Menu Close
VSRao
అశోక మౌర్య
డా. వల్లూరుపల్లి శివాజీరావు

చాణిక్యుడి నీతి శాస్త్రం లోని మరికొన్ని నీతి వాక్యాల పరంపర

దేవుడు, దైవం, ధర్మం సంబంధిత వాక్యాలు

  1. ఉత్తమ బ్రాహ్మణుడికి ‘అగ్ని’ దేవుడి ప్రతినిధి; దేవుడు తన నిజమైన భక్తుల హృదయాల్లో నివసిస్తాడు; అల్ప బుద్ధి గలవారు దేవుడిని విగ్రహ రూపంలోనే చూస్తారు; విశాల బుద్ధిగల వారు దేవుడిని అన్ని చోట్లా చూడగలరు.
  2. మహా విష్ణువు ఆయన సతీమణి మహాలక్ష్మిని "నీవు బ్రాహ్మణ గృహంలో నివసించటానికి ఎందుకు అనాసక్తిని చూపిస్తావు?" అని ప్రశ్నించాడు. ఆమె ఈ విధంగా సమాధానం ఇచ్చింది.
    “ప్రభూ! అగస్త్య మహర్షి కోపంతో నా తండ్రిని (సముద్రాన్ని) తాగేశాడు; భృగు మహర్షి కోపంతో మిమ్ములను కాలితో తన్నాడు; తాము పండితులమనే అహంకారంతో బ్రాహ్మణులు నా ప్రత్యర్థి, పోటీదారు సరస్వతి అనుగ్రహం అపేక్షించారు; ఇవి చాలక ప్రతి రోజూ వీరు నా నివాసమైన పద్మానికి ఉన్న రేకులను తెంపి శివుడు మీద వేసి ఆయనను పూజిస్తారు. అందువల్లనే నాధా! నాకు బ్రాహ్మణుల గృహంలో నివసించటానికి భయం”.
  3. ఒక వ్యక్తి ఈ మూడు విషయాలలో సంతృప్తి పడాలి. అవి, భగవంతుడు ఇచ్చిన ఆహారం, న్యాయమైన రీతిలో ఆర్జించిన సంపద. అలాగే చదువు (చింతన), దైవనామ జపం, దానం విషయాలలో సంతృప్తి పడకూడదు!
  4. ఉదయాన్న మహాభారతం, మధ్యాహ్న సమయంలో రామాయణం, సాయంకాల-రాత్రి సమయం లో శ్రీమద్భాగవతం పఠించటంలో నిమగ్నమవ్వాలి.
  5. ఏవ్యక్తి తన స్వహస్తాలతో దైవానికి దండ అల్లుతాడో, దేవుడి హస్తాలకు పూయవలసిన గంధం అరగదీస్తాడో, పవిత్ర గ్రంధాలను లిఖిస్తాడో ఆవ్యక్తికి దేవేంద్రుడికి సమానమైన ఐశ్వర్యం లభిస్తుంది.
  6. చాణక్య ఉవాచ: కమలా దేవి (లక్ష్మి) నా తల్లి; జనార్ధనుడు (విష్ణు) నా తండ్రి; విష్ణుభక్తులు నా బంధువులు. వీరు ఉన్న ప్రదేశం నా స్వస్థలం.
  7. చాణక్య స్వగతం: అందరికీ ఆశ్రయమిచ్చి పోషించే విశ్వంభరుడి (విష్ణువు) స్తుతిలో నేను నిమగ్నమయినప్పుడు నా పోషణ గురించి ఎందుకు వ్యాకుల పడాలి? హరి అనుగ్రహం లేకపోతే శిశువు పోషణకు అవసరమైన స్తన్యం తల్లి స్థనాల నుంచి ఎలా స్రవిస్తాయి? యదు భూషణా! (లక్ష్మీపతి), నేను ఎల్లప్పుడూ ఈ విధంగా ఆలోచిస్తూ సమయమంతా నీ పాద పద్మాలను సేవించటంలోనే వెచ్చించుచున్నాను.
