Menu Close
Lakshmi-Iyer
సనాతన భారతీయం
ఆచార్య లక్ష్మి అయ్యర్

రాణి వేలు నాచ్చియార్

Velu-Nachiyar
Photo Credit: WikiBio

భారతీయ స్వాతంత్ర పోరాటంలో పురుషులతోపాటు ఎంతో మంది స్త్రీలుకూడా తమ ప్రాణాలకు తెగించి భరతావనికై, దేశ విడుదలకై, క్రూర బ్రిటిష్ సైనికులకు ప్రాణత్యాగాలు చేసి మాతృ భూమి రక్షణకై కొన ఊపిరి వరకు పోరాడారు. కానీ, అలాంటి నారీ మణులలో కొందరు మాత్రమే గుర్తించబడ్డారు. ఎంతోమంది గుర్తు తెలియని రాణులు, వీరాంగనలు, సామాన్య స్త్రీ సమర యోధుల పేర్లు ఇంతవరకు భారతీయులకే తెలియక పోవడం విచార దగ్గ విషయం. మన వేమన గురించి సి.పి. బ్రౌన్ ద్వారానే తెలుసుకున్నాం. అలాగే భారత దేశపు ప్రాంతీయాధిపతులు కొన్ని వేల సైనికులు దేశ స్వాతంత్రానికై ప్రాణ తర్పణం గావించారు. ఉత్తర భారత దేశంలో అల్లూరి సీతారామరాజు పేరు ఇప్పటి వరకు ఎవరికీ తెలియదన్నది పచ్చి నిజం. అందుకే సాహిత్య వారధి ద్వారా మన దేశాన్ని గురించి ఉత్సుకతో మనం ముందు తెలుసుకోవాలి. ఈ సందర్భంగా రాయప్రోలు సుబ్బారావు గారి కవితను ఓ సారి మననం చేసుకొని వ్యాసాన్ని చదువగలరు.

ఏ దేశమేగినా ఎందు కాలెడినా
ఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనినా,
పొగడరా నీ తల్లి భూమి భారతిని,
నిలపరా నీ జాతి నిండు గౌరవము.

ఏ పూర్వ పుణ్యమో, ఏ యోగ బలమో
జనియించినాడ వీ స్వర్గఖండమున
ఏ మంచిపూవులన్ ప్రేమించినావో
నిను మోచె ఈ తల్లి కనక గర్భమున.

ఈ కవితలో వర్ణించిన ఆ భారత మాత స్వర్ణ గర్భం లో జన్మించి ఆ తల్లిని కాపాడేందుకై అసువులను బాసిన ప్రథమ భారత రాణి వేలు నాచ్చియార్. క్రీ.శ.1730 సంవత్సరము తమిళనాడు కు చెందిన రామనాథపురం సంస్థానాన్ని ఏలిన మహారాజు సెల్ల ముత్తు విజయ రఘునాథ సేతుపతి, చక్కంతి ముక్త నాచ్చియార్ దంపతులకు ఏకైక పుత్రిక గా జన్మించింది. తనకు కలిగిన ఏకైక సంతానాన్ని ఒక యువరాజు లాగా రాజు పెంచారు. సకల విధములైన భార యుద్ధ కళలతో బాటు పలు భారతీయ భాషలను కూడా నేర్పించారు. ఆ కాలంలోనే ఒక స్త్రీ పురుషుడికి సమానంగా ధైర్యశాలిగా స్వేచ్ఛగా అన్నీ కళలను నేర్చుకుని దేశానికై ప్రథమ సమరయోధురాలుగా నిలిచిన వేలునాచియార్ చిన్నప్పటినుండే సిలoబం(దక్షిణ ప్రాంతానికి చెందిన ఓ యుద్ధ కళ, కేరళ తమిళ నాడు లలో ప్రఖ్యాతం), ఇనుప గొలుసులతో ప్రత్యర్థిని ఎదిరించే కళ, కత్తి సాము, కర్ర సాము ఈటెలు విసరడం, గుర్రపు సవారీ, ఏనుగు సవారి లాంటి యుద్ద నైపుణ్య కళలను మరియు ఎన్నో భారతీయ భాషలను నేర్చుకున్న భారత అవని ముద్దుబిడ్డ వేలు నాచ్చియార్. ఆంధ్రదేశపు రుద్రమదేవిలా మగవాడి కంటే దీటుగా సకల కళలలో ఆరితేరిన రాణి తమిళం, ఉర్దూ, సంస్కృతం, కన్నడ, ఫ్రెంచ్, ఆంగ్లేయ భాషలలో కూడా ప్రవీణురాలు.

