Menu Close
Satyam-Mandapati
‘అనగనగా ఆనాటి కథ’ 9
సత్యం మందపాటి

స్పందన

ఏది న్యాయం? ఏది ధర్మం? మనిషి మనుగడకు ఏది అవసరం? నిజమా? ఇజమా? ఏది మనిషిని మనిషిగా బ్రతికించి సమాజానికి ఊపయోగపెడుతుంది? కొన్ని నమ్మకాలు ఎప్పుడు, ఎందుకు, ఎలా మూఢనమ్మకాలుగా మారతాయి? ఇలాటి ఆలోచనలు నాకు 1960 దశకం మొదటినించీ (అంటే నాకు పదహారేళ్ళ వయసు వచ్చినప్పటినించీ) వస్తూనే వుండేవి. అవి నేను గుంటూరులో మా ఇంటి పక్కనే వున్న లైబ్రరీలో నా చిన్నప్పటినించీ చదివిన ఎన్నో ఎన్నెన్నో పుస్తకాల విజ్ఞానంతో వచ్చాయేమో. స్వలాభం కోసం మాత్రమే బ్రతికే మన రాజకీయ నాయకుల మాటల్లో, చేతల్లో మరి మానవత్వానికి సంబంధించిన ఇలాటి సంఘటనలు ఎలా మారిపోతాయా అనే భావన వచ్చాకనే వ్రాసిన కథ ఇది. ఆరోజుల్లో నా కథలు ఎక్కువగా ప్రచురించి నన్ను బాగా ప్రోత్సహించింస పెద్ద పత్రికలు జ్యోతి, యువ మాసపత్రికలు. ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ వారపత్రికలు. నన్ను ఇన్ని దశాబ్దాలుగా రచయితగా నిలబెట్టి, ఇప్పటిదాకా మీతో నా సాహిత్య ప్రయాణం చేయటానికి కారకులు. ఆ పత్రికల సంపాదకవర్గ మహానుభావులందరికీ అనవరతం కృతజ్ఞ్నుడిని.

అరణ్యకాండం!

(ఈ కథ ‘జ్యోతి’ మాసపత్రిక, ఏప్రిల్ 1979 సంచికలో ప్రచురింపబడింది)

Aranyakaamdam Story Image

కృష్ణమూర్తి మళ్ళీ ఎన్నికల్లో నుంచుంటున్నాడన్న వార్త ఆ ఊళ్లో ఎవర్నీ ఆశ్చర్యపరచలేదు. అంతకుముందు ఐదేళ్ళుగా కృష్ణమూర్తి పంచాయితీ బోర్డు ప్రెసిడెంటుగా వున్నాడు. ప్రజలలో పలుకుబడి కూడా వున్నవాడు. తన స్వార్థం అసలేమాత్రం చూసుకోకుండా ఆ ఊరి కోసం చాల కష్టపడి, ఎన్నో ముఖ్య సదుపాయాలు ఏర్పాటుజేసి అందరిలో తలలో నాలుకలా వున్నాడు. అందుకే ఎంతోమంది అతను మళ్ళీ ఎన్నికల్లో నుంచుంటే బాగుంటుంది అనుకున్నారు. కానీ ఈమధ్య కృష్ణమూర్తి జీవితంలో జరిగిన ఒక సంఘటన వల్ల కొంతమంది మాత్రం అతను ఇక రాజకీయాల్లోనేకాక, ఇతరత్రా ఊళ్ళోని మరేవిధమైన కార్యక్రమాల్లోనూ తలదూర్చడని అనుకున్నారు.

కృష్ణమూర్తి జీవితంలో జరిగిన ఆ సంఘటన అతన్నే కాదు, ఆ ఊరినే కదిలించి వేసింది. అసలా సంఘటన జరగటానికి ముఖ్యకారణాలు రెండు. రాజేశ్వరి అందంగా వుండటం ఒకటి. ఆమె వయసులో వుండటం రెండవది.