  8. ఒక క్రూరుడు దైవ భక్తుల సహచర్యంలో సాధు గుణాలను పెంపొందించుకోగలడు. కాని దైవభక్తుడు క్రూరుడి సహచర్యంలో భక్తి రహితుడు కాడు. అలాగే ఒక పుష్పం భూమి మీదకు రాలితే భూమి సువాసన భరితమవుతుంది. కాని ఆ పుష్పానికి భూమి వాసన తాకదు.
  9. ఎవరి గృహంలో బ్రాహ్మణుల పాదపద్మాలు కడుగబడవో, వేద మంత్రాలు గట్టిగా పఠనం చేయబడవో, పూర్వీకులకు పవిత్ర కర్మ కాండలు (స్వాహా, స్వధా) జరుపబడవో ఆ గృహం స్మశానం లాంటిది.
  10. ఒక సాధువుని తన కుటుంబం గురించి అడిగితే ఆయన ఇచ్చిన సమాధానం: సత్యం నా తల్లి; ఆత్మ విజ్ఞానం నా తండ్రి; సత్య (న్యాయ) ప్రవర్తన నా సోదరుడు; దయ నా మిత్రుడు; అంతర్ముఖ శాంతి నా భార్య; క్షమ (క్షమాపణ) నా పుత్రుడు.
  11. అర్జునుడు కృష్ణ భగవానుడితో ఈ విధంగా పలికాడు: బ్రాహ్మణులు విందులకు వెళ్లటం లోనూ; గోవులు లేత పచ్చి గడ్డి మేయటంలోనూ; భార్యలు భర్తల సహవాసంలోనూ, ఆనందం పొందుతారు. ఓ కృష్ణా! అలాగే నేను అంతకు మించిన ఆనందం యుద్ధం చేయటంలో పొందుతాను.
  12. యుగాంతంలో మేరు పర్వతం కదులుతుంది; కల్పాంతంలో సప్త సముద్రాల నీరు వ్యాకులం చెంది ఒడ్డు దాటుతుంది. కాని నిజమైన సాధువు ఐహిక మార్గం నుంచి తొలగడు.
  13. క్రిందటి జన్మలలోని దైవభక్తి, ధాతృత్వం, విజ్ఞానం, నిరాడంబరం, మొదలగు సద్గుణాలు, సత్ప్రవర్తనలు యోగబంధంవల్ల ప్రస్తుత జన్మలోకూడా కొనసాగుతూ ఉంటాయి. దీనినే “పూర్వ జన్మ సుకృతం”, పూర్వ జన్మ సువాసనలు” అంటాము.
  14. మాటల్లోని, మనస్సులోని, ఇంద్రియాల్లోని పవిత్రత దైవ సాధనకు అత్యవసరం. అలాగే దయార్ద్ర హృదయం కూడా!
  15. మానవుడు ఏకాకి గా జన్మిస్తాడు, చివరకు ఏకాకిగానే మరణిస్తాడు. మంచి చెడుల అనుభవం, వాటి పర్యవసానం తన కర్మను బట్టే జరుగుతాయి. స్వర్గానికి వెళ్లినా, నరకానికి వెళ్లినా ఒంటరిగానే వెళ్తాడు.
  16. పండితుడు ప్రజలచేత గౌరవించబడతాడు. ఈయన పాండిత్యానికి, విద్వత్తుకు ప్రతిచోటా గౌరవం పొందుతాడు. వాస్తవానికి పాండిత్యం అన్నిచోట్లా గౌరవనీయమే!
  17. మత, దైవ సంబంధిత ఉపదేశాలు వినేటప్పుడు, స్మశానంలో ఉన్నప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు మానవులు మానసిక పరిస్థితిని ఎల్లపుడు తమ అధీనంలో ఉంచుకోవాలి. అటువంటప్పుడు మోక్షాన్ని ఎవరు పొందరు?
  18. దాతృత్వంలో, నిరాడంబరత్వంలో, పరాక్రమంలో, ఐహిక జ్ఞానంలో, వినయం, నమ్రత విష యంలో, నీతి విషయంలో, మనకు అహంకారం ఉండకూడదు. ఎందుకంటే ఈ ప్రపంచం అనేక అరుదైన మాణిక్యాలతో (వ్యక్తులతో) నిండియున్నది!

