Menu Close
తెలుగు పద్య రత్నాలు 23
-- ఆర్. శర్మ దంతుర్తి --

మహావిష్ణువు వైకుంఠంలో ఉన్నప్పుడు సనకసనందనాదులు ఆయన్ని చూడ్డానికి వచ్చారు. ఈ మునులు బాగా చిన్న వయసులోనే భగవంతుణ్ణి దర్శించినవారు. ఎప్పుడు ఏ సమయంలో అయినా సరే వాళ్లకి వైకుంఠం లోపలకి వెళ్ళి రావడానికి అనుమతి ఉండేది. వీళ్ళు అలా వచ్చినప్పుడు ద్వారపాలకులు జయ, విజయులకి కి ఏమైందో కానీ ఇప్పుడు మీరు లోపలకి వెళ్లడానికి వీల్లేదు అని అడ్డుకున్నారు. వాళ్లకి కోపం వచ్చి శపించారు – మీరు చేసిన పనికి వైకుంఠంలో ఉండడానికి పనికిరారు, మానవ జన్మ ఎత్తండి అని. ఈ కలకలం విన్న అయ్యవారు బయటకి వచ్చేసరికి జరగాల్సిన ప్రమాదం జరిగిపోయింది. ఇప్పుడేం చేయాలి? కాళ్ళమీద పడేసరికి విష్ణువు చెప్పాడు – అబ్బాయిలూ మీరు చేసిన పని మంచిదా చెడ్డదా అనేది అలా ఉంచితే మీకిచ్చిన శాపం తిరుగులేనిది ఎందుకంటే శాపం ఇచ్చినవారు – బ్రహ్మవేత్తలైన ఈ మహర్షులు. దాన్ని నాతో సహా జగత్తులో ఎవరూ మార్చలేరు. అయితే నాకు కూడా మానవ జన్మ ఎత్తే పని ఉంది కనక మూడు జన్మలు నాకు శతృవులుగా కానీ పది జన్మలు స్నేహితులుగా గానీ ఉండవచ్చు. ఏది కావాలో తేల్చుకోండి అని చెప్తాడు. పది మానవ జన్మలు – చీమూ, రక్తం, అనేకానేక అశుద్ధాలతో కూడినవి - ఎత్తలేము, మూడే చాలు అని కోరుకుంటారు. అలా వీళ్ళు మొదటి జన్మలో పుట్టినది హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా.

హిరణ్యాక్షుడు చిన్నవాడు. హిరణ్యకశిపుడు పెద్దన్న.  మొదటినుంచీ విష్ణువంటే పడదు. హిరణ్యాక్షుడికి తన బలం చూసుకుని గర్వం. అందర్నీ జయించాక ఇంకా భుజాల తీట తీరలేదు. అందువల్ల కొత్త కొత్త వార్ని వెతుకుతూ బయల్దేరాడు. అల బయల్దేరిన హిరణ్యాక్షుడు వరుణుడి దగ్గిరకి వెళ్ళి యుద్ధానికి రమ్మని పిలిచాడు. అప్పుడు వరుణుడు చెప్పే సమాధానమే ఈ పద్యం – పోతన రాసిన భాగవతం మూడో స్కంధంలోనిది.

చ.
మనమున శాంతిఁ బూని నియమంబున సంగర ముజ్జగించి యే
ననయము నున్నవాఁడ నిపుడాహవకేళిఁ జరింపరాదు నీ
ఘన భుజ విక్రమస్ఫురిత గాఢ విజృంభణమున్ జయింపఁ జా
లిన ప్రతివీరు లెవ్వరును లేరు ముకుందుడు దక్క నెక్కడన్.................[పోతన భాగ. 3-621]

నేను ప్రశాంతమైన మనస్సుతో (మనమున శాంతిబూని) యుద్ధం చేయకూడదనే (సంగర ముజ్జగించి) నియమంతో ఉన్నాను. ఇప్పుడు యుద్ధం చేయకూడదు (ఆహవకేళి జరింపరాదు). అయితే నీ భుజబలం యొక్క ఆటోపాన్ని జయింపగల (ఘన భుజ విక్రమస్ఫురిత గాఢ విజృంభణమున్) ప్రతివీరులు ఎక్కడా లేరు, ఒక్క విష్ణువు తప్ప (ముకుందుడు దక్క నెక్కడన్).