రాజేశ్వరి కృష్ణమూర్తి భార్య. కృష్ణమూర్తి కన్నా దాదాపు పదిహేనేళ్ళు చిన్నది. రాజేశ్వరి అంత అందంగా వుండటానికి కారణం కొనదేరి పొడుగ్గా వుండే ఆమె ముక్కు, లేత తమలపాకులంత పలచని ఆమె ఎర్రటి పెదవులు.

సూర్యారావు మరి అంత అందాన్ని ఎదురింట్లో వుంచుకుని, ఊరికే కూర్చోలేకపోయాడు. కృష్ణమూర్తి తన రాజకీయాల్లో పడి, భార్య సంగతి పట్టించుకుపోవటం చూసి, తను ఒక అడుగు ముందుకు వేశాడు సూర్యారావు.

అలా అని రాజేశ్వరి శీలాన్ని శంకించకూడదు మనం. అలనాటి పతివ్రతల్లోకూడా ఏమయినా మచ్చ వుందేమోగానీ, రాజేశ్వరి మాత్రం నిప్పులాంటిది. సూర్యారావునే కాదు మరెవ్వరినీ కన్నెత్తి చూడలేదు. చూడదు. కానీ రాజేశ్వరి అమాయకురాలు కూడా కావటం చేత సూర్యారావు పని మరింత సులభం అయింది.

ఒకరోజు రాత్రి కృష్ణమూర్తి ఏదో పని మీద పొరుగూరు వెళ్ళిన సమయంలో, చుట్టుపక్కల ఎవరూ లేరని నిర్ధారణ చేసుకుని రాజేశ్వరి ఇంట్లో చటుక్కున దూరాడు సూర్యారావు. ఏమీ అర్ధంకాక బిత్తరపోయి చూస్తున్న రాజేశ్వరిని బలవంతం చేయబోయాడు. ఆమె పెద్దగా అరుస్తూ పెనుగులాడింది.

ఇంటి లోపల జరుగుతున్న గోలకి ఇంటి బయట కొంతమంది జనం చేరారు. లోపల ఏం జరుగుతున్నదో, ఎవరెవరున్నారో ఎవరికీ అర్ధం కాలేదు. చివరికి అనుమానం మరింతయి ఇద్దరు బలవంతులు తలుపులు పగలగొట్టి లోపలకు అడుగుపెట్టారు. మెరుపులా బయటికి దూకి, చీకట్లో ఎటో మాయమైన సూర్యారావు మరిక ఆ ఊళ్లో కనపడలేదు. అతని మేనమామగారి ఊళ్లో మరదలు పిల్లతో సుఖంగా వున్నాడని తర్వాత తెలిసింది.

తలుపులు పగలగొట్టిన పెద్దల్ని లోపలి దృశ్యం నిశ్చేష్టుల్ని చేసింది. రాజేశ్వరి బట్టలు అన్నీ చింపివేయబడి గది మధ్యలో నగ్నంగా పడివుంది. తమలపాకులంత పలుచని ఎర్రటి పెదవులు చిట్లి రక్తం కారి మరింత ఎర్రగా వున్నాయి. కొనదేలి పొడుగ్గా వుండే ముక్కు గోళ్ళ గుర్తులతో ఎర్రబడింది. భుజాల మీదా, మెడ మీదా, స్థనాల మీదా... దాదాపు ప్రతిచోటా గోళ్ళ గుర్తులో, పంటి గుర్తులో ఏవో ఒకటి వున్నాయి. ఆమెకు మాత్రం స్పృహ లేదు.

అందరినీ బయటకు పంపించిన ఒక పొరుగావిడ ఇరుగావిడ సహాయంతో రాజేశ్వరికి ఉపచార్యలు చేసి స్పృహ తెప్పించింది. పొరుగూరినించీ ఆలస్యంగా ఇంటికి వస్తున్న కృష్ణమూర్తికి దారిలోనే అతని భార్య గురించి రకరకాల మాటలు వినబడ్డాయి. వెంటనే ఇంటికి వచ్చి పరిస్థితి చూసి శిలలా స్తంభించిపోయాడు. స్పృహ వచ్చిన రాజేశ్వరి చేతుల్లో ముఖం దాచుకుని బావురుమంది.

