Menu Close
మన ఆరోగ్యం మన చేతిలో...
Our health in our hands...
- మధు బుడమగుంట

ఆచారాలు-ఆచరణీయ వాస్తవ దృక్పధాలు

“శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే...” ఈ సకల చరాచర సృష్టిలోని సమస్త దేవతల అంశాలతో ఏర్పడిన ఆ పరబ్రహ్మ స్వరూపము, అతీంద్రియ శక్తి, శాస్త్రీయ పరంగా చెప్పాలంటే విద్యుదయస్కాంత వర్ణపట శక్తి (Electromagnetic Spectrum), ఈ సృష్టిలోని ప్రతి జీవరాశిని రక్షించి, జీవించేటట్లు చేసేది, కేవలం ఒక్కటి మాత్రమె. ఆ బ్రహ్మపదార్థ ఉనికిని “ఇందుగలడందు లేదని సందేహంబు వలదు, చక్రి సర్వోపగతుండు...” అని చెప్పుకోవచ్చు.

నా భక్తులందరూ కేవలం నన్ను మాత్రమె పూజిస్తూ మిగిలిన దేవతా మూర్తులను స్తుతించవద్దని ఏ దేవుడూ చెప్పలేదు. అది కేవలం మనుషులమైన మనం, మన స్వార్థ స్వప్రయోజనాల కొరకు సృష్టించుకొన్న విధివిధానం. దానిని మానసికంగా ధృడంగా ఉన్నవారు బలహీనులను అతి సులభంగా భయం అనే భూతంతో తమకు అనుగుణంగా వారి ఆలోచలనల విధానాన్ని మార్చి, శక్తిహీనులను చేసి తమ స్వార్థం కొరకు మూఢ నమ్మకాల మైకంలో, మూఢాచార ముసుగులో, మతమనే పరిధిలో సదా పరిభ్రమించేటట్లు చేసి తద్వారా సాటి మనుషుల మధ్యన అంతరాలను సృష్టిస్తున్నారు. మనలోని విశ్లేషణ పాటవాన్ని మరచి, విచక్షణ కోల్పోయి గుడ్డిగా కొన్ని ఆచారాలను పాటించడం నేర్చుకొన్నాము.

మన సంప్రదాయాల ఆచరణ విషయంలో మనందరిలోనూ జవాబులు దొరకని ఎన్నో సందేహాలు ఉన్నాయి. అలాగే మన తరువాతి తరం వారు అడిగిన ధర్మ సందేహాలను నివృత్తి చేసే ప్రహసనంలో మనలోనే సందిగ్దమై, సమాధానం దొరకని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి. మన ఆచారాలను పాటించేందుకు మన ముందుతరం వారు చెప్పిన సూత్రాలను మనం పూర్తిగా అర్థం చేసుకోకుండానే పాటించడం నేర్చుకొన్నాము. అందుకు కారణం మన తల్లిదండ్రులు, పెద్దలమీద ఉన్న గౌరవం, ఒక విధమైన భయం కూడా ఉండేది. కనుక వితర్కానికి తావులేకుండా అయిష్టంగానే, ఇష్టముతో ఆచరిస్తూ వస్తున్నాము. ఇది వాస్తవం. అందరం ఒప్పుకోవాల్సిందే. కానీ పాతతరం పాటించిన పద్ధతులన్నింటిలోనూ ఒక శాస్త్రీయమైన నిబద్ధత వుంది. చేసిన ప్రతి పనికి ఒక నిర్దేశిత ఉపయోగం దాగి ఉంది. కాకుంటే దానిని విశ్లేషించి చెప్పగలిగిన విధివిధానాలు లేవు. అప్పుడు ఇన్ని సామాజిక మాధ్యమాలు ఉండేవి కావు.

నేడు పరిస్థితులు మారాయి. వాటితోపాటే సంస్కృతులు, సంప్రదాయాల విజ్ఞాన సంపద కూడా మెండుగా లభించడం కనపడుతున్నది. నాడు కేవలం గ్రంథాలయాలు, పండితుల వద్ద మాత్రమె లభించే సమాచారం, నేడు వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా పుష్కలంగా మనకు దొరుకుతున్నది. అయితే అందులో కూడా ఒకే విషయం మీద విభిన్న పాఠాంతరములు కనపడుతున్నాయి. అప్పుడు ఏది పాటించాలి అనే మరో సందేహం ఉంటూనే ఉంది. అంతేకాక ఈ మధ్య కాలంలో మనిషిలోని భయాన్ని, అన్ని తెలుసుకోవాలనే ఉత్సుకతను అవకాశంగా తీసుకొని తమ ఉనికిని, పేరును పెంపొందించుకోవడానికి చాలామంది తమ పరిజ్ఞానాన్ని పక్కదోవ పట్టించి అవకాశవాదులు అవుతున్నారు. ఉదాహరణకు మేము చెప్పినట్లు నియమాలను పాటిస్తే వారం రోజుల్లో లేక పక్షం రోజుల్లో మీ బరువు ముప్పై కిలోలు తగ్గుతారు అని ప్రచారం చేస్తారు. అలాగే మరొకరు ఇంకోవిధంగా చెబుతారు. వాస్తవానికి ఆరోగ్య విజ్ఞానంలో మన బరువు అతి తక్కువ కాలంలో అంతగా తగ్గకూడదు. అది మరో అనారోగ్యానికి చిహ్నం అవుతుంది. నిజం చెప్పాలంటే మన శరీరం పంపే సంకేతాలను మనం మాత్రమె వినగలుగుతాము. ఆ సంకేతాలకు అనుగుణంగా మన ప్రవర్తన ఉంటె మన శరీరం మన చేష్టలకు చక్కగా స్పందిస్తుంది. మన శరీరం చేతల ద్వారా చెప్పే మాటలను అర్థం చేసుకొని మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవచ్చు. మన నిజమైన సంస్కృతీ సంప్రదాయబద్ధ ధర్మాలను మనఃపూర్వకంగా ఇతరుల కొరకు కాకుండా, నమ్మకంతో మనం ఆచరించడం మాత్రమే నిజమైన ఆచారం అవుతుంది. మరిన్ని విషయాలను వచ్చే సంచికలో ప్రస్తావిస్తాను.

‘సర్వే జనః సుఖినోభవంతు’

Posted in May 2023, ఆరోగ్యం

2 Comments

  1. GSS Kalyani

    వివిధ కాలాల్లో వచ్చే పండుగలను మనం జరుపుకునే పద్ధతుల్లో కూడా మన ఆరోగ్యానికి మంచిని చేసే విషయాలను చేర్చారు మన పూర్వీకులు. ఆచారాలను సరిగ్గా అర్ధం చేసుకుని వాటిని పాటించడంవల్ల మనకు మేలు కలుగుతుందని తెలుపుతూ రాసిన ఈ వ్యాసం చాలా బాగుంది!

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!