అయితే హిరణ్యాక్షుడికి కోపం వచ్చి అడుగుతాడు. ఎక్కడున్నాడు ఆ విష్ణువు చూపించు అని. వరుణుడు వీణ్ణి వదిలించుకోవడానికి చెప్తాడు – ఆయన వైకుంఠంలో ఉంటాడురా అబ్బాయి. నీలాంటి వాళ్ల తాట వలుస్తూ ఉంటాడు వీలున్నప్పుడల్లా; వెళ్ళి ఆయన్ని చూడు, అని. సరే అని వాడు వెళ్లబోతూంటే వెనకనుంచి రెచ్చగొడుతూ హెచ్చరిస్తాడు మరోసారి. కయ్యం సంగతి దెయ్యానికి తెలుస్తుంది, ఆ శ్రీహరికే చెప్పుకో కానీ ఆయనతో దెబ్బలాటపెట్టుకుంటే నువ్వు చచ్చాక నీ శరీరాన్ని కుక్కలు తింటాయి సుమా, ఆ తర్వాత ఏమౌతుందో చెప్పడం దేనికీ అని. గర్వం అనేది మనసులో ఉన్నంతవరకూ కళ్ళు కనిపించవు కదా అందువల్ల హిరణ్యాక్షుడు వెంఠనే వైకుంఠానికి బయల్దేరతాడు. దారిలో నారదుడు కనిపించి మరోసారి చెప్తాడు – ధరణిని ఉద్ధరించడానికి శ్రీహరి ఇప్పటికే వరహావతారంలో ఉన్నాడు, వైకుంఠం దాకా వెళ్లనవసరం లేదు. ఫలానా చోటికి వెళ్ళావంటే నీకు కావాల్సిన యుద్ధం చులాగ్గా జరుగుతుంది ఆయనతో.

అక్కడకి వెళ్ళాక విష్ణువు చేతిలో చావడం, ఆ చావు తెలిసాక హిరణ్యకశిపుడు తపస్సుచేసి వరాలు కోరుకోవడం మనకి తెల్సిందే. అయితే అన్న తపస్సు చేసాక బ్రహ్మదేవుడు కనిపిస్తే విష్ణువు పరమ మోసగాడు ఏ రూపంలో వస్తాడో తెలియదు కనక భూమ్మీద, ఆకాశంలో, నీళ్ళలో (తమ్ముణ్ణి నీళ్లలో వరహావతారంలో చంపాడు కదా) ఇంట్లో, బయటా, పొద్దున్నా, రాత్రీ, ప్రాణం ఉన్నచేత దానితో గానీ ప్రాణం లేనిదానితో గానీ, మానవులతో గానీ జంతువులతో గానీ అలా అన్నీ చేర్చి మరణం రాకూడదు అని కోరుకుంటాడు. అయితే తాను మర్చిపోయినదేమంటే, ఏ చావు అయితే ఎలా రాకూడదని కోరుకున్నాడో ఆ చావు ఎలా రావాలో తానే కోరుకున్నాడు. అదే విధంగా విష్ణువు నృసింహావతారం ఎత్తి వాణ్ణి కూడా సంహరించాడు. మరోసారి వెనక్కి ఆలోచిస్తే మూడు జన్మలు ప్రకారం జయవిజయులు హిరణ్యాక్ష హిరణ్యకశిపులు, రావణ కుంభకర్ణులు, శిశుపాల దంతవక్త్రులుగా పుట్టి విష్ణువుచేత చంపబడ్డారు. అయితే వీళ్లకి మొదటి జన్మలో ఉన్నంత శక్తి (విష్ణువు రెండు అవతారాలు ఎత్తాల్సి వచ్చింది కదా) రెండో జన్మలో ఉండదు (రామావతారం). మూడో జన్మలో శిశుపాలుడి గురించి తెలుస్తుంది కానీ దంతవక్త్రుడి కధ అంత ఉండదు (కృష్ణావతారం). అలా మూడు జన్మలలోనూ విష్ణువుకి శతృవులుగా పుట్టి తిరిగి వైకుంఠం చేరుకుంటారు.

****సశేషం****

Posted in May 2023, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!