రాజు, రాజ్యం సంబంధిత వాక్యాలు

  1. పట్టాభిషిక్త సమయంలో సూర్య వంశ రాజుల ఆస్థాన గురువు బ్రహ్మర్షి వశిష్ఠుడు దశరధ నందనుడు శ్రీరామచంద్రుడితో ఈ విధంగా పలికాడు: “నీలో ధర్మం యెడల ప్రేమ; మనోహరమైన భాషణం; దాతృత్వ సంబంధిత విషయాలయందు అమితమైన కాంక్ష; మిత్రులతో నిష్కపట మైన వ్యవహారాలు; గురువుల సన్నిధిలో వినయం; గంభీరమైన మానసిక ప్రశాంతత; నిర్మల మైన ప్రవర్తన; సద్గుణాలను కనిపెట్టే, పరిశీలించే నేర్పు; శాస్త్రజ్ఞాన అవగాహనా నైపుణ్యం; రూప అందం; భగంతుని యెడల భక్తి; ఉన్నట్లు కనిపెట్టాను.”
  2. రాజు సద్గుణుడు, సన్మార్గుడు అయితే ఆయన ప్రజలు కూడా అలాంటివారే అవుతారు. ఆయన పాపిష్టి అయితే ప్రజలు కూడా పాపిష్టులవుతారు. రాజు మధ్యరకపు వ్యక్తి అయితే ప్రజులు కూడా అలాంటివారిగా మారుతారు. దీనిని బట్టి ప్రజలు రాజును అనుసరిస్తారు. యధా రాజా తధా ప్రజా! ప్రస్తుత దేశ రాజకీయ నాయకులు, ప్రజలు ఇలాగే ఉన్నారు గదా!)
  3. తన ప్రజలు చేసుకున్న పుణ్యాలు, పాపాలను రాజు భరించాలి, అలాగే రాజు చేసుకున్న వాటిని పురోహితుడు, భర్త చేసుకున్న వాటిని భార్య, శిష్యులు చేసుకున్న వాటిని గురువు భరించాలి.
  4. విధి రాజును యాచకుడుగాను, యాచకుడిని రాజుగానూ మార్చగలదు. అలాగే నిరుపేదను ధనికుడుగాను, ధనికుడిని నిరుపేదగానూ కూడా.

కుటుంబ సంబంధిత వాక్యాలు

  1. నీకు జన్మనిచ్చిన వ్యక్తి, జంధ్యం వేసిన వ్యక్తి, బోధించిన వ్యక్తి, ఆహారాన్ని సమకూర్చిన వ్యక్తి, భయంకర పరిస్థితులనుంచి నిన్ను కాపాడి వ్యక్తి, నీకు తండ్రులే!
  2. ఈ అయిదుగురు నీకు తల్లులు: వారు నీకు జన్మనిచ్చిన స్త్రీ, రాజు భార్య, జ్ఞానాన్ని బోధించిన వారి భార్య, మిత్రుడి భార్య, నీ భార్య తల్లి (అత్త గారు).
  3. బదరి వృక్షం నుంచి వచ్చే వేయి పండ్లు ఎలా ఒకే విధంగా ఉండవో అలాగే ఒకే గర్భంనుండి ఇద్దరు (ఇంకా ఎక్కువ మంది కూడా) పిల్లలు ఒకే నక్షత్రంలో జన్మించినా వారి ప్రవర్తన, వ్యవహరించే తీరు ఒకేలాగా ఉండవు.
