Menu Close
వీక్షణం సాహితీ గవాక్షం-128 వ సమావేశం
-- వరూధిని --
vikshanam-128

వీక్షణం-128 వ సాహితీ సమావేశం ఏప్రిల్ 8, 2023 న  ఆన్ లైనులో జూమ్ సమావేశంగా వీనులవిందుగా జరిగింది. ఇందులో అమెరికా, భారతదేశం, ఇతరదేశాల నుంచి అతిథులు పాల్గొన్నారు. ముందుగా వీక్షణం సంస్థాపక అధ్యక్షులు డా.కె.గీతామాధవి ప్రారంభోపన్యాసం చేసి, సభలోని వారందరికీ పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ సభలో ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీమతి వాణి నల్లాన్ చక్రవర్తి గారు "లలితసంగీతంలో భావసౌరభం" అనే అంశంతో పాటల్ని జతచేసి అత్యద్భుతంగా ప్రసంగం  చేసారు. శ్రీమతి వాణి నల్లాన్ చక్రవర్తి గారి నాన్నగారు శతావధాని శ్రీ నల్లాన్ చక్రవర్తుల వెంకటాచార్యులు గారు, అమ్మగారు శ్రీమతి చూడామణి, వీరి మాతామహులు అలనాటి ప్రముఖ వాయులీన విద్వాంసులు శ్రీ కొదమసింహం లక్ష్మణాచార్యులు గారు. ఈ తరం ప్రముఖ గాయకులు కారుణ్య, హేమచంద్రలు స్వయంగా వీరి అన్నయ్య, చెల్లెలి పిల్లలు. వీరు 2015 లో పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి పదవీ విరమణ చేశారు. వీరి ప్రవృత్తి సంగీతం, సాహిత్యం. సంగీతం పట్ల ఉన్న అభిరుచి కలిగిన దేశ విదేశాలలో విద్యార్ధినీ విద్యార్థులకు నేర్పిస్తున్నారు. రేడియో టీవీ లలో బి గ్రేడ్ కళాకారిణిగా అనేక సంగీత సాహిత్య కార్యక్రమాలలో పాలు పంచుకున్నారు. సంగీత సాహిత్యాలపై ఉన్న అనురక్తితో 2021 లో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు.

వాణి గారు తమ ప్రసంగాన్ని ప్రారంభిస్తూ "చతుషష్ఠి కళలలో అత్యంత లలితమైనది సంగీతం అంటే అతిశయోక్తి కాదు. అది శాస్త్రీయమైన లలిత గీతాలైన అసలు ఎటువంటి పాట ఐనా శ్రోతల మనస్సులను అలరిస్తుంది. అందుకే శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణి అన్నారు. పాలు తాగే పసి పాప ఐనా అమ్మ పాడే జోల అర్థం తెలియక పోయినా అమ్మ మెత్తని స్వరానికి పాటలోని లాలిత్యానికే హాయిగా నిద్ర పోతాడు." అంటూ

"భావ సౌరభాలను పంచటంలో నవరసాలను పండించటంలో తేలికగా అర్థం అయ్యే భావ గీతం త్వరగా శ్రోతల మనస్సులను తాకుతుంది. పల్లె పాటలు, మేలుకొలుపు,పవళింపు పాటలు, దంపుడు పాటలు, సంప్రదాయంగా వినిపించే భద్రాచల రామదాసు, అన్నమయ్య పదాలు, హరికథలు, బుర్రకథలు కూడా లలిత గీతాలకు మూలాలు ప్రేరణలు అని చెప్పొచ్చు. ఏ కళకైనా కాలానుగుణంగా మార్పు సహజం. అలానే కొంత శాస్త్రీయత నుంచి బయటకు వచ్చి అత్యంత లలితంగా మారింది భావగీతం. లలిత గీతాలకు పెద్ద పీట వేసింది ఆకాశవాణి. "భక్తి రంజని", "ఈ మాసపు పాట", "దేశ భక్తి గేయాలు", "ఈపాట నేర్చుకుందాం" వంటి కార్యక్రమాల ద్వారా జనాలకు లలితగీతాలను దగ్గర చేసింది." అని కొన్ని లలిత గీతాల్ని రాగయుక్తంగా చక్కగా ఆలపిస్తూ భావాల్ని మనసుకి హత్తుకునేటట్టు పరిచయం చేసారు. అందులో కొన్ని మూర్తి యెన్ సి స్వరపరచిన రాయప్రోలు వారి "నిదురపో", ఎం ఆర్ కె ప్రభాకర్ సంగీతంలో దేవులపల్లి గీతం "గాలితరగల", చిత్తరంజన్ రచన, సంగీతం "మనసున పూచే ", ఎం బాలమురళి గారి "వలపులెలనే", కలగా కృష్ణ మోహన్ "కంటిగడప", కొలిపాక రమామణి "హేమంత" మొ.నవి.