1746లో శివగంగై ప్రాంతాన్ని ఏలిన రాజు ముత్తు వడుగ నాద దేవర్ గారికి ధర్మపత్నిగా పట్ట మహిషి స్థానాన్ని పొందారు. వీరికి ఒక కూతురు కలిగింది ఆమె పేరు వెళ్లచ్చి నాచ్చియార్. రాణి యొక్క భర్త ముత్తు వడుగ నాద దేవర్ శివగంగైను పరిపాలించేవారు. అప్పుడు ఆర్కాట్ నవాబుకు కప్పము చెల్లించనందున ఆ నవాబు ఆంగ్లేయులతో చేయి కలిపి కలిసి కుట్ర చేసి రాణి భర్తపై అధర్మ యుద్ధానికి పాల్పడి చంపి వేశారు. 1772లో దైవ దర్శనం చేయడానికై వెళ్ళిన రాజును కాళయార్ గుడిలో పూజ చేస్తున్నపుడు హఠాత్తుగా పొంచి వుండి అదే ప్రాంగణంలో పొదలలో దాగుకున్న ఆంగ్లేయ సైనికులు నిరాయుధుడైన రాజుపై దాడికి పాల్పడి ఆయనను నిర్దాక్షిణ్యంగా చంపివేశారు. ఈరోజు కూడా ఆ మందిరము తమిళనాడులో కాళయార్ సంగ్రామ మందిరంగా పిలువ బడుతున్నది . ఈ హఠాత్ మరణాన్ని విన్న రాణి దుఃఖానికి అంతులేక పోయింది. రాణికి రెండే రెండు మార్గాలు కనబడ్డాయి. ఒకటి కుటుంబ ప్రాచీన పద్ధతుల ననుసరించి భర్తతో పాటు సతిగా మారడం అంటే సతీసహగమనం చేయడం లేదా శివ గంగ రాజ్యపు ఉత్తరాధికారిగా రాణిగా మారి భర్తను చంపిన బ్రిటిష్ వారిపై పగ తీర్చుకోవడం ప్రజలను కాపాడడం. రాణి రెండో మార్గాన్ని అనుసరించారు. భర్త మరణించిన కబురుని విని రాణి తన కూతురుని పిలుచుకొని ప్రధాన సేనాపతి తాండవ రాయునితో తన మరుదు సహోదరుల సైన్య సహాయంతో విరూపాక్షి ఆలయంలోని కోటలో తలదాచుకున్నారు.

అక్కడ కొద్ది రోజులు ఉండి హైదర్ అలీ (టిప్పు సుల్తాన్ తండ్రి ) ని కలిసి ఉర్దూ భాషలో ఆంగ్లేయులు ఎలా తుద ముట్టించాలా అని ఆయనతో మాట్లాడి వివరించారు. ఆమె ఉర్దూ భాష పరిజ్ఞానాన్ని, దేశ భక్తికి సంబంధించిన ఉర్దూ కవితలను యొక్క విన్న హైదరాలి ఆశ్చర్య చకితుడయ్యాడు. ఆమెకు యుద్ధంలో సహాయపడతానని మాటిచ్చాడు. రాణి వేలు నాచ్చియార్ దిండుకల్ కోట, విరూపాక్షి కోట అయ్యంపాళం కోట అని పలుచోట్ల రహస్యంగా ఆంగ్లేయ సైనికులకు తెలియకుండా మార్చి మార్చి ఉంటూ ప్రజలను కలుస్తూ తమ ప్రాంతపు సైన్యాధిపతులైన మరుదు సహోదరులను కలిసి వారి సహాయంతో తన భర్త ఏలిన శివగంగై ప్రాంతపు ప్రజలను ఒకటి చేసి బ్రిటిష్ సైన్యానికి శివగంగై ప్రజలను ఒకే సైన్యంగా తయారు చేసి స్వాతంత్ర సమరయుద్ధం లో బ్రిటీష్ కు ఎదురుగా దూకారు. 1780 సంవత్సరము జూన్ నెలలో దిండుకల్ నుండి ఒక సేనను ఆంగ్లేయులు ఆక్రమించుకున్న తన కోట వైపు పంపారు. హైదరాలి ఆమెకు సహాయంగా 5000 గుర్రాలను 5000 వీరులను ఫిరంగి దళాలను పంపాడు. వైగై నది ద్వారా చోళ బంధన ప్రాంతాన్ని త్రిభువనం, ముక్తేండం మొదలగు నగరాలను జయించుకుంటూ మానా మధురై నగరం లో యుద్ధములో ఆరితేరిన వీరులతో పాటు ప్రజలను కూడా కలుపుకొని బ్రిటిష్ సైనికులను యుద్ధంలో తరిమికొట్టి గెలిచారు. ఫలితంగా రాణి క్రీస్తు శకం 1780లో తన 50 వ ఏట భర్త గారి కోట అయిన శివగంగ కోటను చేజిక్కించుకొని తిరిగి రాణిగా పట్టాభిషిక్తులయ్యారు.