  4. తెలివైన వ్యక్తి సంపద కోల్పోయినప్పుడు, అతనికి మానసిక ఆందోళన కలిగినప్పుడు, అతని భార్య చెడు ప్రవర్తన తెలిసినప్పుడు, ఇతరులు బూతులు మాట్లాడినప్పుడు, అతను అవమానం పొందినప్పుడు, వాటిని బహిరంగ పరచకూడదు.
  5. ఒక పురుషుడికి/స్త్రీకి తమ జీవితాల్లో మూడు దురదృష్టాలు తారసిల్లుతాయి. అవి: తన భార్య/ భర్త మరణించటం, బంధువుల చేతుల్లో తన సంపదను అప్పజెప్పటం, ఆహారానికి ఇతరుల మీద ఆధారపడటం.
  6. భూమిలోకి ఇంకే నీరు శుద్ధమైనది; భర్తకు అంకితమైన భార్య పవిత్రమైనది; ప్రజల బాగోగులు చూసే రాజు పరిశుద్ధ హృదయుడు; తృప్తిపడిన బ్రాహ్మణుడు నిర్మల హృదయుడు.
  7. బ్రహ్మచారి ఈ ఎనిమిదిటిని పరిత్యజించాలి. అవి: కామం, కోపం, అత్యాశ, తీపి పదార్ధాల యెడల మక్కువ, శరీరాభరణ, అతి ఆసక్తి, అతి నిద్ర, అతి శరీర పోషణ.
  8. ఎవరి గృహంలో ఆనంద వాతావరణం విలసిల్లుతుందో; ఎవరి పుత్రులు ప్రజ్ఞావంతులో; ఎవరి భార్య మధురంగా సంభాషిస్తుందో; ఎవరి సంపద తన అవసరాలకు తగినంత ఉంటుందో; ఎవరు సతీమణి సహచర్యంలో ఆనందం పొందుతాడో; ఎవరి సేవకులు విధేయతతో ఉంటారో; ఎవరి గృహంలో ఆతిధ్యం, అతిధి సత్కారణ ఉంటుందో; ఎవరి గృహంలో దేవ దేవుడికి నిత్య పూజ జరుగుతుందో; ఎచ్చట ఆహార పానీయాలు పాలుపంచుకోబడతాయో; ఎవరికి భక్తుల సహవాసం వల్ల ఆనందం లభిస్తుందో, వారు ధన్యులు.
  9. పేదరికం, వ్యాధి, విచారం, చర (ఖైదు) జీవితం, ఇతర ఆపదలు తాను చేసుకున్న పాపాల ఫలాలే!
  10. పోగొట్టుకున్న సంపదను, మిత్రుడిని, భార్యను, రాజ్యాన్ని మరల పొందవచ్చు. కాని శరీరం పోతే దానిని ఎన్నడూ పొందలేరు.
  11. మనం ఎల్లప్పుడూ నిప్పు, నీరు, స్త్రీలు, మూర్ఖులు, సర్పాలు, రాజ కుటుంబీకులు, తదితర ముఖ్య విషయాలలో చాలా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే సమయం వచ్చిన్నపుడు ఇవి (వీరు) మన మరణానికి దారితీస్తాయి(రు).
  12. ధనం కోల్పోయినప్పుడు భార్య, మిత్రులు, సేవకులు, బంధువులు, ఇతర దగ్గరవారు నిన్ను విసర్జిస్తారు. కాని పోయిన ధనం తిరిగి వచ్చినప్పుడు నిన్ను విసర్జించినవారు నీదగ్గరికి తిరిగి వస్తారు. అందువల్ల ధనం మన బంధువులలో అతి ముఖ్యమైనది. అందుకే “ధనం మూలం, ఇధం జగత్” అనే నానుడి ఉంది.