"లలిత గీతాలకు ఒక సిలబస్ తయారు చేసి తెలుగు యూనివర్సిటీ లో డిప్లొమా కోర్స్ ప్రవేశ పెట్టారు శ్రీ చిత్తరంజన్ గారు. నవరసాలకు అనుగుణంగా పాట రూపు దిద్దుకొని గాయకుల మనస్సు ఆ భావాన్ని అన్వయించుకొని పాడినప్పుడే అది శ్రోతల మనసులో రసానుభూతి కలుగజేస్తుంది. త్యాగరాజ స్వామి వంటి వాగ్గేయకారుల రచనలని అదే బాణీ లో పాడాలి. వాటిని మార్చలేము. కానీ లలిత గీతాలకు అటువంటి పరిధులు వుండవు. ఒకే గీతాన్ని వేరు వేరు స్వరకర్తలు వారి హృదయానుగతంగా వేరు వేరు బాణీలు కూర్చవచ్చు. అసలు లలిత గీతం ప్రాణం పోసుకోవాలంటే రచయిత ప్రసవ వేదన తప్పనిసరి." అంటూ కృష్ణశాస్త్రి గారి "ఆకులో ఆకునై" పాటని వివిధ సంగీతజ్ఞులు కట్టిన వివిధ బాణీల్లో పాడి వినిపించారు.

"తరువాత మంచి సంగీతకారుని చేతిలో భావానుగుణంగా బాణీ కూర్చబడాలి. ఆ పాట నుడికారం స్పష్టత గాత్రంలో మంచి ఒదుగు ఉంది ఆ రస భావన అనుభవించగల గాయకుని గళంలో ఆ గాన సౌరభం వికసించాలి. లలిత గీతాలు కొన్ని మార్పులతో సినీ రంగంలో ప్రవేశించి చాలా కాలం లలిత మనోహరంగా ఇప్పటికి మన మనస్సులలో నిలిచాయి. నేడు వాద్యాల హోరులో పాట అర్ధం వినిపించని విధంగా మారింది. చక్కని సాహిత్యపు విలువలు కలిగి తగిన బాణీ తో రసానుభవం పంచగలిగే గాయకుల గళాలలో వెలువడే గీతాలు ఇప్పటికీ ఎప్పటికీ శ్రోతల మదిలో చిరస్థాయిగా నిలుస్తాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు." అంటూ సెలయేటి ప్రవాహంలా హాయిగా ప్రసంగించి, ముగించారు.

తరువాత డా కె.గీత వీక్షణం ఫేస్ బుక్ నెలవారీ కవిత్వ పోటీల్లో భాగంగా మార్చి నెలలో గెలుపొందిన కవి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ గారిని అభినందించి, అవార్డుని అందజేశారు.

ఆ తరువాత ప్రశాంతి రామ్ గారి అధ్యక్షతలో జరిగిన చర్చ, కవిసమ్మేళనంలో తాటిపామల మృత్యుంజయుడు, సుభాష్, డా.మీరా సుబ్రహ్మణ్యం, డా.నీహారిణి కొండపల్లి, డా.కె.గీత, శ్రీధర్ రెడ్డి బిల్లా, దాలిరాజు వైశ్యరాజు, లలితావర్మ, ప్రసాదరావు రామాయణం, కె.వి.యస్ గౌరీపతి శాస్త్రి, డా. అరుణ కోదాటి, రాజేంద్ర ప్రసాద్ గుండ్లపల్లి, దోసపాటి వేంకటరామచంద్రరావు, కేశరాజు వేంకట ప్రభాకర్ రావు, బంతికట్ల నాగేశ్వరరావు, భవాని ముప్పల, ఆచార్య అయల సోమయాజుల ప్రసాద్, శాస్త్రి కన్నేపల్లి, కుడికాల వంశీధర్, యు.వి.కృష్ణమూర్తి, రామకృష్ణారెడ్డి, సి.హెచ్. వీర రాఘవులు, అమృతవల్లి, ఆళ్ల నాగేశ్వరరావు, దుర్గాప్రసాదరావు, జనార్దనరావు, రజిత, సీతామహాలక్ష్మి, రాంపల్లి నరసింహారావు మొ.న వారు పాల్గొన్నారు.

Posted in May 2023, వీక్షణం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!