సూర్యారావు రాజేశ్వరిని చెరచబోతే ఆమె బాగా పోట్లాడి పెనుగులాడిందనీ, అతను ఏమీ చేయకముందే తలుపులు పగులగొట్టటంతో అతను పారిపోయాడనీ, ఈ హడావిడికి ఆమె స్పృహతప్పి పడిపోయిందనీ, ఆమె శీలానికి ఏమీ భంగం కలగలేదనీ కొంతమంది అన్నారు.

లేదు, సూర్యారావు ఆమెను బలవంతంగా అనుభవించాడనీ, ఆమె పెనుగులాడినా లాభం లేకపోయిందనీ, చివరికి ఏమీ చేయలేని పరిస్థితిలో ఆమె అతనికి లొంగిపోయిందనీ అన్నారు మరి కొంతమంది.

అసలు రహస్యం అది కాదనీ, ప్రజాసేవలో ముణిగిపోయిన కృష్ణమూర్తి వల్ల రాజేశ్వరికి ఏమాత్రం శరీర సుఖం లేకపోవటంతో సూర్యారావుని మరిగిందనీ, ఇది రోజూ జరిగే భాగోతమేననీ, ఆరోజు ఈరకంగా బయటపడేసరికీ ఆమె బట్టలు చింపుకుని, ఒళ్ళు గీరుకుని అందర్నీ నమ్మించటానికి ఆలా నాటకమాడిందనీ మిగతా వాళ్ళు అన్నారు.

ఏది ఏమైనా చాలమంది రాజేశ్వరి చెడిపోయిందనే నిశ్చయానికి వచ్చారు. ఎంతమంది ఎలా అన్నా, కృష్ణమూర్తి మాత్రం చేతుల్లో తల దాచుకుని ఏడుస్తున్న రాజేశ్వరిని, తన కౌగిట్లో భద్రంగా దాచుకుని లాలించాడు.

రాజేశ్వరి శారీరకంగా మామూలు మనిషి కావటానికి నెల రోజుల పైనే పట్టింది. కానీ మానసికంగా బాగా దెబ్బతిన్నది. ఎప్పుడూ ఏదో ఆలోచన. పరాకు. కృష్ణమూర్తికి ఆమెను ఎలా ఓదార్చాలో అర్ధంగాక, దగ్గరకు తీసుకుని హృదయానికి హత్తుకునేవాడు.

ఈ పరిస్థితుల్లో మళ్ళీ పంచాయతీ ఎన్నికలు వచ్చాయి. కృష్ణమూర్తి మళ్ళీ ఎన్నికల్లో నుంచుందామనే నిర్ణయానికి రావటమేగాక, అలా అని ప్రకటన కూడా ఇచ్చాడు. ఆ ఊళ్లో కృష్ణమూర్తికి చాల మంచివాడనీ, గుణవంతుడనీ, నిజాయితీపరుడనీ పేరు వుంది. అదీగాక అతను ప్రస్తుతం కూడా ప్రెసిడెంటే కనుక ఈసారి కూడా తప్పకుండా ఎన్నికవుతాడని అనుకున్నారు. అలా అనుకున్న వారిలో చాలమంది రామదాసు తన ఎన్నికల ప్రచారం మొదలుపెట్టగానే తమ అభిప్రాయాలు మార్చుకున్నారు.

రామదాసు కృష్ణమూర్తికి ప్రత్యర్థిగా ఎన్నికల్లో నుంచున్నాడు. కృష్ణమూర్తికి ఆ ఊళ్ళో ఎంత మంచి పేరుందో, రామదాసుకీ అంతే మంచి పేరుంది. అదీగాక రామదాసు రోజూ గుళ్ళో రామాయణం మీద ఉపన్యాసాలిచ్చి ఆ ఊరి వారిని బాగా ఆకర్షించిన వ్యక్తి. అతను రామాయణాన్ని కాచి వడబోసిన వ్యక్తి. ఆ ఊరి ప్రజల మీద రామాయణ ప్రభావం అంత ఎక్కువగా ఉండటానికి కారణం రామదాసు. అతని వాగ్ధోరణి.