సమాజ సంభందిత వాక్యాలు

  1. మూర్ఖుడు పండితుడిని, నిరుపేద ధనవంతుడిని, వ్యభిచారిణి పవిత్రురాలిని, వికృత రూపిణులు అందగత్తెలను ద్వేషిస్తారు.
  2. సముద్రం మీద పడే వర్షం నిరుపయోగం; అలాగే కడుపు నిండినవారికి భోజనము, ధనవంతుడికి బహుమతి, పగటి పూట వెలిగే దీపం కూడా.
  3. గార్ధభం అలసిపోయినా బరువును మోస్తూనే ఉంటుంది. చలి అయినా, వేడి అయినా అది ఎల్లప్పుడూ తృప్తితోనే ఉంటుంది. ఈ గుణాలు మానవుడు గార్ధభం నుంచి నేర్చుకోవాలి.
  4. గజాన్ని అంకుశంతోనూ, గుర్రాన్ని చేతి చరుపుతోనూ, కొమ్ములున్న జంతువును దండాన్ని చూపించి, దుర్మార్గుడిని కరవాలంతోనూ నియంత్రించవచ్చు, వశం చేసుకోవచ్చు.
  5. ఓ తెలివిగలవాడా! నీ సంపదను యోగ్యుడికే ఇవ్వు, అయోగ్యులకు ఎన్నడూ ఇవ్వవద్దు. మేఘాల నుంచి సముద్రం స్వీకరించే వర్షం ఎల్లప్పుడూ తీపిదే. వర్షపు నీరు భూమి మీద కదిలే (కీటకాలు, జంతువులు, మానవులు, వగైరా), కదలని (వృక్షాలు, మొక్కలు) ప్రతి ప్రాణిని ఉత్సాహపరుస్తుంది, ఉల్లాస పరుస్తుంది. చివరకు ఈ నీరు సముద్రంలోనే కలుస్తుంది.
  6. అందము, యవ్వనం కలిగియున్నవారికి, గొప్ప కుటుంబాలలో జన్మించిన వారికి పాండిత్యం లేక పోతే నిరర్థకులు. వీరు అందం ఉన్నా సువాసన లేని ‘కింషుక’ (పలాస వృక్షాలకు పూచే) పువ్వులు లాంటివారు.
  7. మందులలో అమృతం శ్రేష్టమైనది; అన్ని రకాల భౌతిక సుఖాలలో మంచి ఆహారం ఉత్తమ మైనది; అన్ని శరీర అంగాలలో నయనం (కన్ను) ప్రధానమైనది; శీర్షం (తల) సమస్త శరీరంలో అతి ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమించింది.
  8. ఈ ఏడుగురిని, అంటే: విద్యార్థిని; సేవకుడిని; బాటసారిని (ప్రయాణికుడిని); ఆకలితో ఉన్న వ్యక్తిని; భయపడిన మనిషిని; కోశాగార రక్షకుడిని; నిద్రపోతున్న అంతరంగికుడిని అత్యవసర సమయంలో మేలుకొల్పవచ్చు.
  9. నిద్రలో ఉన్నప్పుడు సర్పాన్ని, రాజుని, పులిని, (కుట్టే) కందిరీగను, శిశువుని, ఇతరుల శునకాన్ని, మూర్ఖుడిని మేలుకొల్పకూడదు.
  10. రాత్రి అంతా అనేక రకాల పక్షులు చెట్టు మీద వాలి విశ్రమిస్తాయి. తెల్లవారగానే అవి పది దిక్కులలో ఎగిరిపోతాయి. అందువల్ల మనకు ప్రియమైన వారిని వదలి మనం తప్పనిసరిగా వెళ్ళ వలసినప్పుడు శోకించకూడదు.
  11. దాతృత్వం, ఔదార్యం, సౌమ్య సంబోధన, ధైర్యం, సక్రమ ప్రవర్తన పుట్టుకతో వచ్చే సహజసిద్ధ గుణాలే కాని, వాటిని సంపాదించలేరు.
  12. ఏనుగుకి భారీ శరీరమున్నా అంకుశానికి వశమవుతుంది; కాని అంకుశం ఏనుగు అంత పెద్దదా? అలాగే వెలిగించిన చిన్న కొవ్వొత్తి చీకటిని తొలగిస్తుంది: కాని కొవ్వొత్తి చీకటి అంత విశాలమైనదా? ఉరుము కొండను పగలగొట్ట కలదు: కాని ఉరుము కొండ అంత పెద్దదా? కాదే.
    చిన్న శిరస్సుకు పెద్ద మేధస్సు ఉండదూ?  కాబట్టి పరిమాణంలో ఏముంది?
  13. ద్రాక్ష సారాయిని అగ్నితో ఇగర గొట్టినా అది కుండను శుద్ధి చేయలేదు. అలాగే పవిత్ర జలాలతో వంద సార్లు స్నానం చేసినా మానిసిక నైర్మల్యాన్ని ప్రక్షాళన చేయటం సాధ్యం కాదు.
  14. మన శరీరాలు పాడయిపోవచ్చు, సంపద శాశ్వతం కాకపోవచ్చు, మరణం ఎల్లప్పుడూ మన ప్రక్కనే పొంచి ఉంటుంది.
  15. ఎవరయితే తమ విజ్ఞానం పుస్తకాలకే పరిమితం చేసుకుంటారో, ఎవరి సంపద ఇతరుల చేతు లలో ఉంచుతారో, వారు తమ విజ్ఞానాన్ని, సంపదను ఆవరమయినప్పుడు వినియోగించుకోలేరు.
  16. ఏ పురుషులు బంధువుల యెడల ఔదార్యంతో ఉంటారో; అన్యుల (పరిచయం లేని వారు) యెడల దయతో ఉంటారో; క్రూరుల యెడల నిరాసక్తతో ఉంటారో; ఉత్తముల యెడల ప్రేమగా ఉంటారో; నీచమైన వారి వ్యవహారాలలో వివేకం ప్రదర్శిస్తారో; పండితులతో నిష్కపటంగా ఉంటారో; శత్రువులతో ధైర్యంగా ఉంటారో; పెద్దలతో వినయంగా ఉంటారో; భార్యతో ప్రేమ చూపిస్తూ ధృడంగా ఉంటారో, వారు ప్రపంచంలో అత్యంత సంతోషపరులు.

వచ్చే సంచికలో చంద్రగుప్త మౌర్య పుత్రుడు బిందుసార మౌర్య గురించి తెలుసుకుందాం.

****సశేషం****

Posted in May 2023, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!