Kuyili
Photo credit: WikiBio

ఆవిడ కు అంగరక్షకురాలు ఒక అటవీక జాతికి చెందిన కుయిలీ అనే మహిళ. రాణి కి చాలా విశ్వాసపాత్రురాలైన ఆమె సహాయంతో ఆంగ్లేయులను తరిమికొట్టడానికై రాణి ఒక మహిళా శక్తిని ఉదయాల్ పడై (ఉదయించే సైన్యం) అనే పేరుతో వాడవాడలో వీరనారీమణులను తయారుచేసి యుద్ధానికి సంబంధించిన కళల లో తర్ఫీదు ఇప్పించారు . ఆవిడ తయారు చేసిన నారీ సేన భారతదేశపు స్వతంత్ర సమరపు మొట్టమొదటి మహిళా సేన. కోటను గెలుచుకున్న తర్వాత రాణి నవరాత్రి పూజ పేరున కొంతమంది తన సైనికులను మహిళా వేషధారులిగా చేసి విజయదశమి రోజున అదే దేవాలయంలో పూజ పేరుతో కాళికా పూజ ఉత్సవం అని చెప్పి అంగరంగ వైభవంగా ఉత్సవాన్ని ప్రారంభించారు. విజయదశమి రోజు రాణి తన వ్యూహం ప్రకారము సైనికులను తయారుగా ఉంచారు. భర్త మరణించిన అదే చోట ఆయనను చంపిన ఆంగ్లేయ కెప్టన్ జోసెఫ్ స్మిత్ దేవాలయానికి పక్కన తన మందు గుండు సామగ్రిని వుంచి రాణిని అదే దేవాలయ ప్రాంగణంలోచంపాలని వేచి వున్నాడు. కానీ ముందే దీన్ని వూహించిన రాణి అదే చోట అతనిని చంపి తన ప్రతీకారాన్ని నెరవేర్చుకున్నారు. ఆ విజయదశమి ఉత్సవంలో పొంచి ఉన్న కుయిలీ, ఆంగ్లేయులు యుద్ధానికై వుంచిన ఆయుధ శాల లోపలికి వెళ్లి తను తానే తగలబెట్టుకొని ఆ ఆయుధ శాలను కూల్చివేసిన ప్రథమ భారతీయ ఆత్మఘాత వీరవనిత(First suicide bomber). ఇవన్నీ భారత దేశంలో ఉన్న వారికి అందరికీ తెలియాలని ఈ వ్యాసం రాయబడ్డది.

తర్వాత ఓసారి రాణి, బ్రిటీషుల మధ్య జరిగిన యుద్ధంలో దేశద్రోహిగా మారి బందీగా చిక్కికాళ్ళపై బడ్డ కెప్టెన్ బాండ్ ను చంపకుండా సనాతన భారత శరణాగత రక్షణ తత్వాన్ని అనుసరించి ఇలా చెప్పి వదిలేశారు “మా తల్లి భారత దేశము, ఇక్కడ మీరు అతిధిగా ఉండవచ్చు, కానీ మాకు యజమానిగా ఎప్పుడూ ఉండలేరు”- ఈ కథనం భారతదేశ స్వాతంత్ర సమర చరిత్రలోని ప్రప్రథమ వాక్యం. అంతేకాదు 1780 నుండి 1783 వరకు మూడు సంవత్సరాలు ఆవిడ మాత్రమే పరిపాలించారు. 1793లో తన మనవరాలి మరణం వల్ల దుఃఖితురాలై కొద్ది రోజులు విరూపాక్షి భవనములో ఉన్నారు. ఆ మహారాణి డిసెంబర్ 25 న 1796 పరమపదించారు. శివ గంగై కోటను పరిపాలించిన రాజులలో మొదటి స్త్రీ ఈవిడే అనేది గర్వించదగ్గ విషయం. వేలు నాచ్చియార్ అనే పేరుతో శివగంగై జిల్లాలో శూర కులం గ్రామములో 60 లక్షల రూపాయల ఖర్చుతో వీరాంగని వేలు నాచ్చియార్ పేరుపై ఒక స్మారక భవనం తమిళనాడు పూర్వ ముఖ్యమంత్రి కుమారి జె. జయలలితగారు 2014లో కట్టించారు. డిసెంబర్ 31, 2008లో రాణి త్యాగానికి గుర్తుగా భారత ప్రభుత్వం ఓ తపాల బిళ్ళను విడుదల చేసింది. ఇలాంటి దేశ భక్తులు భారతం లో కోకొల్లలు.

****సశేషం****

Posted in May 2023, వ్యాసాలు

1 Comment

  1. వెన్నెలకంటి సుబ్బు నారాయణ

    నిజంగా ఇటువంటి వెలుగులోకి రాని వీర వనితలు ఎందరో ఉన్నారు. వారిని వెలుగులోకి తెచ్చే ప్రయత్నం నిజంగా అభినందనీయం.

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!