అలాంటి రామదాసు కృష్ణమూర్తికి ప్రత్యర్థిగా నుంచున్నాడు. అంతేకాక అతని ప్రచార ధోరణి కూడా ప్రజలలో ఒక కలకలం లేపింది. శ్రీరాముడు వనవాసం తర్వాత రాజు అయినప్పుడు అందరూ అంగీకరించిన కారణం అతని వ్యక్తిత్వమే అని చెప్పాడు. వ్యక్తిత్వం లేని మనిషి ఏనాడూ నాయకుడు కాలేడన్నాడు. మనిషికి శీలం ముఖ్యం అన్నాడు. చెడిపోయిన భార్యతో కాపురం చేస్తున్న వాడికి శీలం ఎలా వుంటుందన్నాడు. శీలం లేని పెద్దమనిషి ప్రజలకు నాయకుడెలా కాగలడన్నాడు. అసలలాటి వాడిని ప్రజలే ఎన్నికలలో తిరస్కరించాలన్నాడు. నేను చెప్పేదేముంది, మీరే ఆలోచించుకోండి అన్నాడు.

రామదాసు మాటలు ఆ ఊరి ప్రజల్లో బాగానే పనిచేశాయి. చాలమందికి అతని వివరణ బాగా నచ్చింది. నచ్చని వాళ్ళు మాత్రం అతనికెదురు తిరిగారు. అతని భార్య కావాలని సూర్యారావుతో పోలేదు కదా అన్నారు. అతను బలవంతం చేస్తుంటే ఆ నిస్సహాయురాలు ఏం చేయగలదన్నారు. ఆవిడ తప్పేమిటన్నారు. అసలింతకీ ఆవిడ శీలం పోయిందన్న దానికి ఋజువేమిటన్నారు. సూర్యారావు ఏమీ జరక్కుండానే పారిపోయాడు కదా అన్నారు. రామదాసుని నిలదీసి ఈ ప్రశ్నలన్నీ అడిగారు.

అంతా విని రామదాసు వాల్మీకి మహర్షిలా నవ్వాడు. నవ్వి నెమ్మదిగా అన్నాడు. “ఆనాడు సీతాదేవికి జరిగిందేమిటి? ఆవిడ ఇష్టపడి రావణుడితో వెళ్ళలేదు కదా! అతను బలవంతంగా తీసుకుపోతుంటే అసహాయ స్థితిలో ఏం చేయగలిగింది? ఆవిడ తప్పేం చేసింది? సీతాదేవి శీలం పోయిందనటానికి ఋజువులు ఏమీ లేవు కదా! అవునా, కాదా?”

“అవును నిజమే” వాళ్ళు అంగీకరించారు.

“మరి శ్రీరామచంద్రుడు ఒక చాకలి వాడి మాటలు విని సీతాదేవిని ఎందుకు వదిలేశాడు? తన వ్యక్తిత్వం కోసం. తనకు సీతాదేవిపై వున్న ప్రేమానురాగాలని, నమ్మకాన్ని కూడా ప్రక్కకు నెట్టి, ఆవిడని అడవుల్లో దించేసి, తను రాజ్యాన్ని పాలించి రామరాజ్యం స్థాపించి పేరుపొందాడు. అవునా, కాదా? అలాటి మహా పురుషులు పుట్టిన ఈ దేశంలో మీరు ఇలాటి కృష్ణమూర్తుల పరిపాలన ఎలా అంగీకరిస్తారు? ఎన్నికల్లో అతన్ని ఓడించండి. అది మీ ప్రధమ కర్తవ్యం” రామదాసు గట్టిగా నూరిపోశాడు.

