్టమొదటి నవ్వుల దినోత్సవాన్ని 1998 జనవరి 11వ తేదీన ముంబయిలో నిర్వహించారు. దీనికి 1200 మంది హాజరయ్యారు. 2004 మే 2వ తేదీన స్విట్జర్లాండ్‌ రాజధాని నగరంలో నవ్వుల ఉత్సవం జరిగింది. ఆ దేశపు పార్లమెంటు చుట్టూ నవ్వుతూ ప్రదక్షిణ చేయడం ఈ ఉత్సవంలో విశేషం. నవ్వడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం చేకూరుతుందని, ప్రపంచశాంతి ఈ దినోత్సవ నిర్వహణ పరమార్థమని నిర్వాహకుల అభిప్రాయం వచ్చిన సందర్భం కూడా ఇదే. ఆ రకంగా ఈ 'నవ్వుల రోజు' మనకు కొత్త స్ఫూర్తినిస్తుందని ఆశిద్దాం!

నవరసాల్లో ఒకటి హాస్యం. ఇప్పుడు హాస్య ప్రియత్వం తగ్గుతోందా! తగ్గుతుందనే చెప్పాలి. ఒంటరి తనం, కోపం.. ముభావం... ఆవేశం... అసంతృప్తి. ..ఒత్తిడి - ఆధునిక జీవన శైలి అనే బందీఖానా లో ఉన్న వర్తమాన మానవుడికి హాస్య ప్రియత్వం గూర్చి ఆలోచించే సమయం ఉండట్లేదు. ఈ బందీఖానా నుంచి మనిషి బయటపడడం అంటే సుడిగుండం నుండి బయటపడడమే. ఆరోగ్యకమైన హాస్యం మన జీవితంలో లోపిస్తోంది. అవసరాలు తీర్చుకునేందుకు, డబ్బు సంపాదించేందుకు చేసే పరుగుపందెంలో ఏళ్లు గడిచిపోతున్నాయి. బావిలో పడినవాడు బిగ్గరగా అరిస్తే బయట ఉన్నవాడు ఏ చేంతాడో - నిచ్చెనో వేసి బయటకు లాగే ప్రయత్నం చేస్తాడు, మరి అందరూ బావిలో ఉంటే - లేదా బయట ఉన్నవాళ్లు ఎవరి గొడవలో వారు ఉంటే? బావిలో ఉన్నవారి గతి ఏమిటి? కాబట్టి బావిలో ఉన్నవారే బయట పడే మార్గం స్వంతంగా అన్వేషించాలి. కావున ఈ నెల మే మొదటి ఆదివారం నవ్వుల దినోత్సవం సందర్భంగా..సిరిమల్లె పాఠకులారా సరదాగా కాసేపు.. అన్నీ మరిచిపోదాం.. మనసారా హాయిగా నవ్వుకుందాం.. ఇంకా నేను గుర్తు చేయవలసినది ఏంటంటే... సిరిమల్లె పాఠకులు చేయవలసిన  రెండు పనులు మిగిలి ఉన్నాయి అని...పెద్దగా కష్టమైనవి కావు అవి  : మొదటిది  -  మంచి కామెడీ సినిమా ఎంచుకొని ఈ ఇంటిల్లిపాది మీ ఇంట్లో ఆసాంతం ఆ సినిమా చూసి ఆస్వాదించండి. రెండవది - యధావిధిగా క్రింద కామెంట్ బాక్స్ లో మీ స్పందనను తెలియజేయండి. వచ్చే నెల రచ్చబండలో మరో అంశం పైన చర్చిద్దాం, ఈలోపు మీ స్పందను కింది కామెంట్ బాక్స్ లో రాయడం మరచిపోవద్దు సుమా !

-- నమస్కారములతో, మీ వెంకట్ నాగం

********

Posted in May 2023, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!