ఎక్కువమంది ప్రజలకు రామదాసు వాదన సబబుగానే వున్నట్టు కనపడింది. కొద్దిమందికి మాత్రం ఆ వాదన ఎబ్బెట్టుగా కనపడింది.

“తనకే మనసా వాచా సర్వస్వం అర్పించిన భార్య మీద కన్నా రాముడికి రాజ్యం మీద కాంక్షే ఎక్కువగా కనపడుతున్నది. కాని కృష్ణమూర్తిగారు అలా కాదు. ఆయనకి తన భార్య వల్ల తప్పేమీ లేదని గట్టిగా తెలుసు. తనకే మనసా వాచా సర్వస్వం అర్పించిన భార్య నిరపరాధి అయినప్పుడు, ఆయనగానీ, మనంగానీ ఆవిడనెందుకు శిక్షించాలి? హృదయపూర్వకంగా ప్రేమించిన మనిషిని, సహధర్మచారిణిని ఎవరో ఏదో కూసిన అర్ధంలేని మాటల కోసం వదులుకోవలసిన అవసరం లేదు. అంతేకాక నిస్వార్ధంతో ఈ ఊరికి ఎంతో మంచి చేసిన ఆయన ఎన్నికల్లో గెలిచి తీరాలి” అని కూడా వాదించారు.

కృష్ణమూర్తి కూడా కర్ణాకర్ణిగా అన్ని వాదనలూ విన్నాడు. రాజేశ్వరి వెక్కివెక్కి ఏడుస్తున్నప్పుడల్లా ఆమెను దగ్గరికి తీసుకుని, “రాజీ! నువ్వే నా ప్రాణం. ఈ పదవులు వస్తే వస్తాయి. లేకపోతే లేదు. కానీ నిన్ను మాత్రం నేను వదులుకోలేను” అనేవాడు కృష్ణమూర్తి.

“కానీ… నేను… నేను….” బావురుమనేది రాజేశ్వరి. “అదొక పీడకల. మరచిపో” అనేవాడు అతను, తన విశాల హృదయానికి ఆమెను హత్తుకుంటూ. తర్వాత నెల రోజుల్లో ఎన్నికలు జరిగాయి.

రామదాసు తన ఎన్నికల ప్రచారం అదే పంథాలో ఉథృతంగా కొనసాగించాడు. కృష్ణమూర్తి మాత్రం తను ఆ ఊరిని అంతవరకూ ఎంత అభివృద్ధి చేశాడో, మళ్ళీ అతన్నే గెలిపిస్తే ఇంకా ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తాడో చెప్పేవాడు.

చివరికి ఎన్నికల రోజు రానే వచ్చింది. అందరూ ఉత్సాహంగా ఎన్నికల్లో పాల్గొన్నారు. రామదాసు ఎన్నికల్లో ఎన్నడూ రానంత అత్యథిక మెజారిటీతో ఘన విజయం సాధించాడు.

కృష్ణమూర్తికి డిపాజిట్ కూడా దక్కలేదు!

Posted in May 2023, కథలు

2 Comments

  1. హరి మద్దూరి

    మాములుగా కథల్లో చివరికి ‘ధర్మమే జయించింది, సత్యమే జయించింది’ అని చూపిస్తారు. మీరు దాన్ని తిరగదిప్పి అసత్యమే జయిస్తుంది అని లోకం నిజం పోకడ చూపారు.
    ఊహించని మలుపు ఉండబట్టే కథ బాగా వెలిగింది!
    ఇది చదువుతుంటే, ఈనాడు కూడా అన్నిచోట్లా ఎన్నికలు ఇలాగే ఉన్నాయనిపిస్తోంది!
    లోకులు పలుగాకులు! ఎక్కువ కాకులేటు వెళ్తే అదే రైటు మార్గం!

    • సత్యం మందపాటి

      ధన్యవాదాలు హరిగారు. రోజులు మారాయి అంటారుగానీ, మంచి కోసం మనుష్యులు మారటం లేదు మరి. మీకీ కథ నచ్చినందుకు సంతోషం.

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!